నవ్వుల..పువ్వులు..
* జేసీ వర్సెస్ జనం
* అందోలులో సరదా సంభాషణ
జోగిపేట: ఆహార భద్రత , పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన తనిఖీలో భాగంగా బుధవారం ఆందోలు గ్రామానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ శరత్‌కు పలువురు వృద్ధులు, వివిధ పథకాల లబ్ధిదారులకు మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి.. దీంతో అధికారులు, స్థానికుల మధ్య నవ్వుల పువ్వులు వికసించాయి... గ్రామంలో రోడ్డు పక్కన కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఇలా పలకరించారు..
జేసీ: అమ్మా మీరు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారా?
వృద్ధురాలు: ఎలచ్చన్లకు ఇంటికొచ్చి దండాలు పెడ్తరు.. ఇంటికి పా..
(అని వృద్ధురాలు అనగానే జేసీతో సహా అక్కడి వారంతా ఘొల్లున నవ్వారు)
జేసీ: అమ్మా నీకు తప్పనిసరిగా పింఛను వస్తది.. నీకు ఎంత మంది కొడుకులు?
వృద్ధురాలు: ఒక్కడు సచ్చిపోయిండు, ముగ్గురు కొడుకులున్నా ఒంటరిగానే ఉన్నా.. అంటూ వారిని తిట్టబోయింది...
జేసీ: నీవు అన్నదాంట్లో తప్పేమి లేదు.. వచ్చేనెల నుంచి నీకు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తది.. వాళ్లే అమ్మా.. అమ్మా అంటూ నీ చుట్టు తిరుగుతారు.
వృద్ధురాలు: దండం పెడుతూ నీ దయ అంది.
అందోలులోని అంబేద్కర్ కాలనీలో ఏసయ్య ఇంటి వద్ద రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు పరిశీలిస్తుండగా జేసీ అక్కడికి వెళ్లారు.
జేసీ: నీ వయస్సు ఎంత ఉంటుంది?
ఏసయ్య: 66 వరకు ఉంటది సార్..
జేసీ: ఏమయ్యా.. మీ అక్క వయస్సు 65 అని చెప్పావ్.. నీ వయస్సు 66 ఎలా ఉంటుంది?
ఏసయ్య: మీ దయ సార్.
జేసీ: నీకు ఇప్పుడు పెన్షన్ వస్తుందా?
ఏసయ్య: వస్తుంది సార్
జేసీ: ఇక నుంచి రాదు, బాధ పడకు, నాలుగేళ్లు ఓపిక పట్టు వస్తుంది. అవును ఈ ఇల్లు ఎప్పుడు మంజూరైంది.
ఏసయ్య: తెలుగుదేశం వాళ్లిచ్చారు సార్..
జేసీ: అలా కాదు.. ప్రభుత్వం ఇచ్చిందనాలి.
ఏసయ్య: రాజయ్య ఎమ్మెల్యే ఇప్పించిండు సార్.
జేసీ: మరి వెయ్యి రూపాయల పెన్షన్ ఎవ్వరు ఇస్తున్నరు?
గోపాల్ (స్థానికుడు): బాబూమోహన్ సార్..
జేసీ: నవ్వుతూ ముందుకు కదిలారు.