కొందరే ‘భద్రం’ | Some of the 'save' | Sakshi
Sakshi News home page

కొందరే ‘భద్రం’

Published Sat, Oct 25 2014 12:13 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

కొందరే ‘భద్రం’ - Sakshi

కొందరే ‘భద్రం’

  •  ప్రైవేటు ఉద్యోగులకు ఆహార భద్రత కార్డులు కట్
  •  ఒక ఇంట్లో ఒక్క వృద్ధునికే పింఛను
  •  నిబంధనలు కఠినతరం
  • సాక్షి, సిటీబ్యూరో: మీకు ఎంత చిన్నదైనా సరే... ప్రైవేటు ఉద్యోగం ఉందా? అయితే ఆహార భద్రత కార్డులపై ఆశలు వదులుకోండి. మీ ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారా? ఇద్దరికీ పిం ఛను అందుతోందా? అయితే ఇద్దరిలో ఒకరు త్యాగానికి సిద్ధంగా ఉండండి... ఇది మా మాట కాదు. ప్రభుత్వ నిబంధనలు చెబుతున్న నిజం. సంక్షేమ ఫలాలను నిజమైన లబ్ధిదారులకు అందించే పేరిట ప్రభుత్వం భారీ కోతలకు సిద్ధమవుతోంది. ఆహార భద్రత కార్డులు, పింఛనుదారుల ఎంపికపై నిర్వహించనున్న విచారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

    ఈ దరఖాస్తులను కుటుంబ సమగ్ర సర్వేతో ముడిపెట్టి పరిశీలించాలని పేర్కొంది. రేషన్ కార్డులు, పెన్షన్లకు ఆధార్ లింక్ చేసిన సమ యంలో భారీగా బోగస్ రేషన్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో 1.84 లక్షల రేషన్ కార్డులు, 60 వేలకు పైగా పింఛన్లు బోగస్‌గా తేలాయి. ఇలాంటివి నివారించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకం అమలులో భాగంగా రాష్ట్ర సర్కారు తాజాగా రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు ప్రవేశపెట్టాలని, దరఖాస్తులు స్వీకరించింది.

    ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీకి   ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి.జంట జిల్లాల్లో ప్రసుతం రేషన్ కార్డులు 15.62 లక్షలు ఉండగా, ఆహారభద్రతకు 21.88 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సామాజిక భద్రత పింఛన్లు 3,49,759 ఉండగా... కొత్తగా 4,96,429 దరఖాస్తులు వచ్చాయి. వీటిని చూసిన యంత్రాంగం వడపోతకు సిద్ధమైంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలివీ...
     
    ఆహార భద్రత కార్డులకు అర్హులు

    మూడు గదుల్లో నివసించే/సొంత ఇళ్లు కలిగిన వారు, రెగ్యులర్ ఆదాయం లేని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు, ఇంటిలో మంచినీరు, మరుగు దొడ్డి సదుపాయం లేని వారు, వితంతువులకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయనున్నారు.  
     
    అనర్హులు వీరే..

    ప్రభుత్వ, ప్రవేట్ రంగాల ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన వారు, వ్యాపారులు, ప్రభుత్వ పింఛనుదారులు, సమర యోధులు, ఫోర్ వీలర్, ఏసీ కలిగిన వారు, నాలుగు/ అంతకన్న ఎక్కువ గదులు ఉన్న ఇంటి యజమానులు, ఆదాయ పన్ను చెల్లించువారు, ఆహార భద్రత కార్డులకు అనర్హులు.
     
    పింఛన్లకు ఇలా...

    కుటుంబంలో పిల్లలు ఉద్యోగం చేస్తుంటేపింఛన్లకు అనర్హులు. ఇతర పింఛన్లు పొందుతున్నా, వ్యాపారాలు, నాలుగు చక్రాల వాహనాలు, పరిమితికి మించి భూమి ఉన్నా అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. భార్యాభర్తలిద్దరూ వృద్ధులైతేప్రస్తుతమున్న విధంగా ఒక్కరికి మాత్రమే పింఛను ఇవ్వాలన్న నిబంధనను కొనసాగించనున్నారు. ఇంట్లో వితంతువులు, వికలాంగులు ఎంత మంది ఉన్నప్పటికీ, అందరికీ పింఛను మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. కఠిన నిబంధనల వల్ల అర్హులైన పేదలు నష్టపోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     
    విచారణ షురూ...


    ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం దరఖాస్తుల వడపోతపై విచారణ ప్రారంభించింది. తొలుత పింఛన్లపై విచారణ చేపట్టనుంది. దీని కోసం 225 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. స్థానికంగా ఉన్న 125 మంది రెవెన్యూ ఉద్యోగులతో పాటు జీహెచ్‌ఎంసీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్, భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని ఎస్టేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు మరో 100 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం 20 కుటుంబాలను కలిసి, 40 నుంచి 50 దరఖాస్తులను పరిశీలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈప్రక్రియ పూర్తి కాగానే ఆహార భద్రత కార్డులు, ఆదాయ, కుల, నివాస పత్రాల దరఖాస్తు విచారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి. ఈ దరఖాస్తుల విచారణలో 1000 మంది ఉద్యోగులు పాల్గొంటారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement