జన ‘స్పందన’ భేష్‌ | CM YS Jagan Comments in Video Conference Over Spandana program | Sakshi
Sakshi News home page

జన ‘స్పందన’ భేష్‌

Published Wed, Oct 30 2019 4:43 AM | Last Updated on Wed, Oct 30 2019 8:20 AM

CM YS Jagan Comments in Video Conference Over Spandana program - Sakshi

లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు,రేషన్‌కార్డులు, పెన్షన్లు ఫలానా తేదీ నుంచి ఇస్తామని లేఖ ఇవ్వండి. దీనివల్ల ప్రజలకు ఎప్పటి నుంచి అవి అందుతాయన్న దానిపై అవగాహన ఉంటుంది. అప్పుడే అవినీతి, పక్షపాతం లేకుండా పథకాలు అందరికీ అందుతాయి.
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘స్పందన’పై వస్తున్న నివేదిక ప్రకారం కార్యక్రమం బాగా సాగుతోందని, ఎక్కువ శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే వినతుల్లో అధిక భాగం ఇళ్ల పట్టాలు, రేషన్‌ కార్డులు, పెన్షన్‌ అంశాలే ఎక్కువగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండేలా చర్యలు చేపట్టామని, దీనిపై అధికారులకు శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో  మంగళవారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందనలో వచ్చే వినతులను నాణ్యతతో పరిష్కరించగలిగినప్పుడే కలెక్టర్లు, ఎస్పీలకు మంచిపేరు వస్తుందని, తన కళ్లు, చెవులు.. కలెక్టర్లు, ఎస్పీలేనని, మీ పనితీరు బాగుంటేనే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని సీఎం స్పష్టం చేశారు. ‘వినతుల పరిష్కారంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇందులో భాగంగా సీఎం కార్యాలయం నుంచి కార్యదర్శి సాల్మన్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది జిల్లాలకు వెళ్తారు. పోలీసు అధికారులు కూడా ఈ బృందంలో ఉంటారు. ఎమ్మార్వోలు, మున్సిపల్‌ కమిషనర్లు, క్షేత్ర స్థాయిలో అధికారులను కలుస్తారు. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా వినతులను ఎలా పరిష్కరించాలన్నదానిపై వారికి వివరిస్తారు. స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌పై వీరు పని చేస్తారు. నవంబర్‌ 5 నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది’ అని సీఎం వివరించారు.

ఇళ్లపట్టాల పంపిణీపై ప్రత్యేక దృష్టి
ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు 22,79,670 లబ్ధిదారులను గుర్తించామని, దేశం మొత్తం ఈ పథకం వైపు చూస్తోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాల్వగట్ల మీద, నదీ తీర ప్రాంతాల్లో ఉంటున్న వారికి మొదటి విడతలోనే సుమారు 6 లక్షల మేర ఇళ్లు కట్టించి, వారిని అక్కడికి తరలించాలని చెప్పారు. అర్బన్‌ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి వరకు రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పామన్నారు. 2 సెంట్ల నుంచి 6 సెంట్ల వరకు నిర్దేశిత విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించడంపై ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నామన్నారు. అభ్యంతరం ఉన్న, అభ్యంతరం లేని వర్గీకరణ స్పష్టంగా ఉండాలన్నారు.  

2 నుంచి రెండవ విడత కంటి వెలుగు
కంటి వెలుగుకు సంబంధించి రెండో విడత కార్యక్రమం నవంబర్‌ 2 నుంచి ప్రారంభం అవుతుందని సీఎం తెలిపారు. తొలి విడత కార్యక్రమంలో 69.36 లక్షల మంది పిల్లలకుగాను 65.03 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశారని, ఇందులో 4.30 లక్షల మంది పిల్లలకు కంటికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు. ప్రభుత్వ స్కూలు సముదాయాల్లోనే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తారని, మొత్తంగా 500 బృందాలు ఇందులో పాలుపంచుకుంటాయన్నారు. నవంబర్‌ 20 నుంచి కంటి అద్దాల పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని ఆసుపత్రుల్లో రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వెద్య సేవలు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. 

నవంబర్‌ 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు పేమెంట్లు 
నవంబర్‌ 7వ తేదీ నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులకు డిపాజిట్ల చెల్లింపులు ప్రారంభం అవుతాయని సీఎం చెప్పారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన 3,69,655 మంది బాధితులకు సుమారు రూ.264 కోట్లు అందించడానికి వీలుగా కలెక్టర్లు నవంబర్‌ 2లోగా బిల్లులు  సమర్పించాలని సీఎం సూచించారు. సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్నవారికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే.. వారికి పథకం వర్తించేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవంబర్‌ 14న పాఠశాలల్లో ‘నాడు – నేడు’ కార్యక్రమం ప్రారంభం అవుతుందని సీఎం పేర్కొన్నారు. తొలివిడతలో 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై, వచ్చే ఏడాది మార్చి 30 నాటికి పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తారని, ఆ తర్వాత ఏడాది నుంచి 9వ తరగతి, ఆ మరుసటి ఏడాది పదిలో ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తారని చెప్పారు. 

21న వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం
నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం కార్యక్రమం ప్రారంభం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు. మత్స్యకారులకు లీటరు డీజిల్‌ మీద రూ.6.03 ఉన్న సబ్సిడీని రూ.9కి పెంచామని, దీనికి సంబంధించి 81 పెట్రోలు బంకులను గుర్తించామని చెప్పారు. డీజిల్‌ పట్టించుకున్నప్పడే సబ్సిడీ కూడా ఇస్తామని స్పష్టం చేశారు.  వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఉండే సహాయాన్ని రూ.10 వేలకు పెంచామన్నారు. 21న ఈ డబ్బు ఇస్తామని తెలిపారు.   గతంలో మెకనైజ్డ్, మోటారైజ్డ్‌ బోట్లకు మాత్రమే ఇచ్చే వారని, ఇప్పుడు సముద్రంలో తెప్పలపై వేటకు వెళ్లే వారికీ దీన్ని వర్తింప చేస్తున్నామని సీఎం వివరించారు. 1,32,332 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని గుర్తించామని చెప్పారు. ముమ్మిడివరంలో ఈ పథకం ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని సీఎం తెలిపారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారు. 

గ్రామ వలంటీర్‌ పోస్టుల భర్తీ
పట్టణ ప్రాంతాల్లో 19 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో  9 వేల గ్రామ వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. రైతు భరోసా మీద కలెక్టర్లు వచ్చే వారం దృష్టి సారించాలని సూచించారు. నవంబర్‌ 15 రైతు భరోసాకు ఆఖరు తేదీగా నిర్ధారించామని, ఆధార్‌ సీడింగ్‌లో పొరపాట్లు, ఇతరత్రా సమస్యలను నివారించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. 1.87 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లు క్లోజ్‌ అయిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు. వాటిని తెరిపించి రైతు భరోసా లబ్ధి అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 4.89 లక్షల మంది రైతులకు ఆధార్‌ తప్పుగా నమోదైందని, వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాలు బాగా కురిశాయని, ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 

ప్రభుత్వాసుపత్రుల్లో 500 రకాల మందులు లభిస్తాయి. నవంబర్‌ 20 నుంచి ఆస్పత్రులకు మందుల పంపిణీ ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి కలెక్టర్లు ఆస్పత్రులను తనిఖీ చేయాలి. ఎక్కడైనా మందుల కొరత ఉందని గుర్తిస్తే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలి. నవంబర్‌ 30 నాటికి అన్ని ఆస్పత్రుల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు 
కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త ఇళ్ల స్థలాలపై ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, దీనివల్ల సోషల్‌ ఆడిట్‌ జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అర్హత ఉండీ ఎవరిపేరైనా జాబితాలో లేకపోతే.. వారు ఎవరికి, ఎలా, దరఖాస్తు చేయాలి? అనే వివరాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని చెప్పారు. డిసెంబర్‌ 15 నాటికి గ్రామ సచివాలయాలు పని చేయడం ప్రారంభించాలని, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్, లామినేషన్‌ యంత్రం.. తదితర సామగ్రి అంతా సచివాలయాల్లో ఉండాలన్నారు. లోటుపాట్లు సరిదిద్దుకుని జవనరి 1 నుంచి పూర్తి స్థాయిలో పని చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సచివాలయం పక్కన ప్రభుత్వానికి సంబంధించిన భవనాన్ని గుర్తించి.. అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని చెప్పారు. రైతులకు ఉత్తమ వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చేలా ఉండాలని సీఎం సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement