సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు, మహిళ, యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని ప్రకటించారు. ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని, కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆదివారం సీఎం ప్రజలకు విడుదల చేసిన సందేశం ఆయన మాటల్లోనే..
ఆ హామీలు నిలబెట్టుకున్నాం..
నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ఆరింటిలో రెండు గ్యారంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యార్యంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష.
యవత భవితే ప్రాధాన్యం..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి వారి భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.
సాగునీటి రంగంలో అవినీతిపై త్వరలో శ్వేతపత్రం
‘గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటిరంగంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాం.
అసత్య ప్రచారాలతో గందరగోళం వద్దు..
పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురుచూశారు. త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అధికారం కోల్పోయిన కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గతపాలన కాదు, జనపాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.
తెలంగాణ ఉద్యమకారులకు కేసుల నుంచి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2024 ప్రాధాన్యం రైతు, మహిళ, యువత..
Published Mon, Jan 1 2024 1:03 AM | Last Updated on Mon, Jan 1 2024 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment