నీలగిరి : ఆహారభద్రత కార్డులు, పింఛన్లకు అర్జీలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పేరిట జారీ చేయాలనుకున్న కొత్తకార్డులకు దరఖాస్తుల స్వీకరణ గడువు మరో 48 గంటల్లో ముగియనుంది. దీంతో సమస్త ప్రజానీకం దరఖాస్తు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. కాగా సోమవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే...అధికారుల అంచనాకు మించి కొత్త అర్జీలు వచ్చే పరిస్థితి కని పిస్తోంది. పాత లెక్కల ప్రకారం జిల్లాలో రేషన్‌కార్డులు 9,31,525 ఉన్నాయి.
ఈ లెక్కన ఇప్పటికే ఆహారభద్రత కార్డులు కావాలని కోరుతూ 6,94,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, కళాకారులు, చేనేత, కల్లుగీతకార్మికుల తదితర పింఛన్లన్నీ కలిపి జిల్లాలో 3లక్షల 94 వేలు ఉన్నాయి. ఈ సంఖ్యకు దీటుగానే కొత్తగా 3,58,037 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో అర్జీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
0-5 ఏళ్ల చిన్నారులకు కూడా ఆధార్ తప్పనిసరిగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కార్డు తప్పనిసరి అని చెబుతుండడంతో కొత్తగా నమోదు చేసుకునేవారితోపాటు, మార్పులుచేర్పులు చేసుకునే వారి తోనూ ఆధార్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. అధికారికంగా దరఖాస్తుల స్వీకరణ 15వ తేదీతో ముగియనుంది. కానీ దరఖాస్తుల పరిశీలన ముగిసేంత వరకు (ఈ నెల 30) కూడా ప్రజల నుంచి కొత్త అర్జీలు తీసుకునే అవకాశాలున్నాయి.
అంచనాలు తారుమారు...
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.75 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్య 11.50 లక్షలకు పెరిగింది. రెండేళ్లలో 2.75 లక్షల కుటుంబాలు పెరగడం పట్ల అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వలస వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు సొంత గ్రామాలకు చేరుకుని సర్వేలో నమోదు చేసుకున్నందునే కుటుంబాల సంఖ్య పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్తకార్డుల విషయంలో కూడా ఇదే పునరావృతమవుతోందని..దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడానికి అదే కారణమని వారు చెబుతున్నారు. అయితే ఆహార భద్రత కార్డులు, పింఛన్లకు ప్రభుత్వం విధించిన షరతులు పక్కాగా అమలు చేస్తే మాత్రం వచ్చిన దరఖాస్తుల్లో చాలా వర కు తొలగించే అవకాశం లేకపోలేదు.
దరఖాస్తుల పరిశీలనకు బృందాలు...
దరఖాస్తుల పరిశీలన చేసేందుకుగాను ప్రత్యేక బృందాలు నియమించారు. మండలాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించి 6 బృందాలతో పూర్తిస్థాయి పరిశీలన చేస్తారు. ఈ బృందంలో తహసీల్దారు, ఎంపీడీఓ, డీటీ, ఆర్‌ఐ, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు. పింఛన్ల దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు ఎంపీడీఓలకు, ఆహార భద్రత కార్డుల బాధ్యలు తహసీల్దార్లకు అప్పగించారు. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పోల్చి చూస్తారు. ఏదైనా సందేహాలు లేదా అనుమానాలు ఉన్నట్లయితే ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ చేస్తాయి.
వికలాంగులకు సదరమ్ క్యాంపులు...
ఏరియా/ప్రాంతీయ ఆస్పత్రుల వద్ద ఈ నెల 31 తేదీ వరకు ప్రత్యేక సదరమ్ క్యాంపులు నిర్వహించనున్నారు. అంధులు, వినికిడి, మానసిక వికలాంగులు, మానసిక రుగ్మత, బహుళ వికలాంగత్వం కలిగిన వారికి జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద పరీక్షలు చేస్తారు. శారీరక వికలాంగులకు భువనగిరి, మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యా పేట ఏరియా ఆస్పతుల వద్ద అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.
అర్జీలే...అర్జీలు
Published Tue, Oct 14 2014 3:44 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement