private job
-
విరాళం ఇచ్చిన యువతికి ఉద్యోగం
సేలం: కరోనా నివారణ నిధి కోసం తన మెడలో ఉన్న రెండు సవర్ల చైన్‌ను తాకట్టు పెట్టి విరాళంగా ఇచ్చిన యువతికి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం లభించింది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలతో ఆమెకు ఉద్యోగం వచ్చినట్లు వెలుగు చూసింది. నామక్కల్‌కు చెందిన సౌమ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ఈనెల 12న మేట్టూరుకు సీఎం స్టాలిన్ రావడంతో ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. తన మెడలోని రెండు సవర్ల చైన్‌ను తాకట్టు పెట్టి సీఎం కరోనా నివారణ నిధికి అందజేశారు. తనకు ఓ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఆమెలోని మానవత్వాన్ని మెచ్చిన సీఎం ఆ చైన్‌ను విడిపించడమే కాకుండా, ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ఓ ప్రైవేటు సంస్థలో రూ. 17 వేల జీతంతో సౌమ్యకు కంప్యూర్ ఇంజినీర్ ఉద్యోగం దక్కింది. నియామక పత్రాన్ని విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఆమెకు అందజేశారు. అలాగే ఫోన్లో సీఎంతో మాట్లాడించారు. దీంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయింది. చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా! -
ఆపన్నహస్తం కోసం..
తిరుమలాయపాలెం:ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ యువకుడ్ని రోడ్డు ప్రమాదం జీవచ్ఛవంలా మార్చింది. ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే తన బతుకులు మారతాయని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆ యువకుడు నేడు మంచానికే పరిమితమయ్యాడు. మెరుగైన వైద్యం అందించే స్థోమతలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన గండమల్ల నర్సయ్య, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కమార్తె ఉన్నారు. రెక్కల కష్టంతో బతుకు బండి సాగిస్తున్న ఆ కుటుంబంలో ఇద్దరు కుమారులు, కుమార్తెకు వివాహం చేశారు. ఇద్దరు కుమారులు వేరుపడి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న చిన్న కుమారుడు గండమల్ల నవీన్‌ని రెక్కల కష్టంతో డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ వరకు చదువుకున్న నవీన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. పేద కుటుంబం కావడంతో తన తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయ పడుతూ తన కాళ్లపై తాను నిలబడాలనే ఆశయంతో ఖమ్మంలో ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తన కొడుకు తమ కష్టానికి ఫలితం దక్కించుకుంటున్నాడని సంతోషంగా ఉన్న తల్లిదండ్రుల ఆశలు ఎంతో కాలం నిలవలేదు. 2014 జనవరి 1న తన స్నేహితుడి కోసం మోటార్ సైకిల్‌పై బయలు దేరిన నవీన్‌ని రోడ్డు ప్రమాదం వెంటాడి నడవలేని స్థితికి చేర్చింది. రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో నడవలేని స్థితికి చేరాడు. రెండు సార్లు ఆపరేషన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. తమకు ఆసరాగా ఉండాల్సిన కన్న కొడుకు జీవచ్ఛవంలా మంచంలో పడి ఉండాడాన్ని చూసి తట్టుకోలేక ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పేదరికంలో ఉన్న ఆ తల్లిదండ్రులు కూలీనాలీ చేస్తేగాని పొట్టగడవని పరిస్థితి ఉంది. మంచంలోనే ఉంటూ జీవన పోరాటం చేస్తున్న నవీన్ తనకు చిన్నతరహా వ్యాపారం కోసం రుణసహాయం చేస్తే ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తానని తెలుపుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. స్పందించినటీఆర్ఎస్ నాయకులు నవీన్ దీనస్థితిని తెలుసుకున్న టీఆర్ఎస్ నా యకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకవెళ్లా రు. దీంతో స్పందించిన మంత్రి నవీన్ కు టుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందు కు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సూధన్తో చర్చించారు. సోమ వారం జిల్లా పర్యటన సందర్భంగా నవీన్ కుటుంబా న్ని కలిసి ఆదుకోవాలని టీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. -
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..
ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు.. అతడి మాయమాటలకు ఆమె పొంగిపోయింది.. ఏదేమైనా అతడితోనే జీవితమునుకుంది.. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు.. కొంతకాలానికే అతడి నిజస్వరూపం బయటపడింది..కట్నం కావాలంటూ వేధించాడు. బాధలకు పంటికింద అదిమిపెట్టుకుని ఓర్చుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.. చేసేదేమీ లేక.. పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బతికీడుస్తోంది.. అయినా ఆమెపై కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు. మిర్యాలగూడ అర్బన్ : కట్టుకున్న భార్యను భర్త సుత్తెతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నందిపాడుకు చెందిన కొంక నర్మద(27) పట్టణంలోని కలాల్‌వాడకు చెందిన కొంక రాము ప్రేమించుకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్మద పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ పుట్టింట్లోనే తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగా పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నందిపాడు బైపాస్ వద్ద మాటు వేసిన ఆమె భర్త రాము సుత్తెతో నర్మద తలపై బలం గా మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు మణిదీప్, 3సంవత్సరాల కూతురు గాయత్రి ఉన్నారు. కాగా నర్మద భర్త రాము పట్టణంలోని కేఆర్ ఎస్టేట్‌లో చైనాబజారును నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భార్యను హత్య చేసిన తరువాత పిల్లలను తీసుకుని పారిపోయినట్టు సమాచారం. గతంలోనూ హత్యకు కుట్ర.. నాలుగేళ్లగారాము, నర్మద తరుచూ గొడవ పడుతుం డగా పెద్దల సమక్షంలో ఒకటి చేశారు. కొద్ది రోజుల పాటు నందిపాడులోనే కాపురం పెట్టిన వారు నర్మదను హత్య చేయడానికి రెండు సార్లు ప్రయత్నిం చినట్లు మృతురాలి తల్లి ఆరోపించింది. ఎలాగోలా తప్పించుకున్న నర్మద భర్తకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. అయినా దారుణం జరగడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. అదనపు కట్నం కావాలని.. నర్మదను పెళ్లి చేసుకున్న అనంతరం తరుచూ కట్నం కావాలని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలి పారు. దీంతో దొరికిన కాడికల్లా అప్పు తెచ్చి రూ.లక్ష వరకు ఇచ్చామని విలపిస్తూ చెప్పారు. పోలీసుల పరిశీలన హత్యకు గురైన నర్మద మృతదేహాన్ని డీఎస్పీ సందీప్‌గోనే, వన్ టౌన సీఐ దూసరి భిక్షపతి పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒవేరియన్ కెపాసిటీ తగ్గడం అంటే...?
నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల నాకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటే వైద్యులను సంప్రదించాను. నాకు పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్ చేస్తారేమో అనే భయంతో మళ్లీ వైద్యుల దగ్గరకు వెళ్లలేదు. కానీ మూత్ర విసర్జన సమయంలో వస్తున్న నొప్పిని భరించలేకపోతున్నాను. అసలు కిడ్నీలో రాళ్లు సమస్య ఎందుకు వస్తుంది? ఈ సమస్యకు తప్సనిసరిగా ఆపరేషన్ చేస్తారా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. - విజయ్ కుమార్, కర్నూలు మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని తెలిపారు. మీరు ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కిడ్నీ రాళ్ల సమస్యకు ప్రస్తుతం అత్యాధునికమైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. మూత్రపిండాళ్లో మూత్రం తయారయ్యే ప్రాంతంలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వాస్తవానికి ఇవి రాళ్లు కావు. మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్ ఘనీభవించి స్పటికంలా మారతాయి. వీటినే కిడ్నీ రాళ్లు అని అంటారు. వీటి పరిమాణం చిన్నగా ఉంటే ఆ రాళ్లు మూత్రంతో పాటే శరీరం నుంచి విసర్జించబడతాయి. కానీ ఈ రాళ్ల పరిమాణం పెద్దగా ఉంటే మాత్రం మూత్ర విసర్జనకు అడ్డుపడుతూ భరించలేని నొప్పి, బాధ కలిగిస్తుంటాయి. ఈ సమస్య ఉన్నవారికి అధునాతన రొబాటిక్ లేజర్ చికిత్స ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సులువుగా రాళ్లను కరిగించవచ్చు. ఈ విధానంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడిన ప్రాంతానికే లేజర్ కిరణాలు చొచ్చుకుని వెళ్లి ఆ రాళ్లనుగులగొడతాయి.లాగిలిపోయిన రాళ్లు మూత్ర విసర్జన ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఎలాంటి కోత లేకుండా నిర్వహించే ఈ అధునాతన ప్రక్రియలో నొప్పి, బాధ ఉండదు. లోకల్ అనస్థీషియా ఇచ్చి రోగి స్పహలో ఉండగానే లేజర్ చికిత్స నిర్వహిస్తారు. ఈ విధానంలో రోగి త్వరితగతిన కోలుకోవడంతో పాటు చికిత్స అనంతరం సాధారణ జీవితం గడపగలుగుతారు. కాబట్టి మీరు మాత్రం సంకోచించకుండా నిరభ్యంతరంగా చికిత్స చేయించుకోవచ్చు. వైద్యులను సంప్రదించకుండా వాయిదా వేస్తూ వస్తే మాత్రం సమస్య మరింత తీవ్రవయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ కె. సాయిరాం రెడ్డి సీనియర్ నెఫ్రాలజిస్టు మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి. దీనికి తగిన చికిత్స సూచించగలరు. - సువర్చల, గుంటూరు సాధారణంగా యువతీయువకుల కౌమార దశలో మొటిమలు వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్ చేయని చేతులు వంటి భాగాలు కూడా నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి. - ఆమని, కోరుకొండ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి...సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్పీఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 39 ఏళ్లు. నా భర్తకు 40 ఏళ్లు. మా ఇద్దరి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది. పెళ్లయిన నాటి నుంచీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. గత వారం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాం. ఆమె కొన్ని పరీక్షలు నిర్వహించి నా అండాశయాల సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) తక్కువగా ఉందని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? నాకు పిల్లలు పుడతారా? ఒవేరియన్ కెపాసిటీ తగ్గడానికి కారణాలు ఏమిటి? ప్రస్తుతం నేను చేయాల్సిందేమిటి? వివరంగా చెప్పండి. - ఉషారాణి, విశాఖపట్నం ఒవేరియస్ సామర్థ్యం తగ్గిందంటే... మీ వయసు ఉన్న ఇంకో మహిళకు ఇవే మందులు వాడినా... వాటికి స్పందించే తీరు కాస్త తగ్గవచ్చు. అంటే... సంతాన సాఫల్యం కోసం ఒకే వయసు ఉన్న ఇద్దరు మహిళలకు ఒకేలాంటి చికిత్స చేసినా... అది సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు వేర్వేరుగా ఉండవచ్చు. అంతమాత్రాన ఒవేరియన్ కెపాసిటీ తగ్గినవారు గర్భం ధరించడం సాధ్యం కాదని చెప్పడం కూడా సరికాదు. సాధారణంగా ఇలా ఒవేరియన్ కెపాసిటీ తగ్గడానికి కారణాలు పెద్దగా తెలియదు. అయితే సంతాన సాఫల్యం విషయంలో వయసు కీలకమైన భూమికను పోషిస్తుంది. సాధారణంగా చాలా సందర్భాల్లో వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా మీలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్ రిజర్వ్) తెలుసుకుంటారు. ఆ ‘ఒవేరియన్ రిజర్వ్’ పరీక్ష ద్వారా మీకు సరైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయించవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక మీ వయసులో అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. పైగా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని, మీ సంతాన సాఫల్య నిపుణులను సంప్రదించండి. వారితో ఈ విషయాలను చర్చించండి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
యజమాని ఇచ్చే బీమాతో సరా..!
శ్రీధర్ది ప్రైవేటు ఉద్యోగం. మంచి జీతం. కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఎప్పుడూ సొంత ఆరోగ్య బీమా గురించి ఆలోచించలేదు. అయితే ఉన్నట్టుండి కంపెనీ అతన్ని తొలగించింది. ఈ వార్త పిడుగుపాటులా తాకటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా... ఈ కుంగుబాటుతో ఆరోగ్యం దెబ్బతింది. ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తలెత్తింది అసలు సమస్య. ఆసుపత్రిలో నాలుగైదు రోజులు ఉంచటం... పరీక్షలన్నీ చేయటం, ట్రీట్మెంట్... వీటన్నిటికీ రూ.2 లక్షల దాకా అయింది. అంతకు ముందైతే కంపెనీ హెల్త్ పాలసీ ఉండేది కనక ఎన్నడూ ఇబ్బంది అనిపించలేదు. కానీ ఉద్యోగం పోవటం... ఆదాయం లేకపోవటం... అదే సమయంలో ఆసుపత్రి పాలవటం అన్నీ కలిసి శ్రీధర్‌ను నానా ఇబ్బందులూ పెట్టాయి. బంధుమిత్రుల సాయంతో బయటపడ్డా... కంపెనీ ఇస్తున్నది కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఎంత అవసరమో అప్పుడు తెలిసొచ్చింది శ్రీధర్‌కు. నిజానికిపుడు చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ ఇస్తున్న ఆరోగ్య బీమా పాలసీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ బీమా సరిపోతుంది కదా! ఇంకెందుకు మరొకటి? అనేది వారి ఆలోచన. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది. గడిచిన మూడేళ్లుగా చాలా సంస్థలు ఉద్యోగుల తల్లిదండ్రుల బీమా కవరేజీకి వచ్చేసరికి వారి నుంచి కూడా కొంత పేమెంట్ ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగ్గట్టుగా ఇవి కవరేజీ పెంచటం లేదు. ఇటీవల ఓ బీమా కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైందేంటంటే... 2008 నుంచి భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న మెడిక్లెయిమ్ ప్రీమియం పెరగటమే లేదు. అయితే తగ్గటం, లేకపోతే అదే స్థాయిలో ఉండటం జరుగుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలు పెడుతున్న ఖర్చులో 10 శాతమే ఇక్కడి కంపెనీలు వెచ్చిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెపైచ్చు 2008లో మాంద్యం పరిస్థితులు నెలకొన్న తరవాత నుంచి ఇవి ఆ ఖర్చులను కూడా కుదించటం మొదలుపెట్టాయి. బీమా ప్రీమియంలలో కోత పెట్టాయి. దీంతో 20 నుంచి 25 శాతం ఉద్యోగులు తమ మెడిక్లెయిమ్ పాలసీలకు అదనంగా టాప్ అప్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి * కంపెనీ పాలసీలో కవరేజీ మొత్తం అంతంతే * వ్యక్తిగత, గ్రూప్ టాప్-అప్లూ చేయించుకోవచ్చు * సొంత హెల్త్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్, ప్రమాద బీమాతో ధీమా పెరుగుతున్న నియంత్రణలు... చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ బీమా కవరేజీలపై ఆంక్షలు పెడుతున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ తాజా నివేదిక ప్రకారం 76 శాతం కంపెనీలు కో-పేమెంట్ నిబంధనను పాటించటమే కాక ఆసుపత్రుల్లో గది అద్దెపై పరిమితి విధిస్తున్నాయి. సగటున చూస్తే ఇవి ఉద్యోగులకు అందిస్తున్న బీమా కవరేజీ మొత్తం లక్ష నుంచి లక్షన్నర దాటడం లేదు. ‘‘దురదృష్టవశాత్తూ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి వారం రోజుల పాటు ఉన్నారనుకోండి. మీ ఆసుపత్రి బిల్లు భారీగా పెరిగిపోయే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో కంపెనీ ఇస్తున్న కవరేజీ సరిపోదు. అందుకని మీ వార్షిక ఆదాయానికి సమానమైన సొంత ఆరోగ్య బీమా కవరేజీ తప్పక ఉండి తీరాలి. దానికి క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, వ్యక్తిగత ప్రమాద బీమా జత చేయాలి’’ అనేది పాలసీ బజార్ సీఈఓ యాశిష్ దహియా మాట. నిజానికి కంపెనీ ఇస్తున్న కవరేజీ చాలకపోవటం అనేది ఒక్కటే కాదు. కంపెనీ ఆఫర్ చేస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని దాటిపోయినా, లేక మీరు తరచు ఉద్యోగాలు మారుతున్నా కూడా... మీకు ప్రత్యేక ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఏడాదికి రూ.9 వేలలోనే అన్నీ... ఒకవేళ విడిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామనుకుంటే... ముఖ్యంగా చూడాల్సింది అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి వారు పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్ ఎంత? మెటర్నిటీ ప్రయోజనాలున్నాయా? క్యాష్‌లెస్ ఫెసిలిటీ కల్పించే ఆసుపత్రులెన్ని? వంటివి. నిజానికి 30 ఏళ్ల వ్యక్తి గనక రూ.5 లక్షల బీమా కవరేజీ, రూ.10 లక్షల క్రిటికల్ ఇల్నెస్, రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా... వీటన్నిటికీ కలిసి ఏడాదికి రూ.9 వేలు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే... రూ.5 లక్షల రెలిగేర్ కేర్ హెల్త్ కవర్‌కు ఏడాదికి రూ.5,162 అవుతుండగా, బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.3వేలు, ఐసీఐసీఐ లాంబార్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.1,221 ఖర్చవుతోంది. కాకపోతే వ్యక్తిగత బీమాకు కొన్ని పరిమితులుంటాయి. కంపెనీ ఇస్తున్న గ్రూప్ బీమా కవరేజీ అయితే అప్పటికే ఉన్న వ్యాధుల్ని, మెటర్నిటీ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలైతే అప్పటికే ఉన్న వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది కంపెనీని బట్టి మారుతుంది. కవరేజీని పెంచుకోవాలనుకుంటే టాప్ అప్ ప్లాన్‌నూ పరిశీలించొచ్చు. కొన్ని కంపెనీలు గ్రూప్ టాప్-అప్‌లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటిని మీరు పనిచేస్తున్న కంపెనీ ఆఫర్ చేస్తున్న బీమా సంస్థ దగ్గరే కొనుగోలు చే యొచ్చు. ఇలాంటప్పుడు గ్రూప్ టాప్-అప్ అనేది కంపెనీ ఇస్తున్న పథకానికి జతగా ఉంటుందో లేదో చూడాలి. ఇక వ్యక్తిగత టాప్-అప్లనేవి కొంత ఖరీదే. వీటిని ఎంచుకునే ముందు వాటి షరతులనూ చూడాలి. మరికొన్ని కంపెనీలు నిర్దిష్ట మొత్తానికి సొంత ఆరోగ్య బీమా ఉంటే తప్ప టాప్ అప్ చేయలేమని, కవరేజీ మొత్తాన్ని ఏకకాలంలో ఉపయోగించుకున్న తరవాతే టాప్ అప్ వర్తిస్తుందని షరతులు పెడుతున్నాయి. కనుక చిన్న వయసులో ఉన్నపుడే వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకుంటే తక్కువ ధరకే రావటం తో పాటు మరిన్ని వ్యాధులు కవరయ్యే అవకాశం ఉంటుంది. -
రామ్మూర్త్తీ.. ఈక్విటీనే మార్గం
నాది పైవేటుద్యోగం. వయస్సు 35 సంవత్సరాలు. నెల జీతం రూ. 45,000. నెలవారీ ఇంటి ఖర్చు 20,000 అవుతుంది. భార్య, రెండేళ్ల అబ్బాయి ఉన్నారు. ఇంతవరకు నేను ఎలాంటి పొదుపూ చేయలేదు. ఇప్పటి నుంచి నా రిటైర్మెంట్, పిల్లవాడి ఉన్నత చదువు కోసం డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ పథకాలు బాగున్నాయో సూచించగలరా!!? - రామ్మూర్తి, విశాఖపట్నం ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు నెలకు రూ. 36,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నెలకు రూ. 25,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి ఏటా మీ జీతం పెరుగుదల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ విలువను కూడా పెంచుకుంటూ ఉండండి. ఇంతవరకు మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదంటున్నారు. అంటే ఇప్పటికే ఆలస్యమయిందనుకోవాలి. అందుకని ఇక ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా పొదుపు మొదలుపెట్టాల్సిందే. ఆలస్యం చేసే కొద్దీ మీ లక్ష్యాలను చేరుకోవడానికి కేటాయించే మొత్తం పెరిగిపోతుంటుంది. మీరిచ్చిన సమాచారం ప్రకారం 55 ఏళ్లకు అంటే 2035కి రిటైరవ్వాలని మీరు భావిస్తున్నారు. అలాగే 2029 నాటికి మీ పిల్లవాడి ఉన్నత చదువులకు నగదు అవసరం అవుతుంది. ఇప్పుడున్న మీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే 2035 తర్వాత మీకు ప్రతి నెలా కనీసం రూ. 25,000 పెన్షన్ అవసరమవుతుంది. అలాగే 2029 నాటికి పిల్లవాడి కోసం కనీసం రూ.10 లక్షలు నగదు కావాల్సి ఉంటుంది. వీటిని ద్రవ్యోల్బణాన్ని (ధరలు పెరుగుదల) పరిగణించకుండా లెక్కించటం జరిగింది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి సమకూర్చుకోవాల్సిన నిధి కోసం సాధారణ సగటు ద్రవ్యోల్బణాన్ని 6 శాతం, విద్యా ద్రవ్యోల్బణాన్ని 7 శాతంగా లెక్కించాం. ఆ విధంగా చూస్తే ఎంత నిధి అవసరమవుతుంది? ఇందుకోసం ఇప్పుడు ఎంత మొత్తం కేటాయించాలనేది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా చేయండి.. స్వభావ రీత్యా మీ రెండు ఆర్థిక లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవే. కాబట్టి అధిక రాబడి పొందడానికి అవకాశమున్న ఈక్విటీ పథకాలు మీకు నప్పుతాయి. పోర్ట్‌ఫోలియోలో సమతుల్యం పాటించడం కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా... అధిక భాగం ఈక్విటీలకు కేటాయించండి. ఇందుకు మ్యూచువల్ ఫండ్ పథకాలను పరిశీలించండి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సిప్ విధానం ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ప్రారంభ ఇన్వెస్టర్లలకు సిప్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ముఖ్యంగా ప్రతీ నెలా జీతంలో మిగిలే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సిప్ బాగుంటుంది. మార్కెట్లో ఉండే హెచ్చు తగ్గులను తట్టుకుంటూ దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందడానికి సిప్ దోహదం చేస్తుంది. దీంతోపాటు బీమా రక్షణ తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కుటుంబానికి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా ఉంటుంది. ఇందుకోసం కేవలం బీమా రక్షణను మాత్రమే అందించే టర్మ్ పాలసీలను తీసుకోండి. కంపెనీ నుంచి ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా... సొంతంగా కూడా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. కంపెనీలు అందించే బీమా కేవలం అందులో పనిచేస్తున్నంత కాలమే ఉంటుంది. మీరు ఒక్కసారి కంపెనీని వదిలేస్తే బీమా రక్షణ ఆగిపోతుంది. అందుకని కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీని తీసుకోండి. ప్రస్తుతానికి ఆఫీసుది ఉంది కదా? తర్వాత తీసుకుందాములే అనుకుంటే.. అధిక ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. చిన్న వయస్సులోనే పాలసీని తీసుకొని కొనసాగించడం ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందొచ్చు. ముఖ్యాంశాలు.. * ఇక ఆలస్యం చెయ్యకుండా పొదుపు మొదలుపెట్టండి * దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీని ‘సిప్’ చేయటమే బెటర్ * బీమా రక్షణ కోసం కేవలం టర్మ్ పాలసీ ఉంటే చాలు * హెల్త్ పాలసీ కూడా కంపెనీది కాకుండా సొంతది ఉండాలి * కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష
తుంగతుర్తి : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. తల్లిదండ్రులు నిరాకరించారని కాదు పొమ్మన్నాడు.. దీంతో తనకు న్యాయం చేయాలని భార్య ఆ భర్త ఇంటి ఎదుటే మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన తుంగతుర్తి మండలం పసునూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన మల్లేపాక శ్రీరాములు రెండో కుమారుడు సందీప్ కుమార్ మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన ఊర్మిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఈ ఏడాది జనవరి 22న అక్కడే ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కొంత కాలం వరకు అక్కడే కాపురం కూడా చేశారు. ఇటీవల సందీప్ తన భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతడి తల్లిదండ్రులు పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో ఊర్మిళను అప్పటి నుంచి సందీప్ అతడి కుటుంబ సభ్యులు వేధించసాగారు. సందీప్ తన నుంచి విడిపోవాలని ఊర్మిళను ఒత్తిడి చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో మూడు రోజుల క్రితం ఊర్మిళను పసునూరులోనే వదిలి సందీప్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. అయితే అప్పటి నుంచి భర్త ఇంటి ఎదుటే ఊర్మిళ దీక్ష చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అటు తల్లిదండ్రులు రానివ్వడం లేదని.. ఇటు చూస్తే తనకు వద్దంటూ భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని.. న్యాయం జరగకుంటే చావు తప్ప వేరే మార్గం లేదని ఊర్మిళ విలపిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
కొందరే ‘భద్రం’
ప్రైవేటు ఉద్యోగులకు ఆహార భద్రత కార్డులు కట్ ఒక ఇంట్లో ఒక్క వృద్ధునికే పింఛను నిబంధనలు కఠినతరం సాక్షి, సిటీబ్యూరో: మీకు ఎంత చిన్నదైనా సరే... ప్రైవేటు ఉద్యోగం ఉందా? అయితే ఆహార భద్రత కార్డులపై ఆశలు వదులుకోండి. మీ ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారా? ఇద్దరికీ పిం ఛను అందుతోందా? అయితే ఇద్దరిలో ఒకరు త్యాగానికి సిద్ధంగా ఉండండి... ఇది మా మాట కాదు. ప్రభుత్వ నిబంధనలు చెబుతున్న నిజం. సంక్షేమ ఫలాలను నిజమైన లబ్ధిదారులకు అందించే పేరిట ప్రభుత్వం భారీ కోతలకు సిద్ధమవుతోంది. ఆహార భద్రత కార్డులు, పింఛనుదారుల ఎంపికపై నిర్వహించనున్న విచారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ దరఖాస్తులను కుటుంబ సమగ్ర సర్వేతో ముడిపెట్టి పరిశీలించాలని పేర్కొంది. రేషన్ కార్డులు, పెన్షన్లకు ఆధార్ లింక్ చేసిన సమ యంలో భారీగా బోగస్ రేషన్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో 1.84 లక్షల రేషన్ కార్డులు, 60 వేలకు పైగా పింఛన్లు బోగస్‌గా తేలాయి. ఇలాంటివి నివారించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకం అమలులో భాగంగా రాష్ట్ర సర్కారు తాజాగా రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు ప్రవేశపెట్టాలని, దరఖాస్తులు స్వీకరించింది. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి.జంట జిల్లాల్లో ప్రసుతం రేషన్ కార్డులు 15.62 లక్షలు ఉండగా, ఆహారభద్రతకు 21.88 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సామాజిక భద్రత పింఛన్లు 3,49,759 ఉండగా... కొత్తగా 4,96,429 దరఖాస్తులు వచ్చాయి. వీటిని చూసిన యంత్రాంగం వడపోతకు సిద్ధమైంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలివీ... ఆహార భద్రత కార్డులకు అర్హులు మూడు గదుల్లో నివసించే/సొంత ఇళ్లు కలిగిన వారు, రెగ్యులర్ ఆదాయం లేని వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు, ఇంటిలో మంచినీరు, మరుగు దొడ్డి సదుపాయం లేని వారు, వితంతువులకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయనున్నారు. అనర్హులు వీరే.. ప్రభుత్వ, ప్రవేట్ రంగాల ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, కాంట్రాక్టర్లు, స్వయం ఉపాధి కలిగిన వారు, వ్యాపారులు, ప్రభుత్వ పింఛనుదారులు, సమర యోధులు, ఫోర్ వీలర్, ఏసీ కలిగిన వారు, నాలుగు/ అంతకన్న ఎక్కువ గదులు ఉన్న ఇంటి యజమానులు, ఆదాయ పన్ను చెల్లించువారు, ఆహార భద్రత కార్డులకు అనర్హులు. పింఛన్లకు ఇలా... కుటుంబంలో పిల్లలు ఉద్యోగం చేస్తుంటేపింఛన్లకు అనర్హులు. ఇతర పింఛన్లు పొందుతున్నా, వ్యాపారాలు, నాలుగు చక్రాల వాహనాలు, పరిమితికి మించి భూమి ఉన్నా అనర్హులుగా ప్రకటించే అవకాశముంది. భార్యాభర్తలిద్దరూ వృద్ధులైతేప్రస్తుతమున్న విధంగా ఒక్కరికి మాత్రమే పింఛను ఇవ్వాలన్న నిబంధనను కొనసాగించనున్నారు. ఇంట్లో వితంతువులు, వికలాంగులు ఎంత మంది ఉన్నప్పటికీ, అందరికీ పింఛను మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. కఠిన నిబంధనల వల్ల అర్హులైన పేదలు నష్టపోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ షురూ... ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం దరఖాస్తుల వడపోతపై విచారణ ప్రారంభించింది. తొలుత పింఛన్లపై విచారణ చేపట్టనుంది. దీని కోసం 225 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. స్థానికంగా ఉన్న 125 మంది రెవెన్యూ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్, భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని ఎస్టేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు మరో 100 మంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం 20 కుటుంబాలను కలిసి, 40 నుంచి 50 దరఖాస్తులను పరిశీలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈప్రక్రియ పూర్తి కాగానే ఆహార భద్రత కార్డులు, ఆదాయ, కుల, నివాస పత్రాల దరఖాస్తు విచారణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి. ఈ దరఖాస్తుల విచారణలో 1000 మంది ఉద్యోగులు పాల్గొంటారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు.