కుమారుడి దీనస్థితిని చూపిస్తూ తమను ఆదుకోవాలని కోరుతున్న నవీన్ తల్లిదండ్రులు
తిరుమలాయపాలెం:ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ యువకుడ్ని రోడ్డు ప్రమాదం జీవచ్ఛవంలా మార్చింది. ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే తన బతుకులు మారతాయని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆ యువకుడు నేడు మంచానికే పరిమితమయ్యాడు. మెరుగైన వైద్యం అందించే స్థోమతలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన గండమల్ల నర్సయ్య, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కమార్తె ఉన్నారు. రెక్కల కష్టంతో బతుకు బండి సాగిస్తున్న ఆ కుటుంబంలో ఇద్దరు కుమారులు, కుమార్తెకు వివాహం చేశారు. ఇద్దరు కుమారులు వేరుపడి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న చిన్న కుమారుడు గండమల్ల నవీన్‌ని రెక్కల కష్టంతో డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ వరకు చదువుకున్న నవీన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.
పేద కుటుంబం కావడంతో తన తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయ పడుతూ తన కాళ్లపై తాను నిలబడాలనే ఆశయంతో ఖమ్మంలో ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తన కొడుకు తమ కష్టానికి ఫలితం దక్కించుకుంటున్నాడని సంతోషంగా ఉన్న తల్లిదండ్రుల ఆశలు ఎంతో కాలం నిలవలేదు. 2014 జనవరి 1న తన స్నేహితుడి కోసం మోటార్ సైకిల్‌పై బయలు దేరిన నవీన్‌ని రోడ్డు ప్రమాదం వెంటాడి నడవలేని స్థితికి చేర్చింది. రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో నడవలేని స్థితికి చేరాడు. రెండు సార్లు ఆపరేషన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. తమకు ఆసరాగా ఉండాల్సిన కన్న కొడుకు జీవచ్ఛవంలా మంచంలో పడి ఉండాడాన్ని చూసి తట్టుకోలేక ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పేదరికంలో ఉన్న ఆ తల్లిదండ్రులు కూలీనాలీ చేస్తేగాని పొట్టగడవని పరిస్థితి ఉంది. మంచంలోనే ఉంటూ జీవన పోరాటం చేస్తున్న నవీన్ తనకు చిన్నతరహా వ్యాపారం కోసం రుణసహాయం చేస్తే ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తానని తెలుపుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.
స్పందించినటీఆర్‌ఎస్ నాయకులు
నవీన్ దీనస్థితిని తెలుసుకున్న టీఆర్‌ఎస్ నా యకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకవెళ్లా రు. దీంతో స్పందించిన మంత్రి నవీన్ కు టుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందు కు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సూధన్‌తో చర్చించారు. సోమ వారం జిల్లా పర్యటన సందర్భంగా నవీన్ కుటుంబా న్ని కలిసి ఆదుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment