నాది పైవేటుద్యోగం. వయస్సు 35 సంవత్సరాలు. నెల జీతం రూ. 45,000. నెలవారీ ఇంటి ఖర్చు 20,000 అవుతుంది. భార్య, రెండేళ్ల అబ్బాయి ఉన్నారు. ఇంతవరకు నేను ఎలాంటి పొదుపూ చేయలేదు. ఇప్పటి నుంచి నా రిటైర్మెంట్, పిల్లవాడి ఉన్నత చదువు కోసం డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ పథకాలు బాగున్నాయో సూచించగలరా!!?
- రామ్మూర్తి, విశాఖపట్నం
ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు నెలకు రూ. 36,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నెలకు రూ. 25,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి ఏటా మీ జీతం పెరుగుదల ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ విలువను కూడా పెంచుకుంటూ ఉండండి.
ఇంతవరకు మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదంటున్నారు. అంటే ఇప్పటికే ఆలస్యమయిందనుకోవాలి. అందుకని ఇక ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా పొదుపు మొదలుపెట్టాల్సిందే. ఆలస్యం చేసే కొద్దీ మీ లక్ష్యాలను చేరుకోవడానికి కేటాయించే మొత్తం పెరిగిపోతుంటుంది. మీరిచ్చిన సమాచారం ప్రకారం 55 ఏళ్లకు అంటే 2035కి రిటైరవ్వాలని మీరు భావిస్తున్నారు. అలాగే 2029 నాటికి మీ పిల్లవాడి ఉన్నత చదువులకు నగదు అవసరం అవుతుంది. ఇప్పుడున్న మీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే 2035 తర్వాత మీకు ప్రతి నెలా కనీసం రూ. 25,000 పెన్షన్ అవసరమవుతుంది. అలాగే 2029 నాటికి పిల్లవాడి కోసం కనీసం రూ.10 లక్షలు నగదు కావాల్సి ఉంటుంది.
వీటిని ద్రవ్యోల్బణాన్ని (ధరలు పెరుగుదల) పరిగణించకుండా లెక్కించటం జరిగింది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి సమకూర్చుకోవాల్సిన నిధి కోసం సాధారణ సగటు ద్రవ్యోల్బణాన్ని 6 శాతం, విద్యా ద్రవ్యోల్బణాన్ని 7 శాతంగా లెక్కించాం. ఆ విధంగా చూస్తే ఎంత నిధి అవసరమవుతుంది? ఇందుకోసం ఇప్పుడు ఎంత మొత్తం కేటాయించాలనేది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది.
ఇలా చేయండి..
స్వభావ రీత్యా మీ రెండు ఆర్థిక లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవే. కాబట్టి అధిక రాబడి పొందడానికి అవకాశమున్న ఈక్విటీ పథకాలు మీకు నప్పుతాయి. పోర్ట్‌ఫోలియోలో సమతుల్యం పాటించడం కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా... అధిక భాగం ఈక్విటీలకు కేటాయించండి. ఇందుకు మ్యూచువల్ ఫండ్ పథకాలను పరిశీలించండి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సిప్ విధానం ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయండి.
ప్రారంభ ఇన్వెస్టర్లలకు సిప్ ఒక చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ముఖ్యంగా ప్రతీ నెలా జీతంలో మిగిలే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సిప్ బాగుంటుంది. మార్కెట్లో ఉండే హెచ్చు తగ్గులను తట్టుకుంటూ దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందడానికి సిప్ దోహదం చేస్తుంది.
దీంతోపాటు బీమా రక్షణ తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కుటుంబానికి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా ఉంటుంది. ఇందుకోసం కేవలం బీమా రక్షణను మాత్రమే అందించే టర్మ్ పాలసీలను తీసుకోండి.
కంపెనీ నుంచి ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా... సొంతంగా కూడా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. కంపెనీలు అందించే బీమా కేవలం అందులో పనిచేస్తున్నంత కాలమే ఉంటుంది. మీరు ఒక్కసారి కంపెనీని వదిలేస్తే బీమా రక్షణ ఆగిపోతుంది. అందుకని కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీని తీసుకోండి. ప్రస్తుతానికి ఆఫీసుది ఉంది కదా? తర్వాత తీసుకుందాములే అనుకుంటే.. అధిక ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. చిన్న వయస్సులోనే పాలసీని తీసుకొని కొనసాగించడం ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందొచ్చు.
ముఖ్యాంశాలు..
* ఇక ఆలస్యం చెయ్యకుండా పొదుపు మొదలుపెట్టండి
* దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీని ‘సిప్’ చేయటమే బెటర్
* బీమా రక్షణ కోసం కేవలం టర్మ్ పాలసీ ఉంటే చాలు
* హెల్త్ పాలసీ కూడా కంపెనీది కాకుండా సొంతది ఉండాలి
* కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి
- అనిల్ రెగో
ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్
రామ్మూర్త్తీ.. ఈక్విటీనే మార్గం
Published Mon, Oct 19 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement