Anil rego
-
బ్యాలెన్సా..? లేక డైనమిక్కా..?
తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు మ్యూచువల్ ఫండ్స్ వాటి ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని బట్టి విభిన్న రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకునే అగ్రసివ్ ఫండ్స్‌తో పాటు... ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేయాల్సినఅవసరం లేని ఇండెక్స్ ఫండ్లూ ఉన్నాయి. ఇండెక్స్‌లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా ఇవి ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటాయి. అదే డైనమిక్, డైవర్సిఫైడ్ ఈక్విటీ వంటి అగ్రసివ్ ఫండ్స్ వ్యూహాలు మాత్రం మార్కెట్ కదలికలను బట్టి వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందిన ఇలాంటి రెండు రకాల ఫండ్స్ బ్యాలెన్స్డ్, డైనమిక్ ఫండ్స్ గురించి చూద్దాం. మార్పులు అక్కర్లేని బ్యాలెన్స్డ్... పేరుకి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ విధానంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65-70 శాతం ఈక్విటీలకు కేటాయిస్తారు. మిగిలిన మొత్తం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటి పోర్ట్‌ఫోలియోలో ఎప్పటికప్పుడు పెద్దగా మార్పులు చేయాల్సిన పని ఉండదు. ఈక్విటీ, డెట్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణ వ్యయం తక్కువ. కానీ ఇదే సమయంలో ఇండెక్స్ ఫండ్స్ కంటే నిర్వహణ వ్యయం ఎక్కువ. ఇక వీటి రాబడులు చూస్తే... ఈక్విటీ, డెట్ పథకాల రాబడులకు మధ్యలో ఉంటాయి. గడిచిన ఏడాదిలో డెట్ ఫండ్స్ 11 శాతం, ఈక్విటీ ఫండ్స్ 25 నుంచి 30 శాతం రాబడినందించాయి. కానీ ఇదే సమయంలో బ్యాలెన్స్డ్ ఫండ్స్ 17 నుంచి 20 శాతం లాభాలనిచ్చాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియోలో 60 శాతం పైగా ఈక్విటీలకే కేటాయిస్తారు కాబట్టి పన్ను విషయాల్లో వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే వీటిలో ఇన్వెస్ట్ చేసి ఏడాది దాటితే ఎలాంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. డెట్, ఈక్విటీ రెండింట్లో ఇన్వెస్ట్ చేస్తారు కనక తక్కువ రిస్క్‌తో మధ్యస్థాయిలో లాభాలను అందిస్తాయి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ విధానమే ఉత్తమం. డైనమిక్ ఫండ్స్ వివిధ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో సహజ సిద్ధంగా ఉండే ఒడిదుడుకులను డైనమిక్ ఫండ్స్ స్వల్ప కాలానికి ఒడిసి పట్టుకుంటాయి. ఇవి తప్పనిసరిగా ఈక్విటీ, డెట్ పథకాల నుంచి మారుతుండాలి. అంటే.. ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయిస్తే నెలరోజుల్లో ఈ మొత్తాన్ని విక్రయించి డెట్ పథకాల్లోకి తప్పకుండా మార్చాలి. ఈ మార్పు అనేది ప్రతి ఫండ్ హౌస్‌కి మారుతుంటుంది. కొన్ని ఫండ్ హౌస్‌లు చాలా అగ్రసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుస్తాయి. మరికొన్ని ఇండెక్స్ ఫండ్స్‌లా చాలా నెమ్మదిగా మారుస్తాయి. అందుకే డైనమిక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవాలి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు నిబంధనల ప్రకారం ఈక్విటీల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్ కంటే రాబడి తక్కువగా ఉంటుంది. కానీ తిరిగి ప్రవేశించడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. మిగిలిన పథకాలతో పోలిస్తే డైనమిక్ ఫండ్స్‌లో రిస్క్ అధికమే అయినా అధిక రాబడి పొందే అవకాశముంది. ఇవి దీర్ఘకాలానికి అంటే కనీసం 5 ఏళ్ల దృష్టిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిప్ విధానం కంటే మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం మంచింది. ఈ అంశాలు గుర్తుంచుకోండి... ⇒ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ పథకాలు రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. ⇒ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తక్కువ రిస్క్‌ను, తక్కువ రాబడిని కలిగి ఉంటాయి. ⇒ డైనమిక్ ఫండ్స్ పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే పూర్తిగా వైదొలగుతాయి కూడా. ⇒ డైనమిక్ ఫండ్స్‌కు అధిక రిస్క్, అధిక రాబడిని అందించే లక్షణాలున్నాయి ⇒ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో, డైనమిక్ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం మంచిది. - అనిల్ రెగో సీఈవో,రైట్ హొరెజైన్స్ -
బ్రేక్ వచ్చినా.. బెంగ వద్దు
ఉద్యోగం కోల్పోయినా ఆర్థిక ప్రణాళికతో ధీమా ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మారిపోతున్న ఆర్థిక పరిస్థితులు మొదలైనవన్నీ దేశీయంగా మన మీద కూడా తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. 2008-09 నాటి ఆర్థిక సంక్షోభంలో అంతర్జాతీయంగా అనేక వ్యాపారాలు మూతబడటంతో ఈ ధోరణి మరింతగా పెరిగింది. కొంగొత్త టెక్నాలజీలు, ఎక్కడికక్కడ పెరిగిపోతున్న పోటీ దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. కొన్ని కంపెనీలు నిపుణులను చౌకగా రిక్రూట్ చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తుంటే.. మరికొన్ని సంస్థలు ఉత్పాదకత పెంచుకునే పేరుతో నిపుణులపై మరింత పని భారం మోపుతున్నాయి. ఇలాంటప్పుడు ఉద్యోగం కోల్పోతే మరో ఆదాయమార్గం అంటూ పెద్దగా ఉండని వేతన జీవుల పరిస్థితి సమస్యాత్మకంగా మారుతోంది. ఎంతటి నిపుణులైనా సరే.. ఉద్యోగం పోయిందంటే మళ్లీ కొత్త దాన్లో చేరాలంటే కనీసం రెండు, మూడు నెలలు పైగానే పట్టేస్తోంది. ఒకవేళ అదే నైపుణ్యాలున్న వారు పుష్కలంగా ఉన్నారంటే.. ఈ సమయం మరింత పెరుగుతుంది. అయితే, ప్రతి నెలా ఖర్చులు మాత్రం ఆగవు కదా. సిటీల్లో ఉంటున్నప్పుడు నిత్యావసరాలతో పాటు భారీ అద్దెలు, లేదా రుణంపై ఇల్లు తీసుకుంటే ఈఎంఐలు, ప్రయాణాలకయ్యే ఖర్చులు సాధారణంగానే ఉంటాయి. వీటికి తోడు పిల్లలను మంచి స్కూల్లో చదివించాలంటే వేలకు వేలు కట్టాల్సిందే. కుటుంబం చిన్నదే అయినా.. ఇవన్నీ కలిసి తడిసి మోపెడవుతుంటాయి. కాబట్టి ఏ కారణం వల్ల ఉద్యోగం కోల్పోయినా.. ఆర్థికంగా భరోసా లేకపోతే మానసికంగానూ, ఆర్థికంగాను ఒత్తిడి తప్పడం లేదు. తప్పనివి.. తప్పించుకోగలిగేవి.. స్కూలు ఫీజులు, ఇంటి అద్దె లేదా గృహరుణ ఈఎంఐలు, బీమా ప్రీమియంలు మొదలైనవి రిటైరవ్వడానికి ముందు ఉండే ఖర్చుల్లో అనివార్యమైనవి. ఖర్చులు తగ్గించుకోగలిగేవేవైనా ఉంటే అవి ఇంటి బడ్జెట్టు.. వినోదంపై చేసే ఖర్చులు. సినిమాలు, షికార్లు పూర్తిగా తగ్గించుకోవడం.. హోటళ్లకెళ్లడం బదులు ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వడం మొదలైనవి చేయొచ్చు. మళ్లీ మంచి ఉద్యోగం దొరికే దాకా వీటిని వాయిదా వేసుకోవచ్చు. ఆల్కహాల్ అలవాటుంటే దాన్ని సాధ్యమైనంత వరకూ మానుకోగలిగితే మంచిది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికే కాదు ఆర్థిక పరిస్థితికీ చేటు తెస్తుంది. ఇక తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన బైటికి కనిపించే లైఫ్ స్టయిల్‌ను ఒక్కసారిగా మార్చేయకూడదంటారు హెచ్ఆర్ నిపుణులు. తెలిసిన వారిని తరచూ కలుస్తూ, నెట్వర్కింగ్ కొనసాగిస్తుంటేనే త్వరగా మరో కొత్త ఉద్యోగం దక్కే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమయంలో మంచి డ్రెస్సింగ్, ప్రయాణాలు, ఫ్రెండ్స్‌కి కాఫీ..టీలు మొదలైన ఖర్చులు అదనంగా ఉంటాయి. ఒకోసారి ఉద్యోగం ఉన్నప్పటికంటే, లేనప్పుడే ఇవి మరింత ఎక్కువ కావొచ్చు. ప్రణాళికలు ఇలా.. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకూ ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్లానింగ్ చేసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు ఎలాగైతే వేసుకుంటారో, మధ్యమధ్యలో తలె త్తే ఉద్యోగ సంబంధిత అంతరాయాల కోసం కూడా ప్రణాళిక ఉండాలి. ఉద్యోగం చేతిలో లేనప్పుడు.. భారీ వడ్డీ రేటు పడే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మేలు. మరీ అత్యవసరమైతే పీఎఫ్ మీద లేదా ఇన్సూరెన్స్ పాలసీల మీద రుణం తీసుకోవచ్చు. ముందు నుంచే ప్రణాళిక వేసుకుని.. కనీసం ఆర్నెల్ల పాటు ఖర్చులకు ఎటువంటి ఢోకా ఉండకుండా అత్యవసర నిధి ఉంచుకోవాలి. ఒకవేళ ఉద్యోగం చేసే కంపెనీలో గానీ లేదా సదరు పరిశ్రమలో గానీ ఏవైనా సంక్షోభాల సూచనలు కనిపిస్తే అత్యవసర నిధి పరిమాణాన్ని దాదాపు ఏడాది కాలం దాకా పెంచుకోవడం ఉత్తమం. ఇందుకోసం లిక్విడ్ లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో రిస్కు తక్కువుంటుంది, బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ పథకాలతో పోలిస్తే కాస్త మెరుగైన రాబడి అందిస్తాయి. ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. ఉద్యోగం లేని సమయంలో కూడా కాస్త ఆర్థికంగా భరోసాగా ఉండొచ్చు. ఈ ధీమా మనలోనూ ప్రతిఫలిస్తుంది కాబట్టి ఇంటర్వ్యూల్లాంటివి ధైర్యంగా ఎదుర్కొనే వీలుంటుంది. వీలైనంత త్వరగా కొత్త ఉద్యోగాన్నీ దక్కించుకునే అవకాశం ఉంటుంది. - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
పన్నుకు మందు... ఈఎల్ఎస్ఎస్
ఇది మార్చి నెల. అంటే పన్ను కోతలకు ఆఖరి నెల. ఈ నెల్లో గనక ఇన్వెస్ట్మెంట్ల రుజువు పత్రాలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు ఇవ్వకపోతే నెలాఖర్లో చేతికి కాస్తయినా జీతం రావటం కష్టం. అయితే పన్ను ఆదా చేయటానికున్న చక్కటి మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఉంటాయి. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేయడానికి వీలు కల్పించే ఈఎల్ఎస్ఎస్ల లాకిన్ వ్యవధి మూడేళ్లు. ఒకరకంగా మిగతా పథకాలతో పోలిస్తే తక్కువే. వీటిని ఒకసారి చూద్దాం... ♦ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడులు ♦ మూడేళ్ల లాకిన్‌తో దీర్ఘకాల రాబడులకు అవకాశం ♦ రాబడులపై క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండదు ♦ మంచి ఫండ్‌ను ఎంచుకోవటం; సిప్ చేయటం అవసరం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి తగిన లాభాలు పొందాలనుకునేవారికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడమే చక్కని మార్గమని అందరూ చెబుతుంటారు. ఎందుకంటే స్వల్ప కాలమైతే స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటాయి. వాటిని తప్పించుకోవాలంటే దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించాలి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులే కాబట్టి మెరుగైన ఆదాయాన్ని ఆశించవచ్చు. పెపైచ్చు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. వీలుంటే ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే సిప్ పద్ధతిలో దఫదఫాలుగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. వీటిలో ఉండే ప్రయోజనాలేంటంటే... * పన్ను మినహాయింపు * మూడేళ్ల లాకిన్ ఉంటుంది కనక పన్ను లేని ఆదాయం * రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం * పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్ల వంటి సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ ఎక్కువ. ఆర్థిక లక్ష్యాలకు మంచిదే... ఆర్థిక లక్ష్యాల్ని సాధించడానికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడమనేది చక్కని మార్గం. ఎందుకంటే మార్కెట్ లోతుపాతులు తెలుసుకోవటానికి, పరిణామాల్ని అంచనా వేయటానికి మరీ ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఎంచుకున్న ఫండ్ ఎంత పెద్దది? ఎన్నాళ్ల నుంచి పనిచేస్తోంది? ఫండ్ ఖర్చులుగా ఎంత శాతాన్ని వెచ్చిస్తున్నారు? దాని పనితీరు ఎలా ఉంది? వంటి అంశాల్ని మాత్రం అధ్యయనం చేస్తే చాలు. ఎందుకంటే కాస్త పెద్ద పోర్టుఫోలియో ఉండి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫండ్ సంస్థలైతే మార్కెట్ పరిస్థితులు బాగులేనపుడు కూడా స్థిరంగా ఉండే అవకాశముంటుంది. అలాగే ఖర్చుల శాతం ఎక్కువైతే అది మీ రాబడిపై ప్రభావం చూపిస్తుంది. ఖర్చుల్లో కనీసం 0.5 శాతం తక్కువ ఉన్నా... దీర్ఘకాలంలో అది రాబడులపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. సంస్థను, ఫండ్‌ను ఎంచుకున్నాక... ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయటమా? లేక సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటమా? అన్నది. ఒకరకంగా సిప్ విధానమే ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ పడినా, పెరిగినా కూడా దానిద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పడే పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్లు, పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ యూనిట్లు వస్తాయి. సరాసరిన మంచి రాబడులుంటాయి. లాకిన్ వ్యవధిపై జాగ్రత్త! ఈఎల్ఎస్ఎస్లో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ వెనక్కి తీసుకోవటానికి మాత్రం లాకిన్ వ్యవధి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది మూడేళ్లు. ఒకవేళ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు... ఈ నెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మూడేళ్ల తరవాత వెనక్కి తీసుకోవచ్చు. వచ్చేనెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి... అప్పటి నుంచి మూడేళ్ల గడువు వర్తిస్తుంది. మూడేళ్ల తరవాత తీసుకునే మొత్తానికి క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు కనక ‘గ్రోత్’ ఫండ్‌ను ఎంచుకోవటమే మంచిది. ఎందుకంటే డివిడెండ్ చెల్లించే ఫండ్‌ను ఎంచుకుంటే డివిడెండ్‌పై పన్నును సంస్థ చెల్లిస్తుంది. దీనివల్ల మన లాభాలు తగ్గుతాయి. ఒకవేళ డివిడెండ్‌ను రీ-ఇన్వెస్ట్ చేస్తే... అలా ఇన్వెస్ట్ చేసే ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ వ ర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవటం ఉండదు కనక... ఈ ఫండ్ల మేనేజర్లు దీర్ఘకాలంలో చక్కని రాబడులొచ్చే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో మిగిలిన ఫండ్ల కన్నా ఇవి మంచి రాబడులే ఇస్తాయి. మొత్తంగా చూస్తే ఈఎల్ఎస్ఎస్లో సిప్ పద్ధతిలో నెలవారీ పెట్టుబడి పెట్టడమే మంచిదనేది నా సలహా. పెపైచ్చు ఇలా నెలవారీ ఇన్వెస్ట్ చేసే విధానాన్ని ఆటోమేట్ చేసుకుంటే ఆలస్యం కాకుండా ఉంటుంది. పెపైచ్చు ఇలా దఫదఫాలుగా ఇన్వెస్ట్ చేయటం వల్ల బడ్జెట్‌పై కూడా పెద్దగా ప్రభావం పడదు. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ -
ఈ ఆదాయానికి పన్నుండదు
పన్ను లేని ఆదాయం కావాలా? మీరు వింటున్నది నిజమే!!. పన్ను లేని ఆదాయం కావాలా అనే!!. సాధారణంగా పెట్టుబడులపై వచ్చే రాబడులపై ఆదాయ పన్ను, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి అనేక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇటువంటి పన్నులేవీ లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది కదూ...! అంతేకాదు... వీటిలో కొన్ని పెట్టుబడులపై ఆదాయ పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. తద్వారా మీ పన్ను భారం కూడా తగ్గుతుంది. ఇలా పన్నులేని ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి సాధనాలను ఇప్పుడు చూద్దాం... ట్యాక్స్ ఫ్రీ బాండ్స్... ఇప్పుడంతా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల హవా నడుస్తోంది. ఈ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన కూడా చాలా అధికంగానే ఉంటోంది. సాధారణంగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేస్తాయి. ఈ బాండ్లు అందించే వడ్డీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే బ్యాంకు డిపాజిట్లు, ఇతర డిబెంచర్స్ అయితే వాటిపై వచ్చే వడ్డీకి పన్ను భారం పడుతుంది. కానీ ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అందించే వడ్డీపై పన్నుభారం లేకపోవడమే వీటిలోని ప్రధానమైన ఆకర్షణ. ఈక్విటీ పెట్టుబడులు... షేర్లు కొనడం, అమ్మడం... లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనడం, అమ్మడం అనేది పన్ను ప్రయోజనాలకు అనుకూలం. ఇలా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపే లాభాలను తీసుకుంటే ఆ లాభంపై 15 శాతం ప్రత్యేక పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ మీ ఆదాయ పన్ను శ్లాబుతో సంబంధం లేదు. అలా కాకుండా ఏడాది దాటిన తర్వాత లాభాలను తీసుకుంటే దానిపై ఎటువంటి పన్ను భారం ఉండదు. ఈక్విటీల్లో మదుపు అనేది ముఖ్యంగా స్వల్పకాలానికి చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. ఈ రిస్క్‌కు సిద్ధపడ్డవారే స్వల్ప కాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎటువంటి రిస్క్ లేకుండా దీర్ఘకాలానికి ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)ని పేర్కొనవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.1.50 లక్షలు వరకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ పథకం అందించే వడ్డీపై కూడా పన్ను భారం ఉండదు. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌తో సంబంధం లేకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిపై వచ్చే వడ్డీ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ప్రస్తుతం ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. ముఖ్యంగా అధిక పన్ను శ్లాబుల్లో ఉన్న వారికి ఈ పథకం చాలా బాగుంటుంది. ఇందులో ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షలు మించి ఇన్వెస్ట్ చేయడానికి లేదు. అలాగే హిందూ అవిభాజ్య కుటుంబ సభ్యులు (హెచ్‌యూఎఫ్), ప్రవాస భారతీయులు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు. చిన్న పిల్లల పేరు మీద కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ ఇలాంటి సమయంలో పిల్లలు, గార్డియన్ సంయుక్తంగా రూ. 1.50 లక్షలు మించి ఇన్వెస్ట్ చేయలేరు. సేవింగ్ బ్యాంక్స్‌పై వడ్డీ.. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై అందించే వడ్డీపై కూడా పన్ను భారం లేదు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ ప్రకారం సేవింగ్స్ ఖాతా నుంచి ఏడాదిలో లభించే రూ. 10,000 వడ్డీ వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా బ్యాంకులు 4 శాతం వడ్డీని అందిస్తుంటే కొన్ని బ్యాంకులు 6-7 శాతం వరకు కూడా ఇస్తున్నాయి. బీమా మెచ్యూరిటీ... బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ... అది ఎంత పెద్ద మొత్తమైనప్పటికీ ఎటువంటి పన్ను ఉండదు. కానీ ఇక్కడో చిన్న నిబంధన ఉంది. మీరు చెల్లించే ప్రీమియం బీమా రక్షణ మొత్తం (సమ్ అష్యూర్డ్)లో 10 శాతం దాటకూడదు. ఒకవేళ ప్రీమియం అనేది సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం దాటితే.. మెచ్యూరిటీ ద్వారా వచ్చే లాభంపై పన్ను భారం ఏర్పడుతుంది. డివిడెండ్ ఇన్కమ్ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్లపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. ఈ డివిడెండ్లపై కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) చెల్లిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్లు చేతికి వచ్చిన మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్గానే భావిస్తారు. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి...డీడీటీ రూపంలో కంపెనీ చెల్లించే మొత్తం ఇన్వెస్టర్లదే. ఆ మేరకు ఇన్వెస్టర్ల సంపద లేక లాభాలు తగ్గుతాయి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్.. మ్యూచువల్ ఫండ్స్ అందించే కొన్ని రకాల ఫండ్స్‌పై రెండు రకాలుగా లాభాలుంటాయి. ఇటు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాలతో పాటు, ఈ ఫండ్స్ అందించే రాబడులపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ రెండు ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ఫండ్స్ మూడేళ్ల లాకిన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడేళ్ల వరకు వైదొలగడానికి అవకాశం ఉండదు. ఏడాది దాటిన తరవాత ఈక్విటీ రాబడులపై ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి వీటి రాబడులపై పన్ను భారం ఉండదు. ఒక వేళ మూడేళ్ల కంటే ముందే వైదొలిగితే సెక్షన్ 80సీ ద్వారా పొందిన ప్రయోజనాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ మేరకు పొందిన పన్ను ప్రయోజనాన్ని వెనక్కి తీసుకుంటారు. కానీ ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి. - అనిల్ రెగో, సీఈవో, రైట్ హొరైజన్స్ -
బీమాతోనే హోమ్‌లోన్ ధీమా..
భారతీయుల మదిలో సొంతింటికి ప్రత్యేక స్థానముంది. ఇంటిని కేవలం నివాసం ఉండటానికి అనే కాకుండా ఒక నమ్మకమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. అందుకే ప్రతీ ఒక్కరు సొంతింటిపై చాలా మమకారంతో ఉంటారు. అలాగే అద్దె ఇంట్లో ఉండే దానికంటే సొంతింటికే మొగ్గు చూపుతారు. చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొని నెలనెలా ఈఎంఐలు (అద్దె బదులు) చెల్లిస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొనే దేశంలో రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో రుణ మొత్తం చెల్లించే ఈఎంఐల భారం కూడా పెరిగిపోతోంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్లో సొంతింటిపై ఇన్వెస్ట్ చేయడం ఒక భాగమయ్యింది. ఇది వారి కుటుంబానికి ఒక భద్రతను కల్పిస్తుంది. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకున్న తర్వాత అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మీ కుటుంబ సభ్యులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఒకవేళ మీ తర్వాత కుటుంబ సభ్యులు ఆ రుణాన్ని కట్టలేకపోతే బ్యాంకులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని వేలం వేస్తాయి. ఇటువంటివి జరగకుండా మీ తర్వాత కూడా కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ అనేది అక్కరకు వస్తుంది. ఏదైనా ఊహించలేని సంఘటన జరిగితే మిగిలిన బకాయిలను బీమా కంపెనీ బ్యాంకులకు చెల్లిస్తుంది. ఇక మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది హోమ్ ఇన్సూరెన్స్, హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ రెండూ ఒకటే అని పొరపడుతుంటారు. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటిలోని సామాన్లు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు వంటి వాటికి బీమా రక్షణ కల్పిస్తుంది. అదే హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ కేవలం మీరు చెల్లించాల్సిన రుణ బకాయికి మాత్రమే బీమా రక్షణ అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల హోమ్‌లోన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. రెడ్యూసింగ్ కవర్ ఆప్షన్, లెవెల్ కవర్ (ఫిక్స్డ్ సమ్ అష్యూర్డ్) ఆప్షన్స్‌లో హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. ఇందులో రెడ్యూసింగ్ కవర్ ఆప్షన్ ఎంచుకుంటే.. కట్టాల్సిన రుణ బకాయికి మాత్రమే బీమా రక్షణ ఉంటుంది. ఈఎంఐ చెల్లించినప్పుడల్లా చెల్లించాల్సిన బకాయి తగ్గుతుంది. ఆ మేరకు బీమా రక్షణ కూడా తగ్గుతూ వస్తుంది. అదే లెవెల్ కవర్ ఆప్షన్ తీసుకుంటే మీ రుణ బకాయితో సంబంధం లేకుండా మీరు ఎంత మొత్తానికి బీమా తీసుకుంటే అంత మొత్తానికి బీమా రక్షణ లభిస్తుంది. అందుకే రెడ్యూసింగ్ కవర్ ఆప్షన్‌తో పోలిస్తే లెవెల్ కవర్ ఆప్షన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇలా పనిచేస్తుంది.. ఈఎంఐలు చెల్లిస్తుంటే ప్రతీ ఏటా రుణ భారం తగ్గుతుంది. దీంతోపాటే హోమ్‌లోన్ బీమా రక్షణ కూడా ఏటా తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు ఖలీ మస్తాన్ వలీ రూ. 50 లక్షలకు ఇంటి రుణం తీసుకున్నాడనుకుందాం. రుణంతోపాటే హోమ్‌లోన్ తీసుకుంటే (రెడ్యూసింగ్) బీమా రక్షణ రూ. 50 లక్షలు ఉంటుంది. ఏడేళ్ల తర్వాత మీరు చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తం రూ. 27 లక్షలుగా ఉందనుకుంటే అప్పుడు బీమా రక్షణ రూ. 50 లక్షల నుంచి రూ. 27 లక్షలకు తగ్గుతుంది. అలాగే ఏదైనా ఊహించని సంఘటన జరిగిన సమయంలో బీమా కంపెనీ క్లెయిమ్‌ను నేరుగా బ్యాంకుకి చెల్లించేస్తుంది. ఆ తర్వాత నుంచి మీ కుటుంబ సభ్యులు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే లెవెల్ కవర్లో అయితే రుణ బకాయిని నేరుగా బ్యాంకుకి చెల్లించి మిగిలిన మొత్తాన్ని నామినీకి అందచేయడం జరుగుతుంది. ప్రత్యామ్నాయాలున్నాయా?... గృహ రుణానికి రక్షణగా హోమ్‌లోన్ బీమానే తీసుకోవాల్సిన అవసరం లేదు. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. తీసుకున్న హోమ్‌లోన్ మొత్తానికి సమానంగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోండి. ఇది మీ రుణ బకాయిలకు బీమా రక్షణను కల్పిస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్ బీమా ప్రీమియం కంటే టర్మ్ బీమా ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ఇవి గమనించండి.. హోమ్‌లోన్ ఇన్సూరెన్స్‌ను నేరుగా బీమా కంపెనీ నుంచి లేదా రుణం తీసుకుంటున్న బ్యాంకు నుంచి కూడా తీసుకోవచ్చు. ప్రీమియం అనేది మీ వయస్సు, ఆరోగ్యం, రుణ కాలపరిమితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణాన్ని ఉమ్మడిగా తీసుకుంటే ఇద్దరికీ బీమా రక్షణ కల్పించాల్సి వస్తుంది కాబట్టి ఆ మేరకు ప్రీమియం పెరుగుతుంది. సాధారణంగా హోమ్‌లోన్ బీమా కాలపరిమితి మీ రుణ కాలపరిమితికి సమానంగా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు 60 నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే బీమా రక్షణను అందిస్తున్నాయి. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ -
టీడీఎస్ భారం తగ్గించుకుందామిలా..
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. జనవరి నెల వచ్చిందంటే చాలు ఆఫీసులోని హెచ్ఆర్ సిబ్బంది మీ ఇన్వెస్ట్మెంట్ వివరాలను ఇవ్వమని కోరతారు. వీటిని ఇవ్వకపోతే టీడీఎస్ పేరుతో మీ జీతం నుంచి భారీ కోతలు కోస్తారు. సరైన ప్రణాళికతో వెళితే ఈ టీడీఎస్ భారం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. పన్ను భారం తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80సీ ప్రధానమైనది. ఈ సెక్షన్ ప్రకారం రూ. 1.5 లక్షలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునే వెసులుబాటు ఉంటుంది. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక చక్కటి సాధనం. ఇందులో గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ మొత్తంపై పన్ను లాభాలను పొందవచ్చు. మీ పేరున లేదా మీపై ఆధారపడి జీవించే వారి పేరు మీద ఈ అకౌంట్ ప్రారంభించొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. నెలలో ఒకటవ తేదీ నుంచి అయిదవ తేదీ లోపల ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా నెల మొత్తానికి వడ్డీ లభిస్తుంది. 5 తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఆ నెల మొత్తానికి వడ్డీ లభించదు. దీని కాలపరిమతి 15 ఏళ్లు. సెక్షన్ 80సీ పరిధిలోకి అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు, వ్యయాలు వస్తాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), న్యూ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (పోస్టాఫీసుల్లో లభిస్తాయి), ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, ఇద్దరు పిల్లలకు చెల్లించే స్కూలు, కాలేజీ ట్యూషన్ ఫీజులు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇంటి గృహరుణానికి చెల్లించే ఈఎంఐలో అసలు వాటా ఇవన్నీ 80సీ పరిధిలోకే వస్తాయి. వీటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. పన్ను లాభాల కోసమే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించకండి. గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు సరిపోయింది కదా అని ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపొద్దు. ఈ పథకాలు మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలు, రిటైర్మెంట్కు తోడ్పాటును అందిస్తాయి. హెచ్ఆర్ఏ ఒకవేళ మీరు ఇంటి అద్దె చెల్లిస్తుంటే దాని నుంచి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు పనిచేసే సంస్థ హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అద్దెను చెక్ రూపంలో చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను దగ్గర పెట్టుకోండి. ఇంటి ఓనర్ పాన్ నంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆదాయం నుంచి తగ్గించి చూపిస్తారు. 1. కంపెనీ ఇస్తున్న వాస్తవ హెచ్ఆర్ఏ అలవెన్స్. 2. చెల్లిస్తున్న అద్దెలోంచి బేసిక్ శాలరీలో 10 శాతం తీసివేయగా వచ్చే మొత్తం. 3. మెట్రోలో నివసిస్తుంటే బేసిక్ శాలరీలో 50 శాతం, ఇతర పట్టణాల్లో అయితే 40 శాతం. ఒకవేళ మీకు సొంతిల్లు ఉండి, అది పనిచేస్తున్న కార్యాలయానికి దూరంగా ఉండటం వల్ల అద్దె ఇంట్లో ఉంటే కూడా హెచ్ఆర్ఏ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. రుణాలపై.. రుణం తీసుకొని ఇంటిని నిర్మిస్తే లేదా కొంటే...దానిపై రెండు రకాల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రుణానికి చెల్లించే ఈఎంఐలో అసలుకు చెల్లించిన మొత్తంపై సెక్షన్ 80సీ ప్రయోజనం లభిస్తుంది. చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద గరిష్టంగా రూ. 2 లక్షలు ఆదాయం నుంచి మినహాయించుకోవచ్చు. బ్యాంకు నుంచి అసలు, వడ్డీ రూపంలో ఎంత మొత్తం చెల్లించారో కాగితం తీసుకొని అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. ఇవి కాకుండా మీ ఉన్నత చదువుల కోసం లేదా భార్యా పిల్లల చదువుల కోసం తీసుకొనే రుణాలపై ఎటువంటి పరిమితి లేకుండా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి కాకుండా సెక్షన్ 80జీ కింద వివిధ సంస్థలకు ఇచ్చే విరాళాలపై కూడా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సకాలంలో ఈ వివరాలన్నీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం ద్వారా వచ్చే మూడు నెలలు జీతంలో భారీ కోతల నుంచి తప్పించుకోవచ్చు. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరైజన్స్ -
ఇరవైల నుంచే విరమణ ప్రణాళిక!
* ముందు నుంచి ఆరంభిస్తే కాంపౌండింగ్ లాభాలు * పొదుపు మొత్తాన్ని బట్టి ముందుగానే రిటైర్మెంట్ * ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచన కష్టపడి పనిచేసి సాధ్యమైనంత ఎక్కువగా ఆర్జించేందుకు చేసే ప్రయత్నాలన్నింటి వెనుక ప్రధాన కారణం ఒకటే.. అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏ బాదరబందీ లేకుండా జీవితాన్ని హాయిగా గడపడం. ఇంత కీలకమైన రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ముందుగా ఎప్పుడు రిటైరవబోతున్నాం? ఆ తర్వాత ఎలాంటి జీవన విధానాన్ని కోరుకుంటున్నాం? ఇందుకోసం ఎంత మొత్తం అవసరమవుతుంది? ఇలాంటివన్నీ లెక్కేసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల, వైద్యం ఖర్చులు మొదలైనవన్నీ కూడా ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే భారీ మొత్తమే అవసరమవుతుంది. అంత నిధి ఒక్కసారిగా వచ్చి పడదు గనుక.. కొద్దికొద్దిగా కూడబెట్టక తప్పదు. ముప్ఫయ్యేళ్లు వచ్చిన తర్వాత ప్లానింగ్ మొదలుపెట్టే కంటే ఇరవైలలో కెరియర్ ప్రారంభంలోనే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే కాంపౌండింగ్ మహిమతో రిటైర్మెంట్ నాటికి గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయొచ్చు. రిటైర్మెంట్ అవసరాల కోసం చేసే పెట్టుబడులు ఎలక్ట్రానిక్ విధానంలో (ఈసీఎస్) ఆటోమేటిక్‌గా ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటే.. ఇతరత్రా తలెత్తే ఖర్చుల వల్ల రిటైర్మెంట్ ప్రణాళిక దెబ్బతినకుండా చూసుకోవచ్చు. లక్ష్యాలు రాసిపెట్టుకోవాలి.. పదవీ విరమణ తర్వాత మనం చేయాలనుకున్న లక్ష్యాలను రాసిపెట్టుకోవడం ముఖ్యం. ఇవి నిర్దిష్టంగా ఉండటం మంచిది. ఉదాహరణకు విదేశీ పర్యటన చేయాలనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏమేం చూడాలనుకుంటున్నారు? వగైరాలాంటివన్నమాట. అలాగే పదవీ విరమణ తర్వాత వైద్య అవసరాలకు కూడా సరిపడేంత బీమా ఉండేలా చూసుకోవాలి. తద్వారా చికిత్స ఖర్చుల భారం మీ మీద పడకుండా ఉంటుంది. ముందుకు సాగుతున్న కొద్దీ కెరియర్, లైఫ్‌స్టయిల్, ఆరోగ్యం అన్నీ మారుతుంటాయి కనుక పదవీ విరమణ తర్వాత ఖర్చులు ఒకింత ఎక్కువగానే ఉంటాయన్న అంచనాలతోనే ప్రణాళిక వేసుకోవాలి. ఈలోగా కొత్త ఇల్లో, కారో కొనుక్కోవడమో లేదా విహారయాత్రలకు వెళ్లడమో లాంటి ఆలోచనలు ఉంటే ఆ వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడులను సమీక్షించుకోవాలి.. మీకున్న ఆస్తులు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలను సమీక్షించుకోవాలి. రిస్కు సామర్థ్యం, రాబడుల అంచనాలను బట్టి అవసరమైతే పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మధ్యమధ్యలో సవరించాలి. ఉదాహరణకు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్కుతో కూడుకున్న షేర్ల పెట్టుబడులే ఎక్కువగా ఉంటే .. రిటైర్మెంట్ దశలో భరోసాగా ఉండేలా స్థిరమైన ఆదాయం ఇచ్చే సాధనాల్లోకి సింహభాగాన్ని మార్చవచ్చు. పదవీ విరమణ తర్వాత రుణభారం ఉండకుండా అప్పులేవైనా ఉంటే సాధ్యమైనంత ముందుగానే తీర్చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మీ రిటైర్మెంట్ బడ్జెట్లో వీటిని కూడా చేర్చి ప్రణాళిక వేసుకోవాల్సి వస్తుంది. ఇక, స్థలం, ఇల్లు తదితర స్థిరాస్తులు సైతం తదుపరి సంవత్సరాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. పాతతరం నాటి వస్తువులు, కళాఖండాలు.. ఆఖరికి వైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు కూడా తరచూ కాకపోయినా సందర్భాన్ని బట్టి మంచి రాబడులే ఇవ్వగలవు. స్థూలంగా చెప్పాలంటే మనం చేసిన పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడులు.. మన ఖర్చులకు మించి ఉన్న తరుణంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఎంత ముందుగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలిగితే అంత త్వరగా రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవచ్చు. పొదుపు చేసిన అసలును కదల్చాల్సిన పని లేకుండా దానిపై వచ్చే రాబడులే.. మన ఖర్చులకు సరిపోయేట్లుగా ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్‌లో మరీ అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆదుకునేందుకు ఈ అసలు మొత్తం ఉపయోగపడగలదు. ఒక్క ముక్కలో.... * రిటైర్మెంట్ ప్రణాళికను సాధ్యమైనంత ముందుగా ప్రారంభించాలి. ముఫ్ఫై ఏళ్ల వయస్సులోనైనా ఫర్వాలేదు. * జీవన విధానం, పదవీ విరమణ వయస్సు, భారీ కొనుగోళ్లు మొదలైనవన్నీ కూడా ప్రణాళిక వేసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి. * కంపెనీపరంగా, ప్రభుత్వపరంగా వచ్చే పింఛను ప్రయోజనాలు, రివర్స్ మార్టిగేజ్ మొదలైన మార్గాలను పరిశీలించుకోవాలి. * వైద్య చికిత్స ఖర్చులు భారీగా పెరుగుతాయి కనుక తగినంత కవరేజి ఉండేలా చూసుకోవాలి. * రిటైర్మెంట్కి ఎంత ఎక్కువ మొత్తం ప్లానింగ్ చేసుకుంటే అంత మంచిది. * పొదుపు చేసిన అసలును కదల్చాల్సిన పని లేకుండా దానిపై వచ్చే రాబడులే ఖర్చులకు సరిపోయేలా చూసుకోవాలి. - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
రామ్మూర్త్తీ.. ఈక్విటీనే మార్గం
నాది పైవేటుద్యోగం. వయస్సు 35 సంవత్సరాలు. నెల జీతం రూ. 45,000. నెలవారీ ఇంటి ఖర్చు 20,000 అవుతుంది. భార్య, రెండేళ్ల అబ్బాయి ఉన్నారు. ఇంతవరకు నేను ఎలాంటి పొదుపూ చేయలేదు. ఇప్పటి నుంచి నా రిటైర్మెంట్, పిల్లవాడి ఉన్నత చదువు కోసం డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ పథకాలు బాగున్నాయో సూచించగలరా!!? - రామ్మూర్తి, విశాఖపట్నం ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు నెలకు రూ. 36,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నెలకు రూ. 25,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి ఏటా మీ జీతం పెరుగుదల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ విలువను కూడా పెంచుకుంటూ ఉండండి. ఇంతవరకు మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదంటున్నారు. అంటే ఇప్పటికే ఆలస్యమయిందనుకోవాలి. అందుకని ఇక ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా పొదుపు మొదలుపెట్టాల్సిందే. ఆలస్యం చేసే కొద్దీ మీ లక్ష్యాలను చేరుకోవడానికి కేటాయించే మొత్తం పెరిగిపోతుంటుంది. మీరిచ్చిన సమాచారం ప్రకారం 55 ఏళ్లకు అంటే 2035కి రిటైరవ్వాలని మీరు భావిస్తున్నారు. అలాగే 2029 నాటికి మీ పిల్లవాడి ఉన్నత చదువులకు నగదు అవసరం అవుతుంది. ఇప్పుడున్న మీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే 2035 తర్వాత మీకు ప్రతి నెలా కనీసం రూ. 25,000 పెన్షన్ అవసరమవుతుంది. అలాగే 2029 నాటికి పిల్లవాడి కోసం కనీసం రూ.10 లక్షలు నగదు కావాల్సి ఉంటుంది. వీటిని ద్రవ్యోల్బణాన్ని (ధరలు పెరుగుదల) పరిగణించకుండా లెక్కించటం జరిగింది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి సమకూర్చుకోవాల్సిన నిధి కోసం సాధారణ సగటు ద్రవ్యోల్బణాన్ని 6 శాతం, విద్యా ద్రవ్యోల్బణాన్ని 7 శాతంగా లెక్కించాం. ఆ విధంగా చూస్తే ఎంత నిధి అవసరమవుతుంది? ఇందుకోసం ఇప్పుడు ఎంత మొత్తం కేటాయించాలనేది పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా చేయండి.. స్వభావ రీత్యా మీ రెండు ఆర్థిక లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవే. కాబట్టి అధిక రాబడి పొందడానికి అవకాశమున్న ఈక్విటీ పథకాలు మీకు నప్పుతాయి. పోర్ట్‌ఫోలియోలో సమతుల్యం పాటించడం కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా... అధిక భాగం ఈక్విటీలకు కేటాయించండి. ఇందుకు మ్యూచువల్ ఫండ్ పథకాలను పరిశీలించండి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సిప్ విధానం ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ప్రారంభ ఇన్వెస్టర్లలకు సిప్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ముఖ్యంగా ప్రతీ నెలా జీతంలో మిగిలే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సిప్ బాగుంటుంది. మార్కెట్లో ఉండే హెచ్చు తగ్గులను తట్టుకుంటూ దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందడానికి సిప్ దోహదం చేస్తుంది. దీంతోపాటు బీమా రక్షణ తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే కుటుంబానికి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా ఉంటుంది. ఇందుకోసం కేవలం బీమా రక్షణను మాత్రమే అందించే టర్మ్ పాలసీలను తీసుకోండి. కంపెనీ నుంచి ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా... సొంతంగా కూడా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. కంపెనీలు అందించే బీమా కేవలం అందులో పనిచేస్తున్నంత కాలమే ఉంటుంది. మీరు ఒక్కసారి కంపెనీని వదిలేస్తే బీమా రక్షణ ఆగిపోతుంది. అందుకని కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీని తీసుకోండి. ప్రస్తుతానికి ఆఫీసుది ఉంది కదా? తర్వాత తీసుకుందాములే అనుకుంటే.. అధిక ప్రీమియంలు చెల్లించాల్సి వస్తుంది. చిన్న వయస్సులోనే పాలసీని తీసుకొని కొనసాగించడం ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందొచ్చు. ముఖ్యాంశాలు.. * ఇక ఆలస్యం చెయ్యకుండా పొదుపు మొదలుపెట్టండి * దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీని ‘సిప్’ చేయటమే బెటర్ * బీమా రక్షణ కోసం కేవలం టర్మ్ పాలసీ ఉంటే చాలు * హెల్త్ పాలసీ కూడా కంపెనీది కాకుండా సొంతది ఉండాలి * కుటుంబం మొత్తానికి బీమా రక్షణ ఉండే విధంగా ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ -
పొదుపు పాఠాలు.. నేర్పండిలా!
వెంకట్, సౌమ్య భార్యాభర్తలు. ఉండేది బెంగళూరులో. రాహుల్ వారికి ఒక్కగానొక్క కొడుకు. టీనేజ్‌లోకి వచ్చాడు. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం అలవాటైంది. ఇది చూసి తల్లిదండ్రులకు ఆందోళన కూడా ఆరంభమైంది. ఎన్నోసార్లు కూర్చోబెట్టి డబ్బు విలువ గురించి పాఠాలు చెప్పారు. అయినా పలితం లేకపోయింది. ఏం చేయాలి? బాగా ఆలోచించాక వారు ఇక మాటలు ఆపి చేతల్లోనే (ప్రాక్టికల్‌గా) కొడుక్కు పొదుపు పాఠాలు నేర్పించాలనుకున్నారు. ‘‘నీకు ప్రతి నెలా ప్యాకెట్ మనీగా రూ.2,000 ఇస్తున్నాం. కాబట్టి నీ పుట్టినరోజుకు ప్రత్యేకంగా డబ్బులివ్వలేం. నువ్వే నీ ప్యాకెట్ మనీ కొంత మిగుల్చుకుని బర్త్‌డే పార్టీ చేసుకోవాలి’’ అని చెప్పేశారు. ఎప్పుడూ ఏమీ చెప్పని అమ్మానాన్నా ఇలా చెప్పటంతో రాహుల్ కూడా విన్నాడు. దీంతో పుట్టినరోజు పార్టీకి డబ్బు కూడబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై పడింది. అప్పటికి ఇంకా పుట్టినరోజు 11 నెలలు ఉండటంతో... బర్త్‌డే పార్టీకి డబ్బు కూడబెట్టడం ఆరంభించాడు రాహుల్. బర్త్‌డేకి రూ.12 వేలు కావాలని ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి... 11 నెలల పాటు నెలకు రూ.1,100 దాచుకోవటం మొదలుపెట్టాడు. ప్యాకెట్ మనీలో రూ.900 మాత్రమే ఖర్చుచేయడం ఆరంభించారు. 11 నెలలు గడిచేసరికి ముందుగా నిర్ణయించుకున్న రూ.12 వేల కన్నా 100 రూపాయలు ఎక్కువే సమకూరింది. అనుకున్న మొత్తం సిద్ధమైపోయింది. ఎంతో సంతోషం. అయితే అప్పటికే 11 నెలల నుంచి పొదుపు అలవాటవటంతో... పుట్టినరోజు బడ్జెట్‌ను కూడా రాహుల్ తగ్గించేసుకున్నాడు. కాస్త తక్కువ ఖరీదుండే రెస్టారెంట్‌కి వేదిక మార్చాడు. అనవసరమైన ఖర్చులు మానేశాడు. దీంతో బర్త్‌డే పార్టీ ఖర్చు కూడా రూ.12,000 నుంచి రూ.8,000కు తగ్గిపోయింది. దాంతో ఒకేసారి రూ.4 వేలు మిగిలింది. అంత డబ్బు మిగలటం రాహుల్‌కు విపరీతమైన ఉత్సాహాన్నిచ్చింది. ఇదే పరిణామం రాహుల్‌కు ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక కూడా నేర్పించింది. అదీ కథ. నగదు నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. అయితే ఇవన్నీ తల్లిదండ్రులే నేర్పాలి తప్ప స్కూళ్లలో నేర్పేవి కావు. మరి ఇవన్నీ నేర్పడానికి తల్లిదండ్రులేమైనా ఫైనాన్షియల్ ఇంజనీర్లో లేక వారెన్ బఫెట్ అంతటి ఇన్వెస్ట్మెంట్ గురులో కావాలి? అలాంటిదేమీ అక్కర్లేదు. జీవితంలో తమకెదురైన అనుభవాల్నే పాఠాలుగా మార్చాలి. పిల్లలకు అర్థమయ్యేట్టు చూడాలి. ఆర్థికపరమైన నడవడిక, నిర్ణయాలు జీవితంలో ఎంత ముఖ్యమో వారికి తెలిసేలా చేయాలి. నెలవారీ బడ్జెట్ నుంచి పెట్టుబడుల వరకూ... అక్కడి నుంచి లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన మనీ మేనేజిమెంట్‌ను పిల్లలకు వివరించాలి. అప్పుడే వారికి డబ్బు విలువ తెలుస్తుంది. ‘టీన్’లో ఉన్నప్పుడు ఆరంభించే ఆర్థిక పాఠాలు... వారిని ఆర్థికంగా చైతన్యవంతుల్ని చేస్తాయి. ఎలా ప్రారంభించాలి... పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుంచే... రోజుకు కొన్ని పైసలు ఇచ్చి వాటిని ‘డిబ్బీ’లో దాచుకునేలా చేయాలి. వారి అవసరానికి ఆ ‘డిబ్బీ’ నుంచే డబ్బు తీసుకుని ఖర్చు చేసుకునేలా ఒక పద్ధతి నేర్పాలి. టీనేజ్‌లోకి ప్రవేశించే సరికి వారి పుట్టినరోజు పండుగకు ఆర్థిక ప్రణాళిక, డబ్బు సమీకరణ వంటి అంశాల విషయంలో వారే ఒక అవగాహనకు వచ్చేలాంటి పాఠాలు నేర్పాలి. నిజానికిపుడు పొదుపుల పాఠాలు నేర్పడం చాలా తేలికయింది. ఇందుకోసం ఎన్నో పాఠాలు, ఎక్సర్సైజులు పుట్టుకొచ్చాయి. అయితే వాటిని నేర్చుకునే దిశగా పిల్లల్ని నడిపించాల్సింది తల్లిదండ్రులే. క్రెడిట్ కార్డుల బదులు వారిచేత నేరుగా కరెన్సీనే ఖర్చుపెట్టించటం, పిల్లలను తమతోపాటు బ్యాంక్‌కు తీసుకువెళ్లి ఆర్థిక అంశాలకు సంబంధించి చిన్న చిన్న అంశాలను నేర్పించడం, డబ్బు పొదుపు పద్ధతులను నేర్పే ఆటలను పిల్లల చేత ఆడించడం వంటివి చేయాల్సింది తల్లిదండ్రులే. అవే ఇక్కడ ముఖ్యం. -
ఈసారి ఇలా ప్లాన్ చేద్దాం..
అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ ఎటువంటి ఇబ్బంది, ఒత్తిడి లేకుండా ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే చక్కటి ప్రణాళిక అవసరం. మనలో చాలామంది లక్ష్యాలను నిర్దేశించుకున్నా సరైన అవగాహన, ప్రణాళికలు లేక విఫలమవుతుంటారు. కొన్ని అంశాలను తు.చ. తప్పకుండా పాటిస్తే భవిష్యత్తు ఆర్థిక అవసరాలపై నిశ్చింతగా ఉండొచ్చు. బడ్జెట్‌తో మొదలు పెట్టాలి.. ఆర్థిక ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం బడ్జెట్ రూపకల్పన. మీ మొత్తం ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాల కాలపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వృథా ఖర్చులు తగ్గించి నెలవారీ ఆదాయంలో పొదుపు కోసం కొంత మొత్తం కేటాయించాలి. ఆదాయ, వ్యయాలను ఏ నెలకు ఆ నెల సమీక్షించుకునే వాళ్లు ప్రతీ ఏడాది ఆర్థిక ప్రణాళికలో విజయం సాధిస్తారు. అనవసర వ్యయాలను తగ్గించి, దీర్ఘకాలం పొదుపు చేయడానికి బడ్జెట్ దోహదం చేస్తుంది. పథకాల ఎంపికా ముఖ్యమే... పొదుపు విషయానికి వస్తే ఎంచుకున్న పథకాలపైనే ఆర్థిక విజయం ఆధారపడి ఉంటుంది. సరైన పథకంలో పెడితేనే అది వృద్ధి చెంది ఆర్థిక ఫలాలను అందించగలుగుతుంది. మీ దగ్గర ఉన్న అదనపు మొత్తాన్ని అనవసరంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచకుండా వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్, మ్యూచువల్, గోల్డ్ ఫండ్స్ వంటి అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి సాధనాలకు కేటాయించండి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్ అధిక రాబడులను అందిస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్లు అయితే 9% వడ్డీని ఇస్తున్నాయి. ఇంతకంటే కొద్దిగా రిస్క్ చేయగలిగితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ఈక్విటీ సేవింగ్స్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ -ఈఎల్ఎస్ఎస్) చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చెప్పొచ్చు. వీటిల్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉండటం వల్ల ఫండ్ మేనేజర్లు దీర్ఘకాలంలో మంచి రాబడి ఇవ్వడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే సిప్ విధానం ఎంచుకోవడం వల్ల మార్కెట్ కదలికలపై ఆందోళన ఉండదు. మార్కెట్ పడితే మన చేతికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. అదే పెరుగుతుంటే మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం కూడా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ సాధనం ఎంచుకోవడంలో ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం వంటి అంశాలు చాలా కీలకమైనవి. ఉదాహరణకు మీ అమ్మాయి/అబ్బాయికి విదేశాల్లో ఉన్నత చదువు చెప్పించడం మీ లక్ష్యం అనుకుందాం. ఇలాంటి స్థిరమైన లక్ష్యాలున్నప్పుడు రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన ఆదాయాన్నిచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి పథకాలు ఉత్తమం. ఇవి రాబడితో కూడిన స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా, వడ్డీపై పన్ను భారమూ ఉండదు. సకాలంలో బకాయిలు ఏమైనా బకాయిలు ఉంటే వాటిని సకాలంలో చెల్లించండి. రుణాలు, ఆదాయపు పన్ను, ఇతర చెల్లింపులు ఏమైనా సరే అశ్రద్ధ చేయొద్దు. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్ రేటింగ్ తగ్గడంతోపాటు ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. క్రెడిట్ రేటింగ్ పడిపోతే తీసుకునే రుణాలపై అధిక వడ్డీరేట్లు చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి అవసరమే బడ్జెట్ తయారీలో ఇది చివరి అంశమే అయినప్పటికీ ఇదే చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్లో అత్యవసర నిధికి కొంత మొత్తం కేటాయించాలి. ఏ క్షణంలో ఎప్పుడు డబ్బులు అవసరమవుతాయో తెలియదు కాబట్టి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగం పోతే కొత్తది వెతుక్కునే లోపు కనీసం ఇంటి అవసరాలు, ఈఎంఐలు చెల్లించడానికి సరిపోయే విధంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం చేరుకుందామిలా... - ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రణాళికను ప్రారంభించండి. - రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ సాధనం ఎంచుకోవాలి - ముందుగానే బడ్జెట్ తయారు చేసుకొని, దానికి కట్టుబడి ఉండాలి. - సాధారణ పొదుపునకు సంబంధం లేకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.