పొదుపు పాఠాలు.. నేర్పండిలా! | savings lessons | Sakshi
Sakshi News home page

పొదుపు పాఠాలు.. నేర్పండిలా!

Published Mon, May 18 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

పొదుపు పాఠాలు.. నేర్పండిలా!

పొదుపు పాఠాలు.. నేర్పండిలా!

వెంకట్, సౌమ్య భార్యాభర్తలు. ఉండేది బెంగళూరులో. రాహుల్ వారికి ఒక్కగానొక్క కొడుకు. టీనేజ్‌లోకి వచ్చాడు. డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం అలవాటైంది. ఇది చూసి తల్లిదండ్రులకు ఆందోళన కూడా ఆరంభమైంది. ఎన్నోసార్లు కూర్చోబెట్టి డబ్బు విలువ గురించి పాఠాలు చెప్పారు. అయినా పలితం లేకపోయింది. ఏం చేయాలి? బాగా ఆలోచించాక వారు ఇక మాటలు ఆపి చేతల్లోనే (ప్రాక్టికల్‌గా) కొడుక్కు పొదుపు పాఠాలు నేర్పించాలనుకున్నారు. ‘‘నీకు ప్రతి నెలా ప్యాకెట్ మనీగా రూ.2,000 ఇస్తున్నాం. కాబట్టి నీ పుట్టినరోజుకు ప్రత్యేకంగా డబ్బులివ్వలేం.

నువ్వే నీ ప్యాకెట్ మనీ కొంత మిగుల్చుకుని బర్త్‌డే పార్టీ చేసుకోవాలి’’ అని చెప్పేశారు. ఎప్పుడూ ఏమీ చెప్పని అమ్మానాన్నా ఇలా చెప్పటంతో రాహుల్ కూడా విన్నాడు. దీంతో పుట్టినరోజు పార్టీకి డబ్బు కూడబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై పడింది. అప్పటికి ఇంకా పుట్టినరోజు 11 నెలలు ఉండటంతో... బర్త్‌డే పార్టీకి డబ్బు కూడబెట్టడం ఆరంభించాడు రాహుల్. బర్త్‌డేకి రూ.12 వేలు కావాలని ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి... 11 నెలల పాటు నెలకు రూ.1,100 దాచుకోవటం మొదలుపెట్టాడు.

ప్యాకెట్ మనీలో రూ.900 మాత్రమే ఖర్చుచేయడం ఆరంభించారు. 11 నెలలు గడిచేసరికి ముందుగా నిర్ణయించుకున్న రూ.12 వేల కన్నా 100 రూపాయలు ఎక్కువే సమకూరింది. అనుకున్న మొత్తం సిద్ధమైపోయింది. ఎంతో సంతోషం. అయితే అప్పటికే 11 నెలల నుంచి పొదుపు అలవాటవటంతో... పుట్టినరోజు బడ్జెట్‌ను కూడా రాహుల్ తగ్గించేసుకున్నాడు.

కాస్త తక్కువ ఖరీదుండే రెస్టారెంట్‌కి వేదిక మార్చాడు. అనవసరమైన ఖర్చులు మానేశాడు. దీంతో బర్త్‌డే పార్టీ ఖర్చు కూడా రూ.12,000 నుంచి రూ.8,000కు తగ్గిపోయింది. దాంతో ఒకేసారి రూ.4 వేలు మిగిలింది. అంత డబ్బు మిగలటం రాహుల్‌కు విపరీతమైన ఉత్సాహాన్నిచ్చింది. ఇదే పరిణామం రాహుల్‌కు ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక కూడా నేర్పించింది. అదీ కథ.
 
నగదు నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. అయితే ఇవన్నీ తల్లిదండ్రులే నేర్పాలి తప్ప స్కూళ్లలో నేర్పేవి కావు. మరి ఇవన్నీ నేర్పడానికి తల్లిదండ్రులేమైనా ఫైనాన్షియల్ ఇంజనీర్లో లేక వారెన్ బఫెట్ అంతటి ఇన్వెస్ట్‌మెంట్ గురులో కావాలి? అలాంటిదేమీ అక్కర్లేదు. జీవితంలో తమకెదురైన అనుభవాల్నే  పాఠాలుగా మార్చాలి. పిల్లలకు అర్థమయ్యేట్టు చూడాలి.

ఆర్థికపరమైన నడవడిక, నిర్ణయాలు జీవితంలో ఎంత ముఖ్యమో వారికి తెలిసేలా చేయాలి. నెలవారీ బడ్జెట్ నుంచి పెట్టుబడుల వరకూ... అక్కడి నుంచి లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన మనీ మేనేజిమెంట్‌ను పిల్లలకు వివరించాలి. అప్పుడే వారికి డబ్బు విలువ తెలుస్తుంది. ‘టీన్’లో ఉన్నప్పుడు ఆరంభించే ఆర్థిక పాఠాలు... వారిని ఆర్థికంగా చైతన్యవంతుల్ని చేస్తాయి.
 
ఎలా ప్రారంభించాలి...

పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుంచే... రోజుకు కొన్ని పైసలు ఇచ్చి వాటిని ‘డిబ్బీ’లో దాచుకునేలా చేయాలి. వారి అవసరానికి ఆ ‘డిబ్బీ’ నుంచే డబ్బు తీసుకుని ఖర్చు చేసుకునేలా ఒక పద్ధతి నేర్పాలి. టీనేజ్‌లోకి ప్రవేశించే సరికి వారి పుట్టినరోజు పండుగకు ఆర్థిక ప్రణాళిక, డబ్బు సమీకరణ వంటి అంశాల విషయంలో వారే ఒక అవగాహనకు వచ్చేలాంటి పాఠాలు నేర్పాలి. నిజానికిపుడు పొదుపుల పాఠాలు నేర్పడం చాలా తేలికయింది. ఇందుకోసం ఎన్నో పాఠాలు, ఎక్సర్‌సైజులు పుట్టుకొచ్చాయి.

అయితే వాటిని నేర్చుకునే దిశగా పిల్లల్ని నడిపించాల్సింది తల్లిదండ్రులే. క్రెడిట్ కార్డుల బదులు వారిచేత నేరుగా కరెన్సీనే ఖర్చుపెట్టించటం, పిల్లలను తమతోపాటు బ్యాంక్‌కు తీసుకువెళ్లి ఆర్థిక అంశాలకు సంబంధించి చిన్న చిన్న అంశాలను నేర్పించడం, డబ్బు పొదుపు పద్ధతులను నేర్పే ఆటలను పిల్లల చేత ఆడించడం వంటివి చేయాల్సింది తల్లిదండ్రులే. అవే ఇక్కడ ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement