ఇల్లు అంటే మొదట చెప్పుకోవాల్సింది వంటిల్లే. ఇల్లు ఎంత పెద్దదైనా చిన్నదైనా ప్రధానంగా ఉండాల్సిన గది వంటగది. ఆ వంటగదిలోకి అడుగుపెట్టకుండా పెద్దయిపోయే పిల్లల తరం కాదిది. సరదాగా వంటగదిలో ప్రయోగాలు చేస్తున్న కొత్త యువతరం మొదలైంది. రాబోయే ఏడాది యూత్ ట్రెండ్ అంతా వంటగది కేంద్రంగా ఉండబోతోంది. అలాగే టీనేజ్‌లో ఉన్న పిల్లలకు తల్లితో అనుబంధం పెరిగేది వంటగదిలోనే. ఇందుకోసం చదువుకున్న తల్లి పాటిస్తున్న నాలుగు సూత్రాలివి.
పిల్లలను వంటగదిలోకి ఆహ్వానించేటప్పుడు, వారి చేత వంట చేయించేటప్పుడు వాళ్లకు ఇష్టమైన వంటనే చేయాలి, వారి చేత చేయించాలి. వంటల పుస్తకం లేదా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోమని సూచించాలి. ఇంటికోసం వంట చేయడమే కాకుండా చారిటీ కోసం వంట చేయడం అలవాటు చేయాలి. ఏదైనా వండి వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు ఇవ్వడం ఒక పద్ధతి. అలాగే అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ల కోసం వండి తీసుకెళ్లి పంచడం అలవాటు చేయాలి.
తల్లి తనతోపాటు పిల్లలను కూడా కుకరీ క్లాసులకు తీసుకెళ్లడం ద్వారా అందరూ కలిసి ఒక కొత్త వంటను నేర్చుకోవడం, కలిసి వండడం గొప్ప అనుభూతి. అనుబంధాల అల్లిక కూడా.
పిల్లలకు ఒక మోస్తరుగా వంట వచ్చిన తర్వాత ఓ చిట్కా పాటించవచ్చు. ఒక రోజు పూర్తిగా లంచ్‌కి అవసరమైన మెనూ అంతా వాళ్లే సిద్ధం చేయాలి. అంటే ఆ ఒక్కరోజుకు చెఫ్‌గా నియామకం అన్నమాట.
ఏం వండాలో నిర్ణయించుకుని, అవసరమైన వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని, వండి, వడ్డించడం వరకు వారిదే బాధ్యత అన్నమాట. ఆ రోజు సర్వీస్‌కి గాను బయటి నుంచి వచ్చిన షెఫ్‌కి ఇచ్చినట్లే పిల్లలకు కూడా పేమెంట్ ఇవ్వాలి. మోడరన్ ఉమెన్ చాలామంది ఇలా పిల్లలను వారానికోరోజు షెఫ్ డ్యూటీకి సిద్ధం చేస్తున్నారు కూడా.
ఏం వెతికారో తెలుసా?
మన యువత 2024లో కూడా ఇంటర్నెట్‌లో వంటల కోసం విపరీతంగా సెర్చ్ చేసినట్లు చె΄్తోంది గూగుల్. ఇంతకీ ఈ ఏడాది ఏయే వంటకాల కోసం వెతికారో తెలుసా?
పోర్న్‌స్టార్ మార్టినీ...
దీని పేరు మీద అనేక అభ్యంతరాలున్నాయి. కానీ అదే పేరుతో వ్యవహారంలో ఉంది. ఈ లండన్ లోకల్ డ్రింక్‌ని వెనీలా వోడ్కా, ఫ్రూట్ లిక్కర్, వెనీలా షుగర్‌లతో చేస్తారు.
రెండవ స్థానంలో మన మామిడికాయ పచ్చడి ఉంది. మూడవ స్థానంలో ఉత్తరాది వంటకం ధనియా పాంజిరి ఉంది. ధనియాల పొడి, చక్కెర, నెయ్యి, రకరకాల గింజలతో చేస్తారు. ఇది కృష్ణాష్టమి రోజు చేసే నైవేద్యం. ఆయుర్వేదం సూచించిన ఆరోగ్య మూలికలతో చేసే ఔషధాహారం.
నాలుగో స్థానంలో ఉన్న మన ఉగాది పచ్చడే. ఐదవస్థానంలో ఉన్న ఆహారం ఉత్తరాది రాష్ట్రాల చర్నామృత్. పాలు, చక్కెర, పెరుగు, తేనె, నెయ్యి, తులసి ఆకులు, డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వుతో చేస్తారు. మన పంచామృతం వంటిది. పూజాదికాలలో భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా పంచుతారు.
ఆరో స్థానంలో ఉన్నది భూటాన్ వాళ్ల ఇమాదత్శీ. మీగడ పెరుగులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు నానబెట్టి తింటారు. ఆహారప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఉదయాన్నే తాగే వెచ్చటి కాఫీ కోసం అది కూడా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కాఫీ ఎలా చేయాలోనని సెర్చ్ చేశారు.
ఎనిమిదో స్థానంలో ఉన్నది కంజి. ఇది ఉత్తరాదిన హోలీ సందర్భంగా తాగే డ్రింక్‌లాంటిదే. బీట్‌రూట్, క్యారట్, ఆవాలు, ఇంగువతో చేసి రాత్రంతా పులియ బెడతారు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది.
శక్కర్ పారా...
ఇది మహారాష్ట్ర వంటకం. గోధుమ పిండి, చక్కెర కలిపి చేస్తారు. గోధుమ పిండిలో చక్కెర బదులు ఉప్పు, జీలకర్ర కలిపి కూడా చేస్తారు. పిల్లలకు చక్కటి చిరుతిండి, పెద్దవాళ్లకు టీ టైమ్ స్నాక్. ఇక పదవ వంటకం చమ్మంతి... ఇది కేరళ కొబ్బరి పచ్చడి. మన తెలుగు వాళ్లకు కూడా అలవాటే. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండుతో చేస్తారు. ఇడ్లీ, దోశె, అన్నంలోకి కూడా బాగుంటుంది.
గూగుల్ ఇచ్చిన లిస్ట్ చూస్తే ఈ వంటకాల గురించి సెర్చ్ చేసింది యూత్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఇవన్నీ సులువుగా చేయగలిగిన వంటలే. పండుగల సమయంలో మాత్రమే చేసే ధనియా పాంజిరి, ఉగాది పచ్చడి, చర్నామృత్‌ల కోసం సెర్చ్ చేశారంటే వాళ్లు వంటలో చెయ్యి తిరిగిన వాళ్లు కాదని ఒప్పుకోవాల్సిందే.
అలాగే మామిడికాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి కూడా. ఇక మనవాళ్లు ఆసక్తిగా బయటి వంటకాల కోసం తొంగి చూసింది లండన్ డ్రింక్, క్రీమీ కాఫీల విషయంలో మాత్రమే. ఇవి కూడా యూత్ ఇంటరెస్ట్ జాబితాలోనివే. మరో విషయం... బాదం పప్పులు నానబెట్టి రోజూ తినడానికి కారణాలు, ప్రయోజనాలను తెలుసుకున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి కూడా.
Comments
Please login to add a commentAdd a comment