బ్రేక్ వచ్చినా.. బెంగ వద్దు | How to choose the right financial planner | Sakshi
Sakshi News home page

బ్రేక్ వచ్చినా.. బెంగ వద్దు

Published Mon, May 2 2016 7:12 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

బ్రేక్ వచ్చినా.. బెంగ వద్దు - Sakshi

బ్రేక్ వచ్చినా.. బెంగ వద్దు

ఉద్యోగం కోల్పోయినా ఆర్థిక ప్రణాళికతో ధీమా
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మారిపోతున్న ఆర్థిక పరిస్థితులు మొదలైనవన్నీ దేశీయంగా మన మీద కూడా తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. 2008-09 నాటి ఆర్థిక సంక్షోభంలో అంతర్జాతీయంగా అనేక వ్యాపారాలు మూతబడటంతో ఈ ధోరణి మరింతగా పెరిగింది. కొంగొత్త టెక్నాలజీలు, ఎక్కడికక్కడ పెరిగిపోతున్న పోటీ దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. కొన్ని కంపెనీలు నిపుణులను చౌకగా రిక్రూట్ చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తుంటే.. మరికొన్ని సంస్థలు ఉత్పాదకత పెంచుకునే పేరుతో నిపుణులపై మరింత పని భారం మోపుతున్నాయి.

ఇలాంటప్పుడు ఉద్యోగం కోల్పోతే మరో ఆదాయమార్గం అంటూ పెద్దగా ఉండని వేతన జీవుల పరిస్థితి సమస్యాత్మకంగా మారుతోంది. ఎంతటి నిపుణులైనా సరే.. ఉద్యోగం పోయిందంటే మళ్లీ కొత్త దాన్లో చేరాలంటే కనీసం రెండు, మూడు నెలలు పైగానే పట్టేస్తోంది. ఒకవేళ అదే నైపుణ్యాలున్న వారు పుష్కలంగా ఉన్నారంటే.. ఈ సమయం మరింత పెరుగుతుంది. అయితే, ప్రతి నెలా ఖర్చులు మాత్రం ఆగవు కదా.

సిటీల్లో ఉంటున్నప్పుడు నిత్యావసరాలతో పాటు భారీ అద్దెలు, లేదా రుణంపై ఇల్లు తీసుకుంటే ఈఎంఐలు, ప్రయాణాలకయ్యే ఖర్చులు సాధారణంగానే ఉంటాయి. వీటికి తోడు పిల్లలను మంచి స్కూల్లో చదివించాలంటే వేలకు వేలు కట్టాల్సిందే. కుటుంబం చిన్నదే అయినా.. ఇవన్నీ కలిసి తడిసి మోపెడవుతుంటాయి. కాబట్టి ఏ కారణం వల్ల ఉద్యోగం కోల్పోయినా.. ఆర్థికంగా భరోసా లేకపోతే మానసికంగానూ, ఆర్థికంగాను ఒత్తిడి తప్పడం లేదు.
 
తప్పనివి.. తప్పించుకోగలిగేవి..
స్కూలు ఫీజులు, ఇంటి అద్దె లేదా గృహరుణ ఈఎంఐలు, బీమా ప్రీమియంలు మొదలైనవి రిటైరవ్వడానికి ముందు ఉండే ఖర్చుల్లో అనివార్యమైనవి. ఖర్చులు తగ్గించుకోగలిగేవేవైనా ఉంటే అవి ఇంటి బడ్జెట్టు.. వినోదంపై చేసే ఖర్చులు. సినిమాలు, షికార్లు పూర్తిగా తగ్గించుకోవడం.. హోటళ్లకెళ్లడం బదులు ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వడం మొదలైనవి చేయొచ్చు. మళ్లీ మంచి ఉద్యోగం దొరికే దాకా వీటిని వాయిదా వేసుకోవచ్చు. ఆల్కహాల్ అలవాటుంటే దాన్ని సాధ్యమైనంత వరకూ మానుకోగలిగితే మంచిది.

ఎందుకంటే ఇది ఆరోగ్యానికే కాదు ఆర్థిక పరిస్థితికీ  చేటు తెస్తుంది. ఇక తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన బైటికి కనిపించే లైఫ్ స్టయిల్‌ను ఒక్కసారిగా మార్చేయకూడదంటారు హెచ్‌ఆర్ నిపుణులు. తెలిసిన వారిని తరచూ కలుస్తూ, నెట్‌వర్కింగ్ కొనసాగిస్తుంటేనే త్వరగా మరో కొత్త ఉద్యోగం దక్కే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమయంలో మంచి డ్రెస్సింగ్, ప్రయాణాలు, ఫ్రెండ్స్‌కి కాఫీ..టీలు మొదలైన ఖర్చులు అదనంగా ఉంటాయి. ఒకోసారి ఉద్యోగం ఉన్నప్పటికంటే, లేనప్పుడే ఇవి మరింత ఎక్కువ కావొచ్చు.
 
ప్రణాళికలు ఇలా..
ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకూ ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్లానింగ్ చేసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు ఎలాగైతే వేసుకుంటారో, మధ్యమధ్యలో తలె త్తే ఉద్యోగ సంబంధిత అంతరాయాల కోసం కూడా ప్రణాళిక ఉండాలి. ఉద్యోగం చేతిలో లేనప్పుడు.. భారీ వడ్డీ రేటు పడే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మేలు. మరీ అత్యవసరమైతే పీఎఫ్ మీద లేదా ఇన్సూరెన్స్ పాలసీల మీద రుణం తీసుకోవచ్చు.  

ముందు నుంచే ప్రణాళిక వేసుకుని.. కనీసం ఆర్నెల్ల పాటు ఖర్చులకు ఎటువంటి ఢోకా ఉండకుండా అత్యవసర నిధి ఉంచుకోవాలి. ఒకవేళ ఉద్యోగం చేసే కంపెనీలో గానీ లేదా సదరు పరిశ్రమలో గానీ ఏవైనా సంక్షోభాల సూచనలు కనిపిస్తే అత్యవసర నిధి పరిమాణాన్ని దాదాపు ఏడాది కాలం దాకా పెంచుకోవడం ఉత్తమం. ఇందుకోసం లిక్విడ్ లేదా అల్ట్రా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు.

వీటిలో రిస్కు తక్కువుంటుంది, బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ పథకాలతో పోలిస్తే కాస్త మెరుగైన రాబడి అందిస్తాయి.  ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. ఉద్యోగం లేని సమయంలో కూడా కాస్త ఆర్థికంగా భరోసాగా ఉండొచ్చు. ఈ ధీమా మనలోనూ ప్రతిఫలిస్తుంది కాబట్టి ఇంటర్వ్యూల్లాంటివి ధైర్యంగా ఎదుర్కొనే వీలుంటుంది. వీలైనంత త్వరగా కొత్త ఉద్యోగాన్నీ దక్కించుకునే అవకాశం ఉంటుంది.
 - అనిల్ రెగో
ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement