టీడీఎస్ భారం తగ్గించుకుందామిలా..
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. జనవరి నెల వచ్చిందంటే చాలు ఆఫీసులోని హెచ్‌ఆర్ సిబ్బంది మీ ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను ఇవ్వమని కోరతారు. వీటిని ఇవ్వకపోతే టీడీఎస్ పేరుతో మీ జీతం నుంచి భారీ కోతలు కోస్తారు. సరైన ప్రణాళికతో వెళితే ఈ టీడీఎస్ భారం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. పన్ను భారం తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80సీ ప్రధానమైనది. ఈ సెక్షన్ ప్రకారం రూ. 1.5 లక్షలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునే వెసులుబాటు ఉంటుంది.
ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక చక్కటి సాధనం. ఇందులో గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ మొత్తంపై పన్ను లాభాలను పొందవచ్చు. మీ పేరున లేదా మీపై ఆధారపడి జీవించే వారి పేరు మీద ఈ అకౌంట్ ప్రారంభించొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. నెలలో ఒకటవ తేదీ నుంచి అయిదవ తేదీ లోపల ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా నెల మొత్తానికి వడ్డీ లభిస్తుంది.
5 తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఆ నెల మొత్తానికి వడ్డీ లభించదు. దీని కాలపరిమతి 15 ఏళ్లు. సెక్షన్ 80సీ పరిధిలోకి అనేక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు, వ్యయాలు వస్తాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), న్యూ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (పోస్టాఫీసుల్లో లభిస్తాయి), ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, ఇద్దరు పిల్లలకు చెల్లించే స్కూలు, కాలేజీ ట్యూషన్ ఫీజులు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇంటి గృహరుణానికి చెల్లించే ఈఎంఐలో అసలు వాటా ఇవన్నీ 80సీ పరిధిలోకే వస్తాయి.
వీటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. పన్ను లాభాల కోసమే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించకండి. గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు సరిపోయింది కదా అని ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపొద్దు. ఈ పథకాలు మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలు, రిటైర్మెంట్‌కు తోడ్పాటును అందిస్తాయి.
హెచ్‌ఆర్‌ఏ
ఒకవేళ మీరు ఇంటి అద్దె చెల్లిస్తుంటే దాని నుంచి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు పనిచేసే సంస్థ హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అద్దెను చెక్ రూపంలో చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను దగ్గర పెట్టుకోండి. ఇంటి ఓనర్ పాన్ నంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్‌ఆర్‌ఏ పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆదాయం నుంచి తగ్గించి చూపిస్తారు.
1. కంపెనీ ఇస్తున్న వాస్తవ హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్. 2. చెల్లిస్తున్న అద్దెలోంచి బేసిక్ శాలరీలో 10 శాతం తీసివేయగా వచ్చే మొత్తం. 3. మెట్రోలో నివసిస్తుంటే బేసిక్ శాలరీలో 50 శాతం, ఇతర పట్టణాల్లో అయితే 40 శాతం. ఒకవేళ మీకు సొంతిల్లు ఉండి, అది పనిచేస్తున్న కార్యాలయానికి దూరంగా ఉండటం వల్ల అద్దె ఇంట్లో ఉంటే కూడా హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు.
రుణాలపై..
రుణం తీసుకొని ఇంటిని నిర్మిస్తే లేదా కొంటే...దానిపై రెండు రకాల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రుణానికి చెల్లించే ఈఎంఐలో అసలుకు చెల్లించిన మొత్తంపై సెక్షన్ 80సీ ప్రయోజనం లభిస్తుంది. చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద గరిష్టంగా రూ. 2 లక్షలు ఆదాయం నుంచి మినహాయించుకోవచ్చు. బ్యాంకు నుంచి అసలు, వడ్డీ రూపంలో ఎంత మొత్తం చెల్లించారో కాగితం తీసుకొని అది హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఇవ్వండి.
ఇవి కాకుండా మీ ఉన్నత చదువుల కోసం లేదా భార్యా పిల్లల చదువుల కోసం తీసుకొనే రుణాలపై ఎటువంటి పరిమితి లేకుండా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి కాకుండా సెక్షన్ 80జీ కింద వివిధ సంస్థలకు ఇచ్చే విరాళాలపై కూడా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సకాలంలో ఈ వివరాలన్నీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్లో ఇవ్వడం ద్వారా వచ్చే మూడు నెలలు జీతంలో భారీ కోతల నుంచి తప్పించుకోవచ్చు.
- అనిల్ రెగో
సీఈవో, రైట్ హొరైజన్స్