ఇరవైల నుంచే విరమణ ప్రణాళిక!
* ముందు నుంచి ఆరంభిస్తే కాంపౌండింగ్ లాభాలు
* పొదుపు మొత్తాన్ని బట్టి ముందుగానే రిటైర్మెంట్
* ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచన
కష్టపడి పనిచేసి సాధ్యమైనంత ఎక్కువగా ఆర్జించేందుకు చేసే ప్రయత్నాలన్నింటి వెనుక ప్రధాన కారణం ఒకటే.. అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏ బాదరబందీ లేకుండా జీవితాన్ని హాయిగా గడపడం. ఇంత కీలకమైన రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం.
ఇందులో భాగంగా ముందుగా ఎప్పుడు రిటైరవబోతున్నాం? ఆ తర్వాత ఎలాంటి జీవన విధానాన్ని కోరుకుంటున్నాం? ఇందుకోసం ఎంత మొత్తం అవసరమవుతుంది? ఇలాంటివన్నీ లెక్కేసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల, వైద్యం ఖర్చులు మొదలైనవన్నీ కూడా ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే భారీ మొత్తమే అవసరమవుతుంది. అంత నిధి ఒక్కసారిగా వచ్చి పడదు గనుక.. కొద్దికొద్దిగా కూడబెట్టక తప్పదు.
ముప్ఫయ్యేళ్లు వచ్చిన తర్వాత ప్లానింగ్ మొదలుపెట్టే కంటే ఇరవైలలో కెరియర్ ప్రారంభంలోనే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే కాంపౌండింగ్ మహిమతో రిటైర్మెంట్ నాటికి గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయొచ్చు. రిటైర్మెంట్ అవసరాల కోసం చేసే పెట్టుబడులు ఎలక్ట్రానిక్ విధానంలో (ఈసీఎస్) ఆటోమేటిక్‌గా ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటే.. ఇతరత్రా తలెత్తే ఖర్చుల వల్ల రిటైర్మెంట్ ప్రణాళిక దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
లక్ష్యాలు రాసిపెట్టుకోవాలి..
పదవీ విరమణ తర్వాత మనం చేయాలనుకున్న లక్ష్యాలను రాసిపెట్టుకోవడం ముఖ్యం. ఇవి నిర్దిష్టంగా ఉండటం మంచిది. ఉదాహరణకు విదేశీ పర్యటన చేయాలనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏమేం చూడాలనుకుంటున్నారు?
వగైరాలాంటివన్నమాట. అలాగే పదవీ విరమణ తర్వాత వైద్య అవసరాలకు కూడా సరిపడేంత బీమా ఉండేలా చూసుకోవాలి. తద్వారా చికిత్స ఖర్చుల భారం మీ మీద పడకుండా ఉంటుంది. ముందుకు సాగుతున్న కొద్దీ కెరియర్, లైఫ్‌స్టయిల్, ఆరోగ్యం అన్నీ మారుతుంటాయి కనుక పదవీ విరమణ తర్వాత ఖర్చులు ఒకింత ఎక్కువగానే ఉంటాయన్న అంచనాలతోనే ప్రణాళిక వేసుకోవాలి. ఈలోగా కొత్త ఇల్లో, కారో కొనుక్కోవడమో లేదా విహారయాత్రలకు వెళ్లడమో లాంటి ఆలోచనలు ఉంటే ఆ వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
పెట్టుబడులను సమీక్షించుకోవాలి..
మీకున్న ఆస్తులు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలను సమీక్షించుకోవాలి. రిస్కు సామర్థ్యం, రాబడుల అంచనాలను బట్టి అవసరమైతే పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మధ్యమధ్యలో సవరించాలి. ఉదాహరణకు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్కుతో కూడుకున్న షేర్ల పెట్టుబడులే ఎక్కువగా ఉంటే .. రిటైర్మెంట్ దశలో భరోసాగా ఉండేలా స్థిరమైన ఆదాయం ఇచ్చే సాధనాల్లోకి సింహభాగాన్ని మార్చవచ్చు.
పదవీ విరమణ తర్వాత రుణభారం ఉండకుండా అప్పులేవైనా ఉంటే సాధ్యమైనంత ముందుగానే తీర్చేయడం మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో మీ రిటైర్మెంట్ బడ్జెట్‌లో వీటిని కూడా చేర్చి ప్రణాళిక వేసుకోవాల్సి వస్తుంది. ఇక, స్థలం, ఇల్లు తదితర స్థిరాస్తులు సైతం తదుపరి సంవత్సరాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. పాతతరం నాటి వస్తువులు, కళాఖండాలు.. ఆఖరికి వైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు కూడా తరచూ కాకపోయినా సందర్భాన్ని బట్టి మంచి రాబడులే ఇవ్వగలవు.
స్థూలంగా చెప్పాలంటే మనం చేసిన పెట్టుబడుల ద్వారా వచ్చే రాబడులు.. మన ఖర్చులకు మించి ఉన్న తరుణంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఎంత ముందుగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలిగితే అంత త్వరగా రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోవచ్చు. పొదుపు చేసిన అసలును కదల్చాల్సిన పని లేకుండా దానిపై వచ్చే రాబడులే.. మన ఖర్చులకు సరిపోయేట్లుగా ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్‌లో మరీ అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆదుకునేందుకు ఈ అసలు మొత్తం ఉపయోగపడగలదు.
ఒక్క ముక్కలో....
* రిటైర్మెంట్ ప్రణాళికను సాధ్యమైనంత ముందుగా ప్రారంభించాలి. ముఫ్ఫై ఏళ్ల వయస్సులోనైనా ఫర్వాలేదు.
* జీవన విధానం, పదవీ విరమణ వయస్సు, భారీ కొనుగోళ్లు మొదలైనవన్నీ కూడా ప్రణాళిక వేసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి.
* కంపెనీపరంగా, ప్రభుత్వపరంగా వచ్చే పింఛను ప్రయోజనాలు, రివర్స్ మార్టిగేజ్ మొదలైన మార్గాలను పరిశీలించుకోవాలి.
* వైద్య చికిత్స ఖర్చులు భారీగా పెరుగుతాయి కనుక తగినంత కవరేజి ఉండేలా చూసుకోవాలి.
* రిటైర్మెంట్‌కి ఎంత ఎక్కువ మొత్తం ప్లానింగ్ చేసుకుంటే అంత మంచిది.
* పొదుపు చేసిన అసలును కదల్చాల్సిన పని లేకుండా దానిపై వచ్చే రాబడులే ఖర్చులకు సరిపోయేలా చూసుకోవాలి.
- అనిల్ రెగో
ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్