దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు మంచి ఉత్సాహంలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన సీఎం అతిశీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కల్కాజీ స్థానం నుండి పోటీకి దిగారు. ఆతిశీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబాపై పోటీకి దిగారు. అల్కా లాంబా కూడా తాజాగా తన నామినేషన్ దాఖలు చేశారు. తమతమ నామినేషన్లలో వారిద్దరూ తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. అయితే వీరిద్దరిలో ధనవంతులెవరు? ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందనేని ఆసక్తికరంగా మారింది.
ముందుగా కల్కా జీ సీటు విషయానికొస్తే ఇది ఢిల్లీలోని ఒక హై ప్రొఫైల్ సీటుగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆతిశీ, అల్కా లాంబా మధ్య పోటీ కారణంగా ఈ సీటుకు మరింత ప్రాధాన్యత వచ్చింది. బీజేపీ కూడా ఇక్కడి నుంచి ప్రముఖ నేత రమేష్ సింగ్ బిధురిని బరిలోకి దింపింది. బిధురి 2003, 2008, 2013లలో తుగ్లకాబాద్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. అల్కా లాంబా దాదాపు ఐదేళ్ల పాటు ఆప్‌లో ఉండి 2019లో కాంగ్రెస్‌లో చేరారు. కల్కాజీ నియోజకవర్గంలో మొత్తం 1,94,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,893 మంది పురుష ఓటర్లు, 87,617 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్ ఓటర్లున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా(Atishi Marlena) ఆస్తుల విలువ రూ.76,93,347.98. గత ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని ఆతిశీ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి స్థిరాస్తి లేదు. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. సొంత కారు లేదా మరే ఇతర వాహనం కూడా లేదు. కల్కాజీ అసెంబ్లీ స్థానం(Kalkaji Assembly Constituency) నుండి నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో, తనపై రెండు క్రిమినల్ పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆమె తెలియజేశారు. తన దగ్గర 30 వేల రూపాయల నగదు ఉందని, తనకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఆతిశీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా(Alka Lamba) కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో తెలియజేశారు. అల్కా లాంబా మొత్తం ఆస్తులు రూ.3.41 కోట్లు. అల్కా లాంబాకు రూ.61.12 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆమెపై ఆధారపడిన వారిలో ఒకరికి రూ.14.36 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆమె సంపద రూ.20.12 లక్షలు పెరిగింది. అల్కా లాంబా గురుగ్రామ్‌లో రూ.80 లక్షల విలువైన 500 చదరపు అడుగుల వాణిజ్య ఫ్లాట్‌ను, ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్-1లో రూ.2 కోట్ల విలువైన నివాస ఆస్తిని కలిగివున్నారు. అఫిడవిట్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 8.28 లక్షలు కాగా, 2023-24లో రూ. 8.91 లక్షలు, 2022-23లో రూ. 5.35 లక్షలుగా ఉంది. అల్కాలాంబా తన దగ్గరున్న ఆభరణాల గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించలేదు.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి
Comments
Please login to add a commentAdd a comment