బీమాతోనే హోమ్‌లోన్ ధీమా.. | Insurance With Guaranteed home loan | Sakshi
Sakshi News home page

బీమాతోనే హోమ్‌లోన్ ధీమా..

Published Mon, Dec 28 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

బీమాతోనే హోమ్‌లోన్ ధీమా..

బీమాతోనే హోమ్‌లోన్ ధీమా..

భారతీయుల మదిలో సొంతింటికి ప్రత్యేక స్థానముంది. ఇంటిని కేవలం నివాసం ఉండటానికి అనే కాకుండా ఒక నమ్మకమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. అందుకే ప్రతీ ఒక్కరు సొంతింటిపై చాలా మమకారంతో ఉంటారు. అలాగే అద్దె ఇంట్లో ఉండే దానికంటే సొంతింటికే మొగ్గు చూపుతారు. చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొని నెలనెలా ఈఎంఐలు (అద్దె బదులు) చెల్లిస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొనే దేశంలో రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో రుణ మొత్తం చెల్లించే ఈఎంఐల భారం కూడా పెరిగిపోతోంది.
 
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్లో సొంతింటిపై ఇన్వెస్ట్ చేయడం ఒక భాగమయ్యింది. ఇది వారి కుటుంబానికి ఒక భద్రతను కల్పిస్తుంది. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకున్న తర్వాత అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మీ కుటుంబ సభ్యులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఒకవేళ మీ తర్వాత కుటుంబ సభ్యులు ఆ రుణాన్ని కట్టలేకపోతే బ్యాంకులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని వేలం వేస్తాయి.

ఇటువంటివి జరగకుండా మీ తర్వాత కూడా కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ అనేది అక్కరకు వస్తుంది. ఏదైనా ఊహించలేని సంఘటన జరిగితే మిగిలిన బకాయిలను బీమా కంపెనీ బ్యాంకులకు చెల్లిస్తుంది. ఇక మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి.

చాలా మంది హోమ్ ఇన్సూరెన్స్, హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ రెండూ ఒకటే అని పొరపడుతుంటారు. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటిలోని సామాన్లు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు వంటి వాటికి బీమా రక్షణ కల్పిస్తుంది. అదే హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ కేవలం మీరు చెల్లించాల్సిన రుణ బకాయికి మాత్రమే బీమా రక్షణ అందిస్తుంది.
 ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల హోమ్‌లోన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.

రెడ్యూసింగ్ కవర్ ఆప్షన్, లెవెల్ కవర్ (ఫిక్స్‌డ్ సమ్ అష్యూర్డ్) ఆప్షన్స్‌లో హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. ఇందులో రెడ్యూసింగ్ కవర్ ఆప్షన్ ఎంచుకుంటే.. కట్టాల్సిన రుణ బకాయికి మాత్రమే బీమా రక్షణ ఉంటుంది. ఈఎంఐ చెల్లించినప్పుడల్లా చెల్లించాల్సిన బకాయి తగ్గుతుంది. ఆ మేరకు బీమా రక్షణ కూడా తగ్గుతూ వస్తుంది. అదే లెవెల్ కవర్ ఆప్షన్ తీసుకుంటే మీ రుణ బకాయితో సంబంధం లేకుండా మీరు ఎంత మొత్తానికి బీమా తీసుకుంటే అంత మొత్తానికి బీమా రక్షణ లభిస్తుంది. అందుకే రెడ్యూసింగ్ కవర్ ఆప్షన్‌తో పోలిస్తే లెవెల్ కవర్ ఆప్షన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.
 
ఇలా పనిచేస్తుంది..
ఈఎంఐలు చెల్లిస్తుంటే ప్రతీ ఏటా రుణ భారం తగ్గుతుంది. దీంతోపాటే హోమ్‌లోన్ బీమా రక్షణ కూడా ఏటా తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు ఖలీ మస్తాన్ వలీ రూ. 50 లక్షలకు ఇంటి రుణం తీసుకున్నాడనుకుందాం. రుణంతోపాటే హోమ్‌లోన్ తీసుకుంటే (రెడ్యూసింగ్) బీమా రక్షణ రూ. 50 లక్షలు ఉంటుంది.

ఏడేళ్ల తర్వాత మీరు చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తం రూ. 27 లక్షలుగా ఉందనుకుంటే అప్పుడు బీమా రక్షణ రూ. 50 లక్షల నుంచి రూ. 27 లక్షలకు తగ్గుతుంది. అలాగే ఏదైనా ఊహించని సంఘటన జరిగిన సమయంలో బీమా కంపెనీ  క్లెయిమ్‌ను నేరుగా బ్యాంకుకి చెల్లించేస్తుంది. ఆ తర్వాత నుంచి మీ కుటుంబ సభ్యులు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే లెవెల్ కవర్‌లో అయితే రుణ బకాయిని నేరుగా బ్యాంకుకి చెల్లించి మిగిలిన మొత్తాన్ని నామినీకి అందచేయడం జరుగుతుంది.
 
ప్రత్యామ్నాయాలున్నాయా?...
గృహ రుణానికి రక్షణగా హోమ్‌లోన్ బీమానే తీసుకోవాల్సిన అవసరం లేదు. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. తీసుకున్న హోమ్‌లోన్ మొత్తానికి సమానంగా టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోండి. ఇది మీ రుణ బకాయిలకు బీమా రక్షణను కల్పిస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్ బీమా ప్రీమియం కంటే టర్మ్ బీమా ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది.
 
ఇవి గమనించండి..
హోమ్‌లోన్ ఇన్సూరెన్స్‌ను నేరుగా బీమా కంపెనీ నుంచి లేదా రుణం తీసుకుంటున్న బ్యాంకు నుంచి కూడా తీసుకోవచ్చు. ప్రీమియం అనేది మీ వయస్సు, ఆరోగ్యం,  రుణ కాలపరిమితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణాన్ని ఉమ్మడిగా తీసుకుంటే ఇద్దరికీ బీమా రక్షణ కల్పించాల్సి వస్తుంది కాబట్టి ఆ మేరకు ప్రీమియం పెరుగుతుంది. సాధారణంగా హోమ్‌లోన్ బీమా కాలపరిమితి మీ రుణ కాలపరిమితికి సమానంగా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు 60 నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే బీమా రక్షణను అందిస్తున్నాయి.
- అనిల్ రెగో
సీఈవో, రైట్ హొరెజైన్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement