ఈ చార్జీలు మీకు తెలుసా? | 14 types Charges of Home loan | Sakshi
Sakshi News home page

ఈ చార్జీలు మీకు తెలుసా?

Published Mon, Dec 28 2015 2:49 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM

ఈ చార్జీలు మీకు తెలుసా? - Sakshi

ఈ చార్జీలు మీకు తెలుసా?

హోమ్‌లోన్‌పై 14 రకాల చార్జీలు
* వీటిలో అధికభాగం అందరికీ వర్తింపు
* రుణం తీసుకునే ముందు వీటినీ గమనించాలి


ప్రసాద్ ఫ్లాట్ కొందామనుకున్నాడు. మంచి ఫ్లాట్ ఎంచుకున్నాడు. హోమ్‌లోన్‌కు దరఖాస్తు చేశాడు. వడ్డీ రేటు, ఇతరత్రా లెక్కబెట్టుకున్నాడు. దాన్ని బట్టే ఒక అంచనా వేసుకున్నాడు. లోన్ మంజూరయింది. కాకపోతే... లోన్ ఇచ్చేటపుడు బ్యాంకు బోలెడన్ని చార్జీలు వేసింది. వాటిలో చాలావరకూ ప్రసాద్‌కు అప్పటిదాకా తెలియనే తెలియదు. అవేంటో ఒకసారి చూద్దాం.
 
దరఖాస్తు ఫీజు:
ఇది రూ.1000 నుంచి రూ.5వేల మధ్య ఉంటుంది. వెరిఫికేషన్‌కు, ఇతరత్రాకు బ్యాంకుకయ్యే ఖర్చును ఇది కవర్ చేస్తుంది.
 
ప్రాసెసింగ్ ఫీజు:
క్రెడిట్ అప్రయిజల్‌కయ్యే ఖర్చును ఇది కవర్ చేస్తుంది. ఇది ఎంతనేది రుణగ్రహీత స్థితిగతులు, రుణ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రూ.10వేలు కానీ, రుణ మొత్తంలో 1 శాతం గానీ ఉంటుంది.
 
అడ్మినిస్ట్రేటివ్ ఫీజు:
కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ చార్జీల్ని రెండుగా విడగొడతారు. రుణం మంజూరైన తరవాత వసూలు చేసేదాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫీజుగా పిలుస్తారు.
 
టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఫీజు: కాస్త ఖరీదైన ప్రాపర్టీలు కొంటుంటే... విలువను రెండు రకాలుగా అంచనా వేస్తారు. ఈ రెండు అంచనాల్లో దేని విలువ తక్కువగా ఉంటే దాన్ని రుణ మంజూరుకు పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఫీజు వసూలు చేస్తాయి.
 
లీగల్ ఫీజు: చాలా సంస్థలు రుణదాత పత్రాల్ని పరిశీలించే పనిని లీగల్ సంస్థలకు అప్పగిస్తాయి. కొన్ని బ్యాంకులు దీన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తాయి. కొన్ని మాత్రం విడిగా వసూలు చేస్తాయి.
 
సేల్ అగ్రిమెంటుపై ఫ్రాంకింగ్ ఫీజు: కొన్ని రాష్ట్రాల్లో బిల్డర్/అమ్మకందారుతో చేసుకునే ప్రాపర్టీ అగ్రిమెంట్‌పై స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆస్తి  విలువలో 0.1 శాతం నుంచి రూ.20వేల వరకూ ఉంటుంది.
 
రుణ అగ్రిమెంటుపై ఫ్రాంకింగ్ ఫీజు: మహారాష్ట్ర, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు రుణ మొత్తంపై 0.1 శాతం నుంచి 0.2 శాతం వరకూ ఫీజు వసూలు చేస్తున్నాయి.
 
నోటరీ ఫీజు: మీరు గనక ఎన్నారై అయితే... మీ వివరాలతో పాటు పవరాఫ్ అటార్నీని విదేశాల్లో ఉండే నోటరీగానీ, భారత రాయబార కార్యాలయంగానీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీనికయ్యే ఛార్జీలు.
 
రిజిస్ట్రేషన్ సమాచారం తెలిపే ఫీజు: ముందుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలియజేయటమనేది ఇప్పుడే మొదలవుతోంది. మహారాష్ట్రలో దీనికి రూ.1,300 వసూలు చేస్తున్నారు.
 
ఇండెమ్నిటీ ఛార్జీలు: కొన్ని రిస్కులకు సంబంధించి రుణ గ్రహీత ఇండెమ్నిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికయ్యే ఛార్జీలు.
 
న్యాయ ఛార్జీలు: మీరు గనక ఎన్నారై లేదా విదేశాల్లో ఉంటున్న భారతీయ సంతతి వారైతే... మీ రుణ ప్రక్రియ ఆరంభించటానికి ముందు దరఖాస్తును న్యాయపరంగా పరిశీలన జరిపించాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంకుకు సమర్పించే ముందు. దానికయ్యే ఛార్జీలు.
 
అగ్ని ప్రమాద బీమా: సాధారణంగా బీమా వ్యాపారం కూడా చేస్తున్న బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వద్ద మీరు రుణం తీసుకుంటే... ఈ బీమా తీసుకోవాలని అవి బలవంతం చేస్తాయి.
 
డాక్యుమెంటేషన్ ఛార్జీలు: రుణ ఒప్పందంపై సంతకాలకు, ఈసీఎస్‌ను యాక్టివేట్ చేయడానికి... ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి చేయటానికి కొన్ని బ్యాంకులు, రుణ సంస్థలు రూ.2000 నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నాయి.
 
టర్మ్ ఇన్సూరెన్స్: సాధారణంగా గృహ రుణానికి సరిపడా మొత్తానికి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని రుణ సంస్థలు కోరుతాయి. చాలా వాటిలో ఇది తప్పనిసరి చేశారు. ఎందుకంటే ఒకవేళ వాయిదాలు తీరకుండానే మీకేదైనా అయిన పక్షంలో... బ్యాంకులకు బీమా సంస్థ నుంచి వారి రుణ మొత్తం అందుతుంది. ఈ ప్రీమియం మీ ఈఎంఐలో కలిసి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement