ఈ ఆదాయానికి పన్నుండదు | There is no income tax! | Sakshi
Sakshi News home page

ఈ ఆదాయానికి పన్నుండదు

Published Mon, Jan 11 2016 2:34 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

ఈ ఆదాయానికి పన్నుండదు - Sakshi

ఈ ఆదాయానికి పన్నుండదు

పన్ను లేని ఆదాయం కావాలా?
మీరు వింటున్నది నిజమే!!. పన్ను లేని ఆదాయం కావాలా అనే!!. సాధారణంగా పెట్టుబడులపై వచ్చే రాబడులపై ఆదాయ పన్ను, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి అనేక పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇటువంటి పన్నులేవీ లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది కదూ...! అంతేకాదు... వీటిలో కొన్ని పెట్టుబడులపై ఆదాయ పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. తద్వారా మీ పన్ను భారం కూడా తగ్గుతుంది. ఇలా పన్నులేని ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి సాధనాలను ఇప్పుడు చూద్దాం...
 
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్...
ఇప్పుడంతా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల హవా నడుస్తోంది. ఈ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన కూడా చాలా అధికంగానే ఉంటోంది. సాధారణంగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేస్తాయి. ఈ బాండ్లు అందించే వడ్డీపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే బ్యాంకు డిపాజిట్లు, ఇతర డిబెంచర్స్ అయితే వాటిపై వచ్చే వడ్డీకి పన్ను భారం పడుతుంది. కానీ ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అందించే వడ్డీపై పన్నుభారం లేకపోవడమే వీటిలోని ప్రధానమైన ఆకర్షణ.
 
ఈక్విటీ పెట్టుబడులు...
షేర్లు కొనడం, అమ్మడం... లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనడం, అమ్మడం అనేది పన్ను ప్రయోజనాలకు అనుకూలం. ఇలా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపే లాభాలను తీసుకుంటే ఆ లాభంపై 15 శాతం ప్రత్యేక పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ మీ ఆదాయ పన్ను శ్లాబుతో సంబంధం లేదు. అలా కాకుండా ఏడాది దాటిన తర్వాత లాభాలను తీసుకుంటే దానిపై ఎటువంటి పన్ను భారం ఉండదు. ఈక్విటీల్లో మదుపు అనేది ముఖ్యంగా స్వల్పకాలానికి చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. ఈ రిస్క్‌కు సిద్ధపడ్డవారే స్వల్ప కాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయండి.
 
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఎటువంటి రిస్క్ లేకుండా దీర్ఘకాలానికి ఒక చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)ని పేర్కొనవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.1.50 లక్షలు వరకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ పథకం అందించే వడ్డీపై కూడా పన్ను భారం ఉండదు. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌తో సంబంధం లేకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిపై వచ్చే వడ్డీ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది.

ప్రస్తుతం ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. ముఖ్యంగా అధిక పన్ను శ్లాబుల్లో ఉన్న వారికి ఈ పథకం చాలా బాగుంటుంది. ఇందులో ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షలు మించి ఇన్వెస్ట్ చేయడానికి లేదు. అలాగే హిందూ అవిభాజ్య కుటుంబ సభ్యులు (హెచ్‌యూఎఫ్), ప్రవాస భారతీయులు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు. చిన్న పిల్లల పేరు మీద కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ ఇలాంటి సమయంలో పిల్లలు, గార్డియన్ సంయుక్తంగా రూ. 1.50 లక్షలు మించి ఇన్వెస్ట్ చేయలేరు.
 
సేవింగ్ బ్యాంక్స్‌పై వడ్డీ..
బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై అందించే వడ్డీపై కూడా పన్ను భారం లేదు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ ప్రకారం సేవింగ్స్ ఖాతా నుంచి ఏడాదిలో లభించే రూ. 10,000 వడ్డీ వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా బ్యాంకులు 4 శాతం వడ్డీని అందిస్తుంటే కొన్ని బ్యాంకులు 6-7 శాతం వరకు కూడా ఇస్తున్నాయి.
 
బీమా మెచ్యూరిటీ...
బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ... అది ఎంత పెద్ద మొత్తమైనప్పటికీ ఎటువంటి పన్ను ఉండదు. కానీ ఇక్కడో చిన్న నిబంధన ఉంది. మీరు చెల్లించే ప్రీమియం బీమా రక్షణ మొత్తం (సమ్ అష్యూర్డ్)లో 10 శాతం దాటకూడదు. ఒకవేళ ప్రీమియం అనేది సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం దాటితే.. మెచ్యూరిటీ ద్వారా వచ్చే లాభంపై పన్ను భారం ఏర్పడుతుంది.
 
డివిడెండ్ ఇన్‌కమ్
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్లపై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. ఈ డివిడెండ్లపై కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) చెల్లిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్లు చేతికి వచ్చిన మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఇన్‌కమ్‌గానే భావిస్తారు. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి...డీడీటీ రూపంలో కంపెనీ చెల్లించే మొత్తం ఇన్వెస్టర్లదే. ఆ మేరకు ఇన్వెస్టర్ల సంపద లేక లాభాలు తగ్గుతాయి.
 
ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్స్ అందించే కొన్ని రకాల ఫండ్స్‌పై రెండు రకాలుగా లాభాలుంటాయి. ఇటు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాలతో పాటు, ఈ ఫండ్స్ అందించే రాబడులపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ రెండు ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ఫండ్స్ మూడేళ్ల లాకిన్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మూడేళ్ల వరకు వైదొలగడానికి అవకాశం ఉండదు.

ఏడాది దాటిన తరవాత ఈక్విటీ రాబడులపై ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి వీటి రాబడులపై పన్ను భారం ఉండదు. ఒక వేళ మూడేళ్ల కంటే ముందే వైదొలిగితే సెక్షన్ 80సీ ద్వారా పొందిన ప్రయోజనాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ మేరకు పొందిన పన్ను ప్రయోజనాన్ని వెనక్కి తీసుకుంటారు. కానీ ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి.
 - అనిల్ రెగో,
 సీఈవో, రైట్ హొరైజన్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement