Where Can I Get Monthly Regular Income - Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఐడియాలు..ప్రతి నెలా ఆదాయం కావాలా?

Published Mon, Nov 7 2022 7:20 AM | Last Updated on Mon, Nov 7 2022 11:15 AM

Where Can I Get Monthly Regular Income  - Sakshi

ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. స్థిరమైన ఆదాయం ఉండాలి కానీ, ఇక్కడ రిస్క్‌ దాదాపు ఉండకూడదనుకునే వారి ముందున్న ఏకైక మార్గం డెట్‌ సాధనాలే. ఉద్యోగ విరమణ చేసిన వారికి.. అప్పటి వరకు నెల నెలా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. పింఛను ఏర్పాటు ఉన్న వారికి, ఆ తర్వాత కూడా ఎంతో కొంత మొత్తం ప్రతి నెలా చేతికి అందుతుంటుంది. కానీ, ఆ విధమైన ఏర్పాటు లేని వారు ఇతర ప్రత్యామ్నాయాలను చూడాల్సిందే. క్రమం తప్పకుండా ఆదాయం కోసం అందుబాటులో ఉన్న సాధనాల గురించి తెలిపే కథనం ఇది... 

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు  
బ్యాంక్‌లు ప్రతి నెలా వడ్డీని చెల్లించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను సైతం ఆఫర్‌ చేస్తాయి. వడ్డీ ఆదాయం సేవింగ్స్‌ అకౌంట్‌లోనే జమ అవుతుంది. కనుక కావాల్సినప్పుడు ఆ మొత్తాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. త్రైమాసికం వారీగా, ఏడాదికోసారి వడ్డీని చెల్లించే ఆప్షన్‌ కూడా ఉంటుంది. బ్యాంక్‌ల్లో నెలసరి ఆదాయం (మంత్లీ ఇన్‌కమ్‌) చెల్లించే డిపాజిట్లపై వడ్డీ రేటు 10 ఏళ్ల కాల వ్యవధికి గరిష్టంగా 6.5 శాతం వరకు ఉంది. బ్యాంక్‌ల మధ్య ఈ రేటు వేర్వేరుగా ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లు నిండిన) బ్యాంకులు అర శాతం అధికంగా ఆఫర్‌ చేస్తున్నాయి. 

అనుకూలం/ప్రతికూలం  
బ్యాంక్‌ల్లో డిపాజిట్లు ఎంతో సౌకర్యం. బ్యాంకు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే డిపాజిట్‌ చేసుకోవచ్చు.  ప్రభుత్వరంగ బ్యాంకులు లేదంటే ప్రముఖ ప్రైవేటు బ్యాంకులను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. మరీ చిన్న బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకుల్లో కొంత అదనపు రిస్క్‌ ఉంటుంది. అయినప్పటికీ, ఆర్‌బీఐ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ కింద ఒక డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాంకు సంక్షోభంలో పడితే ఈ మొత్తం రావడానికి సమయం పట్టొచ్చు. అందుకని ముందే పటిష్ట బ్యాంకులను ఎంపిక చేసుకుంటే సరి. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వృద్ధులు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల ఆదాయంపై పన్ను లేదు. ఇంతకుమించిన ఆదాయం వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్‌ అమలు చేస్తుంటాయి. కనుక ఆదాయపన్ను వర్తించని వారు ఫామ్‌ 15జీ/హెచ్‌ సమర్పిస్తే 
సరిపోతుంది.  

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌
ఇది ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన పథకం.  ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటే, ప్రతి నెల వడ్డీ ఆదాయాన్ని పోస్టల్‌ సేవింగ్‌ అకౌంట్‌లో జమ చేయడం జరుగుతంది.  దీనిపై 6.6 శాతం రేటు ప్రస్తుతం అమల్లో ఉంది. ఒక్కరు అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకే డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.  జాయింట్‌గా అయితే ఈ పరిమితి రూ.9 లక్షలుగా ఉంది.  

అనుకూలం/ప్రతికూలం 
బ్యాంకులతో పోలిస్తే కాస్తంత వడ్డీ రేటు ఇందులో ఎక్కువ. పైగా ఇందులో పెట్టుబడులకు భారత ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. కాకపోతే, బ్యాంకు డిపాజిట్ల మాదిరి సౌకర్యం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఉండదు. పోస్టాఫీసుకు వెళ్లే డిపాజిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఉపసంహరణకు కూడా వెళ్లాలి. వృద్ధులు, చిరునామా మారే వారికి ఇది అసౌకర్యం. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయంలో చూపించి చెల్లించాలి. ఐదేళ్లలోపు క్లోజ్‌ చేస్తే పెనాల్టీ పడుతుంది. బ్యాంకుల్లో ఎలాంటి పెనాల్టీలు ఉండవు.

కంపెనీల ఎన్‌సీడీలు 
కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. లేదంటే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుంచి కంపెనీల ఎన్‌సీడీలను షేర్ల మాదిరే కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్‌ ఖాతాలో జమ అవుతాయి. వడ్డీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటిల్లో వడ్డీ రేటు 6–11 శాతం మధ్య ఉంటుంది. ఎన్‌సీడీల కాల వ్యవధి 3–8 ఏళ్ల మధ్య ఉంటుంది. ఏఏఏ రేటెడ్‌ కలిగిన ఎన్‌సీడీల్లో పెట్టుబడులు పెట్టడం వరకే పరిమితం కావాలి. 

అనుకూలం/ప్రతికూలం 
బ్యాంకుల కంటే వడ్డీ రేటు ఎక్కువ. కానీ, ఎటువంటి హామీ ఉండదు. డీమ్యాట్‌ ఖాతా ఉంటే సులభంగా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే టీడీఎస్‌ పడదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో ఎన్‌సీడీల కొనుగోలు, విక్రయాల పరంగా లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. 

సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌  
డెట్‌ లేదా ఆర్బిట్రేజ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుని, ప్రతి నెలా నిర్ణీత మొత్తం లభించేలా సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై రాబడి బ్యాంకు డిపాజిట్ల స్థాయిలోనే 5–6 శాతం (వార్షిక) మధ్య ఉంటుందని అనుకోవచ్చు. మార్కెట్‌ పరిస్థితులు, పథకం పనితీరు ఆధారంగా స్వల్ప మార్పులు ఉండొచ్చు. కావాల్సిన ఆదాయం ప్రతి నెలా వచ్చేలా ఇన్వెస్టర్లు తమ స్వేచ్ఛకొద్దీ ఎస్‌డబ్ల్యూపీని నిర్ణయించుకోవచ్చు. రాబడి మేరకు తీసుకుంటే ఫర్వాలేదు. అది చాలదనుకుంటే పెట్టుబడి నుంచి కూడా కొంత మొత్తం తీసుకున్నట్టు అవుతుంది.  

అనుకూలం/ప్రతికూలం 
ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే పన్ను పరంగా ఇది మెరుగైన సాధనం. అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి అనుకూలం. పెట్టుబడి, ఉపసంహరణ అంతా సులభంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ అన్నవి డెట్, ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. రిస్క్‌ కొన్ని సందర్భాల్లో తప్పించి దాదాపుగా ఉండదు.  

యాన్యుటీ ప్లాన్లు 
బీమా కంపెనీలు యాన్యూటీ ప్లాన్లను ఆఫర్‌ చేస్తుంటాయి. ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తే నిర్ణీత రేటుపై ప్రతి నెలా ఇవి చెల్లింపులు చేస్తాయి. 60 ఏళ్లు దాటిన వారికి అయితే పెట్టుబడి పెట్టిన మరుసటి నెల నుంచి చెల్లింపులు చేసే ఇమీడియట్‌ యాన్యూటీ ప్లాన్లు, ఇంకా రిటైర్మెంట్‌కు సమయం ఉన్నవారి కోసం డిఫర్డ్‌ యాన్యూటీ ప్లాన్లు ఉన్నాయి. పెన్షన్‌ కోరుకునే వారు ఇమీడియట్‌ యాన్యూటీలను ఎంపిక చేసుకోవాలి. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు సైతం 60 ఏళ్లు వచ్చిన తర్వాత సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతమే వెనక్కి తీసుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యూటీ ప్లాన్‌ను తీసుకోవడం తప్పనిసరి. ఎల్‌ఐసీలో జీవన్‌ అక్షయ్‌ పెన్షన్‌ ప్లాన్, జీవన్‌ శాంతి యూన్యూటీ ప్లాన్లే. వీటిల్లో రాబడి 4–7 శాతం మధ్య ఉంటుంది.  

అనుకూలం/ప్రతికూలం 
యాన్యూటీ ప్లాన్ల కొనుగోలు సులభం. బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా ఆదాయం జమ అవుతుంది. ఇందులో ఆదాయానికి, పెట్టుబడికి పూర్తి గ్యారంటీ ఉంటుంది. యాన్యూటీ ప్లాన్‌ ఒక్కసారి కొనుగోలు చేశామంటే జీవితాంతం కొనసాగించాల్సిందే. బ్యాంకు ఎఫ్‌డీల కంటే రాబడి తక్కువ. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఇదేమంత ఆకర్షణీయమైన సాధనం కాదు.

రియల్‌ ఎస్టేట్‌ అద్దెలు 
అద్దెలు కూడా క్రమం తప్పకుండా ఆదాయ మార్గమే. నివాసం అయితే రాబడి 1–4 శాతం మధ్యే ఉంటుంది. వాణిజ్య ప్రాపర్టీ అయితే రాబడి 5–12 శాతం మధ్య ఉంటుంది.  

అనుకూలం/ప్రతికూలం 
ఏటేటా ఎంతో కొంత చొప్పున అద్దె ఆదాయం పెరుగుతుంది. కనుక ద్రవ్యోల్బణం నుంచి  రక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కేవలం ఆదాయం కోణంలోనే ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టలేము. ఎందుకంటే కావాల్సినప్పుడు వేగంగా అమ్ముకునే వెసులుబాటు అంతగా ఉండదు. ప్రాపర్టీ కొనుగోలుకు అధిక పెట్టుబడి అవసరం అవుతుంది.   

పన్ను ఆదా బాండ్లు.. 
అధిక ఆదాయపన్ను పరిధిలోని వారికి ఇవి మరింత అనుకూలం. పన్ను లేని ఆదాయాన్ని అందుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత కాలవ్యవధికి ముందు బాండ్లలోని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే కనుక, అప్పుటి వరకు పొందిన లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. గతంలో ఏటా ఈ బాండ్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసేది. గత కొన్నేళ్లుగా వీటి జారీ లేదు. సెకండరీ మార్కెట్‌ నుంచి (డీమ్యాట్‌ ఖాతా ఉన్నవారు) కొనుగోలు చేసుకోవచ్చు. రాబడి 6–6.50 శాతం శ్రేణిలో వస్తుంది.   

అనుకూలం/ప్రతికూలం 
వడ్డీ ఆదాయంపై పన్ను లేకపోవడం సానుకూలం. బ్యాంకు ఎఫ్‌డీలకు తగ్గకుండా ఆదాయం ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లలో వస్తుంది. అదే బ్యాంకు ఎఫ్‌డీల ఆదాయం అయితే పన్ను పరిధిలోకి వస్తుంది. దీర్ఘకాలం పాటు ఇందులో పెట్టుబడులు కొనసాగించాల్సి రావడం అందరికీ అనుకూలం కాకపోవచ్చు. ముందే తీసుకుంటే వడ్డీ ఆదాయంపై పన్ను పడుతుంది. ఈ బాండ్లలో ఎక్కువ వాటికి వార్షికంగా చెల్లింపులు చేసే ఆప్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఇది ప్రతికూలం. సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. 

కొంత రిస్క్‌ తీసుకునే వారికి
రిస్క్‌ తీసుకునే వారు అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో వీటిల్లో రాబడులు వార్షికంగా 12 శాతం వరకు ఉన్నాయి. దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న పథకాల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వీటిల్లో ఏకమొత్తంలో కాకుండా.. ఆరు నుంచి 12 నెలసరి వాయిదాల్లో తమవద్దనున్న కార్పస్‌ను ఇన్వెస్ట్‌ చేసుకుని, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ ద్వారా ఉపసంహరించుకోవచ్చు.  

అనుకూలం/ప్రతికూలం 
అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ 25% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక ఈ మేరకు అధిక రాబడికి అవకాశం ఉంటుంది.  ఈక్విటీ మార్కెట్ల దిద్దుబాటు సమయాల్లో పెట్టుబడిని కాపాడుకునేందుకు ఉపసంహరణను కొంత వరకు తగ్గించుకోవాల్సి రావచ్చు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌ ఎంతో పాపులర్‌ పథకం. 60 ఏళ్లు నిండిన వారు ఇందులో డిపాజిట్‌ చేసుకోగలరు. 55 ఏళ్లు నిండి, పదవీ విరమణ తీసుకున్న వారు కూడా అర్హులే. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. డిపాజిట్‌ కాల వ్యవధి ఐదేళ్లు. ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇది బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ. ఈ రేటు ప్రకారం ప్రతి మూడు నెలలకు (ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిలో) వడ్డీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వృద్ధులకు క్రమం తప్పకుండా ఆదాయన్ని ఇచ్చే సంప్రదాయ సాధనాల్లో ఇది మెరుగైనది.  

అనుకూలం/ప్రతికూలం 
ఇందులో పెట్టుబడికి ఎటువంటి రిస్క్‌ లేదు. భారత ప్రభుత్వం హామీనిస్తుంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌లో పెట్టుబడిని సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కోరొచ్చు. భార్యా, భర్త వేర్వేరు ఖాతాలను తెరవొచ్చు. పోస్టాఫీసులే కాకుండా బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయడమే సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవడం సులభం. ఇందులో ఆదాయంపై టీడీఎస్‌ అమలవుతుంది. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఫామ్‌ 15జీ/హెచ్‌ ఇస్తే టీడీఎస్‌ మినహాయించరు.

ప్రధానమంత్రి వయవందన యోజన 
 2017 మే నుంచి అందుబాటులోకి వచ్చిన పథకం ఇది. ఎల్‌ఐసీ దీన్ని నిర్వహిస్తోంది. ఒకే విడత ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే పదేళ్ల పాటు ఆదాయం అందుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో నెలవారీ చెల్లింపు ఆప్షన్‌పై 7.40 శాతం వార్షిక రేటు చెల్లిస్తున్నారు. 2023 మార్చి 31 వరకు ఇన్వెస్ట్‌ చేస్తే, పదేళ్ల పాటు ఇదే రేటు అమల్లో ఉంటుంది.  

అనుకూలం/ప్రతికూలం 
బ్యాంకు సాధనాలతో పోలిస్తే ఇందులో అధిక రేటు అమల్లో ఉంది. పదేళ్ల కాలానికి ఒక్కటే రేటు ఉండడం వల్ల ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. బీమా కంపెనీలు అందించే పెన్షన్‌ ప్లాన్లతో పోల్చినా ఇందులోనే రాబడి ఎక్కువ. యాన్యుటీ ప్లాన్లతో పోలిస్తే నూరు శాతం ఇదే మెరుగైనది. ప్రభుత్వం తరఫున ఎల్‌ఐసీ దీన్ని నిర్వహిస్తోంది కనుక ఇందులో పెట్టుబడికి రిస్క్‌ ఉండదు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం చెల్లించే ఆప్షన్‌ ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే దీన్ని స్వాధీనం చేసి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో పెట్టుబడి విలువపై 75 శాతానికి సమానంగా రుణాన్ని ఎప్పుడైనా పొందొచ్చు. దీంతో అత్యవసరాల్లో సాయపడుతుంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకోగలరు. ఈ మొత్తంపై ప్రతి నెలా రూ.9,250 పెన్షన్‌ వస్తుంది. 

కంపెనీల డిపాజిట్లు 
బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు, కంపెనీలు సైతం ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తుంటాయి. వీటిల్లో అధిక క్రెడిట్‌ రేటింగ్‌ కలిగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. 6–9 శాతం మధ్య వీటిల్లో వడ్డీ రేటు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్స్‌కు సహజంగా అర శాతం అధిక రేటు లభిస్తుంది. ఈ డిపాజిట్ల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు 10 ఏళ్ల డిపాజిట్లను కూడా ఆఫర్‌ చేస్తున్నాయి.  

అనుకూలం/ప్రతికూలం 
సాధారణంగా బ్యాంకులతో పోలిస్తే అదనపు రేటును ఇవి ఆఫర్‌ చేస్తుంటాయి. ఇవి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే 9 శాతానికి పైనే చెల్లించాల్సి వస్తుంది. అందుకుని ప్రజలకు సైతం మెరుగైన రేటును ఆఫర్‌ చేస్తాయి. వీటిల్లో డిపాజిట్‌ పూర్తిగా రిస్క్‌తో కూడినదే. ఎందుకంటే పెట్టుబడికి, వడ్డీకి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఇందులో వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 మించితే 10 శాతం టీడీఎస్‌ అమలవుతుంది. పన్ను పరిధిలో లేని వారు ఫామ్‌ 15జీ/హెచ్‌ సమర్పించి టీడీఎస్‌ లేకుండా చూసుకోవచ్చు. కాల వ్యవధిలోపు తీసుకుంటే పెనాల్టీ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్‌ చేసే ముందు పెనాల్టీ నిబంధన చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

రివర్స్‌ మార్ట్‌గేజ్‌ 
ఇంటిని తనఖా పెట్టి పొందే రుణం ఇది. ఈ మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. ప్రతి నెలా నిర్ణీత మొత్తం మీకు లభించేలా బ్యాంకుతో ఒప్పందం చేసుకోవచ్చు. ఇది ఈఎంఐకి రివర్స్‌ మాదిరి పనిచేస్తుంది. బ్యాంక్‌లు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు దీన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. కోరుకున్నప్పుడు తీసుకున్న మొత్తం, దానిపై వడ్డీ చెల్లించి మార్ట్‌గేజ్‌ను ఉపసంహరించుకోవచ్చు. లేదంటే తమ తదనంతరం వారసులకు దీన్ని బదిలీ చేయవచ్చు.    

అనుకూలం/ప్రతికూలం 
రూ.50 లక్షల నుంచి కోటి వరకు పొందడానికి ఉంటుంది. ఎక్కువ బ్యాంక్‌లు 20 ఏళ్ల కాలానికి రివర్స్‌ మార్ట్‌గేజ్‌ను అందిస్తున్నాయి. 60 ఏళ్లు నిండిన వారికే ఈ సదుపాయం. మార్ట్‌గేజ్‌ కింద ఇంటిని బ్యాంకుకు తనఖా పెట్టి రుణం పొందుతున్నా కానీ, అదే ఇంట్లో నివసించొచ్చు. తమ తదనంతరం వారసులు ఈ మొత్తాన్ని చెల్లించి బ్యాంకుల నుంచి ఇల్లు తమ పేరిట స్వాధీనం చేసుకోవచ్చు. వద్దనుకుంటే బ్యాంకు సదరు తనఖాలో ఇంటిని విక్రయించి, అప్పటి వరకు చెల్లించిన మొత్తం, దానిపై వడ్డీని మిహాయించుకుంటుంది. ఇది పోను మిగులు ఏమైనా ఉంటే వారసులకు ఇస్తుంది. రుణంపై జీవించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే బ్యాంకు నుంచి అప్పటి వరకు పొందిన మొత్తంపై వడ్డీ కూడా చెల్లించుకోవాలి. 

 ప్రభుత్వ సెక్యూరిటీలు 
ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ జారీ చేస్తుంటుంది. రిటైలర్ల కంటే ఎక్కువగా ఇనిస్టిట్యూషన్స్‌ ఈ సాధనంలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ బాండ్ల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది. వడ్డీని ప్రతి ఆరు నెలలకు చెల్లిస్తారు. రాబడి 5–7 శాతం మధ్య ఉంటుంది.  

అనుకూలం/ప్రతికూలం 
పెట్టుబడికి, రాబడికి ఏ మాత్రం రిస్క్‌ ఉండదు. ఆర్‌బీఐ వద్ద రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంట్‌ ప్రారంభించి ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసుకోవచ్చు. టీడీఎస్‌ అమలు కాదు. వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement