
దశలవారీగా 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 5,057 కోట్లు జమ
మరో 13 లక్షల మందికి రూ.4 వేల కోట్లమేర పెండింగ్
2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా వారికి జమపై సందేహాలు
ఏ పద్దు కింద పెట్టుబడి సాయం అందిస్తారనే విషయంలో లేని స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం నిధుల కొరత కారణంగా క్రమక్రమంగా అమలవుతోంది. ఎకరాకు రూ. 6 వేలు చెల్లించే కార్యక్రమాన్ని జనవరి 26న లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం.. రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమచేస్తోంది.
జనవరి 27న అన్ని మండలాల్లోని 577 గ్రామాల్లోని సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసాను జమ చేసిన ప్రభుత్వం.. ఆ తరువాత మూడు విడతల్లో కలిపి 3 ఎకరాల్లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రూ. 3,487.82 కోట్లను జమ చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు మరో రూ.1,500 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రాష్ట్ర ఖజానా పరిస్థితి, నిధుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ. 5,057 కోట్లను జమ చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ లెక్కన 84.28 లక్షల ఎకరాలకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు జమచేసినట్లు తెలుస్తోంది. సుమారు 57 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
మిగతా వారికి ఎలా?
ప్రభుత్వం ఇంకా సుమారు మరో 13 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 4 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఖజానా నుంచి 2–3 రోజులకోసారి రూ. 100 కోట్లకుపైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు రైతుభరోసా నిధులు పడ్డాయనే కచి్చతమైన సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోవడం గమనార్హం.
అయితే గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద వచ్చిన నిధుల లెక్కలను బట్టి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు గల భూములకు రైతుభరోసా డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో మిగతా వారికి ఏ సంవత్సరం పద్దు కింద పెట్టుబడి సాయం అందజేస్తారనే విషయంలో స్పష్టత లేదు.
యాసంగి కోతలు మొదలైనా తప్పని నిరీక్షణ
రాష్ట్రంలో యాసంగి కోతలు మొదలయ్యాయి. నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన 44 కొనుగోలు కేంద్రాల ద్వారా 183 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చి నెలాఖరు వరకే కొనుగోలు చేశారు. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నారు.
ఒకవైపు యాసంగి కోతలు మొదలై పంట చేతికి వస్తున్నప్పటికీ ఇంకా రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి కోతలు పూర్తయితే జూన్ నుంచి వానాకాలం పంటసాగు మొదలవనుంది. ఇప్పటికే మరో రూ. 4 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా వచ్చే వానాకాలం సాగుకు ఆర్థికసాయం సకాలంలో అందే అవకాశాలు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొర్రీలతో చాలా మంది రైతులకు ఆగిన సాయం
రైతుభరోసా కింద సాగుయోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో చాలా గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. రీసర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)లో ఉన్న భూవిస్తీర్ణంకన్నా రైతుల పాస్ పుస్తకాల్లో ఎక్కువుంటే ఆ సర్వే నంబర్‌లోని రైతులకు డబ్బులు పడలేదు. దీనిపై ఫిర్యాదులతో సమస్య పరిష్కారం అయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ చాలా జిల్లాల్లో ఆ సమస్య పెండింగ్‌లోనే ఉంది.
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అధిక మొత్తంలో పొందేందుకు కొందరు రైతులు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూవిస్తీర్ణాన్ని పెంచడమే అందుకు కారణమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయ భూముల్లో సొంత ఇళ్లు ఉన్నవారికి కూడా ఆయా సర్వే నంబర్లలోని భూములను రైతుభరోసాకు మినహాయించారు. స్కూళ్లు, కళాశాలలు, రైస్ మిల్లులు, కోళ్ల ఫారాల వంటి వాణిజ్య కార్యకలాపాలు ఉన్న భూముల సర్వే నంబర్లలో వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలాచోట్ల రైతుభరోసా జమకాలేదు.
కొన్ని గ్రామాల్లో ఒకే సర్వే నంబర్‌లో ఉన్న ఒక రైతుకు రైతుభరోసా సాయం అందితే పక్కనున్న మరో రైతుకు డబ్బు జమకాలేదు. అలాగే భూ లావాదేవీల్లో కొత్తగా భూమి పట్టా అయి పాస్‌పుస్తకం వచ్చిన వారికి కూడా చాలా చోట్ల డబ్బులు జమకాలేదు. ఇలాంటి సమస్యలు ఎందుకొచ్చాయో తెలియట్లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం.