యజమాని ఇచ్చే బీమాతో సరా..! | Health insurance | Sakshi
Sakshi News home page

యజమాని ఇచ్చే బీమాతో సరా..!

Published Mon, Nov 2 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

యజమాని ఇచ్చే బీమాతో సరా..!

యజమాని ఇచ్చే బీమాతో సరా..!

శ్రీధర్‌ది ప్రైవేటు ఉద్యోగం. మంచి జీతం. కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఎప్పుడూ సొంత ఆరోగ్య బీమా గురించి ఆలోచించలేదు. అయితే ఉన్నట్టుండి కంపెనీ అతన్ని తొలగించింది. ఈ వార్త పిడుగుపాటులా తాకటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా... ఈ కుంగుబాటుతో ఆరోగ్యం దెబ్బతింది. ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తలెత్తింది అసలు సమస్య. ఆసుపత్రిలో నాలుగైదు రోజులు ఉంచటం... పరీక్షలన్నీ చేయటం, ట్రీట్‌మెంట్... వీటన్నిటికీ రూ.2 లక్షల దాకా అయింది. అంతకు ముందైతే కంపెనీ హెల్త్ పాలసీ ఉండేది కనక ఎన్నడూ ఇబ్బంది అనిపించలేదు.

కానీ ఉద్యోగం పోవటం... ఆదాయం లేకపోవటం... అదే సమయంలో ఆసుపత్రి పాలవటం అన్నీ కలిసి శ్రీధర్‌ను నానా ఇబ్బందులూ పెట్టాయి. బంధుమిత్రుల సాయంతో బయటపడ్డా... కంపెనీ ఇస్తున్నది కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఎంత అవసరమో అప్పుడు తెలిసొచ్చింది శ్రీధర్‌కు.


నిజానికిపుడు చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ ఇస్తున్న ఆరోగ్య బీమా పాలసీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ బీమా సరిపోతుంది కదా! ఇంకెందుకు మరొకటి? అనేది వారి ఆలోచన. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది. గడిచిన మూడేళ్లుగా చాలా సంస్థలు ఉద్యోగుల తల్లిదండ్రుల బీమా కవరేజీకి వచ్చేసరికి వారి నుంచి కూడా కొంత పేమెంట్ ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగ్గట్టుగా ఇవి కవరేజీ పెంచటం లేదు. ఇటీవల ఓ బీమా కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైందేంటంటే... 2008 నుంచి భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న మెడిక్లెయిమ్ ప్రీమియం పెరగటమే లేదు. అయితే తగ్గటం, లేకపోతే అదే స్థాయిలో ఉండటం జరుగుతోంది.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలు పెడుతున్న ఖర్చులో 10 శాతమే ఇక్కడి కంపెనీలు వెచ్చిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెపైచ్చు 2008లో మాంద్యం పరిస్థితులు నెలకొన్న తరవాత నుంచి ఇవి ఆ ఖర్చులను కూడా కుదించటం మొదలుపెట్టాయి. బీమా ప్రీమియంలలో కోత పెట్టాయి. దీంతో 20 నుంచి 25 శాతం ఉద్యోగులు తమ మెడిక్లెయిమ్ పాలసీలకు అదనంగా టాప్ అప్ చేసుకుంటున్నారు.
 
 
వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి
* కంపెనీ పాలసీలో కవరేజీ మొత్తం అంతంతే
* వ్యక్తిగత, గ్రూప్ టాప్-అప్‌లూ చేయించుకోవచ్చు
* సొంత హెల్త్ ప్లాన్, క్రిటికల్ ఇల్‌నెస్, ప్రమాద బీమాతో ధీమా
 
పెరుగుతున్న నియంత్రణలు...
చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ బీమా కవరేజీలపై ఆంక్షలు పెడుతున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ తాజా నివేదిక ప్రకారం 76 శాతం కంపెనీలు కో-పేమెంట్ నిబంధనను పాటించటమే కాక ఆసుపత్రుల్లో గది అద్దెపై పరిమితి విధిస్తున్నాయి. సగటున చూస్తే ఇవి ఉద్యోగులకు అందిస్తున్న బీమా కవరేజీ మొత్తం లక్ష నుంచి లక్షన్నర దాటడం లేదు. ‘‘దురదృష్టవశాత్తూ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి వారం రోజుల పాటు ఉన్నారనుకోండి. మీ ఆసుపత్రి బిల్లు భారీగా పెరిగిపోయే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో కంపెనీ ఇస్తున్న కవరేజీ సరిపోదు.

అందుకని మీ వార్షిక ఆదాయానికి సమానమైన సొంత ఆరోగ్య బీమా కవరేజీ తప్పక ఉండి తీరాలి. దానికి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్, వ్యక్తిగత ప్రమాద బీమా జత చేయాలి’’ అనేది పాలసీ బజార్ సీఈఓ యాశిష్ దహియా మాట. నిజానికి కంపెనీ ఇస్తున్న కవరేజీ చాలకపోవటం అనేది ఒక్కటే కాదు. కంపెనీ ఆఫర్ చేస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని దాటిపోయినా, లేక మీరు తరచు ఉద్యోగాలు మారుతున్నా కూడా... మీకు ప్రత్యేక ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే.
 
ఏడాదికి రూ.9 వేలలోనే అన్నీ...
ఒకవేళ విడిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామనుకుంటే... ముఖ్యంగా చూడాల్సింది అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి వారు పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్ ఎంత? మెటర్నిటీ ప్రయోజనాలున్నాయా? క్యాష్‌లెస్ ఫెసిలిటీ  కల్పించే ఆసుపత్రులెన్ని? వంటివి. నిజానికి 30 ఏళ్ల వ్యక్తి గనక రూ.5 లక్షల బీమా కవరేజీ, రూ.10 లక్షల క్రిటికల్ ఇల్‌నెస్, రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా... వీటన్నిటికీ కలిసి ఏడాదికి రూ.9 వేలు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాగంటే... రూ.5 లక్షల రెలిగేర్ కేర్ హెల్త్ కవర్‌కు ఏడాదికి రూ.5,162 అవుతుండగా, బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.3వేలు, ఐసీఐసీఐ లాంబార్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.1,221 ఖర్చవుతోంది. కాకపోతే వ్యక్తిగత బీమాకు కొన్ని పరిమితులుంటాయి. కంపెనీ ఇస్తున్న గ్రూప్ బీమా కవరేజీ అయితే అప్పటికే ఉన్న వ్యాధుల్ని, మెటర్నిటీ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలైతే అప్పటికే ఉన్న వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

అది కంపెనీని బట్టి మారుతుంది.  కవరేజీని పెంచుకోవాలనుకుంటే టాప్ అప్ ప్లాన్‌నూ పరిశీలించొచ్చు. కొన్ని కంపెనీలు గ్రూప్ టాప్-అప్‌లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటిని మీరు పనిచేస్తున్న కంపెనీ ఆఫర్ చేస్తున్న బీమా సంస్థ దగ్గరే కొనుగోలు చే యొచ్చు. ఇలాంటప్పుడు గ్రూప్ టాప్-అప్ అనేది కంపెనీ ఇస్తున్న పథకానికి జతగా ఉంటుందో లేదో చూడాలి.

ఇక వ్యక్తిగత టాప్-అప్‌లనేవి కొంత ఖరీదే. వీటిని ఎంచుకునే ముందు వాటి షరతులనూ చూడాలి. మరికొన్ని కంపెనీలు నిర్దిష్ట మొత్తానికి సొంత ఆరోగ్య బీమా ఉంటే తప్ప టాప్ అప్ చేయలేమని, కవరేజీ మొత్తాన్ని ఏకకాలంలో ఉపయోగించుకున్న తరవాతే టాప్ అప్ వర్తిస్తుందని షరతులు పెడుతున్నాయి. కనుక చిన్న వయసులో ఉన్నపుడే వ్యక్తిగత ఆరోగ్య బీమా  తీసుకుంటే తక్కువ ధరకే రావటం తో పాటు మరిన్ని వ్యాధులు కవరయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement