ఒవేరియన్ కెపాసిటీ తగ్గడం అంటే...? | Overiyan capacity is diminished ...? | Sakshi
Sakshi News home page

ఒవేరియన్ కెపాసిటీ తగ్గడం అంటే...?

Published Thu, Dec 17 2015 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

Overiyan capacity is diminished ...?

నెఫ్రాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 40 ఏళ్లు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల నాకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటే వైద్యులను సంప్రదించాను. నాకు పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్ చేస్తారేమో అనే భయంతో మళ్లీ వైద్యుల దగ్గరకు వెళ్లలేదు. కానీ మూత్ర విసర్జన సమయంలో వస్తున్న నొప్పిని భరించలేకపోతున్నాను. అసలు కిడ్నీలో రాళ్లు సమస్య ఎందుకు వస్తుంది? ఈ సమస్యకు తప్సనిసరిగా ఆపరేషన్ చేస్తారా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
 - విజయ్ కుమార్, కర్నూలు

 మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని తెలిపారు. మీరు ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కిడ్నీ రాళ్ల సమస్యకు ప్రస్తుతం అత్యాధునికమైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. మూత్రపిండాళ్లో మూత్రం తయారయ్యే ప్రాంతంలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వాస్తవానికి ఇవి రాళ్లు కావు. మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్ ఘనీభవించి స్పటికంలా మారతాయి. వీటినే కిడ్నీ రాళ్లు అని అంటారు. వీటి పరిమాణం చిన్నగా ఉంటే ఆ రాళ్లు మూత్రంతో పాటే శరీరం నుంచి విసర్జించబడతాయి. కానీ ఈ రాళ్ల పరిమాణం పెద్దగా ఉంటే మాత్రం మూత్ర విసర్జనకు అడ్డుపడుతూ భరించలేని నొప్పి, బాధ కలిగిస్తుంటాయి. ఈ సమస్య ఉన్నవారికి అధునాతన రొబాటిక్ లేజర్ చికిత్స ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సులువుగా రాళ్లను కరిగించవచ్చు. ఈ విధానంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడిన ప్రాంతానికే లేజర్ కిరణాలు చొచ్చుకుని వెళ్లి ఆ రాళ్లనుగులగొడతాయి.లాగిలిపోయిన రాళ్లు మూత్ర విసర్జన ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఎలాంటి కోత లేకుండా నిర్వహించే ఈ అధునాతన ప్రక్రియలో నొప్పి, బాధ ఉండదు. లోకల్ అనస్థీషియా ఇచ్చి రోగి స్పహలో ఉండగానే లేజర్ చికిత్స నిర్వహిస్తారు. ఈ విధానంలో రోగి త్వరితగతిన కోలుకోవడంతో పాటు చికిత్స అనంతరం సాధారణ జీవితం గడపగలుగుతారు. కాబట్టి మీరు మాత్రం సంకోచించకుండా నిరభ్యంతరంగా చికిత్స చేయించుకోవచ్చు. వైద్యులను సంప్రదించకుండా వాయిదా వేస్తూ వస్తే మాత్రం సమస్య మరింత తీవ్రవయ్యే అవకాశం ఉంటుంది.
 
డాక్టర్ కె. సాయిరాం రెడ్డి
సీనియర్ నెఫ్రాలజిస్టు మరియు
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ, హైదరాబాద్
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
 
నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి. దీనికి తగిన చికిత్స సూచించగలరు.
 - సువర్చల, గుంటూరు

 సాధారణంగా యువతీయువకుల కౌమార దశలో మొటిమలు వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్ చేయని చేతులు వంటి భాగాలు కూడా  నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి.
 - ఆమని, కోరుకొండ

 శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి...సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే  మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి   సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్‌పీఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి      సాధారణంగా మీరు ఫుల్‌స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది  గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి  పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి.
 
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి
హైదరాబాద్
 
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
 
నా వయసు 39 ఏళ్లు. నా భర్తకు 40 ఏళ్లు.     మా ఇద్దరి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది. పెళ్లయిన నాటి నుంచీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. గత వారం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాం. ఆమె కొన్ని పరీక్షలు నిర్వహించి నా అండాశయాల సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) తక్కువగా ఉందని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? నాకు పిల్లలు పుడతారా? ఒవేరియన్ కెపాసిటీ తగ్గడానికి కారణాలు ఏమిటి? ప్రస్తుతం నేను చేయాల్సిందేమిటి? వివరంగా చెప్పండి.
 - ఉషారాణి, విశాఖపట్నం

ఒవేరియస్ సామర్థ్యం తగ్గిందంటే... మీ వయసు ఉన్న ఇంకో మహిళకు ఇవే మందులు వాడినా... వాటికి స్పందించే తీరు కాస్త తగ్గవచ్చు.  అంటే... సంతాన సాఫల్యం కోసం ఒకే వయసు ఉన్న ఇద్దరు మహిళలకు ఒకేలాంటి చికిత్స చేసినా... అది సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు వేర్వేరుగా ఉండవచ్చు. అంతమాత్రాన ఒవేరియన్ కెపాసిటీ తగ్గినవారు గర్భం ధరించడం సాధ్యం కాదని చెప్పడం కూడా  సరికాదు. సాధారణంగా ఇలా ఒవేరియన్ కెపాసిటీ తగ్గడానికి కారణాలు పెద్దగా తెలియదు. అయితే సంతాన సాఫల్యం విషయంలో వయసు కీలకమైన భూమికను పోషిస్తుంది. సాధారణంగా చాలా సందర్భాల్లో వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా  మీలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్ రిజర్వ్) తెలుసుకుంటారు. ఆ ‘ఒవేరియన్ రిజర్వ్’ పరీక్ష ద్వారా మీకు సరైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయించవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక మీ వయసులో అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. పైగా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని, మీ సంతాన సాఫల్య నిపుణులను సంప్రదించండి.     వారితో ఈ విషయాలను చర్చించండి.
 
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement