the operation
-
ఒవేరియన్ కెపాసిటీ తగ్గడం అంటే...?
నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల నాకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటే వైద్యులను సంప్రదించాను. నాకు పరీక్షలు నిర్వహించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్ చేస్తారేమో అనే భయంతో మళ్లీ వైద్యుల దగ్గరకు వెళ్లలేదు. కానీ మూత్ర విసర్జన సమయంలో వస్తున్న నొప్పిని భరించలేకపోతున్నాను. అసలు కిడ్నీలో రాళ్లు సమస్య ఎందుకు వస్తుంది? ఈ సమస్యకు తప్సనిసరిగా ఆపరేషన్ చేస్తారా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. - విజయ్ కుమార్, కర్నూలు మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని తెలిపారు. మీరు ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కిడ్నీ రాళ్ల సమస్యకు ప్రస్తుతం అత్యాధునికమైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. మూత్రపిండాళ్లో మూత్రం తయారయ్యే ప్రాంతంలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వాస్తవానికి ఇవి రాళ్లు కావు. మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్ ఘనీభవించి స్పటికంలా మారతాయి. వీటినే కిడ్నీ రాళ్లు అని అంటారు. వీటి పరిమాణం చిన్నగా ఉంటే ఆ రాళ్లు మూత్రంతో పాటే శరీరం నుంచి విసర్జించబడతాయి. కానీ ఈ రాళ్ల పరిమాణం పెద్దగా ఉంటే మాత్రం మూత్ర విసర్జనకు అడ్డుపడుతూ భరించలేని నొప్పి, బాధ కలిగిస్తుంటాయి. ఈ సమస్య ఉన్నవారికి అధునాతన రొబాటిక్ లేజర్ చికిత్స ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సులువుగా రాళ్లను కరిగించవచ్చు. ఈ విధానంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడిన ప్రాంతానికే లేజర్ కిరణాలు చొచ్చుకుని వెళ్లి ఆ రాళ్లనుగులగొడతాయి.లాగిలిపోయిన రాళ్లు మూత్ర విసర్జన ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఎలాంటి కోత లేకుండా నిర్వహించే ఈ అధునాతన ప్రక్రియలో నొప్పి, బాధ ఉండదు. లోకల్ అనస్థీషియా ఇచ్చి రోగి స్పహలో ఉండగానే లేజర్ చికిత్స నిర్వహిస్తారు. ఈ విధానంలో రోగి త్వరితగతిన కోలుకోవడంతో పాటు చికిత్స అనంతరం సాధారణ జీవితం గడపగలుగుతారు. కాబట్టి మీరు మాత్రం సంకోచించకుండా నిరభ్యంతరంగా చికిత్స చేయించుకోవచ్చు. వైద్యులను సంప్రదించకుండా వాయిదా వేస్తూ వస్తే మాత్రం సమస్య మరింత తీవ్రవయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ కె. సాయిరాం రెడ్డి సీనియర్ నెఫ్రాలజిస్టు మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి. దీనికి తగిన చికిత్స సూచించగలరు. - సువర్చల, గుంటూరు సాధారణంగా యువతీయువకుల కౌమార దశలో మొటిమలు వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్ చేయని చేతులు వంటి భాగాలు కూడా నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి. - ఆమని, కోరుకొండ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి...సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్పీఎఫ్ ఉండే సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 39 ఏళ్లు. నా భర్తకు 40 ఏళ్లు. మా ఇద్దరి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది. పెళ్లయిన నాటి నుంచీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం. గత వారం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాం. ఆమె కొన్ని పరీక్షలు నిర్వహించి నా అండాశయాల సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) తక్కువగా ఉందని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? నాకు పిల్లలు పుడతారా? ఒవేరియన్ కెపాసిటీ తగ్గడానికి కారణాలు ఏమిటి? ప్రస్తుతం నేను చేయాల్సిందేమిటి? వివరంగా చెప్పండి. - ఉషారాణి, విశాఖపట్నం ఒవేరియస్ సామర్థ్యం తగ్గిందంటే... మీ వయసు ఉన్న ఇంకో మహిళకు ఇవే మందులు వాడినా... వాటికి స్పందించే తీరు కాస్త తగ్గవచ్చు. అంటే... సంతాన సాఫల్యం కోసం ఒకే వయసు ఉన్న ఇద్దరు మహిళలకు ఒకేలాంటి చికిత్స చేసినా... అది సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు వేర్వేరుగా ఉండవచ్చు. అంతమాత్రాన ఒవేరియన్ కెపాసిటీ తగ్గినవారు గర్భం ధరించడం సాధ్యం కాదని చెప్పడం కూడా సరికాదు. సాధారణంగా ఇలా ఒవేరియన్ కెపాసిటీ తగ్గడానికి కారణాలు పెద్దగా తెలియదు. అయితే సంతాన సాఫల్యం విషయంలో వయసు కీలకమైన భూమికను పోషిస్తుంది. సాధారణంగా చాలా సందర్భాల్లో వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా మీలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్ రిజర్వ్) తెలుసుకుంటారు. ఆ ‘ఒవేరియన్ రిజర్వ్’ పరీక్ష ద్వారా మీకు సరైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయించవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక మీ వయసులో అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. పైగా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని, మీ సంతాన సాఫల్య నిపుణులను సంప్రదించండి. వారితో ఈ విషయాలను చర్చించండి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్ రోడ్ నెం. 1, బంజారాహిల్స్ హైదరాబాద్ -
రక్తసంబంధాలు కావాలి
వారానికోసారి దేవాలయాలకు వెళుతుంటాం. కేలండర్ ప్రకారం క్రమం తప్పకుండా పండుగలు, పబ్బాలు చేసుకుంటాం. ఇలాంటి పనులను ఎవరూ చెప్పకపోయినా మనం విధిగా చేసేస్తూనే ఉంటాం. అంతే విధిగా రక్తదానం కూడా చేస్తే సమాజానికి మేలు చేసిన వాళ్లమవుతాం. మన దేశంలో రక్తానికి కొరత ఉంది. ఆ కొరత తీరడానికి మనం ఒక చెయ్యి ఇవ్వాలి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టమూ ఉండదు. రక్తదానం చేయకపోయినా మన ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదు. కాకపోతే సమాజం ఆరోగ్యమే కుంటుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రండి. నిండు ప్రాణాలను నిలబెట్టామనే ఆత్మతృప్తి పొందండి. దేహంలో జీవనదిలా రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే యాక్సిడెంట్ కావచ్చు, అత్యవసరమైన ఆపరేషన్ కావచ్చు, ఇలాంటి కారణమేదైనా కావచ్చు.. ఒంట్లోని రక్తం అనివార్యంగా బయటకుపోయే విపత్కర పరిస్థితి ఒక్కోసారి తలెత్తుతుంది. అప్పుడు రక్తం అవసరం అవుతుంది. రక్తాన్ని రక్తంతో భర్తీ చేయాల్సిందే! రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే రక్తదానం అవసరమవుతోంది. అయితే మన దేశంలో రోగుల అవసరాలకు తగిన స్థాయిలో రక్తం అందుబాటులో ఉండడం లేదు. తగినన్ని బ్లడ్‌బ్యాంకులు లేకపోవడం, రక్తదానంపై జనంలో ఉన్న అపోహలు కూడా ఈ పరిస్థితికి కారణమే. రక్తం ఎందుకు అవసరం? ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్‌గా మారాక అన్ని కణాలకూ ఆ ఆహారాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్‌తో పాటు అమినోయాసిడ్స్, ఫాటీయాసిడ్స్నూ కణాలన్నింటికీ అందజేస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ వల్ల శరీరంలో శక్తిని ఇచ్చే జీవక్రియలు జరుగుతాయి. ఈ క్రమంలో కార్బన్-డై-ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచే మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసేది కూడా రక్తమే. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి. ఈ కీలకమైన కార్యకలాపాలన్నీ నిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని కట్టడి చేయడానికి మన శరీరం కృషి చేస్తుంది. రక్తస్రావం మొదలుకాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపుతుంది. రక్తస్రావం జరుగుతున్నప్పుడు జీవి మనుగడ సాగించేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. అయితే హెచ్ఐవీ, హెపటైటిస్ వైరస్ ఉన్నవారు ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రక్తదానానికి అర్హులు కాదు. మిగతా ఆరోగ్యవంతులెవరైనా రక్తదానం చేయవచ్చు. రక్తాన్ని ఎవరి దగ్గరకు వెళ్లి ఇవ్వాలి? మన రెండు రాష్ట్రాలలో... దాతల నుంచి రక్తం సేకరించే పనిని అన్ని ప్రభుత్వ, వైద్యవిధాన పరిషత్, జిల్లా ఆసుపత్రులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ (ఐఆర్సీఎస్), లయన్, రోటరీ వంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలవి కలుపుకొని (2012 నాటి లెక్కల ప్రకారం) సుమారు 250 బ్లడ్‌బ్యాంకులున్నాయి. రక్తంలోని ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ వంటి అంశాలను వేర్వేరుగా విడదీసే ‘కాంపోనెంట్ సపరేషన్ యూనిట్లు’ కూడా ఉన్నాయి. అయితే ఇలా రక్తంలోని కాంపొనెంట్లను వేటికవి విడదీసే వాటికంటే మొత్తం రక్తాన్ని సేకరించే బ్లడ్‌బ్యాంకులే ఎక్కువ. ఓసారి సేకరించిన రక్తం కేవలం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ కాలపరిమితి దాటిన రక్తాన్ని రోగికి అందకుండా తనిఖీలు జరుగుతుంటాయి. ఒకవైపు సేకరించిన రక్తానికి జీవితకాలం లేక వృథా అవడం, మరోవైపు రక్తదానం పట్ల అవగాహన లేకపోవడంతో సమస్య పెరుగుతోంది. రక్తంలో ఏ భాగం ఎవరికి అవసరం? ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్‌బ్లడ్) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అవసరం లేని కాంపోనెంట్స్ కూడా శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. కానీ... ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా రక్తంలోని అదే కాంపోనెంట్‌ను ఎక్కిస్తే, తక్కిన కాంపోనెంట్స్ మిగతావారికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీనత ఎక్కువగా ఉన్న వ్యక్తికి పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూలాంటి వ్యాధి సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్లెట్లు ఎక్కిస్తే చాలు. ప్లాస్మా, పాకెట్ ఆర్బీసీ, ప్లేట్లెట్లు అని విడదీసి వాడుతారు. ఆ విధంగా ప్రతి రక్తపు బొట్టు ముగ్గురికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ కొరతగానే ఉంది! మన దగ్గర రక్తానికి ఉన్న డిమాండ్ కంటే సప్లై చాలా తక్కువగా ఉంది. కార్యాలయాలు, సంస్థల్లోని ఔత్సాహికులు ప్రత్యేక సందర్భాల్లో రక్తదానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రి పడకల సామర్థ్యం (బెడ్ స్ట్రెంగ్త్) ఆధారంగా రక్తం డిమాండ్‌ను లెక్కవేస్తారు. అంటే ఒక ఆసుపత్రిలోని ఒక్కో పడకకు కనీసం 7 యూనిట్ల రక్తం అవసరమని అంచనా. రక్తదాతల్లో రకాలు రక్తదానం చేసేవారిని మూడు రకాలుగా వర్గీకరించారు. వాలంటరీ డోనర్స్, డిస్ట్రెస్ డోనర్స్, ప్రొఫెషనల్ డోనర్స్. సమాజంపై ఆపేక్షతో ఏ ప్రతిఫలాన్నీ ఆశించకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారిని వాలంటరీ డోనర్స్ అంటారు. వీళ్ల సంఖ్య బాగా తక్కువ. కుటుంబ సభ్యుల్లో ఎవరికో జబ్బు చేయడంతో రక్తం అవసరమవుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా రక్తం దానం చేసి తమకు అవసరమైన గ్రూపు రక్తాన్ని పొందేవారు డిస్ట్రెస్ డోనర్స్. మన సమాజంలో డిస్ట్రెస్ డోనర్సే ఎక్కువ. ఇక మూడో వర్గం.. ప్రొఫెషనల్ డోనర్స్. వీరు డబ్బు కోసం రక్తదానం చేస్తారు. ఈ ఆర్టికల్ వీరిని ఉద్దేశించినది కాదు. చివరిగా... రక్తదానం చేయడం అంటే... మనం ఏమీ కోల్పోకుండానే ఇతరులకు ప్రాణదానం చేయడం. మనం ఇచ్చిన రక్తం కొద్ది వ్యవధిలోనే భర్తీ అవుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా కోల్పోయేది ఏదీ ఉండదు. పైగా రక్తం ఇస్తే సాక్షాత్తూ ప్రాణాలు ఇచ్చినట్లే. రక్తదానం చేయండి. రక్తం అవసరమైన ఎందరో రోగుల ప్రాణాలను కాపాడండి. ఇన్పుట్స్: శైలేశ్ ఆర్.సింగీ, హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్ (సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్) అపోహలు - వాస్తవాలు రక్తదానం పట్ల ప్రజల్లో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. అవి పోవాలి. అందరూ వాస్తవాలు తెలుసుకోవాలి. అపోహ: రక్తదానం చేస్తే బలహీనమైపోతారు. వాస్తవం: ఇది ఏమాత్రం నిజం కాదు. వాస్తవానికి ఓ వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి కేవలం 350 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం 21 రోజుల్లో పూర్తిగా భర్తీ అవుతుంది. అయినాగానీ ముందుజాగ్రత్తచర్యగా ఓసారి ఓ వ్యక్తి నుంచి రక్తం సేకరిస్తే మరో మూడు నెలల పాటు అతడినుంచి రక్తం సేకరించరు. అంటే... ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 90 రోజులకు ఓమారు రక్తదానం చేయవచ్చు. 18-60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు. దీంతో ఎలాంటి బలహీనతా రాదు. అపోహ: చక్కెర రోగులు రక్తదానం చేయడానికి అర్హులు కాదు. వాస్తవం: చక్కెర రోగులూ రక్తదానం చేయవచ్చు. మిరియాల సురేష్‌బాబు నిరుపేద. వయసు 32. ఊరు మార్కాపురం. ఇప్పటికి 36 సార్లు రక్తదానం చేశాడు. టీ దుకాణం నడుపుకునే సురేష్‌బాబు ఓ రోజు... రక్తం సమయానికి అందక ఆరుగురు చిన్నారులు మరణించారనే వార్త విన్నాడు. అప్పటి నుంచి స్వచ్ఛంద రక్తదాతగా మారాడు. విజయవాడకు చెందిన మామిడి సాయి ఆకాశ్ వయసు 17 ఏళ్లు. రెండేళ్ల క్రితం ‘మదర్ బ్లడ్ బ్యాంక్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. ఇప్పటికి 1.75 కోట్ల మందిని రక్తదాతలుగా మార్చి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఠీఠీఠీ.ఝ్టౌజ్ఛిట ఛౌౌఛీఛ్చజు.ఛిౌఝ వెబ్సైట్ ద్వారా రక్తదానంపై అవగాహన కలిగిస్తున్నాడు. -
పాదం ఫ్లాట్‌గా ఉన్నా పర్లేదు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 51. సైనసైటిస్‌తో నేను పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆపరేషన్‌తో తప్ప మందులతో తగ్గదంటున్నారు. హోమియోలో అయినా నా సమస్యకు పరిష్కారం లభిస్తుందంటారా? - జి.వి.ఎల్.బి. రాజేశ్వరి, హైదరాబాద్ శ్వాసకోశ వ్యాధుల్లో తరచు వినిపించే సమస్య సైనసైటిఃస్. మన దేశంలో ప్రతి పదిమందిలో ఒకరు దీర్ఘకాలిక సైనసైటిస్‌తో బాధపడుతున్నారు. సైనసైటిస్ అంటే..? ప్రతి వారిలోనూ కపాలభాగంలోని నుదురు, కళ్లకు కిందిప్రాంతంలో, ముక్కుకు ఇరు పక్కల గాలితో నిండిన క్యాపిటీలు ఉంటాయి. వీటినే సైనస్‌లంటారు. సహజంగా సైనస్ మెత్తటి శ్లేష్మపు పొరతో కప్పి ఉంటుంది. ఈ శ్లేష్మపు పొర ఒక విధమైన పలుచటి ద్రవపదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరం లోపలికి ప్రవేశించిన గాలికి త గ్గట్టు ఉష్ణోగ్రతను, తేమను కల్పించడానికి, మనం మాట్లాడినప్పుడు శబ్దం రావడానికి ఉపయోగపడుతుంది. ఈ సైనస్లో ఉండే శ్లేష్మపు పొర ఇన్ఫ్లమేషన్కు గురి కావడాన్ని సైనసైటిస్ అంటారు. కారణాలు: సాధారణంగా శ్లేష్మపు పొర నుండి ఏర్పడే ద్రవపదార్థాలు ఎటువంటి ఆటంకాలు లేకుండానే ముక్కు రంధ్రాలలోకి చేరుతుంటాయి. కాని కొన్ని సందర్భాలలో మాత్రం సైనస్ల నుండి స్రవించ స్రావాలు ప్రవహించే మార్గంలో అడ్డంకులు ఏర్పడడంతో అది సైనసైటిస్‌కు దారి తీస్తుంది. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు, తరచు జలుబు, ఎలర్జీ సమస్యలు, నాసిల్ పాలిప్, ట్రామా, సైనస్ ఎముకలు విరగడం మొదలైనవి. రకాలు: ముఖ్యంగా ఇది రెండు రకాలు. మూడువారాలు లేదా అంతకంటే తక్కువగా ఈ సమస్య ఉంటే అక్యూట్ సైనసైటిస్ అని అంటారు. మూడువారాలకు మించి ఈ ఇబ్బంది ఉంటే క్రానిస్ సైనసైటిస్ అంటారు. లక్షణాలు: ముక్కు దిబ్బడ, సైనస్ ప్రభావిత భాగాలలో నొప్పి, చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు రావడం, తలనొప్పి, పంటినొప్పి, చెవులు బరువెక్కడం, జ్వరం, దగ్గు, నీరసం మొదలైనవి. నిర్ధారణ: వ్యాధి సంబంధమైన లక్షణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా సైనసైటిస్ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా నిర్థారించవచ్చు. దానితోబాటు ఎక్స్‌రే, సీటీస్కాన్, నాసల్ ఎండోస్కోపీ, పిఎఫ్టీ, ఐజీఐ, అలర్జీ టెస్ట్ ద్వారా కూడా వ్యాధిని నిర్థారించవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: సైనసైటిస్‌కు హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ప్రత్యేకరీతిలో సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురైన రోగనిరోధక శక్తిని సరిచేసి, సైనసైటిస్‌ను సంపూర్ణంగా నివారింపజేస్తారు. ఇలాంటి వ్యాధి మరోసారి తిరగబెట్టకుండా శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరిచి ఆరోగ్యమవతమైన జీవనం సాగించే విధంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ అందించే వైద్యం దోహదపడుతుంది. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు నాలుగేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో స్వాభావికంగా ఉండే ఒంపు లేదనీ, పాదం ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము డాక్టర్‌కు చూపించాం. డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు. భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. దాంతో మా బాబుకు ఆ షూ తొడిగించాలని ప్రయత్నించాం. వాడు ఆ షూస్ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. దాంతో ఆ ప్రత్యేకమైన షూస్ తొడిగించలేక, అవి తొడిగించకపోతే భవిష్యత్తులో వాడికి ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ సతమతం అయిపోతున్నాం. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - సుమన్, సదాశివపేట మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్ ఫీట్ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 - 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది. కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్ ఫీట్) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్ ఓవుటా అనే మొరాకన్ ఆటగాడు 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాన్ వెబ్ అనే అమెరికన్ అథ్లెట్ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. ఒకప్పుడు మీకు ఉన్న దురభిప్రాయమే చాలమందిలో ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్యవిజ్ఞానం ప్రకారం అది తప్పు అని తేలింది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. నాకు రెండేళ్లుగా డయాబెటిస్ ఉంది. కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఇటీవల కొంతకాలంగా నాకు కాళ్లవాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్ ఉంటే కాళ్లలో వాపు వస్తుందా? ఈ లక్షణాలతో తీవ్ర అసౌకర్యంగా ఉంది. సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - సుందర్, అనంతపురం మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్తో బాధపడేవాళ్లలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖ వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అని చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఇప్పటికే మీరు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నందున ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆహారంలో తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. -
ఆయుర్వేద కౌన్సెలింగ్
ఫైబ్రాయిడ్స్‌కు చికిత్సను సూచించండి నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్యనిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ (చిన్న చిన్న కంతులు) ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి. - కె. శ్యామల, వనస్థలిపురం మీరు ప్రస్తావించిన ‘కంతుల’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా పొత్తికడుపు కింది భాగంలో కొద్దిపాటి నొప్పి ఉండటం, గట్టిగా, భారంగా ఉండటం, కొంతమందిలో పీరియడ్స్ సంబంధం లేకుండానే అధికరక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ కంతి సైజు పెద్దదిగా ఉండి, ఇతర సమస్యలు ఉంటే తప్ప ఆపరేషన్ అక్కర్లేకుండా, దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు... 1. కైశోర గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 3. శతావరీ లేహ్యం ... ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా 4. అశోకారిష్ట (ద్రావకం) ... నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి ... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు. మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి. - ఎస్. మేరీ, హనమకొండ ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందునుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది. 1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కల్పి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి; గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
హెర్నియా కౌన్సెలింగ్
మహిళలకు కూడా హెర్నియా వస్తుందా? ఇటీవల మాకు తెలిసిన ఒక మహిళకు హెర్నియా వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. హెర్నియా అంటే ఏమిటో తెలియజేయగలరు. - రోహిత్, సంగారెడ్డి హెర్నియా అన్నది పురుషులకూ, మహిళలకూ ఇద్దరికీ వచ్చే కండిషన్. బహుశా మీరు పురుషులకు వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని, రెండో ఒకటే అని అపోహపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట పైపొరల మీద అమరి ఉంటాయి. ఈ పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపలి భాగాలు బలహీనంగా ఉన్న అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని లోపలికి వెళ్తాయి. అలాంటప్పుడు పురుషుల్లో ఆ పేగు వృషణాల సంచిలో కనిపించవచ్చు. అలాగే మహిళల్లో అబ్డామిన్ కండరాలు బలహీనంగా ఉంటే మన పొట్టలోని అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. అలాంటప్పుడు ఆ అవయవాలను శస్త్రచికిత్స ద్వారా యథాస్థితికి తెచ్చి, మళ్లీ అలా దూరిపోకుండా అబ్డామిన్ కండరాలపైన ఒక వలలాంటి దాన్ని (మెష్‌ను) అమర్చుతారు. హెర్నియా ఉంటే తప్పక ఆపరేషన్ చేయించాల్సిందేనా? ఇది మందులతో తగ్గదా? - శ్రీనివాస్, గన్నవరం మామూలుగానైతే బలహీనమైన అబ్డామిన్ కండరాల్లోంచి పేగులు కిందికి జారిపోయే హెర్నియా అనే కండిషన్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు. చాలా సందర్భాల్లో దీనికి నొప్పి కూడా ఉండదు. పడుకున్నప్పుడు పేగు తన యథాతథ స్థితికి రావడం లేదా చేత్తో తాకినప్పుడు వృషణాల సంచిలో పేగు తగలడం వంటి వాటితో హెర్నియాను గుర్తించవచ్చు. అయితే ఒక్కోసారి ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. అబ్డామిన్ పొరల్లోంచి దూసుకుపోయిన ఈ పేగులు ఒక్కోసారి అక్కడి ఖాళీలో ఇరుక్కుపోయి తీవ్రంగా బిగుసుకుపోతాయి. దీన్నే స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా అంటారు. అప్పుడు అలా ఇరుక్కున్న పేగులకు రక్తసరఫరా అందకుండా పోవడంతో పేగులు పాడైపోతాయి. అలాంటప్పుడు మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం.ఏ. సలీమ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
విమ్స్‌లో బాలునికి అరుదైన ఆపరేషన్
సాక్షి, బళ్లారి : ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడికి విమ్స్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ విశ్వనాథ్ నేతృత్వంలో అత్యాధునిక శస్త్ర చికిత్స నిర్వహించారు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా కరడిహాల్ గ్రామానికి చెందిన ఓబుళేసు కుమారుడు అశోక్ అనే బాలుడు పదవ తరగతి చదువుకుంటున్నాడు. నాలుగు నెలల క్రితం బాలుడు పొలంలోకి వెళ్లి వస్తుండగా నాలుగు ఎలుగుబంట్లు దాడి చేశాయి. తల, కళ్లు, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు విమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ విశ్వనాథ్ బాలుడిని పరీక్షించి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేపట్టి బాలుడి ప్రాణాలు కాపాడారు. జ్ఞాపకశక్తి, కంటిచూపు, వాసన, స్పర్శ పూర్తిగా కోల్పోయిన అశోక్‌కు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో మామూలు స్థితికి చేరుకున్నాడు. బతకడనుకున్న కొడుకుకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ విశ్వనాథ్‌ను బాలుడి తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు. ఈ విషయంపై డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ సోమశేఖర్ సమగండి, చంద్రకుమార్, ఆనంద్ తదితర వైద్య బృందం విలేకరులకు వివరించారు. ఎలుగుబంటి దాడులు, ఇతరత్ర గాయాలైన వెంటనే తనను సంప్రదించాలని విమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామని డాక్టర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. -
అమ్మాయిలా మారాలని యువకుడి తపన
తొలి శస్త్ర చికిత్స విజయవంతం రెండవ ఆపరేషన్‌కు డబ్బు కోసం చోరీలు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న అతడి పేరు ప్రవీణ్. అమ్మాయిలా మారాలన్న తపనతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. తొలి శస్త్ర చికిత్స పూర్తి అయింది. రెండవ సారి మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలకు తెగబడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. డీసీపీ సందీప్ పాటిల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా.... పీణ్యా సమీపంలోని మంజునాథ నగరకు చెందిన ప్రవీణ్ అలియాస్ కాంత(23) ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేవాడు. తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నగరంలో హిజ్రాలు నివాసముంటున్న ప్రాంతానికి చేరుకుని చీర కట్టుకుని రోడ్డుపైకి వచ్చేవాడు. తర్వాత నిర్జన ప్రదేశాలలో సంచరించేవారిని లైంగికంగా రెచ్చగొట్టి వ్యభిచారం సాగించేవాడు. ఇందులో భాగంగా ఈ నెల 6న రాత్రి గోరగుంటపాళ్యకు చెందిన గార్మెంట్స్ ఉద్యోగి మురుగేష్‌ను అతను లైంగికంగా రెచ్చగొట్టాడు. ఆ సమయంలో మురుగేస్ వద్ద ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఆర్ఎంసీ యార్డు పోలీసు ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ కచ్చితమైన సమాచారం సేకరించి కాంతను అరెస్ట్ చేశారు. అయితే ఇంత కాలం ప్రవీణ్ మగవాడేనని కుటుంబసభ్యులు భావించారని, అతను హిజ్రా అని వారికి తెలియదని పోలీసులు తెలిపారు. కాగా, తనతో లైంగిక వాంఛ తీర్చుకున్న తర్వాత నగదు ఇవ్వకుండా మురుగేష్ మోసం చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో బంగారు గొలుసు లాక్కొన్నట్లు పోలీసుల ఎదుట ప్రవీణ్ అంగీకరించాడు. తాను చోరీ చేసిన బంగారు గొలుసును సుంకదకట్టలోని ఓ జ్యువెలరీ షాప్‌లో విక్రయించగా వచ్చిన రూ. 30 వేలతో దేవుడి ఫొటోలు కొనుగోలు చేశానని, మిగిలిన సొమ్ముతో తోటి హిజ్రాలతో కలిసి జాలీ ట్రిప్ వెళ్లి వచ్చినట్లు వివరించాడు. అమ్మాయిగా మారేందుకు గతంలో ఒకసారి ప్రవీణ్ ఆపరేషన్ చేయించుకున్నాడని, ప్రస్తుతం మరోసారి ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తునట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.