పాదం ఫ్లాట్‌గా ఉన్నా పర్లేదు! | Homeopathic counseling | Sakshi
Sakshi News home page

పాదం ఫ్లాట్‌గా ఉన్నా పర్లేదు!

Published Sun, Oct 25 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

Homeopathic counseling

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 51. సైనసైటిస్‌తో నేను పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆపరేషన్‌తో తప్ప మందులతో తగ్గదంటున్నారు. హోమియోలో అయినా నా సమస్యకు పరిష్కారం లభిస్తుందంటారా?
 - జి.వి.ఎల్.బి. రాజేశ్వరి, హైదరాబాద్

శ్వాసకోశ వ్యాధుల్లో తరచు వినిపించే సమస్య సైనసైటిఃస్. మన దేశంలో ప్రతి పదిమందిలో ఒకరు దీర్ఘకాలిక సైనసైటిస్‌తో బాధపడుతున్నారు.  సైనసైటిస్ అంటే..? ప్రతి వారిలోనూ కపాలభాగంలోని నుదురు, కళ్లకు కిందిప్రాంతంలో, ముక్కుకు ఇరు పక్కల గాలితో నిండిన క్యాపిటీలు ఉంటాయి. వీటినే సైనస్‌లంటారు. సహజంగా సైనస్ మెత్తటి శ్లేష్మపు పొరతో కప్పి ఉంటుంది. ఈ శ్లేష్మపు పొర ఒక విధమైన పలుచటి ద్రవపదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరం లోపలికి ప్రవేశించిన గాలికి త గ్గట్టు ఉష్ణోగ్రతను, తేమను కల్పించడానికి, మనం మాట్లాడినప్పుడు శబ్దం రావడానికి ఉపయోగపడుతుంది. ఈ సైనస్‌లో ఉండే శ్లేష్మపు పొర ఇన్‌ఫ్లమేషన్‌కు గురి కావడాన్ని సైనసైటిస్ అంటారు.

కారణాలు: సాధారణంగా శ్లేష్మపు పొర నుండి ఏర్పడే ద్రవపదార్థాలు ఎటువంటి ఆటంకాలు లేకుండానే ముక్కు రంధ్రాలలోకి చేరుతుంటాయి. కాని కొన్ని సందర్భాలలో మాత్రం సైనస్‌ల నుండి స్రవించ స్రావాలు ప్రవహించే మార్గంలో అడ్డంకులు ఏర్పడడంతో అది సైనసైటిస్‌కు దారి తీస్తుంది. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు, తరచు జలుబు, ఎలర్జీ సమస్యలు, నాసిల్ పాలిప్, ట్రామా, సైనస్ ఎముకలు విరగడం మొదలైనవి.

రకాలు: ముఖ్యంగా ఇది రెండు రకాలు. మూడువారాలు లేదా అంతకంటే తక్కువగా ఈ సమస్య ఉంటే అక్యూట్ సైనసైటిస్ అని అంటారు. మూడువారాలకు మించి ఈ ఇబ్బంది ఉంటే క్రానిస్ సైనసైటిస్ అంటారు.
 
లక్షణాలు: ముక్కు దిబ్బడ, సైనస్ ప్రభావిత భాగాలలో నొప్పి, చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు రావడం, తలనొప్పి, పంటినొప్పి, చెవులు బరువెక్కడం, జ్వరం, దగ్గు, నీరసం మొదలైనవి.
 
నిర్ధారణ: వ్యాధి సంబంధమైన లక్షణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా సైనసైటిస్ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా నిర్థారించవచ్చు. దానితోబాటు ఎక్స్‌రే, సీటీస్కాన్, నాసల్ ఎండోస్కోపీ, పిఎఫ్‌టీ, ఐజీఐ, అలర్జీ టెస్ట్ ద్వారా కూడా వ్యాధిని నిర్థారించవచ్చు.
 హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: సైనసైటిస్‌కు హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ప్రత్యేకరీతిలో సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అధునాతనమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురైన రోగనిరోధక శక్తిని సరిచేసి, సైనసైటిస్‌ను సంపూర్ణంగా నివారింపజేస్తారు. ఇలాంటి వ్యాధి మరోసారి తిరగబెట్టకుండా శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరిచి ఆరోగ్యమవతమైన జీవనం సాగించే విధంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ అందించే వైద్యం దోహదపడుతుంది.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
మా బాబు వయసు నాలుగేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో స్వాభావికంగా ఉండే ఒంపు లేదనీ, పాదం ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము డాక్టర్‌కు చూపించాం. డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు. భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. దాంతో మా బాబుకు ఆ షూ తొడిగించాలని ప్రయత్నించాం. వాడు ఆ షూస్ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. దాంతో ఆ ప్రత్యేకమైన షూస్ తొడిగించలేక, అవి తొడిగించకపోతే భవిష్యత్తులో వాడికి ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ సతమతం అయిపోతున్నాం. మాకు తగిన సలహా ఇవ్వగలరు.
 - సుమన్, సదాశివపేట


మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్ ఫీట్ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 - 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది. కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్ ఫీట్) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్ ఓవుటా అనే మొరాకన్ ఆటగాడు 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాన్ వెబ్ అనే అమెరికన్ అథ్లెట్ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. ఒకప్పుడు మీకు ఉన్న దురభిప్రాయమే చాలమందిలో ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్యవిజ్ఞానం ప్రకారం అది తప్పు అని తేలింది.
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్

నా వయసు 52 ఏళ్లు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. నాకు రెండేళ్లుగా డయాబెటిస్ ఉంది. కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఇటీవల కొంతకాలంగా నాకు కాళ్లవాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్ ఉంటే కాళ్లలో వాపు వస్తుందా? ఈ లక్షణాలతో తీవ్ర అసౌకర్యంగా ఉంది. సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
 - సుందర్, అనంతపురం

 మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్‌తో బాధపడేవాళ్లలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖ వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అని చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఇప్పటికే మీరు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నందున ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆహారంలో తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement