Respiratory
-
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా
చైనాలో మళ్లీ కొత్త రకం కరోనావైరస్ విస్తరిస్తోందన్న ఆందోళనల మధ్య చైనా స్పందించింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు పలు వ్యాధికారక కారకాల కలయికు కారణమని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ప్రధాన కారణాల్లో ఇన్ఫ్లుఎంజా ఒకటని ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. చైనాలో నమోదవుతోన్న న్యూమోనియా కేసుల్లో ఎలాంటి అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారకాలను గుర్తించ లేదని, కోవిడ్ -19 మహమ్మారి సమయం నాటి తీవ్రత లేదని కూడా స్పష్టం చేసింది. తద్వారా కొత్త కరోనా వస్తోందన్న ఆందోళనలకు చెక్ పెట్టింది. ఇన్ఫ్లుఎంజా, రైనోవైరస్, అడెనోవైరస్లు, మైకోప్లాస్మా న్యుమోనియా వంటి అనేక రకాల వ్యాధికారక కారకాల వల్ల కేసులు పెరుగుతున్నాయని నివేదించింది. అలాగే శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత అసాధారణం కాదని కూడా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ ఆంక్షలు అవసరం లేవని కూడా వెల్లడించింది. బీజింగ్, లియానింగ్ ,ఇతర ప్రదేశాలలో పిల్లల ఆసుపత్రులలో గుర్తించబడని న్యుమోనియా గురించి నివేదిక తర్వాత పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనా నుండి మరింత సమాచారం కోరిన తర్వాత ఈ వివరాలు వచ్చాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చైనాను కోరింది. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈమేరకు చైనా అధికారులు స్పందించారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు WHO తెలిపింది. చైనాలో చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కేసులు కలవర పెట్టాయి. కరోనా బాగా ప్రబలిన నాటి రోజులను తలపించేలా చైనాలో ఆసుపత్రుల వద్ద చిన్నారులతో తల్లిదండ్రులు గంటల తరబడి వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇది వ్యాప్తి చెందకుండా పాఠశాలల్ని తాత్కాలికంగా మూసివేశాయి. మరోవైపు వాకింగ్ న్యుమోనియా" కేసులు పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యులు హెచ్చరించారు. కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల పిల్లలలో మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదించాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండే పెద్ద పిల్లలు, పెద్దలలో తేలికపాటి జలుబు మాత్రమే కనిపిస్తోంది. అయితే ,కొన్ని వారాల పాటు కొనసాగుతున్న లక్షణాలతో చిన్న పిల్లల్లో న్యుమోనియా డెవలప్ అయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైకోప్లాస్మా న్యుమోనియా మైకోప్లాస్మా న్యుమోనియా అనేది ఒక బాక్టీరియా, ఇది సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది, సాధారణ జలుబు మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. ఇది చాలా అరుదుగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు దగ్గు వారాల పాటు కొనసాగుతుంది. ఫలితంగా చిన్న పిల్లలకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. -
కోవిడ్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం!
జెనీవా: కోవిడ్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. చైనాలోని వూహాన్లో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పటికీ దాని చుట్టూ ఇంకా ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది. శ్వాస కోశకు సంబంధించిన వ్యాధులన్నీ సీజనల్‌గానే వస్తాయని, శీతల వాతావరణం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు ఎక్కువని చెప్పింది. ఇక ఫ్లూ తరహా వ్యాధులు కూడా సమశీతోష్ణ ప్రాంతాల్లో కూడా తరచూ విజృంభిస్తూ ఉంటాయని వెల్లడించింది . కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకటే రకం వ్యాధి కావడంతో ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారుతుందని ఆ బృందం అభిప్రాయపడింది. అందుకే ఇప్పటికిప్పుడు వాతావరణ మార్పుల్ని అంచనా వేసుకొని కోవిడ్ ఆంక్షల్ని సడిలించవద్దని హెచ్చరించింది. అత్యంత శీతల వాతావరణంలో కరోనా వ్యాప్తి ఎలా చెందుతోందో, వేడి వాతావరణంలో కూడా అదే స్థాయిలో విజృంభిస్తోందని వచ్చే సీజన్లలో కూడా అలాగే జరిగే అవకాశం ఉందని బృందానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్ జెయిట్‌చిక్ చెప్పారు. -
పాదం ఫ్లాట్‌గా ఉన్నా పర్లేదు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 51. సైనసైటిస్‌తో నేను పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆపరేషన్‌తో తప్ప మందులతో తగ్గదంటున్నారు. హోమియోలో అయినా నా సమస్యకు పరిష్కారం లభిస్తుందంటారా? - జి.వి.ఎల్.బి. రాజేశ్వరి, హైదరాబాద్ శ్వాసకోశ వ్యాధుల్లో తరచు వినిపించే సమస్య సైనసైటిఃస్. మన దేశంలో ప్రతి పదిమందిలో ఒకరు దీర్ఘకాలిక సైనసైటిస్‌తో బాధపడుతున్నారు. సైనసైటిస్ అంటే..? ప్రతి వారిలోనూ కపాలభాగంలోని నుదురు, కళ్లకు కిందిప్రాంతంలో, ముక్కుకు ఇరు పక్కల గాలితో నిండిన క్యాపిటీలు ఉంటాయి. వీటినే సైనస్‌లంటారు. సహజంగా సైనస్ మెత్తటి శ్లేష్మపు పొరతో కప్పి ఉంటుంది. ఈ శ్లేష్మపు పొర ఒక విధమైన పలుచటి ద్రవపదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇది మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరం లోపలికి ప్రవేశించిన గాలికి త గ్గట్టు ఉష్ణోగ్రతను, తేమను కల్పించడానికి, మనం మాట్లాడినప్పుడు శబ్దం రావడానికి ఉపయోగపడుతుంది. ఈ సైనస్లో ఉండే శ్లేష్మపు పొర ఇన్ఫ్లమేషన్కు గురి కావడాన్ని సైనసైటిస్ అంటారు. కారణాలు: సాధారణంగా శ్లేష్మపు పొర నుండి ఏర్పడే ద్రవపదార్థాలు ఎటువంటి ఆటంకాలు లేకుండానే ముక్కు రంధ్రాలలోకి చేరుతుంటాయి. కాని కొన్ని సందర్భాలలో మాత్రం సైనస్ల నుండి స్రవించ స్రావాలు ప్రవహించే మార్గంలో అడ్డంకులు ఏర్పడడంతో అది సైనసైటిస్‌కు దారి తీస్తుంది. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు, తరచు జలుబు, ఎలర్జీ సమస్యలు, నాసిల్ పాలిప్, ట్రామా, సైనస్ ఎముకలు విరగడం మొదలైనవి. రకాలు: ముఖ్యంగా ఇది రెండు రకాలు. మూడువారాలు లేదా అంతకంటే తక్కువగా ఈ సమస్య ఉంటే అక్యూట్ సైనసైటిస్ అని అంటారు. మూడువారాలకు మించి ఈ ఇబ్బంది ఉంటే క్రానిస్ సైనసైటిస్ అంటారు. లక్షణాలు: ముక్కు దిబ్బడ, సైనస్ ప్రభావిత భాగాలలో నొప్పి, చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు రావడం, తలనొప్పి, పంటినొప్పి, చెవులు బరువెక్కడం, జ్వరం, దగ్గు, నీరసం మొదలైనవి. నిర్ధారణ: వ్యాధి సంబంధమైన లక్షణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా సైనసైటిస్ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా నిర్థారించవచ్చు. దానితోబాటు ఎక్స్‌రే, సీటీస్కాన్, నాసల్ ఎండోస్కోపీ, పిఎఫ్టీ, ఐజీఐ, అలర్జీ టెస్ట్ ద్వారా కూడా వ్యాధిని నిర్థారించవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: సైనసైటిస్‌కు హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ప్రత్యేకరీతిలో సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురైన రోగనిరోధక శక్తిని సరిచేసి, సైనసైటిస్‌ను సంపూర్ణంగా నివారింపజేస్తారు. ఇలాంటి వ్యాధి మరోసారి తిరగబెట్టకుండా శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరిచి ఆరోగ్యమవతమైన జీవనం సాగించే విధంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ అందించే వైద్యం దోహదపడుతుంది. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు నాలుగేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో స్వాభావికంగా ఉండే ఒంపు లేదనీ, పాదం ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము డాక్టర్‌కు చూపించాం. డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు. భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. దాంతో మా బాబుకు ఆ షూ తొడిగించాలని ప్రయత్నించాం. వాడు ఆ షూస్ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. దాంతో ఆ ప్రత్యేకమైన షూస్ తొడిగించలేక, అవి తొడిగించకపోతే భవిష్యత్తులో వాడికి ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ సతమతం అయిపోతున్నాం. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - సుమన్, సదాశివపేట మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్ ఫీట్ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 - 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది. కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్ ఫీట్) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్ ఓవుటా అనే మొరాకన్ ఆటగాడు 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాన్ వెబ్ అనే అమెరికన్ అథ్లెట్ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. ఒకప్పుడు మీకు ఉన్న దురభిప్రాయమే చాలమందిలో ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్యవిజ్ఞానం ప్రకారం అది తప్పు అని తేలింది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. నాకు రెండేళ్లుగా డయాబెటిస్ ఉంది. కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఇటీవల కొంతకాలంగా నాకు కాళ్లవాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్ ఉంటే కాళ్లలో వాపు వస్తుందా? ఈ లక్షణాలతో తీవ్ర అసౌకర్యంగా ఉంది. సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - సుందర్, అనంతపురం మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్తో బాధపడేవాళ్లలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కాళ్లలో వాపులతో పాటు ముఖ వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అని చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఇప్పటికే మీరు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నందున ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆహారంలో తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. -
గ్యాస్ట్రిక్ సమస్య పోవాలంటే... క్రౌంచాసనం
వ్యాయామం అజీర్తి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం తగ్గడానికి మందులు వాడేకన్నా క్రౌంచాసనం సాధన చేస్తే మేలు. క్రౌంచాసనం ఎలా వేయాలంటే... రెండు కాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి. ఎడమకాలును మోకాలి దగ్గర మడిచి కూర్చోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని రెండు చేతులతో కుడికాలిని పట్టుకుని (వీలైనంత వరకు మాత్రమే) నిటారుగా పైకి లేపాలి. ఈ స్థితిలో మోకాలుని వంచకుండా (ఫొటోలో చూపినట్లుగా) గడ్డాన్ని మోకాలికి తాకించాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ కాలితోనూ చేయాలి. ఇలా రోజుకు పది నిమిషాల సేపు చేస్తే పైన చెప్పుకున్న సమస్యలతోపాటు బీజ కోశం, గర్భకోశాలకు శక్తి చేకూరడం, రుతుక్రమ సమస్యలు తొలగిపోవడం, ఏకాగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. మోకాళ్ల నొప్పులు, స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు నిపుణుల సలహా మేరకు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. రుతుక్రమ సమయంలో ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. -
శ్వాస స్లో అవుతోంది!
తాము అతిగా కష్టపడుతున్నాం, తీరికలేకుండా కష్టపడుతున్నాం అని చెప్పుకోవడానికి చాలామంది ‘ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాం’ అంటుంటారు. అయితే, అతిశయోక్తి కొద్దీ ఇలా చెబుతున్నా... కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేస్తున్న వారి లో 80 శాతం మంది శ్వాస తీసుకోవడం మరచిపోతున్నారట! ప్రత్యేకించి ఇ-మెయిల్ లేదా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు కంపోజ్ చేసేవారు పనిమీద దృష్టి పెట్టి శ్వాస తీర్చుకోవడాన్ని స్లో చేస్తున్నారట! దీనికే ‘ఇ మెయిల్ అప్నోయా’ అని పేరు పెట్టారు. సాధారణంగా మనిషి నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకోవాలి. అయితే కంప్యూటర్లో కంపోజింగ్ వర్క్‌లో ఉన్నప్పుడు చాలామంది పూర్తిగా పనిమీదే దృష్టిపెట్టి తక్కువసార్లు శ్వాస తీసుకొంటున్నారు. దీని ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హృదయ స్పందనల మీద కూడా ఈ ప్రభావం ఉంటుందట. ఇలా శ్వాస తీసుకోవడం మందగించడం వల్ల ఆ ప్రభావం నరాలపై కూడా ఉంటుందట. ప్రస్తుతం ప్రపంచంలో పీసీల ముందు పనిచేసే వారిలో ఏకంగా 80 శాతం మందిపై ఈమెయిల్ అప్నోయా ప్రభావం ఉంది. అయితే వారెవరికీ తాము తక్కువ శ్వాస తీసుకొంటున్నామన్న విషయం తెలియనే తెలియదట! మరి ఈ వ్యాధిబారిన పడ్డామా? అనే విషయాన్ని ఎవరికి వారు తాము టైపింగ్ చేస్తున్నప్పుడు పరిశీలించుకుని జాగ్రత్తగా శ్వాస తీసుకోవాలి!