గ్యాస్ట్రిక్ సమస్య పోవాలంటే... క్రౌంచాసనం
వ్యాయామం
అజీర్తి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం తగ్గడానికి మందులు వాడేకన్నా క్రౌంచాసనం సాధన చేస్తే మేలు. క్రౌంచాసనం ఎలా వేయాలంటే...
రెండు కాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి.
ఎడమకాలును మోకాలి దగ్గర మడిచి కూర్చోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని రెండు చేతులతో కుడికాలిని పట్టుకుని (వీలైనంత వరకు మాత్రమే) నిటారుగా పైకి లేపాలి. ఈ స్థితిలో మోకాలుని వంచకుండా (ఫొటోలో చూపినట్లుగా) గడ్డాన్ని మోకాలికి తాకించాలి.
ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ కాలితోనూ చేయాలి. ఇలా రోజుకు పది నిమిషాల సేపు చేస్తే పైన చెప్పుకున్న సమస్యలతోపాటు బీజ కోశం, గర్భకోశాలకు శక్తి చేకూరడం, రుతుక్రమ సమస్యలు తొలగిపోవడం, ఏకాగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
మోకాళ్ల నొప్పులు, స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు నిపుణుల సలహా మేరకు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. రుతుక్రమ సమయంలో ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు.