రక్తసంబంధాలు కావాలి | Needs blood relations | Sakshi
Sakshi News home page

రక్తసంబంధాలు కావాలి

Published Tue, Dec 15 2015 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తసంబంధాలు కావాలి - Sakshi

రక్తసంబంధాలు కావాలి

వారానికోసారి దేవాలయాలకు వెళుతుంటాం. కేలండర్ ప్రకారం క్రమం తప్పకుండా పండుగలు, పబ్బాలు చేసుకుంటాం. ఇలాంటి పనులను ఎవరూ చెప్పకపోయినా మనం విధిగా చేసేస్తూనే ఉంటాం. అంతే విధిగా రక్తదానం కూడా చేస్తే సమాజానికి మేలు చేసిన వాళ్లమవుతాం. మన దేశంలో రక్తానికి కొరత ఉంది. ఆ కొరత తీరడానికి మనం ఒక చెయ్యి ఇవ్వాలి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టమూ ఉండదు. రక్తదానం చేయకపోయినా మన ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదు. కాకపోతే సమాజం ఆరోగ్యమే కుంటుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రండి. నిండు ప్రాణాలను నిలబెట్టామనే ఆత్మతృప్తి పొందండి.
 
దేహంలో జీవనదిలా రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే యాక్సిడెంట్ కావచ్చు, అత్యవసరమైన ఆపరేషన్ కావచ్చు, ఇలాంటి కారణమేదైనా కావచ్చు.. ఒంట్లోని రక్తం అనివార్యంగా బయటకుపోయే విపత్కర పరిస్థితి ఒక్కోసారి తలెత్తుతుంది. అప్పుడు రక్తం అవసరం అవుతుంది. రక్తాన్ని రక్తంతో భర్తీ చేయాల్సిందే! రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే రక్తదానం అవసరమవుతోంది. అయితే మన దేశంలో రోగుల అవసరాలకు తగిన స్థాయిలో రక్తం అందుబాటులో ఉండడం లేదు. తగినన్ని బ్లడ్‌బ్యాంకులు లేకపోవడం, రక్తదానంపై జనంలో ఉన్న అపోహలు కూడా ఈ పరిస్థితికి కారణమే.

రక్తం ఎందుకు అవసరం?
ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్‌గా మారాక అన్ని కణాలకూ ఆ ఆహారాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్‌తో పాటు అమినోయాసిడ్స్, ఫాటీయాసిడ్స్‌నూ కణాలన్నింటికీ అందజేస్తుంది.
 
రక్తంలోని గ్లూకోజ్ వల్ల శరీరంలో శక్తిని ఇచ్చే జీవక్రియలు జరుగుతాయి. ఈ క్రమంలో కార్బన్-డై-ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచే మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసేది కూడా రక్తమే. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి.
 ఈ కీలకమైన కార్యకలాపాలన్నీ నిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని కట్టడి చేయడానికి మన శరీరం కృషి చేస్తుంది. రక్తస్రావం మొదలుకాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపుతుంది. రక్తస్రావం జరుగుతున్నప్పుడు జీవి మనుగడ సాగించేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. అయితే హెచ్‌ఐవీ, హెపటైటిస్ వైరస్ ఉన్నవారు ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రక్తదానానికి అర్హులు కాదు. మిగతా ఆరోగ్యవంతులెవరైనా రక్తదానం చేయవచ్చు.  

రక్తాన్ని ఎవరి దగ్గరకు వెళ్లి ఇవ్వాలి?
మన రెండు రాష్ట్రాలలో... దాతల నుంచి రక్తం సేకరించే పనిని అన్ని ప్రభుత్వ, వైద్యవిధాన పరిషత్, జిల్లా ఆసుపత్రులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ (ఐఆర్‌సీఎస్), లయన్, రోటరీ వంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలవి కలుపుకొని (2012 నాటి లెక్కల ప్రకారం) సుమారు 250 బ్లడ్‌బ్యాంకులున్నాయి. రక్తంలోని ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ వంటి అంశాలను వేర్వేరుగా విడదీసే ‘కాంపోనెంట్ సపరేషన్ యూనిట్లు’  కూడా ఉన్నాయి. అయితే ఇలా రక్తంలోని కాంపొనెంట్లను వేటికవి విడదీసే వాటికంటే మొత్తం రక్తాన్ని సేకరించే బ్లడ్‌బ్యాంకులే ఎక్కువ. ఓసారి సేకరించిన రక్తం కేవలం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ కాలపరిమితి దాటిన రక్తాన్ని రోగికి అందకుండా తనిఖీలు జరుగుతుంటాయి. ఒకవైపు సేకరించిన రక్తానికి జీవితకాలం లేక వృథా అవడం, మరోవైపు రక్తదానం పట్ల అవగాహన లేకపోవడంతో సమస్య పెరుగుతోంది.

రక్తంలో ఏ భాగం ఎవరికి అవసరం?
ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్‌బ్లడ్) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అవసరం లేని కాంపోనెంట్స్ కూడా శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. కానీ... ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా రక్తంలోని అదే కాంపోనెంట్‌ను ఎక్కిస్తే, తక్కిన కాంపోనెంట్స్ మిగతావారికి ఉపయోగపడతాయి.  ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీనత ఎక్కువగా ఉన్న వ్యక్తికి పాకెట్ ఆర్‌బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూలాంటి వ్యాధి సోకి ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే చాలు. ప్లాస్మా, పాకెట్ ఆర్‌బీసీ, ప్లేట్‌లెట్లు అని విడదీసి వాడుతారు. ఆ విధంగా ప్రతి రక్తపు బొట్టు ముగ్గురికి ఉపయోగపడుతుంది.

ఇప్పటికీ కొరతగానే ఉంది!
మన దగ్గర రక్తానికి ఉన్న డిమాండ్ కంటే సప్లై చాలా తక్కువగా ఉంది. కార్యాలయాలు, సంస్థల్లోని ఔత్సాహికులు ప్రత్యేక సందర్భాల్లో రక్తదానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆసుపత్రి పడకల సామర్థ్యం (బెడ్ స్ట్రెంగ్త్) ఆధారంగా రక్తం డిమాండ్‌ను లెక్కవేస్తారు. అంటే ఒక ఆసుపత్రిలోని  ఒక్కో పడకకు కనీసం 7 యూనిట్ల రక్తం అవసరమని అంచనా.
 
రక్తదాతల్లో రకాలు
రక్తదానం చేసేవారిని మూడు రకాలుగా వర్గీకరించారు. వాలంటరీ డోనర్స్, డిస్ట్రెస్ డోనర్స్, ప్రొఫెషనల్ డోనర్స్. సమాజంపై ఆపేక్షతో ఏ ప్రతిఫలాన్నీ ఆశించకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారిని వాలంటరీ డోనర్స్ అంటారు. వీళ్ల సంఖ్య బాగా తక్కువ. కుటుంబ సభ్యుల్లో ఎవరికో జబ్బు చేయడంతో రక్తం అవసరమవుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా రక్తం దానం చేసి తమకు అవసరమైన గ్రూపు రక్తాన్ని పొందేవారు డిస్ట్రెస్ డోనర్స్. మన సమాజంలో డిస్ట్రెస్ డోనర్సే ఎక్కువ. ఇక మూడో వర్గం.. ప్రొఫెషనల్ డోనర్స్. వీరు డబ్బు కోసం రక్తదానం చేస్తారు. ఈ ఆర్టికల్ వీరిని ఉద్దేశించినది కాదు.

చివరిగా...
రక్తదానం చేయడం అంటే... మనం ఏమీ కోల్పోకుండానే ఇతరులకు ప్రాణదానం చేయడం. మనం ఇచ్చిన రక్తం కొద్ది వ్యవధిలోనే భర్తీ అవుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా కోల్పోయేది ఏదీ ఉండదు. పైగా రక్తం ఇస్తే సాక్షాత్తూ ప్రాణాలు ఇచ్చినట్లే. రక్తదానం చేయండి. రక్తం అవసరమైన ఎందరో రోగుల ప్రాణాలను కాపాడండి.
 
ఇన్‌పుట్స్: శైలేశ్ ఆర్.సింగీ,
హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్
ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్
(సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్)
 
అపోహలు - వాస్తవాలు
రక్తదానం పట్ల ప్రజల్లో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. అవి పోవాలి. అందరూ వాస్తవాలు తెలుసుకోవాలి.
అపోహ: రక్తదానం చేస్తే బలహీనమైపోతారు.
వాస్తవం: ఇది ఏమాత్రం నిజం కాదు. వాస్తవానికి ఓ వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి కేవలం 350 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం 21 రోజుల్లో పూర్తిగా భర్తీ అవుతుంది. అయినాగానీ ముందుజాగ్రత్తచర్యగా ఓసారి ఓ వ్యక్తి నుంచి రక్తం సేకరిస్తే మరో మూడు నెలల పాటు అతడినుంచి రక్తం సేకరించరు. అంటే... ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి 90 రోజులకు ఓమారు రక్తదానం చేయవచ్చు. 18-60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు. దీంతో ఎలాంటి బలహీనతా రాదు.
అపోహ: చక్కెర రోగులు రక్తదానం చేయడానికి అర్హులు కాదు.
వాస్తవం: చక్కెర రోగులూ రక్తదానం చేయవచ్చు.
 
మిరియాల సురేష్‌బాబు నిరుపేద. వయసు 32. ఊరు మార్కాపురం. ఇప్పటికి 36 సార్లు రక్తదానం చేశాడు. టీ దుకాణం నడుపుకునే సురేష్‌బాబు ఓ రోజు... రక్తం సమయానికి అందక ఆరుగురు చిన్నారులు మరణించారనే వార్త విన్నాడు. అప్పటి నుంచి స్వచ్ఛంద రక్తదాతగా మారాడు.
 
విజయవాడకు చెందిన మామిడి సాయి ఆకాశ్ వయసు 17 ఏళ్లు. రెండేళ్ల క్రితం ‘మదర్ బ్లడ్ బ్యాంక్’ అనే స్వచ్ఛంద  సంస్థను నెలకొల్పాడు. ఇప్పటికి 1.75 కోట్ల మందిని రక్తదాతలుగా మార్చి గిన్నిస్ రికార్డు సాధించాడు.  ఠీఠీఠీ.ఝ్టౌజ్ఛిట ఛౌౌఛీఛ్చజు.ఛిౌఝ వెబ్‌సైట్ ద్వారా రక్తదానంపై అవగాహన కలిగిస్తున్నాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement