నాకు పెళ్లి నిశ్చయమైంది. కానీ మనసులో ఏవో భయాలు. నాకు కాబోయే భర్త చెడుతిరుగుళ్లు తిరిగి ఉంటే నా పరిస్థితి ఏమిటి? అతనికేమైనా సుఖవ్యాధులు ఉన్నాయేమో... ఇలా రకరకాల భయాలు మొదలయ్యాయి. ‘సిప్రిడోఫోబియా’ నుంచి ఎలా భయటపడాలో దయచేసి తెలియజేయగలరు. – కెఆర్, కాజీపేట
సిప్రిడోఫోబియా అంటే కలయిక గురించిన భయం. దాని వల్ల లైంగిక వ్యాధులు, సుఖవ్యాధులు వస్తాయోమోనన్న భయం, అపోహలతో చాలామంది పెళ్లి అంటేనే భయపడిపొతుంటారు. పెళ్లయినా, భర్తని దూరం పెట్టడం, వాళ్లకి వాళ్ళే ఏదో అయిపోతుందని ఊహించేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. దీని లక్షణాలలో భాగంగా కంగారు, భయం, గుండెదడ, లేనిపోని అనుమానాల వంటివి ఎన్నో ఉండవచ్చు. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, ఆందోళన తగ్గడానికి కొన్ని మందులు వంటివి ఉంటాయి. అలాగే పాజిటివ్ థింకింగ్, యోగా, ధ్యానం వంటివి చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీలో భాగంగా ఈ సమస్య ఉన్నవాళ్లకి రకరకాల ఉదాహరణలు ఇవ్వడం, సుఖవ్యాధుల గురించి అవగాహన, కొన్ని వీడియోలు చూపడం వంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించి భయపడడం మానేసి ఒకసారి సైకాలజిస్ట్‌ను లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ చేయించుకోవడం మంచిది.
నాకు తరచుగా వైట్ డిశ్చార్జి అవుతుంది. నెలసరికి సంబంధం లేకుండా రక్తస్త్రావం అవుతోంది. దీనికి కారణాలు, నివారణ గురించి తెలియజేయగలరు.– యస్‌బి, రాజంపేట
వైట్ డిశ్చార్జ్, రక్తస్రావం తరచుగా అవుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. తరచుగా వైట్ డిశ్చార్జ్ అవుతుందన్నారు, అందులో దురద, చెడువాసన ఏమైనా ఉన్నాయా అని రాయలేదు. ఇవన్నీ కలిపి ఉంటే యోనిలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది.కొంతమందిలో పిరియడ్ మధ్యలో, పిరియడ్ వచ్చే ముందు కొద్దిగా జిగటగా వైట్‌డిశ్చార్జ్ అవుతుంది. అది మాములే.కొందరిలో రక్తహీనత, నులిపురుగులు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వైట్‌డిశ్చార్జ్ అవుతుంది. నెలసరి అప్పుడు కాకుండా మిగతా సమయంలో కూడా రక్తస్రావం అవుతుంటే మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల మార్పులు, థైరాయిడ్ సమస్య, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, గర్భాశయంలో పుండ్లు, ఇన్‌ఫెక్షన్‌లు, అండాశయంలో సిస్ట్‌ల వంటి అనేక కారణాల వల్ల రావచ్చు.ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, పెల్విక్ స్కానింగ్, బీపీ, థైరాయిడ్ వంటి కొన్ని రక్తపరీక్షలు చేయించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం వల్ల మీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గ, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది.
మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నాకు మంటగా ఉంటోంది. ఇది క్లమిడియా లక్షణమని మా కొలీగ్ చెబుతున్నారు. ఇది నిజమేనా? ఈ బ్యాక్టీరియా ఎందుకు సోకుతుంది? నివారణ చర్యలు ఏమిటి?
– విఎన్, నరసరావుపేట
మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా ఉండడం అనేది కేవలం క్లమిడియా బ్యాక్టీరియా వల్లే కాదు ఇంకా అనేక రకాల బ్యాక్టీరియాల ఇన్‌ఫెక్షన్‌ల వల్ల రావచ్చు. క్లమిడియా బ్యాక్టీరియా జాతికి చెందిన క్రిములు. ఇవి మగవారిలో వీర్యంలో, ఆడవారిలో యోనిస్రావాలలో ఉంటాయి. ఇవి కలయిక ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల మూత్రంలో మంట, పచ్చని యోని ద్రవాలు వస్తాయి.
దురద, మంట, కలయికలో నొప్పి, నెలసరి మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే క్లమిడియా బ్యాక్టిరియా యోని నుంచి గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ తద్వారా పొత్తి కడుపులోకి పాకి పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్(పీఐడి)ని కలుగజేస్తుంది. ఇందులో ట్యూబ్స్ పాడై అవి మూసుకోవడం, వాటి పనితీరు తగ్గడం... తద్వారా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వవచ్చు. ఇందులో జ్వరం, ఒళ్లునొప్పులు, వాసన, దురదతో కూడిన తెల్లబట్ట, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు గర్భం దాల్చితే అవి బిడ్డకు కూడా సోకి ఇబ్బందులు కలిగించవచ్చు. దీనికి లక్షణాలను బట్టి వెజైనల్ స్వాబ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. లక్షణాల తీవ్రతను బట్టి దీనికి అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్‌వంటి యాంటిబయాటిక్స్‌తో చికిత్స వారం నుంచి రెండు వారాల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కలయికకు దూరంగా ఉండడం మంచిది. అదే సమయంలో మగవారు కూడా మందులు వాడితే మంచిది.మంచి ఆహార నియమాలు, వ్యాయామాలతో రోగనిరోధకశక్తిని పెం చుకోవడం, శారీరక,వ్యక్తిగత శుభ్రతను పాటించడం, కలయిక సమయంలో కండోమ్స్ వాడడం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ను చాలావరకు అరికట్టవచ్చు.క్లమిడియా ఇన్‌ఫెక్షన్ ఒకసారి వచ్చిపోయినా, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారి రోగనిరోధకశక్తిని బట్టి కలయిక ద్వారా మళ్లీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment