విమ్స్‌లో బాలునికి అరుదైన ఆపరేషన్
సాక్షి, బళ్లారి : ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడికి విమ్స్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ విశ్వనాథ్ నేతృత్వంలో అత్యాధునిక శస్త్ర చికిత్స నిర్వహించారు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా కరడిహాల్ గ్రామానికి చెందిన ఓబుళేసు కుమారుడు అశోక్ అనే బాలుడు పదవ తరగతి చదువుకుంటున్నాడు. నాలుగు నెలల క్రితం బాలుడు పొలంలోకి వెళ్లి వస్తుండగా నాలుగు ఎలుగుబంట్లు దాడి చేశాయి. తల, కళ్లు, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు విమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ విశ్వనాథ్ బాలుడిని పరీక్షించి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేపట్టి బాలుడి ప్రాణాలు కాపాడారు. జ్ఞాపకశక్తి, కంటిచూపు, వాసన, స్పర్శ పూర్తిగా కోల్పోయిన అశోక్‌కు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో మామూలు స్థితికి చేరుకున్నాడు.
బతకడనుకున్న కొడుకుకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ విశ్వనాథ్‌ను బాలుడి తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు. ఈ విషయంపై డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ సోమశేఖర్ సమగండి, చంద్రకుమార్, ఆనంద్ తదితర వైద్య బృందం విలేకరులకు వివరించారు. ఎలుగుబంటి దాడులు, ఇతరత్ర గాయాలైన వెంటనే తనను సంప్రదించాలని విమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామని డాక్టర్ విశ్వనాథ్ పేర్కొన్నారు.