ఫైబ్రాయిడ్స్‌కు చికిత్సను సూచించండి
నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్యనిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ (చిన్న చిన్న కంతులు) ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి.
- కె. శ్యామల, వనస్థలిపురం
మీరు ప్రస్తావించిన ‘కంతుల’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా పొత్తికడుపు కింది భాగంలో కొద్దిపాటి నొప్పి ఉండటం, గట్టిగా, భారంగా ఉండటం, కొంతమందిలో పీరియడ్స్ సంబంధం లేకుండానే అధికరక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ కంతి సైజు పెద్దదిగా ఉండి, ఇతర సమస్యలు ఉంటే తప్ప ఆపరేషన్ అక్కర్లేకుండా, దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు...
1. కైశోర గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2
2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2
3. శతావరీ లేహ్యం ... ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా
4. అశోకారిష్ట (ద్రావకం) ... నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి ... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు.
మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి.
- ఎస్. మేరీ, హనమకొండ
ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందునుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది.
1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కల్పి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి; గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
ఆయుర్వేద కౌన్సెలింగ్
Published Tue, Jul 7 2015 10:58 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM
Advertisement
Advertisement