తన సిబ్బందితో సోనమ్...
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్.
పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది.
యూరప్‌లో చూసి
‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు.
ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె.
2021లో ప్రారంభం
పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్‌లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు.
అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్‌లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్.
వారూ మనవారే
సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది.
దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి.
రెస్టరెంట్‌లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్
Comments
Please login to add a commentAdd a comment