Oncologists
-
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్‌లో చూసి ‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
Health: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..
క్యాన్సర్ కణాన్ని తుదముట్టించడానికి సర్జరీ, కీమో, రేడియేషన్ లాంటి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా కీమోలో. అదే క్యాన్సర్‌ను చంపేసే అదే రసాయనాన్ని చాలా కచ్చితత్త్వంతో కేవలం క్యాన్సర్ కణంపైనే ప్రయోగించేలా చూడగలిగితే...? అదే ‘ప్రెసిషన్ ఆంకాలజీ’!! అంటే క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో రసాయనాన్ని గురిపెట్టి కొట్టడమనే ఆ ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్యాన్సర్ కణాలను తొలగించడానికి సర్జరీలు, రేడియేషన్, కిమో చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిల్లో ఆరోగ్యవంతమైన కణాలకు ఎంతకొంత ముప్పు ఉంది కాబట్టి... ఆ అనర్థాలను తప్పిస్తూ... సరిగ్గా క్యాన్సర్ కణాన్నే గురిపెట్టేలాంటి (టార్గెట్ చేసేలాంటి) మందుల పైనా, చికిత్స ప్రక్రియలపైనా మొదట్నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కచ్చితంగా క్యాన్సర్ కణాన్నే దెబ్బతీసేలాంటి చికిత్స కాబట్టి... దీన్ని ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ అంటారు. కేవలం క్యాన్సర్ కణాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి టార్గెటెడ్ థెరపీ అంటున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన కణానికి ఏమాత్రం దెబ్బతగలకుండానో లేదా అత్యంత తక్కువగా నష్టం జరిగేలాగానో జరిగే మందులు రానున్నాయి. అది కూడా కొంత బాధాకరమైన కీమోలోలా రక్తనాళంలోకి ఎక్కించడం కాకుండా... సింపుల్‌గా నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో అందుబాటుకి ఇప్పటికే వచ్చాయి, ఇంకా రానున్నాయి. దెబ్బతిన్న జన్యువుకు గురిపెట్టి, క్యాన్సర్‌ను మొగ్గలోనే తుంచేయడం ఎలా? ఈ సహస్రాబ్దం మొదట్లో అంటే 2001లో మానవ జన్యుపటలాన్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమైంది. ఈ జన్యుపటలంలో ని ఏ కణమైతే దెబ్బతిన్నదో, అది ఇష్టం వచ్చినట్లుగా అపరిమితంగా అనారోగ్యకరంగా పెరిగి క్యాన్సర్ గడ్డలకు కారణమవుతుంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జన్యుపటలంలో సరిగ్గా నిర్దిష్టంగా ఏ కణం తాలూకు జన్యువు దెబ్బతిని, అక్కడ్నుంచి అది క్యాన్సర్‌గా మారుతుందో తెలుసుకుని, సరిగ్గా అపరిమితమైన కచ్చితత్త్వంతో దాన్ని మాత్రమే తుదముట్టించేలా ఔషధాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడు పెరగబోయే క్యాన్సర్ గడ్డను సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ పెరగదు. ఇది స్థూలంగా ‘టార్గెటెడ్ థెరపీ’ తాలూకు సిద్ధాంతం. ఇందుకు ఉపయోగపడేదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ తల్లిదండ్రుల తాలూకు వీర్యకణం, అండం కలిసి పిండం ఏర్పడి... అదే తర్వాత బిడ్డగా ఎదుగుతుంది. ఓ జీవరాశి కలిగి ఉన్న వ్యక్తికి కణం ఎలా మూలమో, ఓ కణానికి దాని తాలూకు జన్యువులు అలా మూలం. ఆ జన్యుపటలంలో ఏదైనా జన్యువు దెబ్బతిని ఉంటే... ఆ తర్వాతి తరం వ్యక్తిలో అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందుకే తర్వాతి తరం బిడ్డకు ఎలాంటి జీవకణాలు రాబోతున్నాయో తెలుసుకునేందుకు ఓ పరీక్ష ఉపయోగపడుతుంది. అదే ‘నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ పరీక్ష. దీన్నే సంక్షిప్తంగా ‘ఎన్జీఎస్’ అంటారు. దీనితో భవిష్యత్తులో బిడ్డపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతగా ఉందో తెలుస్తుంది. అలా క్యాన్సర్ గనకా వస్తే అది భారమే కదా. అందుకే ఆ భారాన్ని ‘ఎన్జీఎస్ ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్’గా పేర్కొంటారు. ఇలా రాబోయే తరాల్లో ఎవరెవరికి క్యాన్సర్ రానుందో తెలుసుకుని... సరిగ్గా క్యాన్సర్‌ను కలగజేయబోయే ఆ నిర్దిష్ట జన్యువుకు తగిలేలా చికిత్స అందించడం అన్నదే ఈ ప్రక్రియ వెనకనున్న సిద్ధాంతం. ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అన్నది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జన్యువు తీరును బట్టి ప్రత్యేకమైన చికిత్స (టైలర్ మేడ్) చికిత్సలూ సాధ్యం కానున్నాయి. అప్పుడు నొప్పి, బాధాలేని అనేక దీర్ఘకాలిక క్యాన్సర్లను తేలిగ్గా తగ్గించే రోజు త్వరలోనే రానుంది. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’కి మంచి ఉదాహరణ ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ పదేళ్ల కిందట నాలుగో దశలోని లంగ్ క్యాన్సర్ అంటే ఇక అది మరణంతో సమానం. కేవలం 7 శాతం మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పడు ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ ప్రక్రియ ద్వారా ఏ జన్యువులు దెబ్బతిన్నాయో వాటిని మార్చడం వల్ల బతికి బయటపడే వారు 40 శాతానికి పెరిగారు. పూర్తిగా ఆశవదిలేసుకున్న బాధితులు సైతం కనీసం ఐదేళ్లకు మించి ఆయుష్షు పొందారు. అంతేకాదు... వీళ్లు సాధారణ కీమోతో మిగతా అవయవాలకూ, కణాలకూ జరిగే నష్టాన్ని, తద్వారా వాళ్లకు కలిగే అమితమైన బాధనుంచి విముక్తమయ్యారు. రొమ్యు క్యాన్సర్ నుంచి విముక్తం కావడం కూడా ప్రెసిషన్ ఆంకాలజీకి ఓ మంచి ఉదాహరణ. ఈ క్యాన్సర్‌లో ‘హర్ 2’ అనేది ఓ రకం. దీనికి గురైనవారిలో తొలిదశలో క్యాన్సర్ కణాలు చాలా చురుగ్గా, దూకుడుగా పెరుగుతాయి. వేగంగా ఇతర కణాలకు వ్యాపిస్తాయి. అయితే అమితమైన కచ్చితత్త్వంతో మంచి కణాలను వదిలేసి, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే దెబ్బతీసే టార్గెట్ థెరపీ మందులు రొమ్ముక్యాన్సర్ చికిత్సలో ఓ విప్లవాన్నే తీసుకొచ్చాయి. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ –హెమటో ఆంకాలజిస్ట్ -
పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. అయితే... ఆ ముప్పు మాత్రం..
కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మహిళల్లో ఎక్కువ. సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది. అలాగే చాలా అరుదుగానైనా పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ కనిపించినా... మహిళల్లోనే అది ఎక్కువ. మహిళలకు వచ్చే క్యాన్సర్ల గురించి అవగాహన కోసమే ఈ కథనం. సర్వికల్ క్యాన్సర్... సర్వికల్ క్యాన్సర్ అన్నది మునుపటి అంత ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ చాలా ముందుగానే గుర్తించవచ్చు. దీనికి కారణం... క్యాన్సర్ వచ్చే ముందర ఉండే ప్రీ–క్యాన్సర్ దశ... దీనికి చాలా ఎక్కువ. అంటే తనను గుర్తించడానికి అది చాలా ఎక్కువ వ్యవధి ఇస్తుందన్నమాట. ఈ ప్రీ–క్యాన్సర్ లక్షణాలతో అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందే దాన్ని పసిగట్టవచ్చు. దాంతో నిరోధించడానికి అవకాశాలు కూడా ఎక్కువే. దానికోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలు ఇలా... ప్రతి మహిళా 25 ఏళ్లు దాటాక ఒకసారి పరీక్ష చేయించాలి. ప్రీ–క్యాన్సర్ ఏదీ కనిపించకపోతే అప్పట్నుంచి ప్రతి మూడేళ్లకోమారు ఈ పరీక్ష చేయించుకోవాలి. వ్యాక్సిన్: సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుందని కనుక్కున్నారు. దానికి వ్యాక్సిన్ రూపొందించడమూ సాధ్యమయ్యింది. అయితే దీన్ని వ్యాధి రాకమునుపే తీసుకోవాలి. మనదేశంలో ఈ వ్యాధి విస్తృతి దృష్ట్యా అమ్మాయిలు ఈ వ్యాక్సిన్‌ను 10–15 ఏళ్లప్పుడే తీసుకుంటే మంచిది. రొమ్ము క్యాన్సర్: ఈ తరహా క్యాన్సర్లలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతుంటాయన్నమాట. మరీ స్పష్టంగా చెప్పాలంటే 80 ఏళ్లు పైబడ్డ ప్రతి పదిమందిలో ఒకరికి ఇది తప్పక కనిపిస్తుంది. ఎవరెవరు రిస్క్ గ్రూప్ : విస్తృతి ఎక్కువ కాబట్టే మహిళల్లో దీని గురించి ఆందోళన కూడా అధికమే. అయినా అంతగా బెంగ పడనక్కర్లేదు. కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు, రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉంటే ∙పిల్లలు లేని వాళ్లలో ∙మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే ఐదేళ్లకు పైబడి హార్మోనల్ చికిత్స తీసుకుంటూ ఉంటే... వీళ్లకు ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్ గ్రూపులు చేయించాల్సిన మూడు పరీక్షలు చేయించుకోవాలి. మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది. ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా అర్థమైపోతుంది. దాంతో ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. ఈ పరీక్షలు ఎలాగంటే... ►ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి. ►ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి. ►40 ఏళ్లు దాటాక 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి. ►50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది. ►ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు పరీక్షలు ఇంకా త్వరితంగానే అవసరం కావచ్చు. చాలా హై రిస్క్ ఉంటే... కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదీ లేనిదీ... కొన్ని జన్యుపరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అన్నదాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఓ చిన్ని రక్తపరీక్ష ద్వారా దీన్ని కనుక్కోవడం చాలా సులభం. కాబట్టి రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. -డాక్టర్ సీహెచ్. మోహనవంశీ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్z ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబర్: 98480 11421 చదవండి: Health Tips: గర్భవతుల్లో తినగానే కడుపులో ఇబ్బందిగా ఉంటే... -
క్యాన్సర్ కొత్త చికిత్సల్లో... ఇమ్యూనోథెరపీ చేసే మేలు ఇది!
క్యాన్సర్‌కు సోకితే కేవలం రోగిని మాత్రమేగాక మొత్తం కుటుంబాన్నే కుంగదీస్తుంది. ఆర్థికంగా, మానసికంగా కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల రోగులపై వారి కుటుంబాలపై పడే అన్ని రకాల భారాలు చాలా ఎక్కువ. అందుకే మరింత ఎక్కువ ప్రయోజనాలిచ్చే కొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటివాటిల్లో మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఒకటి. దీన్నే ఇమ్యూనోథెరపీగా చెప్పవచ్చు. ఇదెలా ఉంటుందో చూద్దాం. ఇమ్యూనోథెరపీ మూలాలు పందొమ్మిదో శతాబ్దంలోనే పడ్డాయి. డాక్టర్ విలియమ్ కోలీ అనే ఓ వైద్యవిజ్ఞాన పరిశోధకుడు... చనిపోయిన ఓ బ్యాక్టీరిమ్ కణాల్ని క్యాన్సర్ గడ్డలోకి ప్రవేశపెట్టినప్పుడు అది క్రమంగా కుంచించుకుపోవడాన్ని గమనించాడు. 21వ శతాబ్దం నాటికి ఇమ్యూనాలజీ బాగా పురోగమించింది. ఈ మధ్యకాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి చాలా పరిశోధనలు జరిగాయి. వాటిల్లో 2018లో డాక్టర్ జేమ్స్ పి. అలిసన్, టసుకో హాంజో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ముఖ్యమైనది. వారిద్దరికీ నోబుల్ బహుమతి కూడా వచ్చింది. దేహంలోని వ్యాధినిరోధక కణాల్లో టీ–సెల్స్ అనేవీ ఒక రకం. సాధారణ కణమేదో, హానికరమైన కణం ఏదో గుర్తించగలిగే శక్తి వీటికి ఉంటుంది. అవి కేవలం హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ కణాలపైనే దాడి చేస్తాయిగానీ దేహంలోని మామూలు కణాలకు ఏ హానీ చేయవు. అయితే ఇక్కడో విచిత్రం జరుగుతుంది. క్యాన్సర్ కణాలు దేహంలోని ఇతర కణాలకు తీవ్రంగా హానిచేసేవే అయినప్పటికీ... అవి కూడా మన సొంతకణాలే అనిపించేలా భ్రమింపజేస్తూ... ‘టీ–సెల్స్’ను మోసం చేస్తాయి. అలా అవి మన ‘వ్యాధినిరోధక’ కణాలు దాడి నుంచి తప్పించుకోగలుగుతాయి. ఇటీవల ఇమ్యూనోథెరపీలో రానున్న మందులు వినూత్నమైనవి. ఇవి ఎలాంటివంటే అవి హానికరమైన క్యాన్సర్ కణాలను నేరుగా ఎదుర్కొనడానికి బదులుగా... ఆ కణాలు తప్పించుకోకుండా ఉండేలా చూస్తాయి. అవి మనకు శత్రుకణాలని ‘టీ–సెల్స్’కు తెలిసిపోయేలా చేస్తాయి. హానికరమైనవని తెలిసిపోవడంతో మిగతా పనంతా మన సొంత ‘వ్యాధినిరోధకతే’ చేసేస్తుంది. అంటే... ఆ హానికారక కణాలను మన ‘ఇమ్యూనిటీ’ చంపేస్తుంది. ప్రస్తుత కీమోథెరపీలోని రకరకాల రసాయనాలు క్యాన్సర్ కణాలతోపాటు మన సొంత కణాలపై కూడా దుష్ప్రభావాలను చూపడం, అవి కూడా నశించిపోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. కానీ ఈ చికిత్స ప్రక్రియ లో పనంతా మన సొంతరోగనిరోధక వ్యవస్థ చేసినట్లుగా స్వాభావికంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియల్లో సైడ్ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఇలా ఇమ్యూనోథెరపీ అన్నది ఇటీవల క్యాన్సర్ చికిత్స రంగంలో మేలైన మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పవచ్చు. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ – హెమటో ఆంకాలజిస్ట్ -
Cancer: క్యాన్సర్ గురించి అవి కేవలం అపోహలు మాత్రమే.. వాస్తవాలేమిటి?
క్యాన్సర్ గడ్డపై కత్తి ఆనిస్తే అది మరింతగా విజృంభించి విస్తరిస్తుందనీ, క్యాన్సర్ ఏదైనా... సర్జరీ చేయకూడదనే అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అయితే తొలిదశ లో క్యాన్సర్‌ను కనుగొంటే దాన్ని నూరు శాతం నయం చేయడానికి శస్త్రచికిత్సే ప్రధాన ప్రక్రియ అనీ, దాదాపు అరవై శాతానికి పైగా క్యాన్సర్లు నయం చేయవచ్చని అంటున్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు (సీఎస్ రావు). క్యాన్సర్‌పై ఉన్న అపోహా వాస్తవాల గురించి ఆయన ఏమన్నారో చదవండి. కొన్ని క్యాన్సర్లకు (ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ల వంటివాటికి) కేవలం శస్త్రచికిత్సే అసలైన చికిత్స అంటారు కదా. అది ఎంతవరకు వాస్తవం? జ. హార్మోన్ల తేడాలతో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పాటు ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ వంటి వాటికి శస్త్రచికిత్సే ప్రధాన చికిత్స. నిజానికి సరైన రీతిలో శస్త్ర చికిత్స చేసినప్పుడు తొలిదశ రేడియేషన్ అవసరమే ఉండకపోవచ్చు. కాకపోతే అప్పటికే వేరేచోటికి క్యాన్సర్ కణాలు పాకి ఉండవచ్చుననే అభిప్రాయంతోనే రేడియేషన్ లేదా కీమో ఇవ్వాల్సి వస్తుంటుంది. లేదంటే కేవలం శస్త్ర చికిత్సతోనే మొత్తం రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది. శస్త్రచికిత్స వల్ల వ్రణాన్ని తొలగించడం వల్ల దేహంలో కొన్ని చోట్ల సొట్టలు కూడా పడే అవకాశముంది కదా... వాటిని సరిదిద్దడానికి ఏవైనా మార్గాలున్నాయా? జ. శస్త్రచికిత్స తర్వాత పడే సొట్టలు రెండు రకాలు. అవి... 1. బయటకు కనిపించేవి 2. బయటకు కనిపించనివి. బయటకు కనిపించే వాటికే ప్లాస్టిక్ సర్జరీ అవసరం వస్తుంది. బయటకు కనిపించని వాటి కారణంగా మనలో... అంటే మనం నిర్వహించే పనుల్లో ఏవైనా లోపాలు (ఫంక్షనల్ లాస్) తలెత్తినప్పుడు మరికొన్ని శస్త్రచికిత్సల సహాయంతో వాటిని అధిగమించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ మళ్లీ మనకు పనికి వచ్చేది ‘శస్త్రచికిత్స’ ప్రక్రియే. ‘కత్తి ఆనిస్తే చాలు... క్యాన్సర్ మరింతగా రెచ్చిపోతుంది. ఇంకా ఎక్కువగా పాకుతుంది’ అంటారు అందుకే క్యాన్సర్‌పై కత్తే పెట్టకూడదు అనే మాట చాలామందిలో ఉంది. అది కేవలం అపోహా? ఇందులో ఏదైనా వాస్తవం ఉందా? జ: నిజానికి క్యాన్సర్గురించి వైద్యశాస్త్ర పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన దశలో శస్త్రచికిత్స చేస్తుండేవారు. అప్పటికే క్యాన్సర్ కణాలు వేర్వేరు అవయవాలకు విస్తరించి ఉండటంతో, అసలు క్యాన్సర్ గడ్డను (ప్రైమరీని) తొలగించినప్పటికీ... ఇతర ప్రాంతాలకు విస్తరించిన గడ్డలు (సెకండరీ ట్యూమర్స్) పెరుగుతుండేవి. ఫలితంగా క్యాన్సర్‌కు కత్తి పెట్టకూడదనే దురభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడు మొదటి, రెండో దశలోనే క్యాన్సర్లను కనుగొంటున్నందున శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయమైపోయిన రోగులెందరో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కత్తి పెట్టలేని మారుమూల ప్రదేశాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలకీ , లేదా కత్తి ఆనించడమే సమస్య గా మారే మెదడు వంటి కీలకమైన అవయవాల్లోని లోపలి భాగాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్సల్లో ఏవైనా అధునాతన ప్రక్రియలు ఉన్నాయా? జ. మనం శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ గడ్డల (డీప్ సీటెడ్ ట్యూమర్స్)ను తొలగించేందుకు... ఎమ్మారై గైడెడ్ సర్జరీ, సింటిగ్రఫీ గైడెడ్ సర్జరీ, అల్ట్రా సౌండ్ గైడెడ్ సర్జరీ వంటి కొన్ని ప్రక్రియలు సమర్థంగా ఉపయోగపడతాయి. వాటి సహాయంతో దేహంలోని మారుమూల ప్రాంతాల్లో చాలా లోతుగా ఉన్న గడ్డలనూ తొలగించవచ్చు. భవిష్యత్తులో శస్త్రచికిత్స విషయంలో రాబోయే విప్లవాత్మకమైన మార్పులు ఏవైనా ఉన్నాయా? జ. గతంలో క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా కనుగొనేవారు. కానీ ఇటీవల క్యాన్సర్ తొలిదశలో ఉండగానే లేదా అంతకు చాలా ముందుగానే కనుగొనడమే ఓ విప్లవవాత్మకమైన మార్పు. కేవలం ఈ కారణంగానే కొన్ని క్యాన్సర్లు సమూలంగా నయమయ్యే అవకాశం దక్కింది. అందుకే మూడు దశాబ్దాలకు ముందు... క్యాన్సర్లలో 85 శాతం నయం కానివి ఉండేవన్న అపప్రథ ఉండేది. కానీ ఇప్పుడు 85 శాతం పూర్తిగా నయమైపోతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్స వల్లే సమూలంగా తొలగించడం సాధ్యమవుతోంది. దీనికి తోడు రేడియో గైడెడ్ లోకలైజెషన్, రేడియోలాజికల్ లోకలైజెషన్, ఇంట్రా ఆపరేటివ్ కీమో థెరపీ, ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ లాంటి విప్లవాత్మకమైన ప్రక్రియల ద్వారా మరింత సమర్థమైన చికిత్సకు అవకాశం దక్కింది. క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రాధాన్యమేమిటి? పరిమితులు ఏమిటి? జ: క్యాన్సర్‌కు మొట్టమొదటి వైద్యం శస్త్ర చికిత్సయే. ఇది ఎక్కువగా గడ్డల రూపంలో కనిపించే క్యాన్సర్ వ్రణాల్లో (సాలిడ్ ట్యూమర్స్) బాగా ఉపయోగపడుతుంది. ఉదా: థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయం, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎముకల్లో వచ్చే సార్కోమా, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్. అంటే దాదాపు 60 శాతం క్యాన్సర్ లకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్ర చికిత్స వల్ల వ్యాధి ఏయే దశలలో ఉందన్న సమాచారమూ తెలుస్తుంది. తొలి దశలలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ శస్త్రచికిత్స సహాయంతో పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో ముదిరి పోయిన క్యాన్సర్‌లో శస్త్ర చికిత్స వల్లనే ఉపశమనం లభిస్తుంది. ఉదా: వాసన వచ్చే పుండు, పేగుకు రంధ్రం పడినప్పుడు, శ్వాస తీసుకునేందుకు అంతరాయం కలుగుతున్న సందర్భాల్లో శస్త్ర చికిత్సతోనే రోగికి ప్రాణదానం చేయవచ్చు. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చదవండి: Gas Problem Solution: గ్యాస్ సమస్యా... పాస్తా, కేక్ బిస్కెట్స్, ఉల్లి, బీట్రూట్స్ తింటే గనుక అంతే! -
క్యాన్సర్ నిస్సత్తువను జయిద్దాం రండి!
క్యాన్సర్ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్ వ్యాధి కారణంగానూ, చికిత్సతోనూ వచ్చే తీవ్రమైన నిస్సత్తువ. వ్యాధిగ్రస్తుణ్ణి తీవ్రమైన నీరసం అనుక్షణం కుంగదీస్తూ ఉంటుంది. ఏమాత్రం చురుగ్గా ఉండనివ్వదు. ఈ నీరసం నిస్సత్తువ, అలసటగా అనిపించే భావన రోగిని మందకొడిగా చేసి... కొన్నిసార్లు మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. దాంతో క్యాన్సర్‌పై పోరు కంటే... ఈ నిస్సత్తువతో పోరే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. కొంతమంది రోగులు తొలుత కాస్త కుంగిపోయినా... క్రమంగా తమ మానసిక బలాన్ని కోల్పోని వారు క్యాన్సర్ పోరుపై తప్పక విజయం సాధిస్తారు. డిసెంబరు నెలను ‘క్యాన్సర్ ఫెటీగ్ అవేర్నెస్ మాసం’ గా పేర్కొంటారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తుల నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్)పై అవగాహన, వాటిని అధిగమించే తీరుతెన్నులను తెలుసుకుని, వ్యాధిపై విజయం సాధించడం కోసం ఉపయోగపడేందుకే ఈ కథనం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్) చాలా సాధారణం. కానీ చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. దీనివల్ల కలిగిన వ్యాకులత, కుంగుబాటు వల్ల రోగి జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగి తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేడు. దాంతో జీవితాన్ని ఆస్వాదించలేడు. ఈ నిస్సత్తువకు చాలా కారణాలే ఉంటాయి. నిర్దిష్టంగా ఫలానా అంశమే దీనికి కారణం అని చెప్పడానికి వీలుకాదు. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి కరవవుతుంది. కానీ కొన్ని పరిమితుల మేరకు దీన్ని అధిగమించడానికి చాలా మార్గాలున్నాయి. ఆ కారణాలనూ, మార్గాలను చూద్దాం. కారణాలు రక్తహీనత (అనీమియా): అనీమియా అనే కండిషన్ క్యాన్సర్ నిస్సత్తువకు ఒక ప్రధాన కారణం. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో (అందునా ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్లలో) వారి ఎముక మూలుగ ఎక్కువగా ప్రభావితమై ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఈ ఎర్రరక్తకణాలే దేహంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను తీసుకెళ్తాయన్న విషయం తెలిసిందే. దాంతో కణాలకు అందే ఆక్సిజన్ తగ్గి నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. శరీరంలో విషాలు తొలగకపోవడం: ఆక్సిజన్ అందించడంతో పాటు ఎర్రరక్తకణాలు దేహంలో తయారైన కార్బన్డయాక్సైడ్, ఇతర విషాల (టాక్సిన్స్)ను బయటకు పంపుతాయి. కానీ ఎర్రరక్తకణాలు తగ్గడంతో కణానికి అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు బయటకు విసర్జించాల్సిన విషాలను తీసుకెళ్లే సామర్థ్యమూ తగ్గుతుంది. దేహంలో ఉండిపోయిన ఈ విషాలు జీవక్రియలకు ఆటంకంగా కూడా పరిణమిస్తాయి. ఫలితంగా రోగిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. రోగి ఎప్పుడూ అలసట తో ఉన్నట్లుగా ఉంటాడు. బ్లడ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో తగినంత ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి సాధారణం. క్యాన్సర్ చికిత్సల వల్ల : కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రోగులకు అందించే కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సల కారణంగానూ, బోన్ మ్యారో క్యాన్సర్లకు అందించే మందుల కారణంగా కూడా రోగుల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ చికిత్సల్లో భాగంగా క్యాన్సర్ కణాల్ని తుదముట్టించడానికి టార్గెట్ చేస్తున్నప్పుడు... ఆరోగ్యవంతమైన కణాలు కూడా అంతో ఇంతో దెబ్బతినడం జరుగుతుంది. ఈ కారణంగా క్యాన్సర్ రోగుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో చికిత్సలో కలిగే నొప్పి, యాంగై్జటీ/ డిప్రెషన్‌కు గురికావడం, మందకొడిగా ఉండాల్సిరావడం (ఇనాక్టివిటీ), తరచూ నిద్రాభంగం కావడం, నిద్రలో అంతరాయాలు, సరిగా భోజనం తీసుకోకపోవడం వంటివి కూడా నీసరం, నిస్సత్తువకు కారణమవుతాయి. ► అధిగమించడం ఇలా ... నీరసం, నిస్సత్తువ ఉన్నప్పటికీ తొలి దశల్లో మనోబలంతో క్రమంగా మంచి ఆహారానికీ, క్రమబద్ధంగా వ్యాయామానికీ ఉపక్రమించడంతో ‘క్యాన్సర్ ఫెటీగ్’ను అధిగమించవచ్చు. క్రియాశీలంగా ఉండటం (ఇంక్రీజింగ్ యాక్టివిటీ) : రోగులు తమలో ఉన్న నీరసం, నిస్సత్తువలకు లొంగిపోకుండా... ఎంతోకొంత చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. అలసట కలిగించని తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ఉపక్రమించాలి. దాంతో దేహంలోనూ, మెదడులోనూ చురుకు పుట్టించే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు స్రవిస్తాయి. ఫలితంగా మూడ్స్ కూడా మెరుగుపడతాయి. రోగిలో సంతోషభావనలు కలుగుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్ : క్యాన్సర్ రోగుల్లో చాలామంది తమ బరువు కోల్పోయి... చాలా సన్నబడతారు. రోగులు తమ వ్యాకులత కారణంగా తినకపోవడంతో పాటు... చికిత్సలో భాగంగా కనిపించే ఆకలిలేమి, వికారం, వాంతుల వల్ల కూడా తినలేకపోతారు. దాంతో ఆహారం తీసుకోకపోవడం, ఫలితంగా దేహానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం జరుగుతాయి. దేహంలోకి పోషకాలు అందేందుకు, నోటికి రుచిగా ఉండేలా ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు అనే అంశంపై అవగాహన కలిగించుకునేందుకు ‘న్యూట్రిషన్ కౌన్సెలర్’ను సంప్రదించాలి. అపుడు ఆహార నిపుణులు దేహానికి అవసరమైనన్ని క్యాలరీలూ, ద్రవాహారాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను సూచిస్తారు. మానసిక బలం కోసం తోడ్పాటు చాలామంది రోగులు తమకు క్యాన్సర్ ఉందని తెలియగానే తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతారు. నిజానికి ఈ రోజుల్లో క్యాన్సర్లు దాదాపు 90 శాతానికి పైగా రకాలను పూర్తిగా నయం చేయవచ్చు. మొదటి, రెండో దశలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే రోగులు తమ మానసిక బలాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్, సోషల్ థెరపీల కోసం మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. మానసిక చికిత్సలతో కూడా క్యాన్సర్ ఫెటీగ్‌ను చాలావరకు అధిగమించవచ్చు. విశ్రాంతి : క్రియాశీలంగా ఉండటానికి ప్రయత్నించడంతో పాటు... కొన్ని సందర్భాల్లో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ఈ విశ్రాంతి మళ్లీ మన శక్తిసామర్థ్యాలను (ఎనర్జీని) ఆదా చేసుకోడానికీ... దాంతో మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రియాశీలం కావడానికి ఉపయోగ పడుతుందని గ్రహించాలి. అందుకే తమ నిస్సత్తువ కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అనుకోకుండా... అలాంటి విశ్రాంతి సమయాల్లో ఇతరులపై ఆధారపడుతున్నామని సిగ్గుపడకుండా... విశ్రాంతి సమయాన్ని ఎనర్జీని ఆదా చేసుకునే టైమ్‌గా పరిగణించాలి. ఇలా ఈ సానుకూల దృక్పథంతో రోగి మళ్లీ శక్తి పుంజుకుని చురుగ్గా మారగలుగుతాడు. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్) ఎప్పుడూ తనకు వచ్చిన వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవవచ్చు. హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడవచ్చు. ఫ్రెండ్స్‌తో సంభాషించవచ్చు (ఈ కోవిడ్ సమయంలో వ్యక్తిగతంగా కలవలేకపోయినా... మొబైల్స్‌లో, వాట్సాప్ ద్వారా ఇతరులతో సంభాషణలు చేయవచ్చు. ఇలా రోగులు తమ సరదా సమయాన్ని గడపవచ్చు. ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండటం అంటే వ్యాధిపై సగం విజయాన్ని సాధించడమే. కంటికి తగిన నిద్ర చాలామంది క్యాన్సర్ రోగులకు ఉండే ప్రతికూలత ‘నిద్ర’. రోగుల్లో చాలామందికి తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో రోగి మరింత నిస్సత్తువగా మారిపోతాడు. రోగుల్లో ఫెటీగ్‌కు ‘నిద్ర’ అనే అంశం చాలా ప్రధానమైంది. చిన్న చిన్న టెక్నిక్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా రోగులు తమలోని వ్యాకులతను, కుంగుబాటును అధిగమించడం ద్వారా కంటినిండా నిద్రపోవచ్చు. కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను కేవలం ఉదయం పూటకు మాత్రమే పరిమితం చేయడం, నిద్రకు ముందు తీసుకోకపోవడం, నిద్ర వచ్చినప్పుడో లేదా మధ్యానం పూటో కాస్తంత చిన్న చిన్న కునుకులు తీయడం, పవర్న్యాప్ను అలవరచుకోవడం, వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లను అలవరచుకోవడం లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా రోగులు తమ నిద్రాభంగాలనూ, నిద్రలో అంతరాయాల సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. కంటినిండా నిద్రపోవడం అనే అంశం కూడా రోగిలో వ్యాధి నివారణశక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది కూడా రోగి త్వరగా కోలుకునేలా చేసే అంశమే. అవసరాన్ని బట్టి మందులు ఒకవేళ రోగిలోని అలసట భావన చాలా ఎక్కువగానూ, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఉంటే రోగి కారణాలనూ, పరిస్థితిని బట్టి డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తారు. రక్తహీనత తక్కువగా ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర మందులు, మానసిక కారణాలున్నవారికి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి ఔషధాలను ఇస్తారు. క్యాన్సర్ రోగులెవరైనా క్యాన్సర్ ఫెటీగ్‌తో బాధపడుతుంటే పైన సూచించిన సూచనలను పాటించడం ద్వారా తమకు తామే సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమస్య అధిగమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం చాలా ప్రధాన అంశం. దీన్ని గ్రహిస్తే సగం సమస్య పరిష్కారమైనట్లే. సగం వ్యాధి తగ్గినట్లే. డా. అజయ్ చాణక్య కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
ఆయుర్వేద కౌన్సెలింగ్
ఫైబ్రాయిడ్స్‌కు చికిత్సను సూచించండి నా వయసు 35. ఇద్దరు పిల్లలు. ఇటీవల పొట్టలో నొప్పిగానూ, కొంచెం గట్టిగానూ ఉంటే, స్త్రీవైద్యనిపుణులను సంప్రదించాను. పరీక్షలన్నీ చేసి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ (చిన్న చిన్న కంతులు) ఉన్నాయని, హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇవి తగ్గడానికి, ఆపరేషన్ లేకుండా, ఆయుర్వేదంలో మందులుంటే సూచించండి. - కె. శ్యామల, వనస్థలిపురం మీరు ప్రస్తావించిన ‘కంతుల’ను ఆయుర్వేద పరిభాషలో ‘గ్రంథి లేక అర్బుదము’ అంటారు. ఇలాంటివి గర్భాశయంలో కూడా సంభవించవచ్చు. వాటి పరిమాణాన్ని బట్టి, లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా పొత్తికడుపు కింది భాగంలో కొద్దిపాటి నొప్పి ఉండటం, గట్టిగా, భారంగా ఉండటం, కొంతమందిలో పీరియడ్స్ సంబంధం లేకుండానే అధికరక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ కంతి సైజు పెద్దదిగా ఉండి, ఇతర సమస్యలు ఉంటే తప్ప ఆపరేషన్ అక్కర్లేకుండా, దీన్ని తగ్గించడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వాటిని మీ ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ఒక ఆరునెలల పాటు వాడితే ఈ వ్యాధి గణనీయంగా తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మందుల వివరాలు... 1. కైశోర గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 2. కాంచనార గుగ్గులు (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 3. శతావరీ లేహ్యం ... ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా 4. అశోకారిష్ట (ద్రావకం) ... నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి (ఒక మోతాదు) రెండు పూటలా తాగాలి. అధిక రక్తస్రావం తగ్గడానికి ... ‘బోలబద్ధరస’ మాత్రలు రెండేసి చొప్పున, రోజుకి మూడు సార్ల వరకు వాడవచ్చు. ఇవి ఒక వారం రోజుల వరకు వాడవచ్చు. మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. నాలుగేళ్ల క్రితమే రజస్వల అయ్యింది. నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. ఆయుర్వేదంలో పరిష్కారం తెలపండి. - ఎస్. మేరీ, హనమకొండ ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ఈ వికారాన్ని ఆయుర్వేదంలో ‘కష్టార్తవ లేక ఉదావర్తం’గా వివరించారు. వివాహం తర్వాత, కాన్పు తర్వాత చాలావరకు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. కానీ చాలామంది కన్యలు ఈ లక్షణంతో విలవిలలాడుతుంటారు. ఈ కింద సూచించిన మందులు, రుతుస్రావం అయ్యే తేదీకి రెండు రోజుల ముందునుంచి మొదలుపెట్టి రక్తస్రావం తగ్గేవరకు వాడండి. తప్పక ఉపశమనం కలుగుతుంది. 1. హింగు త్రిగుణతైలం: దీన్ని ఒక చెంచా గోరువెచ్చని నీటితో కల్పి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి; 2. అశోకారిష్ట (ద్రావకం): 3 చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి, రోజూ మూడు పూటలా తాగాలి; గృహవైద్యం: నాలుగు వెల్లుల్లి రేకల్ని దంచి, దానికి మూడు చిటికెలు ఇంగువ కల్పి, రెండు చెంచాల స్వచ్ఛమైన నువ్వులనూనెలో మరిగించి, వడగట్టాలి. ఇది ఒక మోతాదుగా - 3 చెంచాల పాలు కలిపి, ఉదయం, రాత్రి రెండుపూటలా తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్