కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మహిళల్లో ఎక్కువ. సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది. అలాగే చాలా అరుదుగానైనా పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ కనిపించినా... మహిళల్లోనే అది ఎక్కువ. మహిళలకు వచ్చే క్యాన్సర్‌ల గురించి అవగాహన కోసమే ఈ కథనం.
సర్వికల్ క్యాన్సర్... సర్వికల్ క్యాన్సర్ అన్నది మునుపటి అంత ఆందోళన చెందాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ చాలా ముందుగానే గుర్తించవచ్చు. దీనికి కారణం... క్యాన్సర్ వచ్చే ముందర ఉండే ప్రీ–క్యాన్సర్ దశ... దీనికి చాలా ఎక్కువ. అంటే తనను గుర్తించడానికి అది చాలా ఎక్కువ వ్యవధి ఇస్తుందన్నమాట.
ఈ ప్రీ–క్యాన్సర్ లక్షణాలతో అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందే దాన్ని పసిగట్టవచ్చు. దాంతో నిరోధించడానికి అవకాశాలు కూడా ఎక్కువే. దానికోసం పాప్‌స్మియర్ అనే పరీక్ష చేయించుకోవాలి.
పరీక్షలు ఇలా... ప్రతి మహిళా 25 ఏళ్లు దాటాక ఒకసారి పరీక్ష చేయించాలి. ప్రీ–క్యాన్సర్ ఏదీ కనిపించకపోతే అప్పట్నుంచి ప్రతి మూడేళ్లకోమారు ఈ పరీక్ష చేయించుకోవాలి.
వ్యాక్సిన్: సర్వికల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వస్తుందని కనుక్కున్నారు. దానికి వ్యాక్సిన్ రూపొందించడమూ సాధ్యమయ్యింది. అయితే దీన్ని వ్యాధి రాకమునుపే తీసుకోవాలి. మనదేశంలో ఈ వ్యాధి విస్తృతి దృష్ట్యా అమ్మాయిలు ఈ వ్యాక్సిన్‌ను 10–15 ఏళ్లప్పుడే తీసుకుంటే మంచిది.
రొమ్ము క్యాన్సర్: ఈ తరహా క్యాన్సర్లలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతుంటాయన్నమాట. మరీ స్పష్టంగా చెప్పాలంటే 80 ఏళ్లు పైబడ్డ ప్రతి పదిమందిలో ఒకరికి ఇది తప్పక కనిపిస్తుంది.
ఎవరెవరు రిస్క్ గ్రూప్ : విస్తృతి ఎక్కువ కాబట్టే మహిళల్లో దీని గురించి ఆందోళన కూడా అధికమే. అయినా అంతగా బెంగ పడనక్కర్లేదు.
కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు, రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉంటే ∙పిల్లలు లేని వాళ్లలో ∙మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే ఐదేళ్లకు పైబడి హార్మోనల్ చికిత్స తీసుకుంటూ ఉంటే... వీళ్లకు ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్ గ్రూపులు చేయించాల్సిన మూడు పరీక్షలు చేయించుకోవాలి.
మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది.
ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా అర్థమైపోతుంది. దాంతో ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు.
ఈ పరీక్షలు ఎలాగంటే...
►ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి.
►ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి.
►40 ఏళ్లు దాటాక 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండాలి.
►50 ఏళ్లు వచ్చాక ఏడాదికోమారు చేయించడం మంచిది.
►ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లకు డాక్టర్ సలహా మేరకు పరీక్షలు ఇంకా త్వరితంగానే అవసరం కావచ్చు.
చాలా హై రిస్క్ ఉంటే...
కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదీ లేనిదీ... కొన్ని జన్యుపరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అన్నదాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఓ చిన్ని రక్తపరీక్ష ద్వారా దీన్ని కనుక్కోవడం చాలా సులభం. కాబట్టి రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు.
-డాక్టర్ సీహెచ్. మోహనవంశీ
చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్z
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
ఫోన్ నంబర్: 98480 11421
చదవండి: Health Tips: గర్భవతుల్లో తినగానే కడుపులో ఇబ్బందిగా ఉంటే...
Comments
Please login to add a commentAdd a comment