ప్రతీకాత్మక చిత్రం
క్యాన్సర్ గడ్డపై కత్తి ఆనిస్తే అది మరింతగా విజృంభించి విస్తరిస్తుందనీ, క్యాన్సర్ ఏదైనా... సర్జరీ చేయకూడదనే అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అయితే తొలిదశ లో క్యాన్సర్‌ను కనుగొంటే దాన్ని నూరు శాతం నయం చేయడానికి శస్త్రచికిత్సే ప్రధాన ప్రక్రియ అనీ, దాదాపు అరవై శాతానికి పైగా క్యాన్సర్లు నయం చేయవచ్చని అంటున్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు (సీఎస్ రావు). క్యాన్సర్‌పై ఉన్న అపోహా వాస్తవాల గురించి ఆయన ఏమన్నారో చదవండి.
కొన్ని క్యాన్సర్లకు (ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ల వంటివాటికి) కేవలం శస్త్రచికిత్సే అసలైన చికిత్స అంటారు కదా. అది ఎంతవరకు వాస్తవం?
జ. హార్మోన్ల తేడాలతో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పాటు ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ వంటి వాటికి శస్త్రచికిత్సే ప్రధాన చికిత్స. నిజానికి సరైన రీతిలో శస్త్ర చికిత్స చేసినప్పుడు తొలిదశ రేడియేషన్ అవసరమే ఉండకపోవచ్చు. కాకపోతే అప్పటికే వేరేచోటికి క్యాన్సర్ కణాలు పాకి ఉండవచ్చుననే అభిప్రాయంతోనే రేడియేషన్ లేదా కీమో ఇవ్వాల్సి వస్తుంటుంది. లేదంటే కేవలం శస్త్ర చికిత్సతోనే మొత్తం రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది.
శస్త్రచికిత్స వల్ల వ్రణాన్ని తొలగించడం వల్ల దేహంలో కొన్ని చోట్ల సొట్టలు కూడా పడే అవకాశముంది కదా... వాటిని సరిదిద్దడానికి ఏవైనా మార్గాలున్నాయా?
జ. శస్త్రచికిత్స తర్వాత పడే సొట్టలు రెండు రకాలు. అవి...
1. బయటకు కనిపించేవి
2. బయటకు కనిపించనివి.
బయటకు కనిపించే వాటికే ప్లాస్టిక్ సర్జరీ అవసరం వస్తుంది. బయటకు కనిపించని వాటి కారణంగా మనలో... అంటే మనం నిర్వహించే పనుల్లో ఏవైనా లోపాలు (ఫంక్షనల్ లాస్) తలెత్తినప్పుడు మరికొన్ని శస్త్రచికిత్సల సహాయంతో వాటిని అధిగమించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ మళ్లీ మనకు పనికి వచ్చేది ‘శస్త్రచికిత్స’ ప్రక్రియే.
‘కత్తి ఆనిస్తే చాలు... క్యాన్సర్ మరింతగా రెచ్చిపోతుంది. ఇంకా ఎక్కువగా పాకుతుంది’ అంటారు అందుకే క్యాన్సర్‌పై కత్తే పెట్టకూడదు అనే మాట చాలామందిలో ఉంది. అది కేవలం అపోహా? ఇందులో ఏదైనా వాస్తవం ఉందా?
జ: నిజానికి క్యాన్సర్‌గురించి వైద్యశాస్త్ర పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన దశలో శస్త్రచికిత్స చేస్తుండేవారు. అప్పటికే క్యాన్సర్ కణాలు వేర్వేరు అవయవాలకు విస్తరించి ఉండటంతో, అసలు క్యాన్సర్ గడ్డను (ప్రైమరీని) తొలగించినప్పటికీ... ఇతర ప్రాంతాలకు విస్తరించిన గడ్డలు (సెకండరీ ట్యూమర్స్) పెరుగుతుండేవి.
ఫలితంగా క్యాన్సర్‌కు కత్తి పెట్టకూడదనే దురభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడు మొదటి, రెండో దశలోనే క్యాన్సర్‌లను కనుగొంటున్నందున శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయమైపోయిన రోగులెందరో ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
కత్తి పెట్టలేని మారుమూల ప్రదేశాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలకీ , లేదా కత్తి ఆనించడమే సమస్య గా మారే మెదడు వంటి కీలకమైన అవయవాల్లోని లోపలి భాగాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్సల్లో ఏవైనా అధునాతన ప్రక్రియలు ఉన్నాయా?
జ. మనం శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ గడ్డల (డీప్ సీటెడ్ ట్యూమర్స్)ను తొలగించేందుకు... ఎమ్మారై గైడెడ్ సర్జరీ, సింటిగ్రఫీ గైడెడ్ సర్జరీ, అల్ట్రా సౌండ్ గైడెడ్ సర్జరీ వంటి కొన్ని ప్రక్రియలు సమర్థంగా ఉపయోగపడతాయి. వాటి సహాయంతో దేహంలోని మారుమూల ప్రాంతాల్లో చాలా లోతుగా ఉన్న గడ్డలనూ తొలగించవచ్చు.
భవిష్యత్తులో శస్త్రచికిత్స విషయంలో రాబోయే విప్లవాత్మకమైన మార్పులు ఏవైనా ఉన్నాయా?
జ. గతంలో క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా కనుగొనేవారు. కానీ ఇటీవల క్యాన్సర్ తొలిదశలో ఉండగానే లేదా అంతకు చాలా ముందుగానే కనుగొనడమే ఓ విప్లవవాత్మకమైన మార్పు. కేవలం ఈ కారణంగానే కొన్ని క్యాన్సర్లు సమూలంగా నయమయ్యే అవకాశం దక్కింది. అందుకే మూడు దశాబ్దాలకు ముందు... క్యాన్సర్లలో 85 శాతం నయం కానివి ఉండేవన్న అపప్రథ ఉండేది. కానీ ఇప్పుడు 85 శాతం పూర్తిగా నయమైపోతున్నాయి.
ప్రధానంగా శస్త్రచికిత్స వల్లే సమూలంగా తొలగించడం సాధ్యమవుతోంది. దీనికి తోడు రేడియో గైడెడ్ లోకలైజెషన్, రేడియోలాజికల్ లోకలైజెషన్, ఇంట్రా ఆపరేటివ్ కీమో థెరపీ, ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ లాంటి విప్లవాత్మకమైన ప్రక్రియల ద్వారా మరింత సమర్థమైన చికిత్సకు అవకాశం దక్కింది.
క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రాధాన్యమేమిటి? పరిమితులు ఏమిటి?
జ: క్యాన్సర్‌కు మొట్టమొదటి వైద్యం శస్త్ర చికిత్సయే. ఇది ఎక్కువగా గడ్డల రూపంలో కనిపించే క్యాన్సర్ వ్రణాల్లో (సాలిడ్ ట్యూమర్స్) బాగా ఉపయోగపడుతుంది. ఉదా: థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయం, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎముకల్లో వచ్చే సార్కోమా, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్. అంటే దాదాపు 60 శాతం క్యాన్సర్ లకు శస్త్రచికిత్స అవసరమవుతుంది.
శస్త్ర చికిత్స వల్ల వ్యాధి ఏయే దశలలో ఉందన్న సమాచారమూ తెలుస్తుంది. తొలి దశలలో ఉన్న క్యాన్సర్‌లన్నింటినీ శస్త్రచికిత్స సహాయంతో పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో ముదిరి పోయిన క్యాన్సర్‌లో శస్త్ర చికిత్స వల్లనే ఉపశమనం లభిస్తుంది. ఉదా: వాసన వచ్చే పుండు, పేగుకు రంధ్రం పడినప్పుడు, శ్వాస తీసుకునేందుకు అంతరాయం కలుగుతున్న సందర్భాల్లో శస్త్ర చికిత్సతోనే రోగికి ప్రాణదానం చేయవచ్చు.
-డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment