క్యాన్సర్ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్ వ్యాధి కారణంగానూ, చికిత్సతోనూ వచ్చే తీవ్రమైన నిస్సత్తువ. వ్యాధిగ్రస్తుణ్ణి తీవ్రమైన నీరసం అనుక్షణం కుంగదీస్తూ ఉంటుంది. ఏమాత్రం చురుగ్గా ఉండనివ్వదు. ఈ నీరసం నిస్సత్తువ, అలసటగా అనిపించే భావన రోగిని మందకొడిగా చేసి... కొన్నిసార్లు మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. దాంతో క్యాన్సర్‌పై పోరు కంటే... ఈ నిస్సత్తువతో పోరే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. కొంతమంది రోగులు తొలుత కాస్త కుంగిపోయినా... క్రమంగా తమ మానసిక బలాన్ని కోల్పోని వారు క్యాన్సర్ పోరుపై తప్పక విజయం సాధిస్తారు. డిసెంబరు నెలను ‘క్యాన్సర్ ఫెటీగ్ అవేర్‌నెస్ మాసం’ గా పేర్కొంటారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తుల నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్)పై అవగాహన, వాటిని అధిగమించే తీరుతెన్నులను తెలుసుకుని, వ్యాధిపై విజయం సాధించడం కోసం ఉపయోగపడేందుకే ఈ కథనం.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్) చాలా సాధారణం. కానీ చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. దీనివల్ల కలిగిన వ్యాకులత, కుంగుబాటు వల్ల రోగి జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగి తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేడు. దాంతో జీవితాన్ని ఆస్వాదించలేడు. ఈ నిస్సత్తువకు చాలా కారణాలే ఉంటాయి. నిర్దిష్టంగా ఫలానా అంశమే దీనికి కారణం అని చెప్పడానికి వీలుకాదు. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి కరవవుతుంది. కానీ కొన్ని పరిమితుల మేరకు దీన్ని అధిగమించడానికి చాలా మార్గాలున్నాయి. ఆ కారణాలనూ, మార్గాలను చూద్దాం.
కారణాలు
రక్తహీనత (అనీమియా): అనీమియా అనే కండిషన్ క్యాన్సర్ నిస్సత్తువకు ఒక ప్రధాన కారణం. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో (అందునా ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్లలో) వారి ఎముక మూలుగ ఎక్కువగా ప్రభావితమై ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఈ ఎర్రరక్తకణాలే దేహంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను తీసుకెళ్తాయన్న విషయం తెలిసిందే. దాంతో కణాలకు అందే ఆక్సిజన్ తగ్గి నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి.
శరీరంలో విషాలు తొలగకపోవడం: ఆక్సిజన్ అందించడంతో పాటు ఎర్రరక్తకణాలు దేహంలో తయారైన కార్బన్‌డయాక్సైడ్, ఇతర విషాల (టాక్సిన్స్)ను బయటకు పంపుతాయి. కానీ ఎర్రరక్తకణాలు తగ్గడంతో కణానికి అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు బయటకు విసర్జించాల్సిన విషాలను తీసుకెళ్లే సామర్థ్యమూ తగ్గుతుంది. దేహంలో ఉండిపోయిన ఈ విషాలు జీవక్రియలకు ఆటంకంగా కూడా పరిణమిస్తాయి. ఫలితంగా రోగిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. రోగి ఎప్పుడూ అలసట తో ఉన్నట్లుగా ఉంటాడు. బ్లడ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో తగినంత ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి సాధారణం.
క్యాన్సర్ చికిత్సల వల్ల : కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రోగులకు అందించే కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సల కారణంగానూ, బోన్ మ్యారో క్యాన్సర్‌లకు అందించే మందుల కారణంగా కూడా రోగుల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ చికిత్సల్లో భాగంగా క్యాన్సర్ కణాల్ని తుదముట్టించడానికి టార్గెట్ చేస్తున్నప్పుడు... ఆరోగ్యవంతమైన కణాలు కూడా అంతో ఇంతో దెబ్బతినడం జరుగుతుంది. ఈ కారణంగా క్యాన్సర్ రోగుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో చికిత్సలో కలిగే నొప్పి, యాంగై్జటీ/ డిప్రెషన్‌కు గురికావడం, మందకొడిగా ఉండాల్సిరావడం (ఇనాక్టివిటీ), తరచూ నిద్రాభంగం కావడం, నిద్రలో అంతరాయాలు, సరిగా భోజనం తీసుకోకపోవడం వంటివి కూడా నీసరం, నిస్సత్తువకు కారణమవుతాయి.
► అధిగమించడం ఇలా ...
నీరసం, నిస్సత్తువ ఉన్నప్పటికీ తొలి దశల్లో మనోబలంతో క్రమంగా మంచి ఆహారానికీ, క్రమబద్ధంగా వ్యాయామానికీ ఉపక్రమించడంతో ‘క్యాన్సర్ ఫెటీగ్’ను అధిగమించవచ్చు.
క్రియాశీలంగా ఉండటం
(ఇంక్రీజింగ్ యాక్టివిటీ) : రోగులు తమలో ఉన్న నీరసం, నిస్సత్తువలకు లొంగిపోకుండా... ఎంతోకొంత చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. అలసట కలిగించని తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ఉపక్రమించాలి. దాంతో దేహంలోనూ, మెదడులోనూ చురుకు పుట్టించే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు స్రవిస్తాయి. ఫలితంగా మూడ్స్ కూడా మెరుగుపడతాయి. రోగిలో సంతోషభావనలు కలుగుతాయి.
న్యూట్రిషన్ కౌన్సెలింగ్ : క్యాన్సర్ రోగుల్లో చాలామంది తమ బరువు కోల్పోయి... చాలా సన్నబడతారు. రోగులు తమ వ్యాకులత కారణంగా తినకపోవడంతో పాటు... చికిత్సలో భాగంగా కనిపించే ఆకలిలేమి, వికారం, వాంతుల వల్ల కూడా తినలేకపోతారు. దాంతో ఆహారం తీసుకోకపోవడం, ఫలితంగా దేహానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం జరుగుతాయి.
దేహంలోకి పోషకాలు అందేందుకు, నోటికి రుచిగా ఉండేలా ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు అనే అంశంపై అవగాహన కలిగించుకునేందుకు ‘న్యూట్రిషన్ కౌన్సెలర్’ను సంప్రదించాలి. అపుడు ఆహార నిపుణులు దేహానికి అవసరమైనన్ని క్యాలరీలూ, ద్రవాహారాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను సూచిస్తారు.
మానసిక బలం కోసం తోడ్పాటు
చాలామంది రోగులు తమకు క్యాన్సర్ ఉందని తెలియగానే తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతారు. నిజానికి ఈ రోజుల్లో క్యాన్సర్లు దాదాపు 90 శాతానికి పైగా రకాలను పూర్తిగా నయం చేయవచ్చు. మొదటి, రెండో దశలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే రోగులు తమ మానసిక బలాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్, సోషల్ థెరపీల కోసం మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. మానసిక చికిత్సలతో కూడా క్యాన్సర్ ఫెటీగ్‌ను చాలావరకు అధిగమించవచ్చు.
విశ్రాంతి : క్రియాశీలంగా ఉండటానికి ప్రయత్నించడంతో పాటు... కొన్ని సందర్భాల్లో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ఈ విశ్రాంతి మళ్లీ మన శక్తిసామర్థ్యాలను (ఎనర్జీని) ఆదా చేసుకోడానికీ... దాంతో మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రియాశీలం కావడానికి ఉపయోగ పడుతుందని గ్రహించాలి. అందుకే తమ నిస్సత్తువ కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అనుకోకుండా... అలాంటి విశ్రాంతి సమయాల్లో ఇతరులపై ఆధారపడుతున్నామని సిగ్గుపడకుండా... విశ్రాంతి సమయాన్ని ఎనర్జీని ఆదా చేసుకునే టైమ్‌గా పరిగణించాలి. ఇలా ఈ సానుకూల దృక్పథంతో రోగి మళ్లీ శక్తి పుంజుకుని చురుగ్గా మారగలుగుతాడు.
ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్)
ఎప్పుడూ తనకు వచ్చిన వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవవచ్చు. హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడవచ్చు. ఫ్రెండ్స్‌తో సంభాషించవచ్చు (ఈ కోవిడ్ సమయంలో వ్యక్తిగతంగా కలవలేకపోయినా... మొబైల్స్‌లో, వాట్సాప్ ద్వారా ఇతరులతో సంభాషణలు చేయవచ్చు. ఇలా రోగులు తమ సరదా సమయాన్ని గడపవచ్చు. ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండటం అంటే వ్యాధిపై సగం విజయాన్ని సాధించడమే.
కంటికి తగిన నిద్ర
చాలామంది క్యాన్సర్ రోగులకు ఉండే ప్రతికూలత ‘నిద్ర’. రోగుల్లో చాలామందికి తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో రోగి మరింత నిస్సత్తువగా మారిపోతాడు. రోగుల్లో ఫెటీగ్‌కు ‘నిద్ర’ అనే అంశం చాలా ప్రధానమైంది. చిన్న చిన్న టెక్నిక్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా రోగులు తమలోని వ్యాకులతను, కుంగుబాటును అధిగమించడం ద్వారా కంటినిండా నిద్రపోవచ్చు. కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను కేవలం ఉదయం పూటకు మాత్రమే పరిమితం చేయడం, నిద్రకు ముందు తీసుకోకపోవడం, నిద్ర వచ్చినప్పుడో లేదా మధ్యానం పూటో కాస్తంత చిన్న చిన్న కునుకులు తీయడం, పవర్‌న్యాప్‌ను అలవరచుకోవడం, వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లను అలవరచుకోవడం లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా రోగులు తమ నిద్రాభంగాలనూ, నిద్రలో అంతరాయాల సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. కంటినిండా నిద్రపోవడం అనే అంశం కూడా రోగిలో వ్యాధి నివారణశక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది కూడా రోగి త్వరగా కోలుకునేలా చేసే అంశమే.
అవసరాన్ని బట్టి మందులు
ఒకవేళ రోగిలోని అలసట భావన చాలా ఎక్కువగానూ, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఉంటే రోగి కారణాలనూ, పరిస్థితిని బట్టి డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తారు. రక్తహీనత తక్కువగా ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర మందులు, మానసిక కారణాలున్నవారికి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి ఔషధాలను ఇస్తారు. క్యాన్సర్ రోగులెవరైనా క్యాన్సర్ ఫెటీగ్‌తో బాధపడుతుంటే పైన సూచించిన సూచనలను పాటించడం ద్వారా తమకు తామే సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమస్య అధిగమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం చాలా ప్రధాన అంశం. దీన్ని గ్రహిస్తే సగం సమస్య పరిష్కారమైనట్లే. సగం వ్యాధి తగ్గినట్లే.
డా. అజయ్ చాణక్య
కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment