క్యాన్సర్‌కు సోకితే కేవలం రోగిని మాత్రమేగాక మొత్తం కుటుంబాన్నే కుంగదీస్తుంది. ఆర్థికంగా, మానసికంగా కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల రోగులపై వారి కుటుంబాలపై పడే అన్ని రకాల భారాలు చాలా ఎక్కువ. అందుకే మరింత ఎక్కువ ప్రయోజనాలిచ్చే కొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటివాటిల్లో మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఒకటి. దీన్నే ఇమ్యూనోథెరపీగా చెప్పవచ్చు. ఇదెలా ఉంటుందో చూద్దాం.
ఇమ్యూనోథెరపీ మూలాలు పందొమ్మిదో శతాబ్దంలోనే పడ్డాయి. డాక్టర్ విలియమ్ కోలీ అనే ఓ వైద్యవిజ్ఞాన పరిశోధకుడు... చనిపోయిన ఓ బ్యాక్టీరిమ్ కణాల్ని క్యాన్సర్ గడ్డలోకి ప్రవేశపెట్టినప్పుడు అది క్రమంగా కుంచించుకుపోవడాన్ని గమనించాడు. 21వ శతాబ్దం నాటికి ఇమ్యూనాలజీ బాగా పురోగమించింది. ఈ మధ్యకాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి చాలా పరిశోధనలు జరిగాయి.
వాటిల్లో 2018లో డాక్టర్ జేమ్స్ పి. అలిసన్, టసుకో హాంజో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ముఖ్యమైనది. వారిద్దరికీ నోబుల్ బహుమతి కూడా వచ్చింది. దేహంలోని వ్యాధినిరోధక కణాల్లో టీ–సెల్స్ అనేవీ ఒక రకం. సాధారణ కణమేదో, హానికరమైన కణం ఏదో గుర్తించగలిగే శక్తి వీటికి ఉంటుంది. అవి కేవలం హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ కణాలపైనే దాడి చేస్తాయిగానీ దేహంలోని మామూలు కణాలకు ఏ హానీ చేయవు.
అయితే ఇక్కడో విచిత్రం జరుగుతుంది. క్యాన్సర్ కణాలు దేహంలోని ఇతర కణాలకు తీవ్రంగా హానిచేసేవే అయినప్పటికీ... అవి కూడా మన సొంతకణాలే అనిపించేలా భ్రమింపజేస్తూ... ‘టీ–సెల్స్’ను మోసం చేస్తాయి. అలా అవి మన ‘వ్యాధినిరోధక’ కణాలు దాడి నుంచి తప్పించుకోగలుగుతాయి. ఇటీవల ఇమ్యూనోథెరపీలో రానున్న మందులు వినూత్నమైనవి. ఇవి ఎలాంటివంటే అవి హానికరమైన క్యాన్సర్ కణాలను నేరుగా ఎదుర్కొనడానికి బదులుగా... ఆ కణాలు తప్పించుకోకుండా ఉండేలా చూస్తాయి.
అవి మనకు శత్రుకణాలని ‘టీ–సెల్స్’కు తెలిసిపోయేలా చేస్తాయి. హానికరమైనవని తెలిసిపోవడంతో మిగతా పనంతా మన సొంత ‘వ్యాధినిరోధకతే’ చేసేస్తుంది. అంటే... ఆ హానికారక కణాలను మన ‘ఇమ్యూనిటీ’ చంపేస్తుంది. ప్రస్తుత కీమోథెరపీలోని రకరకాల రసాయనాలు క్యాన్సర్ కణాలతోపాటు మన సొంత కణాలపై కూడా దుష్ప్రభావాలను చూపడం, అవి కూడా నశించిపోవడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే.
కానీ ఈ చికిత్స ప్రక్రియ లో పనంతా మన సొంతరోగనిరోధక వ్యవస్థ చేసినట్లుగా స్వాభావికంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియల్లో సైడ్‌ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఇలా ఇమ్యూనోథెరపీ అన్నది ఇటీవల క్యాన్సర్ చికిత్స రంగంలో మేలైన మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పవచ్చు.
-డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై
సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ –
హెమటో ఆంకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment