Immuno therapy
-
క్యాన్సర్ చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు... మందులకు, రేడియేషన్‌కు అదుపులోకి వస్తే, మరికొందరిలో అవేవీ పనిచేయకపోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీ వంటి వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వీటితో పాటు క్యాన్సర్‌కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా అడ్వాన్స్డ్ దశలో కనుగొన్నప్పుడు కొంతవరకు నొప్పీ, బాధ తగ్గడానికి (పాలియేటివ్ కేర్) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ దుష్ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్‌ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్‌ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ముందే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్‌ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా డే–కేర్ ప్రొసిజర్గా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ: పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ముక్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్‌స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. క్యూరేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. ఒక్కోసారి సర్జరీ చేస్తున్నప్పుడే రేడియేషన్ కూడా ఇస్తారు. పాలియేటివ్ సర్జరీ: క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ చికిత్సలో చేసే సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, బాధితుల్లో ఆత్మన్యూనతను నివారించడానికి దేహంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని సేకరించి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. కీమోథెరపీ: క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ కేవలం తాత్కాలికమే. కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఇవి అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. కొన్ని కొన్ని క్యాన్సర్‌కు రేడియేషన్‌తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్స వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. ఇటీవలి పురోగతితో అధునాతన చికిత్సలు: స్టెమ్‌సెల్ థెరపీ, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్‌ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనో థెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
క్యాన్సర్ కొత్త చికిత్సల్లో... ఇమ్యూనోథెరపీ చేసే మేలు ఇది!
క్యాన్సర్‌కు సోకితే కేవలం రోగిని మాత్రమేగాక మొత్తం కుటుంబాన్నే కుంగదీస్తుంది. ఆర్థికంగా, మానసికంగా కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల రోగులపై వారి కుటుంబాలపై పడే అన్ని రకాల భారాలు చాలా ఎక్కువ. అందుకే మరింత ఎక్కువ ప్రయోజనాలిచ్చే కొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటివాటిల్లో మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఒకటి. దీన్నే ఇమ్యూనోథెరపీగా చెప్పవచ్చు. ఇదెలా ఉంటుందో చూద్దాం. ఇమ్యూనోథెరపీ మూలాలు పందొమ్మిదో శతాబ్దంలోనే పడ్డాయి. డాక్టర్ విలియమ్ కోలీ అనే ఓ వైద్యవిజ్ఞాన పరిశోధకుడు... చనిపోయిన ఓ బ్యాక్టీరిమ్ కణాల్ని క్యాన్సర్ గడ్డలోకి ప్రవేశపెట్టినప్పుడు అది క్రమంగా కుంచించుకుపోవడాన్ని గమనించాడు. 21వ శతాబ్దం నాటికి ఇమ్యూనాలజీ బాగా పురోగమించింది. ఈ మధ్యకాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి చాలా పరిశోధనలు జరిగాయి. వాటిల్లో 2018లో డాక్టర్ జేమ్స్ పి. అలిసన్, టసుకో హాంజో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ముఖ్యమైనది. వారిద్దరికీ నోబుల్ బహుమతి కూడా వచ్చింది. దేహంలోని వ్యాధినిరోధక కణాల్లో టీ–సెల్స్ అనేవీ ఒక రకం. సాధారణ కణమేదో, హానికరమైన కణం ఏదో గుర్తించగలిగే శక్తి వీటికి ఉంటుంది. అవి కేవలం హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగల్ కణాలపైనే దాడి చేస్తాయిగానీ దేహంలోని మామూలు కణాలకు ఏ హానీ చేయవు. అయితే ఇక్కడో విచిత్రం జరుగుతుంది. క్యాన్సర్ కణాలు దేహంలోని ఇతర కణాలకు తీవ్రంగా హానిచేసేవే అయినప్పటికీ... అవి కూడా మన సొంతకణాలే అనిపించేలా భ్రమింపజేస్తూ... ‘టీ–సెల్స్’ను మోసం చేస్తాయి. అలా అవి మన ‘వ్యాధినిరోధక’ కణాలు దాడి నుంచి తప్పించుకోగలుగుతాయి. ఇటీవల ఇమ్యూనోథెరపీలో రానున్న మందులు వినూత్నమైనవి. ఇవి ఎలాంటివంటే అవి హానికరమైన క్యాన్సర్ కణాలను నేరుగా ఎదుర్కొనడానికి బదులుగా... ఆ కణాలు తప్పించుకోకుండా ఉండేలా చూస్తాయి. అవి మనకు శత్రుకణాలని ‘టీ–సెల్స్’కు తెలిసిపోయేలా చేస్తాయి. హానికరమైనవని తెలిసిపోవడంతో మిగతా పనంతా మన సొంత ‘వ్యాధినిరోధకతే’ చేసేస్తుంది. అంటే... ఆ హానికారక కణాలను మన ‘ఇమ్యూనిటీ’ చంపేస్తుంది. ప్రస్తుత కీమోథెరపీలోని రకరకాల రసాయనాలు క్యాన్సర్ కణాలతోపాటు మన సొంత కణాలపై కూడా దుష్ప్రభావాలను చూపడం, అవి కూడా నశించిపోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. కానీ ఈ చికిత్స ప్రక్రియ లో పనంతా మన సొంతరోగనిరోధక వ్యవస్థ చేసినట్లుగా స్వాభావికంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రక్రియల్లో సైడ్ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఇలా ఇమ్యూనోథెరపీ అన్నది ఇటీవల క్యాన్సర్ చికిత్స రంగంలో మేలైన మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పవచ్చు. -డాక్టర్ సాద్విక్ రఘురామ్ వై సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ – హెమటో ఆంకాలజిస్ట్ -
‘ఇమ్యునో థెరపీ’తో కేన్సర్ రోగుల జీవితకాలం పెంపు
రక్త పరీక్షతోనూ కేన్సర్ గుర్తింపు అపోలో వైద్య నిపుణులు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘కేన్సర్ వైద్యంలో ఇమ్యునో థెరపీ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పరిశోధనలు మెరుగైన ఫలితాలి స్తున్నాయి. భవిష్యత్తులో కేన్సర్ చికిత్సకు ఇది అత్యంత కీలకంగా మారబోతోంది’ అని అపోలో కేన్సర్ ఆస్పత్రి వైద్యులు అభిప్రాయ పడ్డారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న ‘అపోలో కేన్సర్ కాన్క్లేవ్–2017’ను పురస్క రించుకుని సోమవారం హోటల్ తాజ్ దక్కన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్వీఎస్ఎస్ ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ టీపీఎస్ భండారి, డాక్టర్ కౌశిక్ భట్టాచార్యా ఈ వివరాలు వెల్లడించారు. తొలిదశలో కేన్సర్‌ని గుర్తించకపోవడం, తీరా గుర్తించే సమయానికి వ్యాధి మరింత ముదిరి పోతోంది. మూడు, నాలుగో స్టేజ్‌లో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇమ్యునో థెరపీ ద్వారా వారి జీవిత కాలం రెండు నుంచి మూడేళ్ల వరకు పెంచవచ్చు. ఈ చికిత్స మరో రెండు మూడేళ్లలో అందుబాటులోకి రావచ్చు. సీటీ, ఎక్సరేలతో కేన్సర్ ముప్పు... అవసరం లేకపోయినా తరచూ సీటీ స్కాన్ తీయించుకోవడం వల్ల భవిష్యత్తులో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక సీటీస్కాన్ 20 ఎక్సరేలతో సమానం. ప్రతి 15 మందిలో ఒకరు ఏదో ఒక కేన్సర్‌తో బాధపడు తున్నారు. శరీరానికి వ్యాయామం లేకపోవ డం, వేపుడు, మసాలా ఆహారం అధికంగా తినడం, మద్యం, మాంసం అతిగా తినడం వల్ల చాలా మంది చిన్నతనంలోనే కేన్సర్ బారిన పడుతున్నారు. సరైన ఆహారం, వ్యాయామం వల్ల 50 శాతం కేన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు. కాన్క్లేవ్కు దేశవిదేశాల ప్రతినిధులు.. కేన్సర్ వైద్య చికిత్సల్లో అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానంపై భావితరం వైద్యులకు అవగాహన కల్పించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుకొనేందుకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు హెచ్ఐసీసీలో అపోలో కేన్సర్ కాన్క్లేవ్–2017 నిర్వహిస్తున్నట్లు సదస్సు చైర్మన్ విజయ్ ఆనంద్‌రెడ్డి తెలిపారు. 2,500 మంది దేశ విదేశాల ప్రతినిధులు, 300 మంది కేన్సర్ నిపుణులు హాజరవుతారన్నారు. 4న కేన్సర్ విజేతలతో ఓపెన్‌హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనికి ప్రముఖ నటి మనీషా కోయిరాల హాజరు కానున్నట్లు తెలిపారు. రక్త పరీక్షతో కేన్సర్ కణాల గుర్తింపు... కేన్సర్ బాధితుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు. ఇప్పటివరకు బయాప్సీ ద్వారా మాత్రమే కేన్సర్ కణా లను గుర్తిస్తున్నారు. ఊపిరితిత్తులు, పెద ్దపేగు, బ్రెయిన్ కేన్సర్ల విషయంలో ఈ బయాప్సీ సాధ్యం కాదు. క్లిష్టమైన భాగాల్లోని టిష్యూని సేకరించడం కష్టం. ప్రస్తుతం రక్త పరీక్ష ద్వారా కూడా కేన్సర్ కణాలను గుర్తించే పరిజ్ఞానం అందు బాటులోకి వచ్చింది. అంతే కాదు ఏ కేన్సర్‌కు ఏ డ్రగ్ పనిచేస్తుందనే అంశాన్ని కూడా ముందే తెలుసుకునే వీలుంది.