- తొలి శస్త్ర చికిత్స విజయవంతం
- రెండవ ఆపరేషన్‌కు డబ్బు కోసం చోరీలు
- ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డ ఇంజినీరింగ్ విద్యార్థి
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న అతడి పేరు ప్రవీణ్. అమ్మాయిలా మారాలన్న తపనతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. తొలి శస్త్ర చికిత్స పూర్తి అయింది. రెండవ సారి మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలకు తెగబడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. డీసీపీ సందీప్ పాటిల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా.... పీణ్యా సమీపంలోని మంజునాథ నగరకు చెందిన ప్రవీణ్ అలియాస్ కాంత(23) ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేవాడు.
తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నగరంలో హిజ్రాలు నివాసముంటున్న ప్రాంతానికి చేరుకుని చీర కట్టుకుని రోడ్డుపైకి వచ్చేవాడు. తర్వాత నిర్జన ప్రదేశాలలో సంచరించేవారిని లైంగికంగా రెచ్చగొట్టి వ్యభిచారం సాగించేవాడు. ఇందులో భాగంగా ఈ నెల 6న రాత్రి గోరగుంటపాళ్యకు చెందిన గార్మెంట్స్ ఉద్యోగి మురుగేష్‌ను అతను లైంగికంగా రెచ్చగొట్టాడు. ఆ సమయంలో మురుగేస్ వద్ద ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఆర్‌ఎంసీ యార్డు పోలీసు ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ కచ్చితమైన సమాచారం సేకరించి కాంతను అరెస్ట్ చేశారు.
అయితే ఇంత కాలం ప్రవీణ్ మగవాడేనని కుటుంబసభ్యులు భావించారని, అతను హిజ్రా అని వారికి తెలియదని పోలీసులు తెలిపారు. కాగా, తనతో లైంగిక వాంఛ తీర్చుకున్న తర్వాత నగదు ఇవ్వకుండా మురుగేష్ మోసం చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో బంగారు గొలుసు లాక్కొన్నట్లు పోలీసుల ఎదుట ప్రవీణ్ అంగీకరించాడు.
తాను చోరీ చేసిన బంగారు గొలుసును సుంకదకట్టలోని ఓ జ్యువెలరీ షాప్‌లో విక్రయించగా వచ్చిన రూ. 30 వేలతో దేవుడి ఫొటోలు కొనుగోలు చేశానని, మిగిలిన సొమ్ముతో తోటి హిజ్రాలతో కలిసి జాలీ ట్రిప్ వెళ్లి వచ్చినట్లు వివరించాడు. అమ్మాయిగా మారేందుకు గతంలో ఒకసారి ప్రవీణ్ ఆపరేషన్ చేయించుకున్నాడని, ప్రస్తుతం మరోసారి ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తునట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.