మహిళలకు కూడా హెర్నియా వస్తుందా? ఇటీవల మాకు తెలిసిన ఒక మహిళకు హెర్నియా వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. హెర్నియా అంటే ఏమిటో తెలియజేయగలరు.
- రోహిత్, సంగారెడ్డి
హెర్నియా అన్నది పురుషులకూ, మహిళలకూ ఇద్దరికీ వచ్చే కండిషన్. బహుశా మీరు పురుషులకు వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని, రెండో ఒకటే అని అపోహపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట పైపొరల మీద అమరి ఉంటాయి. ఈ పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపలి భాగాలు బలహీనంగా ఉన్న అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని లోపలికి వెళ్తాయి. అలాంటప్పుడు పురుషుల్లో ఆ పేగు వృషణాల సంచిలో కనిపించవచ్చు. అలాగే మహిళల్లో అబ్డామిన్ కండరాలు బలహీనంగా ఉంటే మన పొట్టలోని అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. అలాంటప్పుడు ఆ అవయవాలను శస్త్రచికిత్స ద్వారా యథాస్థితికి తెచ్చి, మళ్లీ అలా దూరిపోకుండా అబ్డామిన్ కండరాలపైన ఒక వలలాంటి దాన్ని (మెష్‌ను) అమర్చుతారు.
హెర్నియా ఉంటే తప్పక ఆపరేషన్ చేయించాల్సిందేనా? ఇది మందులతో తగ్గదా?
- శ్రీనివాస్, గన్నవరం
మామూలుగానైతే బలహీనమైన అబ్డామిన్ కండరాల్లోంచి పేగులు కిందికి జారిపోయే హెర్నియా అనే కండిషన్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు. చాలా సందర్భాల్లో దీనికి నొప్పి కూడా ఉండదు. పడుకున్నప్పుడు పేగు తన యథాతథ స్థితికి రావడం లేదా చేత్తో తాకినప్పుడు వృషణాల సంచిలో పేగు తగలడం వంటి వాటితో హెర్నియాను గుర్తించవచ్చు. అయితే ఒక్కోసారి ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. అబ్డామిన్ పొరల్లోంచి దూసుకుపోయిన ఈ పేగులు ఒక్కోసారి అక్కడి ఖాళీలో ఇరుక్కుపోయి తీవ్రంగా బిగుసుకుపోతాయి. దీన్నే స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా అంటారు. అప్పుడు అలా ఇరుక్కున్న పేగులకు రక్తసరఫరా అందకుండా పోవడంతో పేగులు పాడైపోతాయి. అలాంటప్పుడు మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.
డాక్టర్ ఎం.ఏ. సలీమ్,
సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్,
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
హెర్నియా కౌన్సెలింగ్
Published Sat, May 16 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement