
సాక్షి, హైదరాబాద్ : పేదల ఆహార భద్రత (రేషన్) కార్డు వెబ్‌సైట్ బుధవారం పునఃప్రారంభమైంది. దీంతో మీ–సేవ, ఈ–సేవల ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. 9 నెలల విరామం తర్వాత వెబ్‌సైట్ పునఃప్రారంభమవడంతో తొలిరోజే దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దీంతో మీ–సేవ, ఈ–సేవ సర్వర్లపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని కేంద్రాల్లో వెబ్‌సైట్‌లో లాగిన్ కావడానికి అధిక సమయం పట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు కోసం ఈ వెబ్‌సైట్‌ను నిలిపేయడంతో కొత్త కార్డుల మంజూరు, మార్పులు, చేర్పులు, పునరుద్ధరణకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటికే వచ్చిన సుమారు 3 లక్షలకుపైగా దరఖాస్తులను సైతం పౌరసరఫరాల శాఖ నిలిపేసింది. ఇటీవల మొత్తం 17,027 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తికావడంతో ఈ నెల 13న ఆహార భద్రత కార్డు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఎన్‌ఐసీ, మీ–సేవ డైరెక్టర్లకు లేఖ రాశారు. ఈ మేరకు అధికారులు బుధవారం వెబ్‌సైట్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 50,24,511 ఆహార భద్రత కార్డులుండగా, అందులో 1,91,71,623 లబ్ధిదారులు ఉన్నారు. కార్డుల్లేని కుటుంబాలు సుమారు 12 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment