కొత్తగా 24,665 కార్డులు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాకు కొత్త రేషన్ కార్డులు భారీగానే వస్తున్నాయి. ఈ పీడీస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసిన దరఖాస్తుల్లో ఇప్పటికే దాదాపు 80శాతం వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండు విడతల్లో 52,747 రేషన్ కార్డులు వచ్చాయి. తాజాగా మూడో విడతలో 24,665 కార్డులు రావడంతో కొత్త కార్డుల సంఖ్య 77,412కు పెరిగింది. తహసీల్దార్లు, ఏఎస్‌ఓలు రేషన్ కార్డుల కోసం దాదాపు 97 వేల దరఖాస్తులు ఈ– పీడీఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మరో విడత కార్డులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడో విడతలో కర్నూలు డివిజన్‌కు 5871, నంద్యాల డివిజన్‌కు 6880, ఆదోని డివిన్‌కు 11914 ప్రకారం రేషన్ కార్డులు వచ్చాయి. పాణ్యం నియోజకవర్గంలోని గడివేములకు రెండు విడతల్లోనూ మొండిచెయ్యి ఎదురైంది. మూడో విడతలో మాత్రం 721 కార్డులు వచ్చాయి. బేతంచెర్లకు మొదటి విడతలో కేవలం 7 కార్డులు మాత్రమే రాగా రెండవ విడతలో ఒక్క కార్డు కూడా రాలేదు. తాజాగా ఈ మండలానికి 1553 కార్డులు వచ్చాయి. రెండో, మూడవ విడతలో మంజూరు చేసిన కార్డులు ఇంకా జిల్లాకు చేరలేదు. హైదరాబాద్‌లోనే ముద్రిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉంది.