హకీ కోచ్ కావలెను
హెచ్‌ఐ వెబ్‌సైట్‌లో దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) భారత పురుషుల సీనియర్ జట్టుకు చీఫ్ కోచ్‌ను నియమించే పనిలో పడింది. అర్హులైనవారు ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌ఐ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లాగే ఈసారి కొత్తగా వెబ్‌సైట్ ద్వారా హెచ్‌ఐ దరఖాస్తుల్ని ఆహ్వానించడం విశేషం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) లెవెల్–3 అర్హతలున్న కోచ్‌లు, అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కోచ్‌లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అందులో పేర్కొంది. ఎంపికైన చీఫ్ కోచ్ టోక్యో ఒలింపిక్స్ (2020) వరకు పని చేయాల్సివుంటుంది.
ముందుగా ఆరునెలల ప్రొబెషన్ పీరియడ్‌లో సంతృప్తికర ఫలితాలు సాధిస్తే ఈ మూడేళ్ల పాటు కొనసాగిస్తారు. ప్రకటనలో కోచ్‌కు ఉండాల్సిన అర్హతలతో పాటు లక్ష్యాలను పొందుపరిచారు. ‘ముందుగా వచ్చే ఏడాది ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌లో జట్టును విజయవంతంగా నడిపించాలి. ప్రపంచ స్థాయి ఈవెంట్లకు జట్టును సన్నద్ధం చేయాలి. ఒలింపిక్స్‌కు మేటి జట్టును తయారు చేయాలి. అలాగే జూనియర్ జట్టు పురోగతిపై కూడా సమీక్షించాలి’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల కోచ్‌లు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. జట్టు ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో హాలెండ్‌కు చెందిన ఓల్ట్‌మన్స్‌ను ఇటీవలే కోచ్ పదవినుంచి హాకీ ఇండియా తప్పించింది.