
న్యూఢిల్లీ: మున్సిపల్ బాండ్ల కోసం ప్రత్యేకించిన వెబ్‌సైట్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఆవిష్కరించింది. తద్వారా దేశీయంగా మున్సిపల్ బాండ్ల మార్కెట్లలో క్రెడిబిలిటీ, విజిబిలిటీని పెంచనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దేశీ మున్సిపల్ బాండ్లపై సమగ్ర డేటాను అందించడం ద్వారా మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేవారికి వెబ్‌సైట్ ప్రధాన కేంద్రంగా నిలవనున్నట్లు తెలియజేసింది.
బాండ్ల జారీ, క్రెడిట్ రేటింగ్స్, లావాదేవీల పరిమాణం, వాస్తవిక ఈల్డ్స్, ధరలు తదితరాలను ఇందులో అందించనుంది. అంతేకాకుండా దేశీయంగా తొలి మున్సిపల్ బాండ్ ఇండెక్స్ అయిన నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ గత చరిత్ర తదితర పూర్తి వివరాలకు ఇది వేదిక కానుంది. పారదర్శకంగా, సులభంగా బాండ్ల సమాచారాన్ని పొందగలగడంతోపాటు.. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే లక్ష్యాలతో వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. ఎప్పటికప్పుడు సంబంధిత తాజా సమాచారాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో సమకూర్చడం ద్వారా మున్సిపల్ బాండ్లను పెట్టుబడి సాధనంగా విశ్వసించేందుకు వెబ్‌సైట్ దోహదపడనున్నట్లు తెలియజేసింది.
ఇదీ చదవండి: హెచ్‌సీఎల్ గ్రూప్‌తో ప్రుడెన్షియల్ జత
సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు వెబ్‌సైట్ సహకరించనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్ చౌహాన్ పేర్కొన్నారు. వెరసి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ముని బాండ్లుగా పిలిచే వీటిని స్థానిక ప్రభుత్వాలు, ఏజెన్సీలు, రోజువారీ నిధుల అవసరాలకు జారీ చేస్తాయి. జాతీయ రహదారులు, రహదారులు, స్కూళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సైతం వీటిని వినియోగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment