సాక్షి, హైదరాబాద్: వెబ్‌సైట్ సతాయింపులు, సర్వర్ సమస్యలు గురుకుల కొలువుల అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. వీటిని పరిష్కరించడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) విఫలమైంది. దీంతో వేలాది మంది దరఖాస్తుకు దూరం కావాల్సిన పరిస్థితి దాపురించింది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ (స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) కొలువులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది.
కానీ గడువు ముగిసే చివరి నిమిషంవరకు సాంకేతిక సమస్యలు వెంటాడాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. బోర్డు వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించని అధికారులు, గడువు తేదీ పొడిగింపుపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో రెండ్రోజుల్లో మ్యూజిక్ టీచర్, టీజీటీ దరఖాస్తు ప్రక్రియ సైతం ముగియనుంది. అప్పటివరకు ఇవే సమస్యలు పునరావృతమైతే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఎదురుకానుంది.
తొలిరోజు నుంచీ ఇదే తీరు...
టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తొలిరోజు నుంచే కొనసాగుతూ వచ్చాయి. రాష్ట్ర గురుకుల సొసైటీల పరిధిలోని 9,231 ఉద్యోగాల భర్తీకి గత నెల 5వ తేదీన బోర్డు ఏకకాలంలో 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా గత నెల 17వ తేదీ నుంచి గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించింది. నెల రోజుల పాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.
దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటీఆర్ నమోదు, ఆ తర్వాత దరఖాస్తుల సమర్పణకు ఉపక్రమించిన అభ్యర్థులకు గురుకుల వెబ్‌సైట్ చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్ సతాయింపుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీతో ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగియగా.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుకు దూరమయ్యారు.
తాజాగా గురుకుల పాఠశాలల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియగా.. సాంకేతిక సమస్యలు కొనసాగడంతో దీనికీ మెజారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొందరైతే ఫీజులు చెల్లించినప్పటికీ దరఖాస్తును సబ్మిట్ చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు.
వివరాలు ఎంట్రీ చేశాక ఎర్రర్!
గురుకుల వెబ్‌సైట్‌లో ప్రధానంగా రెండు దశల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఓటీఆర్ నమోదుకు సంబంధించి ఆధార్ వివరాలు ఎంట్రీ చేసిన వెంటనే వివరాల పేజీ తెరుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఎర్రర్ అంటూ డిస్‌ప్లే అవుతుండటంతో తిరిగి వెబ్‌పేజీని తెరవాల్సివస్తోంది. ఇలా పలుమార్లు ప్రయతి్నస్తేనే ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయగలిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కొందరైతే ఓటీఆర్ నమోదుకే రోజుల తరబడి ప్రయత్నించినట్లు తెలిపారు.
ఓటీఆర్ నమోదు తర్వాత ఫీజు వివరాలను నమోదు చేయా ల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులో వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేసే సమయంలో సర్వర్ ఎర్రర్, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటూ వస్తోంది. మెజారిటీ అభ్యర్థులకు ఇదే అనుభవం ఎదురవుతుండడంతో గురుకుల బోర్డు హెల్ప్ డెస్‌్కకు ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. కానీ హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదులు, వినతులతో ఉపయోగం లేదని రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌కు చెందిన పీజీటీ అభ్యర్థి ఎస్.పాండురంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరఖాస్తు గడువు పెంపు లేనట్టే..!
కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువును గురుకుల బోర్డు పెంచలేదు. దీంతో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు విషయంలోనూ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు బోర్డు అధికారులు నిరాకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment