సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూ స్తున్న కొత్త ఆహార భద్రత కార్డుల (రేషన్ కార్డులు) జారీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు దరఖాస్తుల నమూనా లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. మీ–సేవ కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, బస్తీ సభలను నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించి విధివిధానాలు ఆదివారం జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం తరువాత వెలువడే అవకాశం ఉంది.
కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు జారీ చేసిన రేషన్‌కార్డుల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత మొదలైన తెలుపు, గులాబీ కార్డుల జారీ ప్రక్రియ భారీ ఎత్తున సాగింది.
ఈ లెక్కన రాష్ట్రంలో తెలుపు, గులాబీ కార్డు లు తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే 83 లక్షలకు పైగా జారీ అయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత జాతీయ స్థాయిలో జరిగిన మార్పుల వల్ల తెలుపు, గులాబీ కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులు మంజూరు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం పదేళ్లలో కొత్తగా 6.50 లక్షల కార్డులు మంజూరు చేసింది. ఇవి కాకుండా 11 లక్షలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలకు కార్డు తప్పనిసరి కావడంతో...
రేషన్ బియ్యం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరిగా మారింది. ఆరోగ్యశ్రీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదల గృహ నిర్మాణం వంటి అనేక పథకాలకు ఆహార భద్రత కార్డు తప్పనిసరైంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు రేషన్‌కార్డుల అవసరం తప్పనిసరైంది.
గతంలో తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే 2021లో చివరిసారిగా 3 లక్షల కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్‌కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు మార్పులు , చేర్పులు చేయడం వంటి ప్రక్రియ కూడా కొన్నేళ్లుగా నిలిపివేయడంతో ఈసారి డిమాండ్ పెరిగింది. కొత్త కార్డుల ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు వస్తే అర్హులైన వారంతా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
కొత్త దరఖాస్తుదారులు ఆధార్, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు గ్యాస్ కనెక్షన్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారికి కార్డులు జారీ చేయకుండా నిబంధనలు విధించనున్నారు. అదే సమయంలో ఇప్పటికే కార్డులు పొందిన వారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు ఓ పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కార్డుల వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న కార్డుల సంఖ్య : 90,14,263
ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్ ఎఫ్ ఎస్) కింద జారీ చేసిన కార్డులు : 54,48,170
రాష్ట్ర ఆహారభద్రత కార్డులు : 35,66,093
ఈ కార్డుల లబ్ధిదారులు : 2,83,39,478
Comments
Please login to add a commentAdd a comment