నల్లగొండ : ఆహారభద్రత కార్డుల పరిశీలన దాదాపు పూర్తికావొచ్చింది. దరఖాస్తుల పరిశీలనకు విధించిన గడువు శనివారంతో ముగిసింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 8,35,000 దరఖాస్తులు ఆహారభద్రత కార్డు పొందేందుకు అర్హత సాధించాయి. జిల్లావ్యాప్తంగా 11,05,000 దరఖాస్తులు రాగా, అధికారులు 10.80 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. శనివారం సాయంత్రానికి కేవలం 25 వేల దరఖాస్తులు మాత్రమే పెండి ంగ్‌లో ఉన్నాయి. పాత లెక్కల ప్రకారం జిల్లాలో 9.30 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే కార్డుల సంఖ్య తగ్గినప్పటికీ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 80 శాతం కుటుంబాలకు ఆహారభద్రత కార్డులు అందనున్నాయి. అర్హత సాధించిన దరఖాస్తుల్లో మొదటిస్థానంలో నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లు ఉండగా, దేవరకొండ డివిజన్ చివరిస్థానంలో ఉంది.
డేటా ఎంట్రీ షురూ...
ఆదివారం నుంచి అర్హత సాధించిన దరఖాస్తుల వివరాలను ఈ-పీడీఎస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో రేషన్‌దుకాణం పేరును క్లిక్ చేయగానే, ఆ దుకాణం పరిధిలోని వివరాలు మొత్తం అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే రేషన్‌కార్డులకు ఆధార్ కార్డు నంబర్ సీడింగ్ చేసినందున, ఆ కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాలు మొత్తం ఈ- పీడీఎస్‌కు అనుసంధానం చేస్తారు. అయితే డేటాఎంట్రీ చేసే క్రమంలో మార్పులు,చేర్పులు చేస్తారు. అంటే పాతకార్డులో ఉన్న కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణించినా లేదా కొత్తగా పేర్లు చేర్చాల్సి వస్తే వాటిని జత చేస్తారు. అంతోద్యయ కార్డులు కలిగిన వాటిని కూడా వేరు చేస్తారు. ఈ కార్డుదారులకు కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా ప్రభుత్వం 35 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చే స్తుంది. మారిన మార్గదర్శకాల ప్రకారం ఆహార భ ద్రత కార్డుదారులకు కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా, ఒక్కొక్కరికి 6 కేజీలు చొప్పున పంపిణీ చేస్తారు. కాబట్టి ఈ రెండు రకాల కార్డులను వేరు చేస్తారు. అనంతరం తహసీల్దార్ల ఆమోదానికి పంపుతారు. డేటాఎంట్రీలో పేర్కొన్న వివరాలు సవ్యంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆహారభద్రత కార్డులకు తహసీల్దార్లు ఆమోదముద్ర వేస్తారు.
‘కీ’రిజిష్టర్ ద్వారానే బియ్యం పంపిణీ...
కొత్త కార్డుల పంపిణీ ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి... లబ్ధిదారులకు జనవరి 1 నుంచి ‘కీ’రిజిష్టర్ ఆధారంగానే బియ్యం పంపిణీ చేయనున్నారు. జవనరి 20 నాటికి కొత్తకార్డులు సిద్ధమవుతాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగా అధికారులు నల్లగొండ, భువనగిరి డివిజన్లలోని 30 దుకాణాల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దుకాణాల వారీగా ఎన్ని కార్డులు ఉన్నాయో లెక్కకట్టి ఆ ప్రకారంగా డీలర్ల నుంచి డీడీలు కట్టించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అందుబాటులో బియ్యం...
ఆహారభద్రత కార్డులకు సరిపడా బియ్యాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ అందుబాటులో ఉంచింది. పాతలెక్కల ప్రకారం 9.30 లక్షల కుటుంబాలకు 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా, తాజాగా పెరిగిన కోటా ప్రకారం జిల్లాకు ప్రతినెలా 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికిగాను ఇప్పటికే జిల్లాలో లక్షా మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అర్హత సాధించిన ‘ఆహార భద్రత’ 8,35,000
Published Sun, Dec 21 2014 2:13 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement