పింఛన్ రావాలన్నా.. ఆహార భద్రత కార్డు అందాలన్నా..
ధరఖాస్తులు
ఆహారభద్రత కార్డు, పింఛన్‌లకు ఉన్న డిమాండ్‌ను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ‘పింఛన్ రావాలన్నా.. ఆహార భద్రత కార్డు అందాలన్నా.. మాకు కొంత ముట్టజెప్పితే మేము సిబ్బంది చేతులు తడుపుతాం. ఇక మీ దరఖాస్తుకు ఢోకా ఉండదు. మీకు కావాల్సింది వచ్చి తీరుతుంది.’ అంటూ దళారులు దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. వారి మాయలో పడి పలువురు జేబులు గుళ్ల చేసుకుంటున్నారు.
సాక్షి, ఖమ్మం: ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ దళారుల జేబులు నింపుతోంది. పింఛన్ సొమ్మును ప్రభుత్వం పెంచడంతో లబ్ధిదారులు ఐదారు సార్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటువంటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు పింఛన్లు ఇప్పిస్తామంటూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో తెల్లరేషన్‌కార్డులు 7,07,130, అన్నపూర్ణ కార్డులు 1,644, వృద్ధాప్య 1,20,084 , వితంతు 94,084 , వికలాంగుల పింఛన్లు 27,918 ఉన్నాయి. రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం నూతనంగా కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు తొలుత గడువు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో ఈ తేదీని 20వ తేదీ వరకు పొడిగించింది.
ఇప్పటికే రేషన్, పింఛన్ లబ్ధిదారులు ఒక్కొక్కరు ఐదారు దరఖాస్తులు ఇచ్చారు. జిల్లాలో దరఖాస్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. వీటిని పరిశీలించటం అధికారులకు తలనొప్పిగా మారింది. తమకు పింఛన్ అందుతుందా..?, ఆహార భద్రత కార్డు వస్తుందా..? అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వారిని కొంతమంది దళారులు తమ బుట్టలో వేసుకుంటున్నారు. ఇప్పటికే పట్టణాల్లోని వార్డుల్లో చోటామోటా నేతలు, పల్లెల్లో కొంతమంది దళారులు ఈ దరఖాస్తులను అర్హుల వద్ద నుంచి తీసుకొని మండల కార్యాలయాల్లో ఇచ్చారు. పింఛన్ రావాలన్నా, ఆహార భద్రత కార్డు అందాలన్నా తమకు కొంత ముట్టజెప్పితే.. సిబ్బంది చేయి తడుపుతామని ఇక ఢోకా ఉండదని దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు..
ప్రభుత్వం వచ్చేనెల నుంచి రూ.వెయ్యి పింఛన్ ప్రకటించింది. ఆహార భద్రత కార్డును కేవలం రేషన్‌కే పరిమితం చేయడం, పింఛన్‌తో ఎక్కువ లబ్ధి చేకూరనుండటంతో ఇప్పుడు లబ్ధిదారులు దానిపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, పాల్వంచ ప్రాంతాల్లో కొంతమంది దళారులు.. ‘మీకు పింఛన్ ఇప్పిస్తాం.. రూ.500 నుంచి 1000 వరకు ఇవ్వాలి’ అని దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. లబ్ధిదారులు కూడా గుట్టలుగా దరఖాస్తులు రావడంతో తమ దరఖాస్తు పరిశీలనకు వస్తుందో లేదోననే ఆందోళనతో డబ్బులు ముట్టజెప్పుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తాము చెప్పినట్లుగా నడుస్తుందని, పింఛన్ జాబితాలో మీ పేరు ఉండడం ఖాయం’ అని దరఖాస్తుదారులను లబ్ధిదారులు మభ్యపెడుతున్నారు.
గడువు ముగుస్తుందా..? నిరంతరమా..?
తొలుత ఈనెల 15 వరకు గడువు అన్నారు. దాన్ని 20వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం రెండోసారి పెంచిన గడువు సోమవారంతో ముగియనుంది. ఈనెల 2లోగా ముందుగా పింఛన్ దరఖాస్తులు పరిశీలన పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ గజిబిజి ప్రకటనలతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో కొంతమంది ఇప్పటి వరకు అర్జి చేసుకోలేదు. వచ్చేనెల 8న నూతన పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తులకు ఎగబడుతుండగా.. దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రం దళారులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆహార భద్రత కార్డుల పరిశీలనను పక్కన పెట్టిన అధికారులు ప్రస్తుతం పింఛన్ల దరఖాస్తుల పరిశీలనలో మునిగారు. దళారులను నమ్మి డబ్బు ముట్టజెప్పిన వారు తమకు పింఛన్ వస్తుందా..? అని ఆందోళన చెందుతుండగా.. పరిశీలన పారదర్శకంగా జరగాలని లబ్ధిదారులు కోరుతున్నారు.