నేటి నుంచి ఆహారభద్రత
ఆహార భద్రత పథకం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త సంవత్సరంలో ఈ-పీడీఎస్ విధానం ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 6 కిలోలు ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8.76 లక్షల దర ఖాస్తులు ఆహార భద్రత పథకం కింద అర్హత సాధించాయి. మొత్తం 25 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.
- నల్లగొండ
జిల్లాలో ఆహార భద్రత కార్డులకు 11.05 లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో 8.76 లక్షల దరఖాస్తులు అర్హత సాధించాయి. దీంట్లో 7.30 లక్షల దరఖాస్తులను ఈ-పీడీఎస్‌కు అనుసంధానం చేస్తూ డేటాఎంట్రీ పూర్తి చేశారు. మిగతా ప్రక్రియ రెండు,మూడు రోజుల్లో పూర్తవుతుంది. బియ్యం పంపిణీ మాత్రం కీరిజిస్టర్ ఆధారంగానే జరుగుతుంది. ఎంపిక చేసిన అర్హులకు గురువారం నుంచి కుటుంబసభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా పౌరసరఫరాల శాఖ ఒక్కో వ్యక్తిపేర 6 కిలోల బియ్యం పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2,082 రేషన్ దుకాణాల్లో నిల్వ ఉంచారు. అయితే వంద శాతం డేటా ఎంట్రీ పూర్తయిన రేషన్ దుకాణాల్లో మాత్రమే బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ నెల 1 నుంచి 15 తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారు...కాబట్టి ఈలోగా మిగిలిన రేషన్‌దుకాణాల్లో వందశాతం డేటా పూర్తిచేసి లబ్ధిదారులందరికీబియ్యం పంపిణీ చేస్తారు.
నేటి నుంచే ఫైన్‌రైస్...
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు సూపర్ ఫైన్‌రైస్ (సన్నబియ్యం) అందజేయనున్నారు. పాఠశాలలు, హాస్టళ్లకు కలిపి మొత్తం జనవరినెల కోటాకు 1800 టన్నుల బియ్యం అవసరం కాగా, మంగళవారంనాటికి 1600 టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి యుద్ధప్రాతిపదికన ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించారు. గురువారం సెలవుదినం కావడంతో శుక్రవారం నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి పాఠశాలలు, హాస్టళ్లకు బియ్యం చేరవేస్తారు. కాగా పాత బియ్యం నిల్వలను సమీప ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించాలని హెచ్‌ఎంలకు, వార్డెన్‌లకు ఆదేశాలు జారీ చేశారు. సన్నబియ్యం పక్కదారి పక్కపట్టకుండా ఉండేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు.