data entry
-
17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తుల మొత్తం డేటా ఎంట్రీ ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహ ణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్లతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. నేడు టీవోటీలకు శిక్షణ డేటా ఎంట్రీకి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్ ట్రైనర్ (టీవోటీ)లకు 4వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీవోటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏవిధంగా చేయా లన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని చెప్పారు. డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. 2వ తేదీ నాటికి 57 లక్షల దరఖాస్తులు మంగళవారం నాటికి దాదాపు 57 లక్షల దరఖాస్తులు అందాయని సీఎస్ తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని కూడా సీఎస్ స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
మీ దస్తావేజు.. మీరే సొంతంగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానం మరింత సులభతరం కానుంది. ఎవరి దస్తావేజును వారే తయారు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పబ్లిక్ డేటా ఎంట్రీ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వారి వద్ద దస్తావేజుల్లో తమ రిజిస్ట్రేషన్ వివరాలు (ఆస్తి వివరాలు, కొనుగోలుదారు, విక్రయదారు, ఆధార్ నెంబర్లు తదితరాలు) నమోదు చేసుకుని ప్రభుత్వానికి చలానాలు కూడా వారి ద్వారానే చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తున్నారు. అక్కడ ఆ డాక్యుమెంట్‌ను పరిశీలించి రిజిస్టర్ చేస్తున్నారు. ఈ క్రమంలో డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం అధికంగా ఉండడంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ఉపయోగపడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ సీఏఆర్డీ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మిని స్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) డీఐజీ రవీంద్రనాథ్ వివరించారు. దీనివల్ల డాక్యుమెంట్ రైటర్ల వద్దకు వెళ్లకుండా ‘ఐజీఆర్ఎస్’ వెబ్సైట్లో స్వయంగా తమ డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. ఎవరి రిజిస్ట్రేషన్ డేటాను వారే ఆన్లైన్లో ఎంట్రీ చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్లోనే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపులు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జీల చలానాలు కూడా ఆన్లైన్లోనే చెల్లించే సౌలభ్యం కల్పించనున్నారు. ప్రస్తుతం ఇందుకు మూడు రకాల చలానాలు బ్యాంకులో కట్టాల్సి వస్తోంది. ఈ మూడింటిని కలిపి ఒకేసారి ఆన్లైన్లో చెల్లించే వీలు కల్పించనున్నారు. అనంతరం ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్, పేమెంట్ రశీదుతో జారీ చేసే యూనిక్ ఐడీతో నిర్దేశిత సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. సంబంధిత వ్యక్తుల ఫొటోలు, వేలిముద్రలు తీసుకుని ఒరిజినల్ పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం 45 నిమిషాలు పడుతుండగా పబ్లిక్ డేటా ఎంట్రీ, ఆన్లైన్లోనే చెల్లింపుల ద్వారా 10 నిమిషాల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఒకవేళ డేటా ఎంట్రీ అనంతరం ఏమైనా సరిదిద్దుకోవాలన్నా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేరుగా వచ్చినా రిజిస్ట్రేషన్లు.. డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్ లేకుండా నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే వారికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. వీరి డేటా ఎంట్రీని అక్కడి సిబ్బంది చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారానే చేస్తున్నారు. ఈ డేటా ఎంట్రీని మున్సిపల్ శాఖ చేస్తున్నా అదే విధానంలో సాధారణ రిజిస్ట్రేషన్లకు వర్తించేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. వివాహాల రిజిస్ట్రేషన్లను కూడా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇది మంచి ఫలితం ఇవ్వడంతో సాధారణ రిజిస్ట్రేషన్లకు వర్తింపచేస్తున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీతో పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు పబ్లిక్ డేటా ఎంట్రీ వల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానం పారదర్శకంగా ఉంటుంది. ప్రజలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దళారుల ప్రమేయం, అవకతవకలకు ఆస్కారం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం. – వి.రామకృష్ణ, కమిషనర్, ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
పబ్లిక్ డేటాఎంట్రీ.. సూపర్ సక్సెస్
సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన దిశగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రవేశ పెట్టిన పబ్లిక్ డేటాఎంట్రీ (పీడీఈ) విధానం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దస్తావేజు లేఖరుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థిరాస్తి విక్రయ దస్తావేజులను ఎవరికి వారే భర్తీచేసి, ఆన్లైన్ ద్వారా పంపించే పీడీఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏకంగా 6,426 ఆన్లైన్ దరఖాస్తులు నమోదు కావడం గమనార్హం. -
డాటా ఎంట్రీ పేరుతో ఘరానా మోసం
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : డాటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మోసం చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని ఆర్యనగర్‌కు చెందిన సతీష్‌కుమార్ శెట్టి వినాయక్‌నగర్‌లో గత డిసెంబర్ 13న ఎస్కేఎస్ అనే కంపెనీని ఆరంభించాడు. కంపెనీలో బిజ్నెస్ ప్రాసెసింగ్, అవుట్సోర్సింగ్, ఐటీ సొల్యూషన్ ఆఫ్ లైన్ వర్కింగ్ పని ఉంటుందని యువతకు గాలం వేశాడు. దీంతో నిరుద్యోగులు ఆకర్షితులయ్యారు. వీరే కాదు నిజామాబాద్‌కు చెందిన కొందరు యువకులు హైదరాబాద్‌లో మంచి కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు సైతం అక్కడ మానేసి ఇంటి వద్దనే డబ్బులు మిగులుతాయన్న ఆశకు పోయి ఎస్కేఎస్ కంపెనీలో చేరారు. డాటా ఎంట్రీ ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి రూ.20వేలు సతీష్ వసూలు చేశాడు. ఇలా దాదాపు 60 నుంచి 65 మంది యువత బలయ్యారు. అంటే సుమారు రూ.12లక్షలు వసూలు చేశాడు. నెల తర్వాత డాటా ఎంట్రీ పూర్తిచేశాక జీతం డబ్బులు ఇస్తానని చెప్పడంతో వారు నమ్మి డబ్బులు పెట్టి పనిలో జాయిన్ అయ్యారు. వీరేకాకుండా తన కంపెనీలో పనిచేసేందుకు మరో 60 మందిని నియమించుకున్నాడు. 15 రోజుల శిక్షణాకాలంలో నిత్యం ఒక్కొక్కరికి రూ. 200లు ఉపకార వేతనం చెల్లిస్తామని సతీష్ చెప్పాడు. ఇదిలా ఉండగా శిక్షణ పూర్తి చేసుకున్నవారు తమకు స్టయిఫండ్ డబ్బులు ఇవ్వాలని తరుచుగా సతీష్‌ను అడిగారు. దీంతో డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే ఐపీ పెడుతానని వారిని బెదిరించాడు. దాంతో పనిచేసే వారికి సతీష్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. గురువారం ఉదయం సతీష్ కంపనీకి రాకపోవటంతో అనుమానం వచ్చిన వారు ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాంతో బాధితులు జరిగిన మోసంపై నాల్గోటౌన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్కేఎస్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. సతీష్ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు. పోలీసులు ఆర్యనగర్‌లో సతీష్ ఉంటున్న నివాసాన్ని కనుగొని అక్కడ అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ డబ్బులు ఇప్పించాలని, న్యాయం చేయాలని ఎస్ఐ శంకర్‌ను కోరారు. అన్ని మాయ మాటలే.. ఎస్కేఎస్ కంపెనీ పేరుతో కార్యాలయాన్ని స్థాపించిన సతీష్ తనది మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ అని కొందరితో, రాయసీమ అని మరికొందరితో చెప్పాడు. అలంపూర్‌లో ట్రస్ట్ ఉందని, ట్రస్ట్‌కు సహాయంగా మీవంతు సహాకారం అందించాలని చెప్పాడు. కంపెనీలో చేరినవారిని నుంచి రూ.100 నుంచి 200 వరకు విరాళాలు సేకరించాడు. తాను క్రెవన్స్ కంపెనీలో రెండు తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్‌నంటూ నమ్మించాడు. తాము మళ్లీ ఉద్యోగం కోసం ఎక్కడ వెతకాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
డాటా ఎంట్రీ మాయగాడు..
కాజీపేట అర్బన్: ఆధునిక యుగంలో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మోసాలు పెరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం డాటా ఎంట్రీ ఉద్యోగాలంటూ.. ఆన్లైన్లో జీతాలంటూ మోసం చేసి ఓ మాయగాడు రూ.19 లక్షలతో ఉడాయించాడు. హన్మకొండ నక్కలగుట్టలో ఇన్ఫోటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరిట డాటా ఎంట్రీ జాబ్స్ అంటూ సాఫ్ట్వేర్ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించాడు వరంగల్‌కు చెందిన ఓ మాయగాడు. ముందుస్తుగా మూడువేల రూపాయాలు చెల్లించి మా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఓ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తానని, తద్వారా ఇంట్లో నుంచే డాటా ఎంట్రీ పనులు చేస్తూ వారానికి 10వేలకు పైగా సంపాదించవచ్చని నిరుద్యోగులకు వల వేశాడు. మాయగాడి మాటాలకు ఆకర్షితులైన హన్మకొండ కొత్తూరు జెండాకు చెందిన ఇద్దరు నిరుద్యోగ యువకులు తాము డాటా ఎంట్రీ వర్క్స్ చేస్తామంటూ ఓ మధ్యవర్తి ద్వారా సదరు మాయగాడికి పరిచయమయ్యారు. ఇద్దరు యువకులను సదరు మాయగాడు కొంత మొత్తం పెట్టుబడి పెట్టమని తనకు అమెరికా, లండన్, జపాన్‌లతో పాటు వివిధ దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయని వారితో ఎంఓయూ కుదుర్చుకున్నానని నమ్మించాడు. మాయగాడి మాటలకు ఆకర్షితులైన ఇద్దరు మిత్రులు రూ.7లక్షలు అప్పజెప్పారు. తర్వాత వారు దాదాపు 40 మందికి డాటా ఎంట్రీ జాబ్స్ ఇప్పించారు. రెండు నెలలకు బయటపడిన మోసం... వారం వారం ఆన్లైన్ ద్వారా అకౌంట్లో డాటా ఎంట్రీకి సంబంధించిన నగదు వస్తాయని నమ్మించాడు. కానీ రెండు నెలలు గడిచినా ఎలాంటి నగదు అకౌంట్లో పడలేదు. అనుమానం వచ్చి ఆరా తీసిన సదరు యువకులు మాయగాడు మోసం చేశాడని పసిగట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తమ డబ్బులతో పాటు 40మందికి సైతం అకౌంట్లో డబ్బులు రాకపోవడాన్ని పసిగట్టి మోసం చేశాడని నిర్ధారించుకున్నారు. సొత్తుతో పరారీ.. డాటా ఎంట్రీ జాబ్స్ పేరిట నిరుద్యోగుల నుంచి రూ.19లక్షలు వసూల్ చేసిన మాయగాడు రాత్రికి రాత్రే మకాం మార్చేశాడు. అతడి సెల్‌ఫోన్ ఆధారంగా కలకత్తాలో ఉన్నట్లు బాధితులు తెలుసుకున్నారు. కాగా సదరు మాయగాడు తనతో పాటు ఓ మహిళను వెంట తీసుకుని పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి సెల్‌ఫోన్ పని చేస్తుండకపోవడంతో బాధితులు భోరుమంటున్నారు. పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు ఇంట్లో ఉండే సంపాదించుకోండని, తీరిక సమయాల్లో డాటా ఎంట్రీ పనుల ద్వారా వారం వారం డబ్బులు అంటూ పలువురిని మోసగించి ఇద్దరు యువకుల వద్ద నుంచి రూ.7లక్షలు, మరో 40 మంది నిరుద్యోగులకు సంబంధించిన రూ.12లక్షలతో సదరు మాయగాడు పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, తమకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు సమాచారం. -
ఏమాయ చేశారో..
– రేషన్‌కార్డుల్లో ఇష్టానుసారంగా వివరాలు నమోదు – ఒక కుటుంబాన్ని వేరుచేసి రెండు కార్డులు మంజూరు – కొందరి కార్డుల్లో సభ్యుల పేర్లు లేని వైనం – నివాసం ఒక చోట.. రేషన్ షాపు మరోచోట – అవస్థలు పడుతున్న కార్డుదారులు అనంతపురంలోని మూడో డివిజన్ పరిధిలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవల రెండు కార్డులు మంజూరయ్యాయి. అతను, అతని భార్యకు కలిపి ఒక కార్డు ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు మాత్రమే మరో కార్డు జారీ చేశారు. రెండింటిలోనూ కుటుంబ పెద్ద భాస్కర్‌రెడ్డిని చూపించారు. ఉంటున్నది 3వ డివిజన్ అయితే 16వ డివిజన్ కమలానగర్‌లోని 51 నెంబరు రేషన్ షాపును నమోదు చేశారు. ఒక్క భాస్కర్‌రెడ్డి విషయంలో మాత్రమే జరిగిన తప్పదం కాదు.. జిల్లాలోని వేల సంఖ్యలోని కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం అర్బన్ : నాల్గో విడత జన్మభూమి సందర్భంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు జారీ చేసిన తెల్లకార్డుల్లో వివరాలు ఇష్టానుసారంగా నమోదయ్యాయి. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఒక కుటుంబాన్ని రెండుగా విభజించి వేర్వేరుగా రెండు కార్డులు జారీ అయ్యాయి. కొన్ని కార్డుల్లో కుటుంబ యజమానిని మాత్రమే చూపిస్తూ, మిగతా కుటుంబ సభ్యుల ఫొటోలను, పేర్లను చేర్చలేదు. కొన్ని కార్డుల్లో పేర్లు చేర్చారు తప్ప సభ్యుల ఫొటోలు ముద్రించలేదు. వేలాది కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు దొర్లాయి. 99,954 కార్డులు మంజూరు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు 99,954 కార్డులను ప్రభుత్వం మంజూరు చేయగా జన్మభూమి గ్రామ సభల్లో 72,531 కార్డులను లబ్ధిదారులకు జారీ చేశారు. మిగతా కార్డులను తహసీల్దారు కార్యాలయాలకు లబ్ధిదారులు స్వయంగా వెళ్లి తీసుకున్నారు. జారీ అయిన కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో లబ్ధిదారులు చేర్పులు, మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కార్డుల్లో లబ్ధిదారుని వివరాల నమోదు విషయంలో కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కనిపిస్తోంది. కార్డుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తమ కుటుంబం గ్రూప్ ఫొటోను జతచేసి ఇచ్చారు. దీన్ని స్కాన్ చేసి కార్డులో పొందుపర్చకుండా ఇష్టానుసారంగా వివరాలు, ఫొటోలను నమోదు చేశారు. చాలా కార్డుల్లో కేవలం కుటుంబ యజమాని ఫొటో ఒక్కటే ముద్రించారు. కుటుంబ సభ్యల ఫొటోలు లేవు. కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫొటోలు, పేర్లు కూడా నమోదు చేయలేదు. మరికొన్ని కార్డుల్లో ఆధార్‌లోని ఫొటోలను రేషన్ కార్డుల్లో ఉంచారు. ఇవి ఒక రకం తప్పదాలైతే...లబ్ధిదారుల నివాస ప్రాంతానికి సంబంధం లేని డివిజన్లలోని రేషన్ దుకాణం కేటాయించారు. చంద్రబాబు కొట్టాల్లో నివాసముంటున్న ఒకరికి పాపంపేట పంచాయతీలోని చౌక దుకాణం కేటాయించారు. తమకు కేటాయించిన చౌక దుకాణం ఎక్కడ వస్తుందో అంతుపట్టక లబ్ధిదారులు కాలనీలు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఇలాంటి తప్పిదాలు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల నిర్లక్ష్యంగా కారణంగానే చోటు చేసుకున్నాయి. కొరవడిన పర్యవేక్షణ కార్డుల్లో లబ్ధిదారులు వివరాలు నమోదు ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కంప్యూటర్ ఆపరేటర్లు కార్డుల్లో వివరాలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు. ఫొటోలను ఎలా ఉంచుతున్నారు. అనేవాటిని అధికారులు కనీసంగా కూడా పట్టించుకోలేదని తెలిసింది. దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లకు అందజేసి వివరాలను నమోదు చేయాలని చెప్పి వదిలేశారు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వివరాలను నమోదు చేశారు. త్వరలో మార్పులు, చేర్పులు రేషన్ కార్డుల్లో చోటు చేసుకున్న తప్పిదాలను సరిచేసేందుకు ఒక నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. కుటుంబ సభ్యుల చేర్పులు, ఫొటో అప్లోడ్ ప్రక్రియను మీ సేవ ద్వారా చేస్తారు. చేర్పులకు, మార్పులకు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ప్రకటిస్తాం. అప్పుడు లబ్ధిదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. – శివశంకర్‌రెడ్డి, ఇన్చార్జ్ డీఎస్ఓ -
ఆన్లైన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ
కర్నూలు : పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు ముగియడంతో ఆన్లైన్లో డేటా ఎంట్రీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు స్థానిక ఏపీఎస్పీ మైదానంలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీ కొనసాగుతోంది. పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో 494 మహిళ, పురుష కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 14,576 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. సివిల్ ఏఆర్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ నియామక దేహదారుఢ్య పరీక్షలు కూడా డిసెంబర్ 20తో ముగిశాయి. ఇందులో 221 పోస్టులకు సుమారు 40,032 దరఖాస్తులు రాగా 11,762 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. డిసెంబర్ 20తో కార్యక్రమం ముగిసింది. అయితే స్క్రీనింగ్ టెస్టులో ఫెయిలై సందేహాలతో అప్పీల్ చేసుకునే అభ్యర్థులకు రెండవసారి అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్టు ప్రక్రియ పూర్తి కావడంతో దరఖాస్తుదారుల డేటా ఎంట్రీ, ఆన్లైన్లో పొందుపరిచే కార్యక్రమం మొదలెట్టారు. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి 220 వివరాలు పొందుపరుస్తున్నారు. జనవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నందునా వారంలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం నేతృత్వంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ విధుల్లో పోలీసు కార్యాలయ సిబ్బంది గత రెండు నెలలుగా ఊపిరి సలపని విధంగా ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసు సిబ్బంది బిల్లుల తయారీలో పూర్తి జాప్యం జరుగుతోంది. సకాలంలో బిల్లులు ట్రెజరీకి చేరకపోవడంతో అందవలసిన సౌకర్యాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనవరి 3 నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఎస్ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కర్నూలులోనే నిర్వహిస్తున్నారు. ఎస్ఐ అభ్యర్థుల స్క్రీనింగ్ టెస్టుకు కూడా డీపీఓ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తూ కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న కానిస్టేబుళ్లను కూడా జిల్లా కేంద్రానికి రప్పించి డేటా ఎంట్రీకి వినియోగించుకుంటున్నారు. ఆరు జిల్లాలకు సంబంధించిన కానిస్టేబుల్ అభ్యర్థుల డేటా ఎంట్రీని జిల్లాల వారీగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి నమోదు చేస్తున్నారు. -
పంచాయతీల్లో ఆపరేటర్లకు పొంచి ఉన్న గండం
♦ నెలాఖరుతో ముగియనున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ గడువు ♦ 1,313 మంది డేటా ఎంట్రీ ♦ ఆపరేటర్లలో ఆందోళన కొనసాగింపు విషయమై త్వరలో ఉత్తర్వులు: డెరైక్టర్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ విభాగంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. గ్రామ పంచాయతీల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు 2014లో ఔట్సోర్సింగ్ పద్ధతిన వీరందరినీ ప్రభుత్వం నియమించింది. కార్వీ ఏజెన్సీతో సర్కారు కుదుర్చుకున్న ఒప్పందం గత డిసెంబరు 31తోనే ముగియగా, చివరి నిమిషంలోప్రభుత్వం మరో మూడు నెలల పాటు (2016 మార్చి 31) వరకు కాంట్రాక్ట్ గడువును పొడిగించింది. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయోనని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కార్వే ఏజెన్సీ కింద ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వీరందరిని వదిలించుకోవాలని, కార్వే కాంట్రాక్ట్‌కు మంగళం పాడాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 తర్వాత సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’కోసం విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని పంచాయతీరాజ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు. కొనసాగిస్తాం: పీఆర్ విభాగం డెరైక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తామని, వారు పనిచేస్తున్న కార్వీ ఏజె న్సీ కాంట్రాక్ట్ గడువును మాత్రం పొడిగించడం లేదని పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితా రాంచంద్రన్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల ఆదాయంలో 10 శాతం నిధులను పరిపాలనకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను ఆ పంచాయతీలే చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీచేస్తామని ఆమె పేర్కొన్నారు. -
నవంబర్‌లోగా ఈ- పహాణీల్లో వివరాల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పహాణీల్లో డేటా ఎంట్రీని నవంబర్‌లోగా పూర్తి చేయాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్(సీసీఎల్ఏ) అధర్‌సిన్హా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ అంశాలకు సంబంధించి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహ సీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ-పహాణీలోని 15 నుంచి 31 అంశాల్లో ఈ ఏడాది పంట వివరాలను వెంటనే నమోదు చేయాలని అధర్‌సిన్హా అధికారులను ఆదేశించారు. ఆపై 1 నుంచి 14 అంశాల్లో భూమి వివరాలను పొందుపరచాలని సూచించారు. జిల్లాలవారీగా రైతుల ఆధార్ సీడింగ్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని, ఉద్యోగుల వివరాలను కూడా కంప్యూటరీకరించాలన్నారు. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 409 మంది దరఖాస్తుదారులు ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారని, వీరిలో ఆర్హులైనవారికి తక్షణం ఆయా భూములను రిజిస్ట్రర్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన మార్గదర్శకాలు, కన్వీనియన్స్ డీడ్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తె స్తామని చెప్పారు. -
నేటి నుంచి ఆహారభద్రత
ఆహార భద్రత పథకం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త సంవత్సరంలో ఈ-పీడీఎస్ విధానం ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 6 కిలోలు ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8.76 లక్షల దర ఖాస్తులు ఆహార భద్రత పథకం కింద అర్హత సాధించాయి. మొత్తం 25 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. - నల్లగొండ జిల్లాలో ఆహార భద్రత కార్డులకు 11.05 లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో 8.76 లక్షల దరఖాస్తులు అర్హత సాధించాయి. దీంట్లో 7.30 లక్షల దరఖాస్తులను ఈ-పీడీఎస్‌కు అనుసంధానం చేస్తూ డేటాఎంట్రీ పూర్తి చేశారు. మిగతా ప్రక్రియ రెండు,మూడు రోజుల్లో పూర్తవుతుంది. బియ్యం పంపిణీ మాత్రం కీరిజిస్టర్ ఆధారంగానే జరుగుతుంది. ఎంపిక చేసిన అర్హులకు గురువారం నుంచి కుటుంబసభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా పౌరసరఫరాల శాఖ ఒక్కో వ్యక్తిపేర 6 కిలోల బియ్యం పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2,082 రేషన్ దుకాణాల్లో నిల్వ ఉంచారు. అయితే వంద శాతం డేటా ఎంట్రీ పూర్తయిన రేషన్ దుకాణాల్లో మాత్రమే బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ నెల 1 నుంచి 15 తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారు...కాబట్టి ఈలోగా మిగిలిన రేషన్‌దుకాణాల్లో వందశాతం డేటా పూర్తిచేసి లబ్ధిదారులందరికీబియ్యం పంపిణీ చేస్తారు. నేటి నుంచే ఫైన్‌రైస్... ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు సూపర్ ఫైన్‌రైస్ (సన్నబియ్యం) అందజేయనున్నారు. పాఠశాలలు, హాస్టళ్లకు కలిపి మొత్తం జనవరినెల కోటాకు 1800 టన్నుల బియ్యం అవసరం కాగా, మంగళవారంనాటికి 1600 టన్నుల బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి యుద్ధప్రాతిపదికన ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు. గురువారం సెలవుదినం కావడంతో శుక్రవారం నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పాఠశాలలు, హాస్టళ్లకు బియ్యం చేరవేస్తారు. కాగా పాత బియ్యం నిల్వలను సమీప ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించాలని హెచ్ఎంలకు, వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు. సన్నబియ్యం పక్కదారి పక్కపట్టకుండా ఉండేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. -
పింఛనుకు అర్హులు 2.13 లక్షల మంది
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో రెండు లక్షల పదమూడు వేల మందిని పింఛనలకు అర్హులుగా గుర్తించామని, వీరిలో ఇప్పటివరకు లక్షా అరవై ఐదువేల మంది పెన్షన్‌దారుల డేటాను ఎంట్రీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి తెలిపారు. సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరి రేమండ్‌పీటర్ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతంలో 2,24,426 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం 2,13,063 మందిని అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. ఇంకా 10వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఆహర భద్రత కార్డులకు 7,21,852 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటివరకు 2,98,905 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు వివరించారు. ఈ నెలాఖరులోగా పెన్షన్ దరఖాస్తుల పరశీలన పూర్తి చేయడంతో పాటు అర్హులందరికీ పింఛను పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సురేంద్రమోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్, డీఎస్వో గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలంబరితి కలెక్టరేట్ నుంచి పింఛన్లు ,ఆర్‌ఓఎఫ్‌ఆర్‌పై ఎంపీడీవోలు, తహశీల్దార్లతో, ఆర్డీవోలతో, ఫారెస్టు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24వ తేదీలోపు పెన్షన్ల ప్రకియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో జాబితాలు ప్రదర్శించాలని, దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలపాలని సూచించారు. -
త్వరితగతిన ‘జన్మభూమి’ డేటా ఎంట్రీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జన్మభూమి కార్యక్రమంలో స్వీకరించిన అభ్యర్థనల డేటా ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమ డేటా ఎంట్రీ, తుపాను అప్రమత్తతపై అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అత్యవసర సేవలు అందాల్సిన (హైరిస్క్) మహిళలు, పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ సంయుక్తంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరు జాబితాలో తప్పిపోరాదని సూచించారు. తుపానుపై అప్రమత్తం తుపానుపై జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు స్థానికంగా ఉండి అన్ని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, డ్వామా పీడీ ఎ. కల్యాణ చక్రవర్తి, జెడ్పీ సీఈవో ఎం.శివరామనాయకర్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్ గీతాంజలి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఆర్. గణపతిరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఆర్.రవీంద్రనాథ్, పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు పి.నాగన్న పాల్గొన్నారు. -
పని ఒత్తిడి కాదు.. రాజకీయ ఒత్తిడే!
శ్రీకాకుళం పాతబస్టాండ్: తొలగింపునకు గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని జిల్లా మంత్రి, ప్రభు త్వ విప్ల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుండటంతో గృహనిర్మాణ సంస్థ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. ఎవరికి వారు తాము చెప్పిన వారికే పోస్టింగులు ఇవ్వాలని పట్టుపడుతుండటంతో ఏం చేయాలో అర్థంకాక గత 40 రోజులుగా నియామక ప్రక్రియ జోలికే అధికారులు వెళ్లడం లేదు. జాప్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. పని ఒత్తిడి సాకుగా చూపి తప్పించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలనుకూడా చేర్చి పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూ రు చేశారు. దాంతో గృహ నిర్మాణ సంస్థకు పని భారం పెరిగి అదనపు ఉద్యోగులను నియమిం చారు. అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులను నియమించారు. ఆవిధంగా అవుట్ సోర్సింగ్ విధానంలోనే జిల్లాలో 97 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు పని చేసేవారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ వీరిని తొలగిస్తూ ఆగస్టు లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు ఉద్యమాలు చేశారు. అధికారులు కూడా.. తొలగింపు వల్ల పనులు కుంటుపడతాయని, సిబ్బంది అవసరం ఉందంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దాంతో దిగివచ్చిన ప్రభుత్వం మండలానికి ఇద్దరు చొప్పున వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించాలని ఆగస్టు నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 38 మం డలాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 76 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమవుతారు. ఇప్పటికే 22 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నందున మిగిలిన 54 మందిని అవుట్ సో ర్సింగ్ పద్ధతిలో నియమించాల్సి ఉంది. విద్యార్హతలతోపాటు గుణగణాలు, గతంలో పని చేసి న వారి పనితీరు ఆధారంగా ఈ నియామకాలు జరపాల్సి ఉండగా.. అవన్నీ పక్కన పెట్టి తాము చెప్పిన వారికే పోస్టులు కట్టబెట్టాలని రాజకీ య ఒత్తిళ్లు పెరగడం.. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని భీష్మించుకోవడంతో గృహనిర్మాణ సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై గృహనిర్మాణ సంస్థ పీడీ పి.ఆర్.నర్సింగరావు వద్ద ప్రస్తావించగా పని ఒత్తిడి వల్ల సకాలంలో నియామకాలు చేయలేకపోయామన్నారు. రాజకీయ ఒతి ్తళ్లు లేవని, మరో పది రోజుల్లో నిబంధనల ప్ర కారం నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. -
రుణమాఫీ జాబితా సిద్ధం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో రుణమాఫీకి అర్హులైన రైతుల డేటా ఎంట్రీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కేవీ రమణ బ్యాంకు అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం బ్యాంకర్లతో ఆయన సమావేశమయ్యారు. రుణమాఫీ డేటా ఎంట్రీ ఆఫ్‌లైన్‌లో వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు ఎస్బీఐకి ఇచ్చిన 1,89,000కు గాను 45 వేలు, ఏపీజీబీకి 1,21,000కు గాను లక్ష, డీసీసీబీకి 78 వేలకుగాను 57 వేలు ఆఫ్‌లైన్ డేటా ఎంట్రీ చేశారని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రాబ్యాంకు 22 వేలకుగాను 16 వేలు,కార్పొరేషన్ బ్యాంకు 7 వేలకు 5 వేలు ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేశారని, మిగతా వివరాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఖాతాలు ప్రారంభించడానికి జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ఖాతాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్, రేషన్‌కార్డు, రెండు ఫోటోలు ఇస్తే ఖాతాలను ప్రారంభించాలని ఆదేశించారు. వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. బ్యాంకు ఖాతాలు లేని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, ఎల్డీఎం రఘునాథరెడ్డి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుబ్రమణ్యం, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘చైల్డ్ ఇన్ఫో’డేటా ఎంట్రీలో జిల్లాకు చివరి స్థానం
విజయనగరం అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల నమోదుకు సంబంధించిన ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ఎంట్రీ ప్రక్రియలో జిల్లా వెనుకబడి ఉంది. చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ డేటా ఎంట్రీ, విద్యార్థుల ఆధార్ నంబర్ల నమోదు ప్రక్రియలో జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 22వ తేదీలోగా పై రెండు అంశాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇచ్చిన గడువు దాటిపోయినా ఇంకా 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఎస్ఎస్ఏ అధికారులు ఎంఈఓలకు ఫోన్లు చేసి త్వరగా పూర్తి చేయండి మహాప్రభో అని వెంటపడుతున్నారు. జిల్లాలోనిఅన్ని మండలాలకు ఇన్చార్జి విద్యాశాఖాధికారులుండడం వల్ల చాలా మంది ఎస్ఎస్ఏ అధికారులతో సమన్వయంతో పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇచ్చిన ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో ఎంఈఓలు విఫలమవుతున్నారని ఎస్ఎస్ఏ అధికారుల వాదన. అయితే మండల స్థాయిలో తమకు ఉన్న అధికపనుల ఒత్తిడి వల్ల సాధ్యం కావడం లేదని ఎంఈఓలు చెబుతున్నారు. వెబ్సైట్లో నమోదు కాని 63 శాతం మంది విద్యార్థులు అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు చేయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చదువుతున్నారు? అనే విషయాలను ప్రధానంగా తెలుసుకోవడం కోసం 2012-13 విద్యా సంవత్సరం ఆఖరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మంగళవారం వరకు కేవలం 37 శాతం మాత్రమే అయింది. 13 జిల్లాలతో పోల్చుకుంటే చివరి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలుపుకొని 2,90,805 మంది విద్యార్థినీవిద్యార్థులున్నారు. ఇప్పటి వరకు లక్షా 3,576 మంది వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇంకా నమోదు కాాని వారిలో అధికశాతం ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులున్నారు. జిల్లా మొత్తం మీద ప్రైవేటు విద్యాసంస్థల్లో 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో కేవలం 10,420 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా చూసేందుకు, డ్రాపౌట్స్ ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు ఇదే వెబ్సైట్లో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేయాలని నెల రోజుల క్రితం ఆదేశించారు. దీంతో విద్యార్థుల పేర్ల నమోదు ప్రక్రియ మళ్లీ మొదటి వచ్చింది. ఇప్పటికే ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ఎంట్రీ ప్రక్రియలో భాగంగా వెబ్సైట్లో నమోదయిన విద్యార్థులందరి ఆధార్ నంబర్‌ను ఫీడ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు విధిగా ఆధార్‌కార్డులు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో ఎంఈఓలు విఫలమయ్యారు. ఆధారు కార్డులు లేని విద్యార్థుల వివరాలను పాఠశాల వారీగా తెలియజేస్తే సమీప ప్రాంతాలలో విద్యార్థులకు అందుబాటులో ఆధార్ కార్డు మంజూరు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు మొత్తుకొని చెప్పినా సంబంధిత వివరాలను ఇవ్వడంలో ఎంఈఓలు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆధార్ కార్డులు లేనివిద్యార్థులను వెబ్సైట్లో నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఎంఈఓలు స్పందిస్తే చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో ఎంట్రీ ప్రక్రియను విజయవంతం చేయవచ్చని విద్యాశాఖ నిపుణులు చెపుతున్నారు. -
93 లక్షల కుటుంబాల డేటా నమోదు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన 93 లక్షల కుటుంబాల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలో కంప్యూటరీకరణ పూర్తవుతుందని అధి కారులు వివరించారు. 1.05 కోట్ల కుటుంబాల్లో ఇప్పటివరకు 93 లక్షల కుటుం బాల డేటాను కంప్యూటరీకరించినట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 21 లక్షల కుటుంబాలను సర్వే చేయగా 8 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయిందని, మిగిలింది పూర్తి చేసేందుకు ఇతర జిల్లాలకూ సర్వే పత్రాలను పంపిస్తున్నట్లు వివరించారు. సమగ్ర సర్వే కంప్యూటరీకరణ పూర్తయినట్లు కలెక్టర్లు సర్టిఫికేషన్ చేసి పంపించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. -
8లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ: సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఈ నెల 8లోగా కంప్యూటర్లో ఎంట్రీ చేయాలని జాయింట్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారుల సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని 46 మండలాలకు గాను జహీరాబాద్, కల్హేర్, కోహీర్, నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లో డాటా ఎంట్రీ మందకొడిగా సాగుతుండటం పట్ల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తేదీలోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే డాటా ఎంట్రీ ఆపరేటర్లను పెంచుకోవడంతో పాటు అధిక సమయాన్ని కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాతో పాటు వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు పాల్గొన్నారు. డాటా ఎంట్రీని పరిశీలించిన జేసీ సంగారెడ్డి రూరల్: కంది శివారులోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 8 లక్షల 65 వేల నివాసాల్లో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, అందుకు డాటా ఎంట్రీలో అప్రమత్తత అవసరమని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. జేసీతోపాటు తహశీల్దార్ రాధాబాయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
ఎంట్రీ.. ఎంత కష్టమో!
నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమం చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 19వ తేదీన (ఒక్క రోజు) ఇంటింటికీ తిరిగి సేకరించిన కుటుంబ వివరాలను కంప్యూటరీకరించడంలో సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మొత్తం కుటుంబ వివరాలు కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాల్సి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం గడువు కంటే ముందుగానే ఈ డాటా మొత్తాన్ని ఈ నెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ అనేకచోట్ల కావాల్సిన కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరతతో ఆలస్యమవుతోంది. దీంతోపాటు తీవ్రమైన విద్యుత్ కోతల కారణంగా సిబ్బంది అనుకున్నంత స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. పలుచోట్ల కాలేజీల్లో పాతపడిన కంప్యూటర్లను వాడుతుండడం వల్ల డాటా ఎంట్రీ ముందుకు సాగడం లేదు. ప్రధానంగా సర్వే అప్పుడు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. దీంతో ఎంట్రీ సిబ్బంది మళ్లీ ఆయా కుటుంబాలకు ఫోన్లు చేసి వివరాలు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో అధికారులు నిర్ణయించిన ప్రకారం ఒక్కో ఆపరేటర్ రోజుకు 60 ఫారాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయాల్సి ఉండగా..20 నుంచి 30 ఫారాలకు మించి దాటట్లేదు. గడువులోగా పూర్తయ్యేనా..? జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 11,69,690 కుటుంబాల వివరాలు సేకరించారు. దీంట్లో శనివారం సాయంత్రం వరకు అధికారుల ఇచ్చిన సమచారం మేరకు 4,06,394 కుటుంబాల వివరాలను మాత్రమే కంప్యూటర్లలో నమోదు చేశారు. ఇంకా 7,63,296 కుటుంబాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. గడువు సమీపిస్తుండడంతో అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. ఎంట్రీ కార్యక్రమం వేగవంతం చేయాలని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా డివిజన్ అధికారులను ఆదేశించినప్పటికీ పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. నల్లగొండ డివిజన్లో 2,39,459 కుటుంబాలు సర్వే చేశారు. వీటిల్లో కేవలం 1,07,966 కుటుంబాలకు చెందిన వివరాలను మాత్రమే కంప్యూటర్లలో ఎంట్రీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో 53 వేల కుటుంబాలు కాగా ఇప్పటివరకు కేవలం 4 వేల కుటుంబాల వివరాలు మాత్రమే కంప్యూటర్లో నమోదు చేశారు. కంప్యూటర్లలో సాంకేతికలోపాలు తలెత్తడం వల్ల ఎంట్రీ ఆలస్యంగా జరుగుతోంది. చర్లపల్లి సమీపంలోని నిట్స్ కాలేజీలో మరో సెంటర్‌ను పెట్టారు. ఇక్కడ 20 కంప్యూటర్ల ద్వారా 40మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ చేస్తున్నారు. భువనగిరి డివిజన్లోని సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రధానంగా సర్వర్ డౌన్ సమస్య అన్నిచోట్లా ఉంది. సర్వర్లు డౌన్ అయితే రెండు గంటల వరకు ఓపెన్ కావడంలేదు. భువనగిరిలోని ఆరోర, వాత్సల్య, శారద, కేబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్లు, బీబీనగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల, బొమ్మలరామారం మండలం చీకటి మామిడి ప్రొగ్రేస్, భూదాన్‌పోచంపల్లి దేశ్ముఖిలోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాలలో పాత కంప్యూటర్ల వాడకం వ ల్ల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో డాటా ఎంట్రీ చేస్తున్నప్పటికీ ఆప్‌లోడ్ కావడంలేదు. భువనగిరిలో వాత్సల్య, శారదా కళాశాలల్లో పాత కంప్యూటర్లతో డాటా ఎంట్రీ అపరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజుకు 20 ఫారాలకు మించి ఎంట్రీ చేయడం కష్టంగా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో కరెంట్ కోతలు ఇబ్బందిపెడుతున్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో ఆపరేటర్లు నిరసన తెలిపారు. మునుగోడు మండలానికి సంబంధించి డాటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే ఫారాలు నింపకపోవడంతో వీఆర్వోలు వివరాలు సేకరించి, ఇచ్చాక డాటా ఎంట్రీ చేస్తున్నారు. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా 180 కంప్యూటర్లు, దేవరకొండ నగర పంచాయతీలో 20 వార్డులకు 20 కంప్యూటర్లు ఉపయోగించి డాటా ఎంట్రీ చేస్తున్నారు. కంప్యూటర్ల కొరత, రాత్రి వేళ డాటా ఎంట్రీ చేయడం కోసం ఆపరేటర్లు హాజరవడం లేదు. ఒక్కో ఎంట్రీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తుండడంతో ఒక్కో ఆపరేటర్ రోజుకు 50 నుంచి 70 ఫారాలు ఎంట్రీ చేస్తుండగా అతనికి కేవలం రూ.300 కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఆపరేటర్లు ఒక రోజు వచ్చిన వారు మరుసటి రోజు రావడానికి సుముఖత చూపడం లేదు. దీంతో ఆపరేటర్ల కొరత ఎక్కువగా ఉంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర సర్వే ద్వారా మున్సిపల్ అధికారులు మొత్తం 21వేల కుటుంబాలను గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఐదు రోజులుగా పట్టణ పరిధిలోని క్రాంతి కళాశాల, మండల పరిధిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటరీకరిస్తున్నారు. అయితే నెట్ నెమ్మదిగా ఉండడంతో పనివేగంగా జరగడం లేదు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో 14, ఆర్డీఓ కార్యాలయంలో 6 కంప్యూటర్లు ద్వారా డాటా ఎంట్రీ చేస్తున్నారు. 40 మంది ఆపరేటర్లు రెండు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అనుభవం లేని కంప్యూటర్ ఆపరేటర్ల వల్ల ఇప్పటివరకు కేవలం 2,300 కుటుం బాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. శనివారం మ రో 20 కంప్యూటర్లను తెప్పించారు. కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత ఉంది. సూర్యాపేట మండలం బాలెంల గ్రామ సమీపంలోని అరవిందాక్ష ఇంజినీరింగ్ కళాశాలలో తుంగతుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట అర్బన్ కుటుంబాలకు సంబంధించిన వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఇందుకు 90 కంప్యూటర్లు అవసరం ఉండగా 52 కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ఎంట్రీ ఆపరేటర్లను 52 మందిని, 52 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. వీరు గంటకు ఆరు నుంచి పది కుటుంబాల సర్వే వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. విద్యుత్ సమస్య కొంత ఉన్నప్పటికీ ఇన్వర్టర్లు ఉండడంతో కంప్యూటరీకరణ చేయడం పట్ల ఇబ్బంది కలగడం లేదు. కానీ కంప్యూటర్లు సరిపడా లేకపోవడం, సర్వర్ల సమస్య, ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల ఎంట్రీ ఆలస్యమవుతోంది. -
కంప్యూటరీకరణ బాధ్యత వీఆర్వోలదే!
15 రోజుల్లోగా సమగ్ర సర్వే డేటా ఎంట్రీ సాక్షి, హైదరాబాద్: సమగ్ర ఇంటింటి సర్వే పత్రాల్లోని సమాచారాన్ని కంప్యూటర్లలో నిక్షిప్తం చేసే బాధ్యతను ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఈ కంప్యూటర్లలో ప్రతి గ్రామంలో వచ్చిన సర్వే పత్రాలన్నింటినీ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కంప్యూటర్లలో నమోదు చేయించిన తరువాత ఆ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. ఆ సమాచారం మొత్తం నేరుగా రాష్ట్రస్థాయిలోని వెబ్‌కు చేరుతుంది. ఒకసారి గ్రామ రెవెన్యూ అధికారి గ్రీన్‌సిగ్నల్(ఓకే బటన్ క్లిక్ చేయడం) తరువాత ఆ డేటాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా.. లాక్ అయిపోతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రతి జిల్లాలోనూ 1,500 నుంచి 2,000 కంప్యూటర్లను అధికార యంత్రాంగం సమకూర్చింది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగులను దీనికి వినియోగిస్తారని, సరిపోని పక్షంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించు కుంటారు. పక్షం రోజుల్లోగా ఈ డేటా మొత్తం పూర్తి చేయాలని అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి ఆదేశిం చారు. ఎన్యూమన్యూరేటర్లు సర్వే పత్రాల్లో నమోదు చేసిన ప్రతి అంశాన్నీ... ఆన్లైన్ ఫారాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియలో వీఆర్వోలు ఆ సర్వే పత్రాలను చదువుతుంటే.. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్లలో ఫీడ్ చేస్తారు. ఇవన్నీ మండల కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఒక జిల్లాలో అధికంగా మండలాలుండి, గ్రామాలెక్కువగా ఉంటే.. ఎక్కువ సెంటర్లను ఏర్పాటుచేసి నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఈ సమాచారం మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిగా విభజిస్తారు. రాష్ట్ర అధికారులకు మొత్తం సమాచారం అందుబాటులోకి వస్తే...మండలస్థాయి అధికారులకు మండల వివరాలు, గ్రామస్థాయికి వచ్చేసరికి ఆ గ్రామ సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా.. విధానాన్ని రూపొందించనున్నారు. ఆర్థికస్తోమత అంచనాకు.. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలోని అంశాల ఆధారంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారిని గుర్తించడానికి ప్రధానంగా ఈ డేటాను వినియోగించనున్నట్లు సమాచారం. భూ వివరాల సేకరణ ద్వారా ఒక రైతుకు వచ్చే వార్షిక ఆదాయం ఎంత అన్నది.. ప్రస్తుతం ఉన్న ప్రామాణికాల ఆధారంగా వార్షిక ఆదాయాన్ని గణి స్తారు. దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులా.. కాదా? అన్న విషయాన్ని తేల్చనున్నారు. శుక్రవారం నుంచి ఈ కంప్యూటీరకరణను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎస్సీల్లో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత, తరువాత గిరిజనులు, బీసీలకు ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. -
12,66,720
- లెక్క తేలిన కుటుంబాల సంఖ్య - మూడేళ్లలో 29.87% పెరుగుదల - నూటికి 104.45 % దాటిన సర్వే - మొత్తం 104.45% కుటుంబాల సర్వే - ఎలిగేడు, మహదేవ్‌పూర్‌లో తగ్గిన శాతం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఒక్క రోజు సమగ్ర సర్వేతో జిల్లాలోని కుటుంబాల సంఖ్య నిక్కచ్చిగా లెక్క తేలింది. మొత్తం 12,66,720 కుటుంబాలున్నట్లు వెల్లడైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,76,022 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అప్పటితో పోలిస్తే మూడేళ్ల వ్యవధిలో 29.87 శాతం కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. కరీంనగర్ డివిజన్‌లోఅత్యధికంగా 35.28 శాతం, సిరిసిల్ల డివిజన్లో 34.50 శాతం కుటుంబాల సంఖ్య పెరిగినట్లు లెక్కతేలింది. ముందుగా గుర్తించిన కుటుంబాలతో పోలిస్తే సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... జిల్లాలో 104.45 శాతం సర్వే పూర్తయినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. సర్వేకు సంబంధించి ఇంటి నంబర్లు వేసే సమయంలో జిల్లాలో 12.12 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీరా.. సర్వే చేసే సమయానికి ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 12,66,720 కుటుంబాల వివరాలను సర్వే సిబ్బంది నమోదు చేశారు. తమ ఇంటి నంబర్లు గల్లంతయ్యాయని చాలా కుటుంబాలు అప్పటికప్పుడు నంబర్లు వేయించుకుని తమ వివరాలు నమోదు చేయించటం... దూరప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది కుటుంబాలు అదే రోజున సర్వేలో ఎంట్రీ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముందుగా నంబర్లు వేయనప్పటికీ.. అడిగిన వారందరికీ తక్షణమే నంబర్లు కేటాయించి వివరాలు నమోదుకు జిల్లా యం త్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేయటంతో సర్వే సంపూర్ణమైంది. గంగాధర మండలంలో అత్యధికంగా 109 శాతం, చొప్పదండి, భీమదేవరపల్లి, రాయికల్, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో 108 శాతం సర్వే జరిగింది. ముందుగా అధికారులు గుర్తించిన కుటుంబాల కంటేతక్కువగా ఎలిగేడు మండలంలో కేవలం 95.39 శాతం, మహదేవ్పూర్ మండలంలో 98.55 శాతం కుటుంబాలు తమ వివరాలు నమోదు చేయించటం గమనార్హం. ఇబ్రహీంపట్నం మండలంలో పక్కాగా నూటికి నూరు శాతం సర్వే జరగ్గా... జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో వంద శాతానికి మించి సర్వే జరిగినట్లు అధికారులు ప్రకటించారు. రామగుండంలో 105 శాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 40,424 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాలుపంచుకున్నారు. ఇక డాటా ఎంట్రీ సర్వే ద్వారా సేకరించిన కుటుంబాల వివరాలు డాటా ఎంట్రీ చేసేందుకు జిల్లాలో దాదా పు మూడు వేల కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. మంథని, కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 300 కంప్యూటర్లను డాటా ఎంట్రీకి వినియోగిస్తున్నారు. వీటికి తోడుగా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, పట్టణ ప్రాంతాల్లో ఆర్డీవో కార్యాలయాలు, మండలాల్లో తహసీల్ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకి ప్రత్యేకంగా కంప్యూటర్లను సిద్ధం చేశారు. -
ఇంటర్ ఉత్తీర్ణులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు
పరీక్షా స్వరూపం:లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షను రెండు భాగాలుగా విభజించారు. 1 రాతపరీక్ష 2 నైపుణ్య పరీక్ష. రెండు పోస్టులకు రాతపరీక్ష (పేపర్-1)ఒకేలా ఉంటుంది. పేపర్-2లో లోయర్ డివిజన్ క్లర్క్‌కు స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు టైపింగ్ పరీక్ష ఉంటుంది. ఉద్యోగం పేరు ఖాళీలు లోయర్ డివిజన్ క్లర్క్: 991 డేటా ఎట్రీ ఆపరేటర్: 1,006 మొత్తం: 1,997 ముఖ్యాంశాలు విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత (ఆగస్టు 1, 2014నాటికి) వయో పరిమితి:18-27ఏళ్ల మధ్య అంటే 02-08-1987 తర్వాత 01-08-1996కు ముందు జన్మించి ఉండాలి. కేటగిరీల వారీ వయో పరిమితిలో సడలింపు ఇస్తారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 19-07-2014 గడువు: 19-08-2014 సాయంత్రం 5.30 గంటలలోపు దరఖాస్తు రుసుం: రూ. 100. మహిళా అభ్యర్థులు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ లతోపాటు మాజీ సైనికోద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చలానా రూపంలో లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. పరీక్ష తేదీ: నవంబర్ 2, నవంబర్ 9 వెబ్సైట్: http://ssc.online.nic.in http://ssconline2.gov.in. ఎంపిక ప్రక్రియ: పేపర్-1 రాత పరీక్ష, పేపర్-2 నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్ట్) లలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష పేపర్-1 లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రాత పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో (ఇంగ్లిష్ పేపర్ మినహా) రూపొందిస్తారు. అన్ని ప్రశ్నలూ బహుళైచ్ఛికాలు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. రాత పరీక్షా వ్యవధి 2 గంటలు. ప్రత్యేక అవసరాలు గల వారికి గం. 2.40 నిమిషాలు. పరీక్ష వేళలు: ఉదయం 10 నుంచి 12 వరకు పేపర్-1: స్వరూపం అంశం ప్రశ్నల సంఖ్య మార్కులు జనరల్ ఇంటలిజెన్స్ 50 50 ఇంగ్లిష్ 50 50 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 తెలియని వాటిని వదిలేయండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎంత మంది పరీక్ష రాస్తున్నారు అనే దానికంటే మనం ఎంతవరకు చదివాం? ఏమేర ఆత్మ విశ్వాసంతో ఉన్నామన్నదే ముఖ్యం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ కొద్దిగా క్లిష్టమైన అంశాలు. కాబట్టి వాటిలో బాగా పట్టున్న వాటిపైనే సాధన చేయాలి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో మెరుగైన స్కోరింగ్‌కు శ్రమించాలి. ఈ రెంటిలో ఎవరైతే 90 మార్కులకు పైగా సాధిస్తారో వారికి దాదాపు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో అంశానికి రెండు గంటలు కేటాయించాలి. రోజూ వాటికి సంబంధించిన బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. పరీక్షకు ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది కాబట్టి ఇప్పటినుంచే ప్రణాళికతో సన్నద్ధమైతే మంచిది. స్కిల్ టెస్ట్‌లపైనా నిత్యం సాధన చేయండి. వీటికి రోజుకు గంట కేటాయిస్తే సరిపోతుంది. టైపింగ్ వేగం ఏరోజు ఎంత ఉందో? అంచనా వేసుకుంటూ మరుసటి రోజుకు ఆ వేగాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నించండి. నెగెటివ్ మార్కులతో అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా తెలిస్తేనే సమాధానం రాయండి. కొందరు 160 సరైన సమాధానాలను గుర్తించినా మిగిలిన 40 ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తారు. ఇక్కడే వారి విజయావకాశాలు దెబ్బతింటాయి. మంచి మెటీరియల్, పాత ప్రశ్న పత్రాలు చూస్తే అవగాహన ఏర్పడుతుంది. జె. శ్రీనివాస్, కర్నూలు 2012 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విజేత. జనరల్ ఇంటెలిజన్స్ ఈ విభాగంలో పోలికలు-బేధాలు, సమస్య సాధన,విశ్లేషణ, అనాలజీ (నంబర్,ఫిగర్ వర్డ్) జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, అరిథమెటిక్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, నాన్ వెర్బల్ సిరీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇప్పటికే ఇతర ఎస్ఎస్సీ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ విభాగం సులువుగానే ఉంటుంది. ఎక్కువ మోడల్ పేపర్లను సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో నంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆన్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభ నష్టాలు, బారువడ్డీ, డిస్కౌంట్స్, మెన్సురేషన్, టైమ్-డిస్టెన్స్, టైమ్-వర్క్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, బార్ డయా గ్రమ్స్, పై చార్టులు, బీజగణితం, రేఖా గణితం, త్రికోణమితి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ 6 నుంచి 10 తరగతులకు చెందిన గణిత పాఠ్య పుస్తకాల సిలబస్‌లో ఉంటాయి. పేపర్-1 కి సంబంధించి నాలుగు విభాగాల్లో 50 మార్కులు సంపాదించే విభాగం ఇదొక్కటే. కాబట్టి అభ్యర్థులు ఎక్కువ దృష్టి సారించాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. -బి. రవిపాల్‌రెడ్డి డెరైక్టర్, సిగ్మా, హైదరాబాద్ పేపర్-1కు సన్నద్ధమవ్వండిలా ఇంగ్లిష్ ఇందులో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంట నీమ్స్, స్పెల్లింగ్స్, మిస్ స్పెల్ట్ వ ర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఒన్ వర్డ్ సబ్ స్టిట్యూషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్, పాసివ్ వాయిస్ ఆఫ్ వెర్బ్స్, కన్వర్షన్ ఇన్టు డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ నరేషన్, షఫ్లింగ్ ఆఫ్ సెంటె న్స్ పార్ట్స్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ పాసేజ్, క్లోజ్ పాసేజ్, కాంప్రహెన్షన్ పాసేజ్, వొకాబ్యులరీ, పాసివ్ వాయిస్ , డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్స్, క్రియలు, విశేషణాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వీటిపై ప్రాథమిక అవగాహన కోసం ప్రామాణిక డిక్షనరీ, గ్రామర్ బుక్‌లను అధ్యయనం చేయాలి. వీటితోపాటు స్టడీ మెటీరియల్, పాత ప్రశ్నపత్రాల సరళిని తెలుసుకోవాలి. రోజూ ఒక ఇంగ్లిష్ దిన పత్రికను చదవడం, ఇంగ్లిష్ వార్తలు వినడం, జాతీయ టీవీ ఛానళ్లలో చర్చా కార్యక్రమాలను చూస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. -ప్రొఫెసర్ పి.వి.సిహెచ్.శాస్త్రి హెచ్ఓడీ, ఐడీఎస్ (ఇంగ్లిష్) జనరల్ అవేర్నెస్ వర్తమాన వ్యవహారాలు, పర్యావరణం - సామాజిక జీవనం నుంచి ప్రశ్నలు వస్తాయి. భారత్ చుట్టూ ఉండే సరిహద్దు దేశాలు, వాటి సంస్కృతి, సంబంధాలు, భౌగోళిక స్వరూపం మీద కూడా అడగవచ్చు. జాగ్రఫీ, భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం అంశాలపైనా ప్రశ్నలు వస్తాయి. పదోతరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి.ఇక వర్తమాన వ్యవహారాలు, క్రీడలు, విజేతలు, అవార్డులకు సంబంధించి రోజూ రెండు ప్రామాణిక దినపత్రికలు (తెలుగు, ఇంగ్లిష్) చదవాలి. ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన ప్రధాన సంఘటనలను నోట్స్ రాసుకోవాలి. ప్రామాణిక జీకే బుక్స్ చ దవాలి -ఎన్. విజయేందర్‌రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ రిఫరెన్స్ బుక్స్ క్వికర్ మ్యాథ్స్: ఎం.థైరా ఆబ్జెక్టివ్ మ్యాథ్స్: ఆర్.ఎస్.అగర్వాల్ రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్, కిరణ్ ప్రకాశణ్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఎస్. చాంద్ పబ్లికేషన్స్ వర్డ్ నెవర్ మేడ్ ఈజీ పేపర్-2 స్కిల్ టెస్ట్ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు): 15 నిమిషాల్లో 2000 -2200 కీ ఇంప్రెషన్స్ ఎంట్రీ చేయాలి. టైపింగ్ టెస్ట్ (లోయర్ డివిజన్ క్లర్క్): ఇంగ్లిష్ మాధ్యమంలో నిమిషానికి 35 పదాలు, హిందీలోనైతే 30 పదాలను టైప్ చేయాలి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. -
కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
రాంనగర్ :తెలంగాణ పునర్నిర్మాణంలో తొలి అడుగుకు ఉపయోగపడే సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మండల, పట్టణస్థాయి రిసోర్సు పర్సన్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ఒకే రోజు జరపడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారుల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే కీలకం కానుందన్నారు. ఎంత వ్యయ ప్రయాసల కోర్చి అయినా ఒక్క రోజే సర్వే పూర్తి చేసి డేటా ఎంట్రీ నిర్వహించి సర్వే ఫారాలను ఆర్డీఓలకు అందజేయాలన్నారు. జిల్లాలో 9 లక్షలకు పైగా కుటుంబాలుంటే 10 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయని, మరో 4 లక్షల మంది రేషన్‌కార్డులు కొత్తగా కావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులన్నీ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేవని గ్రహించాలన్నారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేవిధంగా ఈ సర్వే దోహదపడుతుందని చెప్పారు. పింఛన్లు, గృహ నిర్మాణాలు, రేషన్‌కార్డులు, ఇతర లబ్ధి మొత్తం ఈ సర్వే డేటా ఆధారంగానే ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. గతంలో చాలా రకాల సర్వేలు చేసినా ఈ సర్వేకు చాలా తేడా ఉన్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా సర్వే ద్వారా పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. గృహాల సర్వే విషయంలో వయస్సు నిర్ధారణ కోసం రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమాచార సేకరణ అనేది ఒక కళ అని, సమాచార సేకరణలో వృత్తి నైపుణ్యం ప్రదర్శించి సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. సర్వే కోసం ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఎక్కువ నివాసాలు ఉన్న బ్లాకులకు సహాయ నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ఇద్దరు సహాయకులతో వెళ్లి నివాసాలకు నోటిఫైడ్ నంబరు కేటాయించి జాబితాలను ఎన్యుమరేటర్లకు అందజేయాలని సూచిం చారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్లు కేటాయిస్తామని, 9 లక్షల కుటుంబాలకు గాను 32 వేల మంది సిబ్బంది నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో 5 శాతం అదనపు సిబ్బంది సేవలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.