‘చైల్డ్ ఇన్ఫో’డేటా ఎంట్రీలో జిల్లాకు చివరి స్థానం | Child inphodeta entry point to the district | Sakshi
Sakshi News home page

‘చైల్డ్ ఇన్ఫో’డేటా ఎంట్రీలో జిల్లాకు చివరి స్థానం

Published Wed, Sep 24 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

‘చైల్డ్ ఇన్ఫో’డేటా ఎంట్రీలో  జిల్లాకు చివరి స్థానం

‘చైల్డ్ ఇన్ఫో’డేటా ఎంట్రీలో జిల్లాకు చివరి స్థానం

 విజయనగరం అర్బన్:  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల నమోదుకు సంబంధించిన ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ఎంట్రీ ప్రక్రియలో జిల్లా వెనుకబడి ఉంది.  చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ డేటా ఎంట్రీ, విద్యార్థుల ఆధార్ నంబర్ల నమోదు ప్రక్రియలో జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 22వ తేదీలోగా పై రెండు అంశాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు  ఆదేశించారు. అయితే ఇచ్చిన గడువు దాటిపోయినా ఇంకా 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఎంఈఓలకు ఫోన్లు చేసి త్వరగా పూర్తి చేయండి మహాప్రభో అని వెంటపడుతున్నారు. జిల్లాలోనిఅన్ని మండలాలకు ఇన్‌చార్జి విద్యాశాఖాధికారులుండడం వల్ల చాలా మంది ఎస్‌ఎస్‌ఏ అధికారులతో సమన్వయంతో పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇచ్చిన ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో ఎంఈఓలు విఫలమవుతున్నారని ఎస్‌ఎస్‌ఏ అధికారుల వాదన. అయితే మండల స్థాయిలో తమకు ఉన్న అధికపనుల ఒత్తిడి వల్ల సాధ్యం కావడం లేదని ఎంఈఓలు చెబుతున్నారు.
 
 వెబ్‌సైట్‌లో నమోదు కాని 63 శాతం మంది విద్యార్థులు
 అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చదువుతున్నారు? అనే విషయాలను ప్రధానంగా తెలుసుకోవడం కోసం 2012-13 విద్యా సంవత్సరం ఆఖరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మంగళవారం వరకు కేవలం 37 శాతం మాత్రమే అయింది. 13 జిల్లాలతో పోల్చుకుంటే చివరి స్థానంలో ఉంది.
 
 జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలుపుకొని 2,90,805 మంది విద్యార్థినీవిద్యార్థులున్నారు. ఇప్పటి వరకు లక్షా 3,576 మంది వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇంకా నమోదు కాాని వారిలో అధికశాతం ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులున్నారు. జిల్లా మొత్తం మీద ప్రైవేటు విద్యాసంస్థల్లో 40 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.  వారిలో కేవలం 10,420 మంది  వివరాలు మాత్రమే నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా చూసేందుకు, డ్రాపౌట్స్ ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు ఇదే వెబ్‌సైట్లో  విద్యార్థుల ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేయాలని  నెల రోజుల క్రితం ఆదేశించారు. దీంతో విద్యార్థుల పేర్ల నమోదు ప్రక్రియ  మళ్లీ మొదటి వచ్చింది.
 
 ఇప్పటికే ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ఎంట్రీ ప్రక్రియలో భాగంగా వెబ్‌సైట్లో నమోదయిన విద్యార్థులందరి ఆధార్ నంబర్‌ను ఫీడ్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు విధిగా ఆధార్‌కార్డులు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో ఎంఈఓలు విఫలమయ్యారు. ఆధారు కార్డులు లేని విద్యార్థుల వివరాలను పాఠశాల వారీగా తెలియజేస్తే సమీప ప్రాంతాలలో విద్యార్థులకు అందుబాటులో ఆధార్ కార్డు మంజూరు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు మొత్తుకొని చెప్పినా సంబంధిత వివరాలను ఇవ్వడంలో ఎంఈఓలు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆధార్ కార్డులు లేనివిద్యార్థులను వెబ్‌సైట్‌లో నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఎంఈఓలు స్పందిస్తే చైల్డ్ ఇన్ఫో వెబ్‌సైట్‌లో ఎంట్రీ ప్రక్రియను విజయవంతం చేయవచ్చని విద్యాశాఖ నిపుణులు చెపుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement